అవినీతిపై పోరాటం ఇంత సులువా?


Anna_Hazare

ప్రభుత్వ ఉత్తర్వును ఎత్తి చూపుతున్న అన్నా హజారే

అన్నా హజారే! ఇప్పుడు చాలామంది భారతీయుల నోట నానుతున్న పేరు. నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాడని భావిస్తున్న బ్రహ్మచారి. గాంధేయుడయిన హజారే, గాంధీ బోధించిన అహింసా సిద్ధాంత పద్ధతిలో పోరాటం చేసి రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ల అవినీతి అంతానికి నడుం బిగించాడని దేశవ్యాపితంగా ప్రశంసలు పొందుతున్నాడు. ఉన్నత స్ధానాల్లోని వ్యక్తులు -మంత్రులు, బ్యూరోక్రట్ అధికారులు- విచ్చలవిడిగా అవినీతికి పాల్పడికూడా ఎట్టి విచారణ లేకుండా తప్పించుకుంటున్నారనీ, అటువంటి వారిని విచారించే అత్యున్నత రాజ్యాంగ సంస్ధను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, దానికోసం “జన్ లోక్ పాల్” పేరున మిత్రులతో కలిసి ఒక బిల్లు కూడా తయారు చేశాడు అన్నా హజారే. “జన్ లోక్ పాల్” సంస్ధ విధి విధానాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో సగం మంది ప్రజల తరపున పని చేస్తున్నారని భావిస్తున్న మేధావులు సభ్యులుగా ఉండాలని డిమాండ్ చేసి సాధించాడని పత్రికలు, ఛానళ్ళు వేనోళ్ళా పొగుడుతున్నాయి.

అవినీతిని ఎవరు వ్యతిరేకించినా -అవినీతికి పాల్పడుతున్నవారు తప్ప- సమర్ధించాల్సిందే. లోగడ ఇందిరా గాంధీగార్ని అవినీతి గురించి అడిగితే “అవినీతి సర్వవ్యాపితం” అని చెప్పి దానిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా సమాధానం ఇచ్చిందని పత్రికలు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడు రాస్తుంటాయి. ఇప్పటి అవినీతి నూతన ఎత్తులను తాకుతూ వ్యవస్ధీకరణ చెందిందని అందరూ అంగీకరించే విషయం. ముఖ్యంగా యు.పి.ఏ-1 ప్రభుత్వం నుండి యు.పి.ఏ-2 ప్రభుత్వం వరకూ విస్తరించిన 2-జి స్పెక్ట్రం కుంభకోణం మున్నెన్నడూ ఎరగనంత పెద్దది. దీనిలో మంత్రులు, అధికారుల దగ్గర్నుండి లక్షల కోట్లకు అధిపతులయిన స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల వరకు పాత్రధారులగా ఉండి కరడుగట్టిన లంచగొండులను సైతం నిశ్చేష్టుల్ని చేసింది. దానిపై చర్చ జోరుగా సాగుతుండగానే, కామన్వెల్త్ నిధుల దుర్వినియోగ కుంభకోణం, ఆదర్శ అపార్ట్ మెంట్ల కుంభకోణం, కొద్దిలో తప్పిపోయిన 3-జి కుంభకోణం వరుసగా బైటపడి నాయకులు, అధికారుల పట్ల రోత పుట్టించిన పరిస్ధితి తలెత్తింది. ఈ నేపధ్యంలో అన్నా హజారే నిరాహార దీక్ష సహజంగానే ప్రజల్నీ, అభ్యుదయ కాముకుల్నీ ఆకట్టుకుంది. అయితే హజారే చూపించిన పరిష్కారం అవినీతిని అంతం చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అసలు అవకాశం ఉందా? అన్నది కూడా విశ్లేషించుకోవాల్సి ఉంది.

అవినీతికి మూలాలు ఎక్కడున్నాయి? ఎలా దాన్ని అంతమొందించాలి? అవినీతిపరుల్ని శిక్షించడానికి అవసరమైన సంస్ధలు, డిపార్డ్ మెంట్లు, చట్టాలు ఇప్పుడు లేవా? ఉన్నవి చాలక కొత్తది కావాలా, లేక ఉన్నవి పనిచేయనందున కొత్తది కావాలా? ఉన్నవి సరిపోకపోతే, అలా సరిపోని పరిస్ధితి ఎప్పటినుండి తలెత్తింది? కొత్తగా తలెత్తిందా, లేక చాలా కాలం నుండి కొనసాగుతూ వస్తోందా? ఉన్నవి పనిచేయనందున కొత్తది కావాలనుకుంటే, కొత్తది మాత్రం పని చేస్తుందన్న నమ్మకం ఏమిటి? ఇప్పటి సి.బి.ఐ, సి.వి.సి లకు మించిన సంస్ధ ఏర్పడగలదా? ఏర్పడినా దాన్ని నియమించేవారు మళ్ళీ ఈ రాజకీయనాయకులు, అధికారులే కదా? ఈ అవినీతిపరుల కనుసన్నల్లో నియమితులయ్యే లోక్ పాల్, తమను నియమించిన వారిని విచారించగలదా? తమపైనే విచారణ చేయాలనుకుంటున్నవారిని లోక్ పాల్ గా నియమించే తప్పుడు పనికి రాజకీయులు, అధికారులు పూనుకుంటారా?

అవినీతి అంతానికి పరిష్కారాలకి ముందు కొన్ని మౌలిక పరిశీలనలు అవసరం. ఇప్పటి రాజ్య వ్యవస్ధ నిర్మాణాన్ని గమనించినట్లయితే పై ప్రశ్నలకు సమాధానం “నో” అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రజలు ధనికులు, పేదలుగా విడిపోయి ఉన్నారు. ధనికులు జనాభాలో ఒక శాతం కంటే తక్కువగా ఉంటే వారికి ఆస్తులు సమకూర్చిపెట్టేవారుగా మిగిలిన వారు ఉన్నారు. ఈ రోజుల్లో ధనికులకే ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలున్నాయి. ఉన్నత చదువులు చదివిన ధనికులే బ్యూరక్రసీ లో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ తదితర పాలనాధికారులుగా నిర్ణయాలు చేశే స్ధాయిలో ఉన్నారు. రాజకీయ వ్యవస్ధని పరికిస్తే, డబ్బున్నోడే నేటి రాజకీయాల్లో నాయకులుగా చెలామణి అవుతున్నాడు. ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న ఎన్నికల్లో సారా, మద్యం, నోట్లు తప్ప మంచి చెడులు ఎంచే విచక్షణ పని చేయడం లేదు. డబ్బూ, మద్యం లను అందించగలిగేది ధనికులే. రాజకీయ ధనికులూ, బ్యూరోక్రసీ ధనికులూ ఒకరికొకరు బంధువులు, స్నేహితులు, పొరుగువారు, క్లాస్ మేట్లు, కులపోళ్ళూ, పార్టనర్లూ, మిగతా అన్నీనూ. వీళ్ళే చట్టసభలకు ఎన్నికవుతారు. వారికి రక్షణగా పోలీసు అధికారులు. పోలీసుల స్ధాయి దాటితే మిలట్రీ కూడా రాజకీయులకూ, అధికార వ్యవస్ధకూ బంధువులే.అంతే కాకుండా పొలాలూ, ఆఫీసులూ, ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఐ-మ్యాక్స్ లూ, గోల్ఫ్ క్లబ్బులూ, పబ్బులూ, హోటళ్ళూ, రేసు క్లబ్బులూ అన్నీ ఈ ధనిక రాజకీయులూ, అధికారులవే. వీరి ఆస్ధుల్లో పని చేసి సంపద సృష్టించేది మాత్రం రైతులూ, కూలీలు, ఉద్యోగులూ, కాంట్రాక్టు ఉద్యోగులూ, టెంపరరీ ఉద్యోగులూ, గుమాస్తాలూ, చిన్నాఫీసర్లూ, పెద్దాఫీసర్లూ, మేనేజర్లూ మొదలైన వారు. వీళ్ళెప్పుడైన ఒళ్ళు మండి తిరగబడితే అణచడానికి పోలీసులు దిగుతారు. పోలిసుల స్ధాయి దాటితే మిలట్రీ ఉండనే ఉంది.

హజారే పరిష్కారం ప్రకారం రాజకీయ నాయకుడు, అధికారీ అవినీతికి పాల్పడితే లోక్ పాల్ విచారించాలి. లోక్ పాల్ ని నియమించేది డబ్బు, మద్యంతో ఎన్నికల్లో నెగ్గిన మంత్రులూ, ప్రధానమంత్రులూ వారు నియమించుకున్న అధికారులే. వారు నియమించిన లోక్ పాల్ చర్య తీసుకునేదీ లేనిదీ గత సివిసిని చూస్తే అర్ధ అవుతుంది. కేరళ రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన సీనియర్ అధికారి ధామస్ సివిసి అయ్యాడు. ఆయన పనికిరాడని నిర్ణయించడానికి రెండేళ్ళు పట్టింది. ఆయన అవినీతికి పాల్పడింది పదేళ్ళక్రితం. అవినీతికి పాల్పడికూడా మన న్యాయ వ్యవస్ధ పని చేస్తున్న వేగానికి ప్రతిఫలంగా అనేక ప్రమోషన్లు పొంది సివిసి స్ధాయికి చేరుకున్నాడాయిన. ఆయన అవినీతికి పాల్పడిన సంగతి ప్రతిపక్ష పార్లమెంటరీ పార్టీ నాయకురాలు చెబుతున్నా, మన నిష్కళంక ప్రధాని పట్టించుకోలేదు. ఆయన అవినీతి పరుడని కోర్టు నిర్ణయించి ఛీ అన్న తర్వాత మాత్రమే నిష్కళంక ప్రధాని “సారీ” అన్నాడు. రెండేళ్ళనుండి ఆయన అవినీతి సమాచారం తెలుస్తున్నా ధామస్ ను వెనకేసుకుంటూ వచ్చిన మన సచ్చీల ప్రధాని కోర్టు తీర్పు తర్వాత మాత్రమే తెలిసినట్లు అర్జెంటు గా సారి చెప్పి తన తప్పు దులిపేసుకున్నాడు. కోర్టుల పనితనం ఏవిటో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన బాలకృష్టన్ ని చూస్తే తెలుస్తుంది. ఇప్పటివరకూ పనిచేసిన ప్రధాన న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతి పరులని సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ ప్రకటించి దమ్ముంటే తనను “కంటెంప్ట్ ఆఫ్ కోర్టు” కింద అరెస్టు చేసుకోమని సవాలు విసిరితే సుప్రీం కోర్టుకు ఆ దమ్ము లేక పోయింది.

ధనికులు డబ్బు, మద్యాలను త్యాగం చేస్తే పుట్టినవారే మన రాజకీయ నాయకులు. డబ్బు తగలేసి చదివితే పుట్టేది మన అధికార వ్యవస్ధ. వీళ్ళిద్దరూ కలిసి అవినీతి పాలన చేస్తుంటే వారికి కాపలా కాసేది పోలిసు వ్యవస్ధ. అవినీతిపరుల అవినీతిని విచారించవలసింది అవినీతితో నిండిపోయిన న్యాయ వ్యవస్ధ. అంతటా అవినీతేనని జనం తిరగబడితే అణిచివేయడానికి పోలీసులు, ఆ తర్వాత మిలట్రీ. రాజ్యం యొక్క ప్రధాన అంగాలైన రాజకీయ వ్యవస్ధ, అధికార వ్యవస్ధ, న్యాయ వ్యవస్ధ అవినీతిలో మునిగిపోయినప్పుడు వారిగురించి ప్రజలకు తెలపాల్సిన పత్రికా వ్యవస్ధ (ఫోర్త్ ఎస్టేట్) ని నడిపేది మళ్ళీ ఆ ధనికులే. ఎవరైనా (ధనికుడుకాని) పింగళి దశరధరాం లాంటి నిజాయితీ పరులు ఎన్ కౌంటర్ లాంటి చిన్న పత్రికలు పెట్టి నిజాలు చెప్పాలనుకుంటే ఆయన వెళ్ళిన చోటికే వెళ్ళాల్సి ఉంటుంది. సో… ఈ అవినీతి పంకిలపైన రాజ్యవవస్ధను చెక్కుచెదరకుండా కాపాడేది అవినీతితో నిండా మునిగిన నాలుగు ఎస్టేట్ లే. ఇక మిగిలింది ప్రజలు. ఒళ్ళొంచి పని చేస్తూ, పై నాలుగు వ్యవస్ధలను పోషిస్తూ, వారికి కావల్సిన అన్ని శ్రమలను చేసిపెడుతూ తమ శ్రమలొ అధికభాగాన్ని ఈ నాలుగు వ్యవస్ధలు కొల్లగొడుతున్నా మౌనంగా భరిస్తున్నది ఈ ప్రజలే. “తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? అని శ్రీశ్రీ గారన్నట్లు ఈ నాలుగు వ్యవస్ధలకు సమస్త సేవలు చేస్తూ కూడా సమస్త దారిద్రాలకూ గురవుతున్నది ఏ ప్రజలే. ఆ ప్రజలు మేల్కోంటే తమ పరిస్ధితి ఏంటో ఈ నాలుగు వ్యవస్ధలకూ తెలుసు.

ప్రజలు మేల్కొనకుండా అనేక ఏర్పాట్లను ఈ నాలుగు ధనిక వ్యవస్ధలు చేసుకున్నాయి కూడా. వాటిలో మొదటిది మతం. ఈ దెయ్యం పట్టిందంటే ఇక ప్రజల సమస్ధ దారిద్రాలకు సమాధానం దొరికనట్లే. దారిద్రం ఎదుర్కొనే ప్రతొక్కడూ “వై మి?” (నాకే ఎందుకీ దురవస్ధ?) అని అడుగుతాడు. దానికి సమాధానాన్ని మతం రెడీ చేసి పెట్టింది. “అది నీ ఖర్మ” అదే అన్ని ప్రశ్నలకూ సమాధానం. ఒక మతం నచ్చక పోతే చేరడానికి ఈ భూప్రపంచంలొ సవాలక్షా మతాలు “రా రమ్మని” ఆహావిస్తూంటాయి. ఒక దేవుడు కాకపోతే నమ్మడానికి సవాలక్ష దేవుళ్ళు. బొమ్మలు, విగ్రహాలు, ఫొటోలు రాళ్ళు, చెట్లు, ఆవులు, కుక్కలు, కోతులు, దున్నపోతులు, గద్దలు తదితర రూపాల్లో అనేకమంది దేవతలు, దేవుళ్ళు. వీళ్ళంతా విఫలమైతే నడిచొచ్చే దేవుళ్ళు రెడీ. బాబాలు, అమ్మలూ, అమ్మమ్మలూ, జేజెమ్మలూ. బాదుడు బాబా, తన్నుడు బాబా,  తొక్కుడు బాబా. నిత్యానందులు, సత్యానందులూ, అపర సత్యానందులూ. ఆది శంకరులూ, రెండో శంకరులూ, నూటక్కో శంకరులూ. చిన జీయరు, పెద్ద జీయరూ, ఇంకో జీయరూ. అయ్యప్ప, భవానీ, ఇంకో అప్పా, మరో అమ్మా. వీళ్ళంతా చెప్పేది ఒకటే. “అది నీ ఖర్మ”. “అది కాదు స్వామీ జనాల సొమ్ముని ప్రవేటోడికి అప్పనంగా అప్పజెప్పాడూ” అనబోతే “అవన్నీ ఈశ్వరాజ్గ్న నాయనా. శివుడి ఆజ్గ్న లేనిదే చీమైనా కుట్టదు. నీవు గత జన్మలో చేసిన పాపం వలన ఈ రోజు నువ్వు పేదవాడిగా, సేవకుడుగా, దరిద్రుడుగా జన్మించావు. కళ్ళెదుట ఏం జరిగినా నోర్మూసుకో. పుణ్యం చేసుకో. వచ్చే జన్మలో అంబానీగా పుట్టడం ఖాయం” అని బోధించి ఇంకో పరిష్కారంవైపుకి చూడకుండా ముందరి కాళ్ళకు బంధం చేస్తారు.

ఈ మతాలు, బాబాలు ఎంత శక్తివంతంగా ప్రజల విచక్షణనూ, ఆలోచనలనూ మొద్దుబార్చి నిష్క్రియాపరులుగా మారుస్తాయంటే, సాయిబాబా ఉదాహరణని చూస్తే అర్ధమవుతుంది. పుట్టపర్తి బాబాగారు కోమాలోకి వెళ్ళి పొయారు. వారికి రేయింబవళ్ళూ దేశ విదేశాలకు చెందిన డాక్టర్లు వైద్యం చేసి మేల్కొలపడానిక్ శాయశక్తులా శ్రమిస్తున్నారు. ఓ వైపు బాబాగారి ఆరోగ్యం గురించి ట్రస్టు, డాక్టర్లు ఏదో దాస్తున్నారని భక్త మహాశయులు ఆరోపిస్తూ, ఆగ్రహిస్తున్నారు. మరోవైపు ఆయన జబ్బు పడడానికి కారణం సత్తెమ్మ తల్లి విగ్రహం చెరువులో ముంచడం కారణమని గ్రామస్ధులు నిర్ణయించి దాన్ని వెతికి తీసుకొచ్చి ప్రతిష్టిస్టే బాబాగారి ఆరోగ్యంలో సడెన్ గా మెరుగుదల కనబడింది. కళ్ళూ, కాళ్ళూ తిప్పడం మొదలు పెట్టారట!? ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుల్ని సత్తెమ విగ్రహం గురించి అడిగితే “అవును” అనేశారు. మరి మీవైద్యం? అంటే అది కూడా బాబా చలవే అని కూడా అనేశారు. అన్నీ బాబాగారి ఇచ్చే అని చెప్పేశారు. సత్తెమ్మను చెర్లో ముంచడం, ఆయన జబ్బు పడటం, సత్తెమ పున ప్రతిష్ట, ఆయన కోలుకోవడం, అన్నీ ఆయన కోరిక ప్రకారమే జరుగుతున్నాయని డాక్టర్లు నేరుగా టీవీ ఛానెళ్లలోనే చెబుతున్నారు. భక్తుల్లో భక్తి పాలు తగ్గుతున్నందున దానిగురించి హెచ్చరించడానికే ఈ జబ్బు అని ఇంకొందరు సెలవిస్తున్నారు.

ఇవన్నీ జనాలకి చెప్పేది ఒకటే. నీకు కనిపించేదంతా మాయ. నిజంగాదు. నీకు కనబడకుండా ఉండేదే నిజం. పోలీసోళ్ళు నిన్ను ఉత్త పుణ్యానికి అరెస్టు చేశారా. పట్టించుకోకు, అదంతా మాయ. నీకు నిజమైందంతా పైనో ఎక్కడో ఉంది. దానికోసం ఎవడు తన్నినా, కొట్టినా, దోచినా పడుండు. పైన నీకు ప్లేసు గ్యారంటీ… ఇది సకల సమస్యలకు వాటమైన సమాధానం. వీరు చెప్పేదానికీ, వాస్తవానికీ పొంతన లేకపోయినా ప్రజలు క్రియారాహిత్యంగా పడి ఉండటానికి బాగా పనికివస్తాయి. వారి బోధల ఫలితం ఏంటంటే ప్రజలు అంతా మాయని నమ్మి కళ్ళెదుట జరుగుతున్న ఎంతటి అన్యాయానికయినా స్పందన లేకుండా పడి ఉండటం. గాంధీ గారికి భగవద్గీత ఇస్టమైన పుస్తకం. అందులో అహింసకు కావల్సిన మసాలా ఉంది మరి. భగవద్గీత ఓ వైపు అంతా మాయ అని చెబుతూ, నువ్వేమీ చేయబన్లే అంటుంటే, భగవద్గీతను నమ్మే హజారే “ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది” అనంటుంటే రెంటిలో ఏది నిజం? పరస్పర విరుద్ధమైన సమాధానాలు, పరిష్కారాలు ఒకే నోటి నుండి వచ్చినా అదేమని అడగరాదు. అడిగితే అదేదో తత్వం తెలియనివారుగా మిగిలిపోతాం. ఈ వైరుధ్యానికి కారణం బాబాలు, అమ్మలూ, మతాలూ, గురువులూ చెప్పే బోధనలు వాస్తవంతో సంబంధం లేకుండా ఉండడమేనని చాలామంది చాలా సార్లు చెప్పారు. సవాళ్ళు విసిరారు. కాని అవి ప్రజలదాకా చేరకుండా అనేక అడ్డంకులు.

మతాలు, బాబాలు, అమ్మలూ ప్రజల స్పందనను మొద్దుబార్చడానికి ఉపయోగపడుతున్నారు. అందుకే వారికి ప్రభుత్వ పోషణ కూడా దొరుకుతోంది. జనాలు ఉద్యమాల జోలికి పోకుండా చేయడానికి ఇన్ని వ్యవస్ధలు, ఎత్తుగడలు, మనుషులూ ఉన్నారు. విద్య కూడా అలాగే ఏడ్చింది. చదువుకో, సంపాదించుకో మిగిలింది నీకనవసరం అని విద్య బోధిస్తుంటే అవినీతి గురించి యువత, విద్యార్ధి, మహిళ ఎందుకు పట్టించుకుంటారు?

అందుకే అన్నా హజారే సాధించింది విజయమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నాలుగు రోజులు. కేవలం నాలుగు రోజుల నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం భయపడిందంటే నమ్మశక్యం కాని విషయం. అలాగని హజారే చిత్తశుద్ధిని శంకించడం కాదిది. కేంద్ర ప్రభుత్వం హజారే దీక్షతో దిగొచ్చినట్లు కనిపించడానికి కారణాలున్నాయి. అన్నా హజారే దీక్షలో, ఆ దీక్ష విజయంలో కూడా మన పాలకులకు తమకు అనుకూల అంశాన్ని గ్రహించారు మన పాలకులు. ఏమిటా అనుకూలాంశం? ఇంకెవ్వరూ అవినీతి గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం, ఉద్యమించాల్సిన అవసరం లేదు. అన్నా హజారే దీక్ష ఒక సేఫ్టీ వాల్వ్. అన్నా హజారే నాల్రోజులు దీక్ష చేస్తే అందరూ, ప్రతిపక్ష పార్టీలతో సహా ఆయన చుట్టూ మూగారు. ఆహా, ఓహో అన్నారు. జేజేలు పలికారు. నాల్రోజులకి ప్రధాని, సోనియా తదితరు ఉద్దండ పిండాలు బాధ పడ్డారు. అయ్యో హజారే నాల్రోజులు కూడూ నీళ్ళూ లేకుండా ఉన్నారా అనుకున్నారు. మంత్రుల్ని పంపారు. ఏం కావాలన్నారు. కమిటీ కావాలంటే సరేనన్నారు. మామూలు కమిటీ కాదు మావోళ్ళుండాలని హజారే అంటే, ఓ కే అనేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఓ పనైపోయింది.

ప్రతిపక్ష పార్టీల దృష్టిలో కూడా ఓ పనై పోయినట్టే. ఎందుకంటే అవినీతి తుట్టెను కదిపింది వారే. టు-జీ పేరుతో పార్లమెంటులో నానా యాగీ చేసి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) వేయించారు. అంతటితో ప్రతిపక్షం పని ఐపోయింది. కానీ వారు కదిపిన తేనే తుట్టే ఇంకా సర్ధుకోలేదు. మామూలు స్ధితికి రాలేదు. ప్రజల్లో ఇంకా అలజడి అలానే ఉంది. వారికింకా ఏమో కావాలి. వారికి పూర్తి సమాధానం కావాలి. రాజా చేత ఊచల్ని లెక్కబెట్టించినా ఇంకా కుంభకోణాలు వెల్లడవుతునే ఉన్నాయి. ప్రజల్లో ఆగ్రహం పేరుకుపోతోంది. అలా పేరుకుపోయే ఆగ్రహం మరో రూపం తీసుకునే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఈజిప్టు, లిబియా, ట్యునీషియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా మొదలైన అరబ్ దేశాల్లొని ఉద్యమాలు, తిరుగుబాట్లు ఆగ్రహించిన భారత ప్రజానీకానికి దారి చూపవు కదా! అన్న అనుమానం పెనుభూతమై, పాలక, ప్రతిపక్ష పార్టీలను వెంటాడుతోంది. ఆ క్షణంలో అన్నా హజారే అపద్భాందవుడిలా దర్శనమిచ్చాడు. ఆయన వెనక దేశం మొత్తం ర్యాలీ అయ్యేదాకా చూసింది. నాలుగు రోజులకే వారికి కావలసిన స్ధితి కనిపించింది. ఆయనకి ఎనలేని గౌరవాన్నిస్తూ, భయ భక్తులు చూపిస్తూ చర్చలు జరిపి ఆయన డిమాండ్లకు ఓకే అనేసింది కేంద్ర ప్రభుత్వం.

పరాయి దేశాల బ్యాంకుల్లో కోట్ల లక్షల కోట్ల ప్రజాధనం మూల్గుతోంది దాన్ని తెమ్మని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కపాడియా అదేపనిగా వేధిస్తున్నాడు. టు-జి కుంభకోణం తెగే దాకా లాగేట్లున్నాడు. ప్రజల దృష్టి అంతా అవినీతిపైనే కేంద్రీకృతమైతే, వారి సహనం నశించి ఈజిప్టునో, ట్యునీషియానో ఆదర్శంగా తీసుకుంటే అటువంటి పరిస్ధితి ప్రభుత్వాల నియంత్రణ లేకుండా పోతుంది. నిర్బంధం అనివార్యమై ప్రాణ నష్టం అనివార్యమౌతుంది. ప్రజాగ్రహం ఇంకా చెలరేగుతుంది. పాలన వదిలేసి శాంతి భద్రతలు ప్రధాన కర్తవ్యంగా ముందుకోస్తుంది. పాలన వదిలేయడం అంటే, బడ్జెట్ ని వదిలేయడం. ప్రవేటీకరణ, సరళీకరణ, గ్లోబలీకరణ విధానాల అమలును తాత్కాలికంగా వాయిదా వేయడమే. ఇప్పటికే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయంతో ఇన్సూరెన్స్, బ్యాంకులను మరింత ప్రవేటీకరణ చేసే పని వాయిదా వేశారు. రిటైల్ రంగం ప్రవేటికరణ బిల్లు ఎప్పుడు పార్లమెంటులోకి వస్తుందో అంతుబట్టడం లేదు. ప్రభుత్వ రంగ కంపెనీల అమ్మకం నత్త నడక నడుస్తోంది. మండుతున్న ధరలు ప్రజల ఆగ్రహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. “వేదాంత-కెయిర్న్ ఇండియా డీల్” అలాగే ఉండిపోయింది. పర్యావరణం పేరుతో పోస్కో కంపెనీకి నో చెప్పాల్సి వచ్చింది. నియమగిరి కొండల్ని వేదాంత నుండి లాగేసుకోవాల్సి వచ్చింది. బ్లాక్ బెర్రీ మౌబైల్ నెట్ వర్క్ కి ఇంకా పూర్తి అనుమతి ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ ప్రవేటీకరణ 25 శాతం నుండి 49 శాతానికి పెంచే బిల్లు రాజ్యసభలో పాసయినా, లోక్ సభలో ఇంకా పాస్ కాలేదు. బ్యాంకుల ఇంకా ప్రవేటీకరించాలని అమెరికా, యూరప్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా బహుళ జాతి కంపెనీలకు అసహనం పెరిగిపోతోంది. ఇంకా ఎప్పుడు అని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళ వార్తా సంస్ధలు అదే పనిగా ఇండియా పాలకులు ప్రవేటీకరణ వేగంగా జరపనందుకు అసమర్ధులుగా ముద్రవేస్తూ వార్తలు రాస్తున్నాయి. ప్రవేటీకరణ బహుళజాతి సంస్ధలు కోరుకున్నంత వేగంగా సాగక పోవడంతో ఎఫ్.ఐ.ఐ లు తమ పెట్టుబడులను ఇండియా షేర్ మార్కెట్ నుండి ఉపసంహరించుకుంటున్నాయి. ఎఫ్.డి.ఐ లు అంచనావేసినంతగా రావడం లేదు. పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చిన వారు సైతం సరళీకరణ మెల్లగా సాగుతుండడంతో ఉపసంహరించుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని గట్టిగా నిరూపించుకోవలసిన అగత్యం ఏర్పడింది. అంటే సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ లకు తాము కట్టుబడి ఉన్నామని చూపుకోడానికి దానికి సంబంధించిన ఇన్సూరెన్సు, రిటైల్ బిల్లు, బ్యాంకుల బిల్లు తదితర బిల్లుల్ని పార్లమెంటులో అర్జెంటుగా పాస్ చేయాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇదే కావాలి. అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేది తమ చేతికి అధికారం వచ్చే వరకే తప్ప ఆ తర్వాత కొనసాగడం ప్రతిపక్షాలకు ఇష్టం ఉండదు. ప్రజలు ఉద్యమాలకు దిగితే పాలకవర్గాలన్నింటికీ నష్టమే. ఇలాంటి సమయంలొ ప్రజాగ్రహాన్ని పాలకవర్గాలకు అనువైన రీతిలో మలుచుకోవాల్సి ఉంది. ప్రజాగ్రహం అవినీతి నుండి సంస్కరణల విధానాలకు వ్యతిరేకంగా మారకుండా చూడవలసిన అగత్యం ముందుకొచ్చింది. అక్కడే అన్నా హజారే అవసరం పాలక వర్గాలకు కూడా ముందుకొచ్చింది. అంటే పాలక, ప్రతిపక్షాలు ఓ పధకం ప్రకారం అన్నా హజారే చేత అవినీతి ఉద్యమాన్ని ప్రారంభింప జేశారా? కానే కాదు. అన్నా హజారే ఉద్యమ నిజాయితీని తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఆయన దీక్షకు ఆగమేఘాలమీద స్పందించిన ప్రభుత్వం ఉద్దేశ్యం లోనే నిజాయితీ లేదని గ్రహించాలి. ఆయన దీక్షకు స్పందించకపోతే అది నియంత్రించలేని రూపం తీసుకుంటుంది. ఈ లోపే ప్రభుత్వం హజారే దీక్షకు స్పందించినట్లయితే అది కమిటీతోనో, చర్చలతోనో సరిపోతుంది. ఒక ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం స్పందించిందన్న పేరు ప్రభుత్వానికీ దక్కుతుంది. కేంద్ర మెడలు వంచగలిగారన్న ఖ్యాతి హజారేకి దక్కినా ప్రభుత్వానికి నష్టం లేదు. వారికి కావలసింది వరుసగా బయట పడుతున్న కుంభకోణాలపై ప్రజల్లో పెరుతున్న ఆగ్రహానికి తమకు అనువైన రీతిలో సమాధానం ఇచ్చి దాన్ని అంతటితో ముగించడం.

అన్నా హజారే “ఇంతటితో అంతా ఐపోలేదు” అని దీక్ష విరమించాక అన్నారు గదా అనవచ్చు. ఆయన అన్నా ప్రజల ఆగ్రహం ఆయనతో పాటు మళ్ళీ ప్రత్యక్షమయ్యే అవకాశాలు లేవు. ప్రజలకు ఇంకా వారి స్ధాయిలో వారికి అనేక సమస్యలున్నాయి. వాటిలో పడిపోతారు. కమిటీ హాజారే అడిగినట్లు ప్రభుత్వం వేసింది గనక ఇక మిగిలింది హజారే భుజస్కందాలపైన వదిలేస్తారు. అంతటితో అవినీతి వ్యతిరేక పోరాటం సరి. ప్రజలు అవినీతికి మూలాలు మనమున్న వ్యవస్ధలో ఉన్నాయని తెలుసుకొనంత కాలం ఎంతమంది అన్నా హజారేలు కూడినా మన పాలకుల దీర్ఘకాలిక ఎత్తుగడల ముందు అలసిపోక తప్పదు.

8 thoughts on “అవినీతిపై పోరాటం ఇంత సులువా?

  1. Vishekar గారు, మీ విశ్లేషణ బాగుంది కానీ, మీరు చాలా నిరాశ వాదం తో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎన్నో పెద్ద పెద్ద ఉద్యమాలు మొదలు అయ్యింది చిన్న చిన్న చిన్న సంఘటనల తోనే. ఉదాహరణకి మన మొదటి స్వతంత్ర ఉద్యమం (1857) జరగటానికి కారణం సైనికుల తిరుగుబాటు అది కూడా మత పరమైన విషయాలకే. ఆ చిన్న ప్రయత్నం ఊహించని విదంగా దేశం లోని ఐక్యతని చూపించింది. ఒక మంచి పని చేస్తే మనకు వెంటే వచ్చే వాళ్ళు వున్నారనే నమ్మకం కలిగించింది. ఒక అన్నాహజారే ని స్పూర్తి గా తీసుకొని కొన్ని వందల మంది హజారే లు తయారవుతారు. జన లోక్ పాల్ బిల్లు అవినీతి అంతానికి తొలి ప్రయత్నం గా బావించ వచ్చు కదా.

  2. మీరన్నట్లు అది మొదటి అడుగై మరిన్ని అడుగులు పడితే సంతోషించాల్సిందే. అనుమానం లేదు. కానీ అవినీతి మూలం దెబ్బతీసే ఉద్యమాలు లేకుండా ఇలాంటి ఉపరితల ఉద్యమాలు, అదీ పరిమిత లక్ష్యంతో (హజారే దీక్ష చట్టం ఏర్పాటు వరకే) చేసే ఉద్యమాలు అలా మొదటి అడుగుగా పరిగణించలేమని నా అభిప్రాయం.

    అవినీతికి మూలాలు వ్యవస్ధ పునాదుల్లో ఉన్నాయి. నూతన ఆర్ధిక విధానాల్లో అవినీతి ఓ ముఖ్యమైన భాగం. ఎందుకంటే నూతన ఆర్ధిక విధానాలు ప్రజలకు వ్యతిరేకం కనుక ప్రజలకోసం పని చేయాల్సిన ప్రభుత్వాలు మాట్లాడకుండా ఉండటానికి అవినీతి అవసరం. నూతనఆర్ధిక విధానాల అమలు వెనక వ్యవస్ధలోని ఆధిపత్య వర్గాల ప్రయోజనాలతో పాటు వారు చెలిమి చేస్తున్న (కరెక్టుగా చెప్పాలంటె, వారి బాసులైన) సామ్రాజ్యవాదుల ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో హజారేలాంటి ఉద్యమాలు వ్యవస్ధ పునాదులతో పెనవేసుకుపోయిన అవినీతి అంతానికి ఏ మాత్రం దోహదపడవు.

    అసలు ఉపయోగమే లేదా? అంటే ఉండొచ్చు. కానీ చాలా చాలా పరిమితం. ప్రజలకోసం ఇపుడున్న చట్టాల్లో ఏవి అమలవుతున్నాయని కొత్తం చట్టం కోసం పోరాటం? శక్తివంతమైన చట్టం లేకపోవడం వల్లనే అవినీతి పెచ్చరిల్లుతోందనడం సరైంది కాదని గుర్తించడం కోసమే ఇది రాశాను.

  3. 1857లో బ్రిటిష్‌వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన మతవాదులని అన్నా హజారేతో పోల్చలేము. స్వచ్ఛంద సంస్థ నిధులని షష్ఠి పూర్తి కార్యక్రమానికి ఉపయోగించుకున్న అన్నా హజారేలో నిజాయితీ ఎంతుంటుందని వందలాది మంది అతన్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యమాలు నడుపుతారు? షష్టి పూర్తి లాంటి విలాస కార్యక్రమాలు చెయ్యకపోయినా ఎక్కువ మంది ప్రజలు అతన్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు.

    మంగళ్ పాండే ఉరికంభం ఎక్కుతాననే భయం లేకుండా బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. నిరాహార దీక్షలు చేసి విరమించేవాళ్ళని ఉరికంభాలు ఎక్కేంత తెగింపు ఉన్న 1857 ఉద్యమకారులతో పోల్చలేము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s