లిబియా తూర్పు ప్రాంతంలో పెద్ద పట్టణమైన బెంఘాజీ కేంద్రంగా ఏర్పదిన తాత్కాలిక తిరుగుబాటు ప్రభుత్వం (లిబియా జాతీయ కౌన్సిల్) మరిన్ని దేశాల గుర్తింపును పొందింది. కౌన్సిల్ ఏర్పడడంతోనే ఫ్రాన్సు గుర్తించిన సంగతి విదితమే. ఫ్రాన్సు, బ్రిటన్ లు కాలికి బలపం కట్టుకుని మరీ యూరోపియన్ దేశాలను కోరినప్పటికీ అవి తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కు ఆర్ధికంగా నాయకత్వం వహిస్తున్న జర్మనీ తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి గట్టిగా నిరాకరించింది. పశ్చిమ దేశాలు లిబియాపై చేస్తున్న దుర్మార్గ వైమానిక దాడుల్లో సైతం జర్మనీ పాల్గొనడం లేదు.
తాజాగా ఖతార్, ఇటలీ దేశాలు లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాయి. దానితో లిబియా తిరుగుబాటుదారులు తమ స్వాధీనంలో ఉన్న తోబ్రుక్ పట్టణం ద్వారా ఆయిల్ ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. ఆయిల్ నింపుకోవడానికి తోబ్రుక్ రేవు వద్ద ఓ నౌక లంగరు వేసి ఉంది. మార్సా ఎల్-హారిగా అనే పేరుగల ఎగుమతి టెర్మినల్ వద్ద ఈ నౌక ఆగి ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. లైబీరియా జేండా ఉన్న ఈ నౌక గ్రీసు దేశానికి చెందిన డైనకాం సంస్ధకు చెందినదిగా ధృవీకరించబడని వార్తల ద్వారా తెలుస్తోందని బిబిసి తెలిపింది. ఒక మిలియన్ బ్యారెళ్ళ క్రూడ్ ఆయిలు ఈ నౌక ద్వారా రవాణా జరగవచ్చని ఆయిల్ రవాణాపై వార్తలు అందించే “లాయిడ్స్ లిస్ట్” పత్రిక తెలిపింది.
తిరుగుబాటు చెలరేగక ముందు లిబియా నుండి రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ళ ఆయిల్ ఎగుమతి అయ్యేది. తిరుగుబాటుదారులు ఎగుమతి చేస్తున్న ఆయిలు మొదట ఖతార్ కూ, అక్కడినుండి ఇటలీకి రవాణా కానున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ రెవిన్యూ గడ్డాఫీ ప్రభుత్వం చేతికి వెళ్ళనంత వరకూ ఆయిల్ ను రవాణా చేసుకోవచ్చని ఇ.యు ప్రకటించింది. లిబియా అధ్యక్షుడు గడ్దాఫీ, అతని కుటుంబంపై ఐక్యరాజ్యసమితి చేత పశ్చిమ దేశాలు ఆంక్షలు విధింప జేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా లిబియా విదేశాంగ మంత్రి మౌస్సా కౌస్సా ఇబ్రహీం బ్రిటన్ చేరుకోవడంపై బ్రిటన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని గడ్దాఫీ పుత్రుడు సైఫ్ గడ్డాఫీ ఖండించాడు. మౌస్సా బ్రిటన్ వెళ్ళింది గడ్డాఫీని వ్యతిరేకిస్తూ కాదనీ, తన ఆరోగ్యం బాగుచేసుకోవడానికి మాత్రమే ఆయన బ్రిటన్ వెళ్ళాడనీ బిబిసి కి తెలిపాడు. ఆయన గడ్డాఫీకి వ్యతిరేకంగా పశ్చిమ దేశాలతో సహకరించినట్లయితే ఆయనను విచారణనుండి మినహాయింపు ఇస్తామని బ్రిటన్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నదని సైఫ్ తెలిపాడు. లాకర్ బీ ఉదంతం గురించి మరిన్ని వివరాలు మౌస్సా వద్ద ఉన్నట్లు బ్రిటన్ భావిస్తున్నదనీ, వాస్తవానికి లాకర్ బీ గురించి బ్రిటన్, అమెరికా ల వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని సైఫ్ తెలిపాడు.
లిబియా ప్రభుత్వం తరపున సీనియర్ రాయబారి అబ్దెలాటి ఒబైదీ యూరోప్ సందర్శనలో ఉన్నాడు. గడ్డాఫీకి అధికారం నుండి తప్పుకునే ఆలోచనేదీ లేదని ఆయన యూరప్ ప్రభుత్వాలకు తెలుపుతున్నాడు. ప్రస్తుతం టర్కీ పర్యటనలో ఒబైదీ ఉన్నట్లుగ తెలుస్తోంది. ఇరు పక్షాలూ పట్టుదలతో ఉన్నాయని టర్కీ ప్రభుత్వం తెలిపింది. మౌస్సా ఇబ్రహీం బ్రిటన్ ప్రభుత్వం వద్ద గడ్డాఫీ ప్రభుత్వాన్ని సమర్ధించినట్లు వార్తలు తెలుపుతున్నాయి. గడ్డాఫీ అధికారం నుండి తప్పుకున్నట్లయితే లిబియాలో అల్లర్లు చెలరేగడం ఖాయమని ఇబ్రహీం చెప్పినట్లు తెలుస్తోంది.