ప్రమాదకర రేడియేషన్ నీటిని సముద్రంలోకి వదులుతున్న జపాన్


fukushima_daiichi

ఫుకుషిమా దైచి అణు కర్మాగారం ఏరియల్ వ్యూ -బిబిసి

శక్తివంతమైన భూకంపం, సునామీ ల తాకిడితో దెబ్బతిన్న ఫుకుషిమా దైచి అణు రియాక్టర్లవద్ద వెలువడుతున్న రేడియేషన్ సంక్షోభాన్ని జపాన్ ప్రభుత్వం ప్రపంచ సమస్యగా మారుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండో రియాక్టరు వద్ద తీవ్రంగా కలుషితమైన నీటిని తోడివేసేందుకు ఖాళీ లేనందున, తక్కువ స్ధాయిలో కలుషితమైన నీటిని సముద్రంలో కలిపి ఖాళీ సృష్టించడానికి జపాన్ నడుం కట్టింది. రెండో రియాక్టర్ 20 సెంటీ మీటర్ల మేరకు పగుళ్ళిచ్చిందని అణు కర్మాగారం ఆపరేటర్ టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) ప్రకటించిన సంగతి విదితమే. రేడియేషన్ ఆగకుండా లీక్ అవడానికి కారణం ఇంతవరకూ కనుగొనలేక పోయారు. కనుక్కోవడానికి అందుబాటులో ఉన్న ప్రయత్నాలన్నింటినీ టెప్కో చేస్తున్నా సఫలం కాలేక పోయింది.

సిమెంటు కాంక్రీటును పంపి రియాక్టర్ పగులును పూడ్చడానికి మొదట టెప్కో ప్రయత్నించింది. ఆ ప్రయత్నం విఫలమైంది. తర్వాత పాలిమర్ ద్వారా పూడ్చటానికి ప్రయత్నించినా అదీ విఫలమైంది. మళ్ళీ పాలిమర్ తో పూడ్చటానికి మరో ప్రయత్నం చేయడానికి టెప్కో సిద్ధమైంది. అయితే రేడియేషన్ తో బాగా కలుషితమైన నీరు రియాక్టరునుండి ఎక్కడెక్కడ లీకవుతున్నదో పూర్తిగా ఇంతవరకూ తేలలేదు. పగులుతో పాటు ఇతర చోట్లనుండి కూడా రేడియేషన్ నీరు లీకవుతున్న సంగతి అర్ధమవుతున్నా ఎక్కడి నుండి లీకవుతున్నదో ఇంకా స్పష్టం కాలేదు. దాన్ని కనిపెట్టడానికి టెప్కో చేస్తున్న ప్రయత్నాలు నిస్పృహతో కూడుకున్నవిగా కనబడుతున్నాయి తప్ప స్పష్టంగా తెలిసి చేస్తున్నవి కాదు. నీటిలో డై కలిపి తద్వారా లీకవుతున్న మార్గాన్ని కనుక్కోవడానికి ప్రస్తుతం టెప్కో ప్రయత్నిస్తోంది.

రెండో రియాక్టర్ నుండి అధిక రేడియేషన్ తో లీకవుతున్న నీటిని నిలవ ఉంచడానికి సరిపోయినంత ఖాళీ లేకపోవడంతో అప్పటికే నిలవ ఉన్న తక్కువ రేడియేషన్ నీటిని సముద్రంలో కలపడానికి జపాన్ ప్రభుత్వం, టెప్కో నిర్ణయించాయి. 11,500 టన్నుల పరిమాణం గల రేడియేషన్ నీటిని సముద్రంలో కలపనున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నీరు చట్టబద్ధ రేడియేషన్ పరిమితి కంటే 100 రెట్లు రేడియేషన్ తో కలుషితమైన నీరు. రియాక్టరు నుండి లీకవుతున్న కలుషితనీరు 100,000 రెట్లు రేడియేషన్ తో కలుషితం అయిన నీరు. ఇది ఇంకా లీకవుతూనే ఉంది. లీకవుతున్న అధిక కలుషిత నీరు నిలవ చేయడానికి వీలుగా తక్కువ స్ధాయిలో కలుషితమైన నీటిని సముద్రంలో కలపడం అనివార్యమైందని జపాన్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ యుకియో ఎడనో తెలిపాడు. ఇప్పుడు సముద్రంలో కలుపుతునన్ రేడియేషన్ నీరు సాపేక్షికంగా తక్కువ రేడియేషన్తో ఉంది తప్ప ప్రమాద రహితమైన రేడియేషన్ కాదు. అదీ ప్రమాదకరమైందే. దాని కన్నా ఎక్కువ ప్రమాదకరమైన రేడియేషన్ నీరు నిల్వ చేయడానికి ఖాళీ సృష్టించుకోవడానికి మాత్రమే సముద్రాన్ని కలుషితం చేయడానికి జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక్కడ ఆలోచించవలసింది అణు విద్యుత్ వినియోగం వలన అనివార్యమైన ప్రమాదం గురించి. అణు విద్యుత్ శుభ్రమైనదీ, పర్యావరణ భద్రతకు అనుకూలమైనదీ అన్న పెరుతో పశ్చిమ దేశాలు అణు రియాక్టర్ల వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అణు విద్యుత్ కర్మాగారంలో ప్రమాదం జరిగాక ఆ ప్రమాదాన్ని నియంత్రించే అవకాశాలు లేవన్న విషయం జపాన్ అణు ప్రమాదం ద్వారా రుజువైంది. రష్యాలో చెర్నోబిల్ ప్రమాదం జరిగాక ప్రపంచ దేశాలు అణు విద్యుత్ గురించి మాట్లాడ్డం మానేశాయి. అమెరికాలో అణు ప్లాంటుల నిర్మాణాన్ని అపేశారు. యూరప్ లో కూడా చెర్నోబిల్ తర్వాత కొత్త ప్లాంటుల నిర్మాణానికి వ్యతిరేకత ప్రజలనుండి వ్యక్తమైంది. తాజాగా పర్యావరణ కాలుష్యంపై, గ్రీన్ హౌస్ వాయువుల విడుదలపై స్పృహ పెరిగింది. దాన్ని అడ్డు పెట్టుకుని అణు విద్యుత్ కాలుష్య రహితమైందన్న నిజానికి ఎక్కువ ప్రచారం కల్పించి అణు విద్యుత్ ఆలో చనకు పశ్చిమ దేశాలు మళ్ళీ ప్రాణం పోశాయి. పశ్చిమ దేశాల బండారాన్ని జపాన్ అణు ప్రమాదం బైట పెట్టింది. అణు విద్యుత్ కర్మాగారాల వలన ఎదురయ్యే ప్రమాదాలను అడ్డుకొనగల పరిజ్గానం కూడా మానవుడి వద్ద లేదన్న విషయం రుజువైంది. ఈ నేపధ్యంలో అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించడానికి ఉరకలు వేస్తున్న ఇండియా, చైనాలు తమ అణు విధ్యుత్ పధకాలను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s