యూరోజోన్ వడ్డీ రేట్లు పెంచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు


eu-flag

యూరప్ లోని బీద దేశాలు, ప్రజల పాలిట మాస్ట్రిచ్ ఒప్పందం ముళ్ళకిరీటమే

ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మొట్టమొదటి సారిగా వడ్డీ రేట్లను పెంచింది. సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు, యూరోజోన్ దేశాల ఆర్ధికవృద్ధి, సంక్షోభ పరిస్ధుతులను అధిగమిస్తున్న విషయాన్ని సూచిస్తోంది. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కడానికి ప్రపంచ దేశాలు తమ సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్లను అతి తక్కువ స్ధాయిలో ఉంచి తద్వారా మార్కెట్ కు డబ్బు అందుబాటులో ఉంచాయి. మార్కెట్ కు డబ్బు అధికంగా అందుబాటులో ఉంచడం వలన సంక్షోభం ఫలితంగా స్తంభించిన మార్కెట్ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయనేది ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల అంచనా.

అమెరికా సెంట్రల్ బ్యాంకు (ఫెడరల్ రిజర్వు) తన వడ్డీ రేటును అత్యంత తక్కువ స్ధాయిలో (0.25 శాతం) కొనసాగిస్తున్నది. తక్కువ స్ద్యాయి వడ్డీ రేటు కొనసాగించడమే కాకుండా అది గత సంవత్సరం 600 బిలియన్ డాలర్లు వివిధ ద్రవ్య రూపాల్లొ మార్కెట్లో కుమ్మరించడానికి నిర్ణయం తీసుక్కున్న విషయం విదితమే. అమెరికా కుమ్మరించిన డబ్బు ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలుగా చెలామణి అవుతున్న బ్రెజిల్, చైనా, ఇండియా, దక్షిణ కొరియా తదితర దేశాలను ముంచెత్తుతోంది. ఫలితంగా ఇండియా లాంటి చోట్ల ద్రవ్యోల్బణం కొండమీది నుండి దిగడం లేదు. ప్రజలకు సరుకుల రేట్లు అందుబాటులో లేకుండా పోయాయి.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటు దాదాపు మూడు సంవత్సరాలపాటు 1 శాతం దగ్గరే ఉంచారు. తద్వారా యూరోజోన్ సభ్య దేశాలకు నిధులు అందుబాటులో ఉంచారు. ఆ నిధులను సభ్య దేశాలు సంక్షోభం అధిగమించడానికి వాడుకునేందుకు ఉద్దేశించారు. ఇప్పుడా వడ్డీ రేటును ఇ.సి.బి 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే ఇప్పుడు వడ్డీ రేటు 0.25 శాతం పెరిగి 1.25 శాతానికి చేరుకుంది. యూరోజోన్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.2 శాతానికి పెరిగింది. ఇది యూరోపియన్ యూనియన్ విధించుకున్న పరిమితి 2 శాతం కంటే ఎక్కువ. వడ్డీ పెంపుదల, ద్రవ్యోల్బణాన్ని మరింత పైకి నెడుతుంది. సరుకుల రేట్లు పెరిగిపోతాయి. వేతనాల పెంపుదల చేయాల్సిన అవసరం తలెత్తుతుంది. కానీ పొదుపు చర్యలను సభ్యదేశాలపై బలవంతంగా రుద్దుతున్న నేపధ్యంలొ వేతనాలు పెంచేందుకు ప్రభుత్వాలు నిరాకరిస్తాయి. ఫలితంగా సమాజంలొ అడుగున ఉన్న ప్రజానీకం మరింతగా దారిద్రాన్ని ఎదుర్కొంటారు.

యూరోజోన్ లో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలు కలిగి ఉన్న జర్మనీ, ఫ్రాన్సు లాంటి దేశాలు ఏదోమేర ఆర్ధికవృద్ధి సాధించి ఆర్ధిక సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బైట పడుతున్నాయి. సాపేక్షికంగా బీద, బలహీనంగా ఉన్న దేశాలు సావరిన్ అప్పు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ లాంటి దేశాలపై ఫిస్కల్ (కోశాగార) క్రమశిక్షణ పేర దారుణమైన పొదుపు చర్యలను రుద్దడంతో వాటి ఆర్ధిక వ్యవస్ధలు ఆర్ధికవృద్ధికి బదులు ఆర్ధిక కుదింపును ఎదుర్కొంటున్నాయి. అంటే వాటి జి.డి.పి వృద్ధి రేటు పెరగడానికి బదులు తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో వడ్డీ రేటు పెంచడం సంక్షోభంలో ఉన్న దేశాలకు నిధుల లభ్యత తగ్గించడమే అవుతుంది. అంటే ఇప్పటికే అప్పు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలు మరింతగా సంక్షోభంలో కూరుకుపోతాయి.

జర్మనీ, ఫ్రాన్సు లాంటి దేశాల ఆర్ధిక వృద్ధి రేట్లు పెరుగుతుండడం వలన వడ్డీ రేటు పెంచవలసిన అవసరం వాటికి ఉంది. అప్పు సంక్షోభంలో దిగబడి నిధులు, అప్పుల కోసం వెతుకులాడుకుంటున్న బలహీన దేశాలకు వడ్డీ రేట్ల పెంపుదల ఆశనిపాతమే అవుతుంది. ఈ విధంగా యూరోజోన్ లో ధనిక, పేద దేశాల మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అభివృద్ధి చెందటం అనేది, ఉమ్మడి కరెన్సీ ఒప్పందం (మాస్ట్రిచ్ ట్రీటీ) వలన తలెత్తిన ప్రతికూల పరిణామం. యూరోజోన్ లోని బీద బలహీన దేశాలకు వడ్డీ రేటు పెంపు ప్రతికూల పరిమాణం కాగా, ధనిక దేశాలకు అనుకూల పరిణామం. ఆ విధంగా ఉమ్మడి కరెన్సీ (యూరో) కూడా ధనిక దేశాలకు అనుకూలంగానూ, బీద దేశాలకు ప్రతికూలంగానూ తయారైంది. అంటే జర్మనీ, ఫ్రాన్సు లు కేంద్రంగా ఉన్న యూరోపియన్ యూనియన్ గానీ, యూరో జోన్ గానీ ధనిక దేశాల పెట్టుబడిదారులకు మరింత లాభకరంగానూ, బీద దేశాల ప్రజలకు మరింత నష్టకరంగానూ పరిణమిస్తాయన్న కమ్యూనిస్టుల వాదన ఇప్పుడు అనుభవం లోకి వచ్చిందని చెప్పవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s