లిబియాపై పశ్చిమ దేశాల దాడులు వాటిని సహాయం కోసం పిలిచిన వారినే చంపుతున్నాయి. బుధవారం అజ్దాబియా పట్టణం నుండి వెనక్కి వెళ్తున్న తిరుగుబాటు బలగాలపై పశ్చిమ దేశాలు నాలుగు క్షిపణులను పేల్చడంతో కనీసం 13 మంది చనిపోగా మరింతమంది గాయపడ్డారని బిబిసి తెలిపింది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వారిపై వైమానికి బాంబుదాడులు చేస్తూ పౌరులను కూడా గడ్డాఫీ చంపుతున్నాడనీ పశ్చిమ దేశాలు నిందించాయి. లిబియా పౌరుల్ని గడ్డాఫీ దాడులనుండి కాపాడే పేరుతో లిబియా గగనతలంపై “నో-ఫ్లై జోన్ అమలు చేసేందుకు ఐక్యరాజ్యసమితి చేత తీర్మానం చేయించిన పశ్చిమ దేశాలు కొన్ని అరబ్ దేశాలను కలుపుకుని గడ్డాఫీ బలగాలపై మూడు వారాల నుండి బాంబులు కురిపిస్తున్నాయి.
గడ్డాఫీ బలగాల వైమానిక దాడులకు లిబియా తిరుగుబాటుదారుల వద్ద సమాధానం లేకపోవడంతో అవి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో లిబియా పై గడ్డాఫీ విమానాలు ఎగరకుండా “నో-ఫ్లై జోన్” అమలు చేయాలని కోరాయి. అయితే “నో-ఫ్లై జోన్” అమలు పేరుతో గడ్డాఫీ సైన్యం పైన కూడా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల యుద్ధవిమానాలు క్షిపణి దాడులు చేస్తున్నాయి. గడ్డాఫీ బలగాలు, లిబియా తిరుగుబాటు బలగాలు ఆక్రమించుకున్న అజ్దాబియా పట్టణం వద్ద భూతల పోరు జరుపుతున్నాయి. ప్రభుత్వ బలగాలు తిరుగుబాటు దారులను వెనక్కి తరుముకుంటూ వెళ్తున్నాయి. వారిలో తిరుగుబాటుదారులను గడ్డాఫీ బలగాలుగా భ్రమించిన పశ్చిమ దేశాల బలగాలు క్షిపణులు పేల్చడంతో చాలామంది చనిపోయారని తిరుగుబాటుదారులు తెలిపారు.
నాటొ దేశాల దాడుల్లో తిరుగుబాటుదారులే చనిపోవడం ఇది మూడవసారి. తాజా దాడిలో మొదటి రెండు దాడులకంటే అధికులు చనిపోయారు. తిరుగుబాటుదారులు కొన్ని ట్యాంకులు, ఆయుధాలు అమర్చిన వాహనాలు, రాకెట్ లాంచర్లను యుద్ధం ఫ్రంట్ లైన్ వద్దకు 30 రవాణా వాహనాల్లో తీసుకెళ్తుండగా నోటో బలగాలు వాటిపై క్షిపణి దాడి జరిపాయి. సైనిక నష్టంతో పాటు ఆయుధ నష్టం కూడా జరగడంతో తిరుగుబాటుదారులు ఆగ్రాహావేశాలతో ఉన్నాయి.