ఫిబ్రవరి 11 న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దింపిన ప్రజల ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముబారక్ నుండి అధికారం నుండి చేపట్టిన సైనిక ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ గద్దె దిగి దేశంనుండి వెళ్ళి పోయిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు విమోచనా కూడలి వద్ద బైఠాయింపు కొనసాగించారు. ప్రజలు డిమాండ్ చేసిన ప్రజాస్వామిక సంస్కరణలను సైనిక ప్రభుత్వం అమలు చేసే వరకూ తమ బైఠాయింపు కొనసాగుతుందని వారు అప్పట్లో స్పష్టం చేశారు. కొన్ని రోజులు చూసిన అనంతరం సైనిక ప్రభుత్వం బలవంతంగా వారిని విమోచనా కూడలి నుండి తొలగించింది. వారికి నాయకత్వం వహించిన వారిని నిర్బంధంలోకి కూడా తీసుకుంది.
అయితే ఆందోళనకారులు చేసిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చడంలో సైనిక ప్రభుత్వం విఫలమైంది. ముబారక్ కాలంనాటి రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేశారు. కాని సైనిక ప్రభుత్వం ముబారక్ నాటి రాజ్యాంగానికి కొన్ని మార్పులు చేసి దానినే ఓటింగ్ కి పెట్టింది. అయినప్పటికీ ఆ రాజ్యాంగానికి అనుకూలంగా పెద్ద ఎత్తున ఓట్లేసి అంగీకారం తెలిపారు. ముబారక్ అధికారానికి వచ్చినప్పటినుండి అమలులో ఉన్న “స్టేట్ ఆఫ్ ఎమర్జన్సీ” చట్టాన్ని ఎత్తి వేయాలనీ, ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలనీ ప్రజలు డిమాండ్ చేశారు. సైనిక ప్రభుత్వం ఈ డీమాండ్ ను అసలు పట్టించుకోలేదు. దేశంలో ఎమర్జెన్సీ ని అలాగే కొనసాగించారు.
ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్నికలు జరిగే వరకూ అధికారాన్ని పౌర ప్రముఖులతో కూడిన కమిటీకి అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆ కమిటీలో సైన్యంనుండి ఒక ప్రతినిధి ఉంటే చాలన్నారు. కాని ముబారక్ గద్దె దిగాక పూర్తిగా సైనికాధికారులతో కూడిన కమిటీ అధికారం చేజిక్కించుకుంది. కమిటీకి ముబారక్ కాలంనాటి సైనికాధికారి ఫీల్డ్ మార్షల్ మహ్మద్ హుస్సేన్ తంతావి నాయకుడుగా కొనసాగుతున్నాడు. తంతావి పూర్తిగా ముబారక్ అనుకూలుడన్న సంగతి ఈజిప్టు ప్రజలకు తెలుసు. అయినా అమెరికా ప్రయోజనాలను కాపాడే వారే అధికారంలో కొనసాగుతున్నారు. ఈజిప్టు ప్రజలు కోరుకున్నవారు కాకుండా అమెరికా ప్రభుత్వం కోరుకున్నవారే అధికారాన్ని చెలాయిస్తున్నారు.
తంతావి వెంటనే గద్దే దిగాలని డిమాండ్ చేస్తూ ఈజిప్టు ప్రజలు శుక్రవారం తాహ్రిరి కూడలి వద్దకు చేరి బైఠాయింపు మొదలు పెట్టారు. మాజీ అధ్యక్షుడు ముబారక్, అతని కుటుంబాన్ని అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి శిక్షించాలని కుడా వారు డిమాండ్ చేస్తున్నారు. “తంతావియే ముబారక్, ముబారకే తంతావి” అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. అయితే సైనిక ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చోలేదు. శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకారులపై విరుచుకుపడింది. ఆందోళనకారులను విమోచనా కూడలి నుండి వెళ్ళగొట్టడానికి తీవ్రంగా లాఠీ చార్జి చేశారు. వినకపోవడంతో కాల్పులు సాగించారు. ఘర్షణల్లొ ఒకరు చనిపోయారని సైన్యం నాయకత్వంలొని మధ్యంతర ప్రభుత్వం ప్రకటించగా, డాక్టర్లు ఇద్దరు చనిపోయారనీ, డెబ్భై మందికి పైగా గాయపడ్డారనీ తెలిపారు.
చనిపోయినవారు బులెట్ గాయాల వలన చనిపోయారని డాక్టర్లు చెబుతుండగా, తాము బుల్లెట్లు వాడలేదని సైనికాధికారులు చెబుతున్నారు. గాయపడినవారు కూడా అనేక మంది బులెట్ గాయాలయ్యాయని డాక్టర్లు చెబుతున్నప్పటికీ సైనికాధికారులు తాము కాల్పులకు అసలు బుల్లెట్లు వాడలేదని నమ్మబలుకుతున్నారు. సైన్యం ఆందోళనకారులను వెళ్ళగొడ్తున్నప్పట్కీ ఆందోళనకారులు మళ్ళీ మళ్ళీ వస్తుండడంతోసైనికులు శనివారం కూడలి నుండి ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. సైనికులు వెళ్ళిపొయాక ఆందోళనకారులు మళ్ళీ కూడలిని ఆక్రమించుకున్నారు. సైనికాధికారి తంతావి రాజీనామా చేయాలన్న డిమాండ్ కు సైనిక ప్రభుత్వం తలొగ్గే విషయం అనుమానాస్పదమే.
ముబారక్ కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా సైనికులు సంయమనం పాటించారనీ ఆందోళనలకు మద్దతు ఇచ్చారనీ ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ముబారక్ గద్దె దిగే వరకే వారి సంయమనమనీ ఆ తర్వాత జరిగే నామమాత్రపు అధికార మార్పిడికి ప్రజలు అంగీకరించక పోతే అణచివేయడానికే సైనిక ప్రభుత్వం గానీ దాని వెనక ఉన్న అమెరికా గానీ మొగ్గు చూపడం ఖాయమనీ ప్రగతిశీల విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు చెప్పిందే నిజం అయ్యే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ముబారక్ రాజీనామా ప్రజల డిమాండ్ నెరవేరినట్లు చూపించడానికి తప్ప వాస్తవంగా ప్రజల చేతికి నిర్ణయాధికారం అప్పగించేందుకు అమెరికా, దాని వత్తాసు పలికే ఈజిప్టు పాలక వర్గాలు సుతరామూ అంగీకరించబోవు.