గూగుల్ చాలా ఘోరాలు చేస్తోంది -అమెరికా రెగ్యులేటర్ ఎఫ్.టి.సి


google_watching_you

గూగుల్ ఉంది జాగ్రత్త!

సెర్చి ఇంజన్ల వ్యాపారంలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్న గూగుల్ వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో పదే పదే తప్పు చేస్తోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ పేరుతో వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తూ అనేక దేశాల్లో దొరికిపోయిన గూగుల్ చివరికి తన ఈ మెయిల్ ప్రోగ్రాం ఐన జీమెయిల్ వినియోగదారుల సమాచారాన్ని కూడా తన వ్యాపార ప్రయోజనాలకు వినియోగించి అమెరికా నియంత్రణ సంస్ధకు దొరికిపోయింది. ఇలా అడ్డంగా దొరికిపోవడం గూగుల్ కి మొదటిసారీ కాదు, బహుశా చివరిసారీ కాదేమో.

జీమెయిల్ వినియోగదారుల ప్రైవసీకి సంబంధించి గూగుల్ గొప్ప గొప్ప హామీలు ఇస్తుంది. టిఏసి (టర్మ్స్ అండ్ కండిషన్స్) పేరుతో, ప్రైవసీ రూల్స్ పేరుతో పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తుంది. వినియోగదారుల ఏకాంతాన్ని గౌరవించడంలో తనను మించిన వారు లేరని గప్పాలు కొట్టుకుంటుంది. కాని ఆచరణలోకి వచ్చేసరికి అన్ని వర్గాలనుండి ఫిర్యాదులను ఎదుర్కొంటుంది.

తాజాగా అమెరికాకి చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్.టి.సి) చేతిలో శిక్షను ఎదుర్కొంది. జీమెయిల్ వినియోగదారుల సమాచారాన్ని తన సోషల్ నెట్ వర్క్ వెబ్సైటు “గూగుల్ బజ్” ను సృష్టించడానికి గత సంవత్సరం వాడుకుందని ఎఫ్.టి.సి ప్రకటించింది. అందుకు గాను ఇరవై సంవత్సరాల పాటు దాని కార్యకలాపాలను తనిఖీ చేయడానికి ఎఫ్.టి.సి నిర్ణయించింది. “కంపెనీలు వినియోగదారుల ప్రైవసీ కాపాడే విషయంలో రూల్స్ పెట్టుకున్నప్పుడు వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది” అని ఎఫ్.టి.సి చైర్మన్ ‘జాన్ లీబోవిట్జ్’ అన్నాడంటే గూగుల్ కి తాను రూపొందించిన సూత్రాల పట్ల దానికి ఎంత గౌరవం ఉందో అర్ధం అవుతుంది.

విచిత్రం ఏంటంటే గూగుల్ బజ్ చేసిన తప్పుతో తనకు సంబంధం లేదన్నట్లు గూగుల్ మాట్లాడటం. “గూగుల్ విధించిన సాధారణ ప్రమాణాలకు తగినట్లుగా గూగుల్ బజ్ సరితూగలేదు” అని ఆ సంస్ధ అంటోంది. ఇంకా “ఈ రోజు ఎఫ్.టి.సి కి ఉన్న అభ్యంతరాలపై దానితో ఒక ఒప్పందానికి వచ్చాము” అని గొప్పగా ప్రకటించింది. నిజానికి అది ఒప్పందం కాదు, శిక్ష (పనిష్ మెంటు). “నేను చెప్పిన నీతులు నేనే పాటించలేక పోయాను. అందుకని ఎఫ్.టి.సి నాకు శిక్షగా ఇరవై ఏళ్ళపాటు నా కార్యక్రమాలపై నిఘా పెడతానంది” అని చెప్పాల్సింది పోయి, ఎఫ్.టి.సి అభ్యంతరాలపై ఒక ఒప్పందానికి వచ్చాం అని డాబుగా ప్రకటించింది. ఇలాంటి ఎత్తుగడలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రకటనల్లో కనిపిస్తుంది. గాజా పాలస్తీనీయులపై దుర్మార్గంగా దాడి చేసి మళ్ళీ వాటిపైన తానే విచారణ చేశాననీ తప్పేమీ కనబడ లేదని గొప్పగా ప్రకటిస్తుంది.

ఎఫ్.టి.సి, గూగుల్ కి ఎట్టా గడ్డి పెట్టిందో చూడండి. “జీమెయిల్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తన ‘గూగుల్ బజ్’ నెట్ వర్క్’ లో నింపడానికి అది మోసపూరిత ఎత్తుగడలకు పాల్పడింది. గూగుల్ బజ్ వినియోగదారులు దాన్నుండి బైటికి వెళ్ళి పోవడానికి నిర్ణయించుకున్నప్పటికీ ఆ తర్వాత కూడా వారి సమాచారం గూగుల్ బజ్ నుండి తొలగించబడకుండా అలాగే ఉంది. కొత్తగా చేరే వినియోగదారులకు ఈ విషయం గురించి సమాచారం ఇచ్చే ప్రయత్నమేదీ గూగుల్ చేయలేదు.” అని అన్నాడాయన. “పైగా ‘టర్న్ ఆఫ్ బజ్’ అన్న సర్వీసును అందిస్తున్నట్టు ప్రకటించిన గూగుల్, ఆ సర్వీసుని వినియోగించుకున్న వినియోగదారుల సమాచారాన్ని బజ్ నెట్ వర్క్ నుండి పూర్తిగా తొలగించలేదు” అని ఆశ్చ్యరాన్నీ, కోపాన్నీ వ్యక్తం చేశాడు.

గూగుల్ ప్రైవసీ పాలసీ ఇలా అంటుంది, “రిజిస్ట్రేషన్ అవసరమైన ఎదైనా నిర్ధిష్ట సర్వీసును మీరు కావాలనుకున్నప్పుడు, మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము అడుగుతాము. మేము ఆ సమాచారాన్ని ఏ ఉద్దేశ్యంతో పొందేమో దానికి కాకుండా వేరేదానికి ఆ సమాచారాన్ని వినియోగించవలసి వస్తే, అలా వినియోగించడానికి ముందు మీ అనుమతి కోరతాము” …ఇది ప్రైవసీ పాలసీ లోని ఒక నియమం. తీరా జీమెయిల్ సమాచారాన్ని గూగుల్ బజ్ సర్వీసుకు వాడుకొంటూ దానికి వినియోగదారుల అనుమతి అడగడాన్ని విస్మరించింది. దీనికి గూగుల్ చెప్పే సమాధానం ఏంటంటే “మేము ఆ ప్రోగ్రామును వినియోగంలోకి తెచ్చేముందు సరిగా పరీక్షించ లేకపోయాము. అందుకు అపాలజీ కోరుతున్నాము” అని.

ఇట్లాంటి అపాలజీలు గూగుల్ చాలా చెప్పింది. దొరికిపోయిన ప్రతిసారీ గూగుల్, “మేము ఆ ప్రోగ్రాం సాఫ్ట్ వేర్ ని సరిగ్గా పరీక్షకు పెట్టలేదు” అనో, “అది ఎవరో ఒక ఉద్యోగి రూపొందించిన సాఫ్ట్ వేర్. అది దానికి సంబంధించింది కాదు. పొరబాటున దీన్లో కలిసిపోయింది. మేము చూసుకోలేదు, సారీ” అనో, “ఇప్పుడు దాన్ని తీసేశాము. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది” అనో తొండి సమాధానాలు చెప్తుంది. ఇది గతంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ అని ఒక సర్వీసు ప్రవేశ పెట్టింది. దానికోసం యూరప్ లో, అమెరికా లో ఆ దేశాల పర్మిషన్ తీసుకొని కారుల్లో రోడ్ల ఫోటోలు తీసుకుంది. ప్రతి పట్టణంలోని కూడళ్ళు, ముఖ్యమైన ప్రదేశాల దగ్గర కార్లుంచుతారు. ఆ కార్లు ఆ చుట్టుపక్కల దృశ్యాల్ని అన్ని కోణాల్లో ఫోటోలు తీస్తాయి. ఆ ఫోటోలని ఇంటర్నెట్ లో తన స్ట్రీట్ వ్యూ ప్రాజెక్టుకు గూగుల్ వినియోగిస్తుంది. ఎవరైనా కొత్తవారు ఆ పట్టణానికి రావాలంటే దాన్లొని రోడ్లు ఎలా ఉండేదీ, కూడళ్ళు ఎలా ఉండేదీ, ఫలానా ఇల్లు ఎలా కనబడుతుందీ ఇత్యాది విషయాలను ఇంటర్నెట్ లో చూసుకొని గుర్తుంచుకొని వెతికేటప్పుడు తేలిగ్గా దొరకబుచ్చుకోవచ్చు అనేది ఆ సర్వీసు లక్ష్యం.

కార్లు ఫోటోలు మాత్రమె తీస్తున్నాయి అని అందరూ అనుకున్నారు. కాని మొట్టమొదట జర్మనీ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల క్రితం అనుమానం వచ్చింది. వాళ్ళు తనిఖీ చేస్తే ఘోరం బయటపడింది. ఇప్పుడు చాలా మంది వైర్ లెస్ నెట్ కనెక్షన్ వాడుతున్నారు. వీటికి రక్షణ్ ఉండదు. వైర్ లెస్ సెట్ ఇంట్లో ఒక చోట ఉంటుంది. దాన్నుండి వైరు లేకుండా వివిధరూముల్లో ఉండే కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందుతుంది. గాలి ద్వారా ఆ కనెక్షన్ అందుతుంది. వినియోగదారులు కంప్యూటర్ ముందు కూచొని వాటిలో ఫీడ్ చేసే సమాచారం అంతా కొద్ది సెకన్లపాటు గాల్లో ప్రయాణిస్తుంది. గాల్లో ప్రయాణించినపుడు ఆ సమాచారానికి రక్షణ ఉండదు. దానికి దగ్గర్లో తగిన పరికరాలను ఉపగియోగించి ఆ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. గూగుల్ కార్లు సరిగ్గా అదే పని చేశాయి. వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి వినియోగదారుడి సమాచారాన్ని ఆ కార్లు సేకరించాయి. సేకరించిన సమాచారం గూగుల్ కార్యాలయంలో దానికోసమే ఏర్పాటు చేసిన హార్డ్ డిస్క్ (సమాచారం నిలవ ఉండే మెమొరీ పరికరం) లో రికార్డ్ అయ్యే విధంగా గూగుల్ ఏర్పాటు చేసుకుంది.

ఈ విషయం జర్మనీ ప్రభుత్వం తనిఖీలో బైట పడింది. అయితే బైట పడిన వెంటనే ఆ కార్యక్రమం ఏంటో సరిగా వారికి అర్ధం కాలెదు. కంప్యూటర్ నిపుణులు అందరికీ తెలిసాక గూగుల్ దుర్మార్గం అర్ధం అయ్యింది. పేపర్లకి ఆ సమాచారం ఇచ్చాక ప్రపంచం అంతటా ముఖ్యంగా యూరప్, అమెరికాల్లో పెద్ద దుమారం చెలరేగింది. దానికి గూగుల చెప్పిన వివరణ అతి పెద్ద అబద్ధమని అందరికీ అర్ధం అయ్యింది. గూగుల్ చెప్పిందాని ప్రకారం గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్లు వైర్ లెస్ కనెక్షన్ల (వై-ఫై హాట్ స్పాట్స్ అని ఇంగ్లీషులో అంటుంటారు) సమాచారం సేకరిస్తున్న విషయం గూగుల్ కే తెలియదు. మరి అలా సేకరించడానికి ఒక ప్రోగ్రాం రాయాలి. ప్రోగ్రాం రాస్తేనే కదా సమాచారాన్ని దొంగిలించింది అనడిగితే, మా ఉద్యోగి ఒకరు వేరేదాని కోసం ఆ ప్రోగ్రాం రాశాడు. అది పొరబాటున స్ట్రీట్ వ్యూ ప్రోగ్రాంలో కలిసింది అన్నారు. మరి సమాచారాన్ని పొరబాటున కలెక్ట్ చేస్తే దాన్ని చూసినపుడు తొలగించాలి. తొలగించకపోగా హార్డ్ డిస్క్ లో ఎందుకు స్టోర్ చేస్తున్నారు అనడిగితే, మేం తనిఖీ చేస్తాం చూస్తాం అన్నారు. ప్రోగ్రాం రాశిన ఉద్యోగి ఎవరంటే గూగుల్ ఇంతవరకు చెప్పలేదు.

ఇంకా ఘోరం ఏంటంటే, ఇలా స్ట్రీట్ వ్యూ కార్లద్వారా సమాచారం దొంగిలించే కార్యక్రమం అప్పటికి ఐదు (ఇప్పటికి ఏడు) సంవత్సరాల నుండి జరుగుతోంది. ఇంటర్నెట్ అంటే సమాచార మార్పిడే. నెట్ లో సమాచారానికి అత్యంత విలువ ఉంటుంది. వ్యక్తిగత వివరాల విలువైతే చాలా ఎక్కువ ఉంటుంది. ఉచితంగా ఈ-మెయిల్, ఉచితంగా బ్లాగు, ఉచితంగా ఛాటింగ్, ఉచితంగా సోషల్ నెట్ వర్క్ సభ్యత్వం, ఉచితంగా కంప్యూటర్ గేమ్స్, ఉచితంగా సాఫ్ట్ వేర్, ఉచితంగా రాజకీయాలు, ఉచితంగా షేర్ మార్కెట్ సలహాలు ఇలా ఉచితం అనే పేరుతో మనకు ఇంటర్నెట్ లో దొరికేవన్నీ ముందు మన సమాచారాన్ని అడుగుతాయి. పుట్టిన రోజి, ఫోటో, అలవాట్లు, అభిప్రాయాలు, పిల్లలు పెద్దలు వారి పేర్లు వాళ్ళ ఫోటోలు అన్నీ మాదగ్గర భద్రంగా నిలవ చేసుకొండి, కావలసినప్పుడు తిరిగి చూసుకోండి అంటూ వివరాలన్ని సేకరించి నిలవ చేసుకుంటాయి. కొన్ని వాటిని వ్యాపార ప్రయోజనాల కోసం అమ్మేసుకుంటాయి. కొన్ని క్రెడిట్ కార్డు నంబర్ల లాంటివి సేకరించి డబ్బు దొంగిలిస్తాయి లేదా దొంగిలించే వారికి అమ్ముకుంటాయి. కొన్ని తామె వ్యాపారం చేశ్త్తాయి. మరికొన్ని మరీ డేంజర్. ప్రవేటు డిటేక్టివ్ సంస్ధలకు అందుబాటులో ఉంచి రెగ్యులర్ గా డబ్బు వసూలు చేస్తాయి.

అయితే యాహూ, మైక్రో సాఫ్ట్ తదితర సంష్దలు వ్యాపార ప్రయోజనాలకు వాడుకున్నా కొన్ని నీతులు, నియమాలు పాటిస్తాయి. గూగుల్ మాత్రం కేవలం సమాచార సేకరణ కోసమే ఉచిత సర్వీసులు అందిస్తాయి. చాలా మంది తప్పుడు పేర్లు, తప్పుడు సమాచారం ఇస్తున్నారని సరైన సమాచారం ఇచ్చే ఎత్తుగడల్ని కూడా గూగుల్ కనిపెట్టి దానికి కావాల్సిన ప్రోగ్రాంలు రాసి అమలు చేస్తోంది. ఉదాహరణకు ఉచితంగా బ్లాగు తీసుకో, రెచ్చిపో అంటుంది. ఆనందంగా తీస్కుంటాం. మీ బ్లాగ్ పైన ఆదాయం కావాలా, అయితే గూగుల్ కొన్ని ప్రకటనలు ఇస్తుంది మీ బ్లాగ్ లో పెట్టుకొండి. ప్రకటనల మీద వినియోగదారులు క్లిక్ చేసినప్పుడల్లా మీ ఖాతాలో డబ్బు జమ చేస్తాం అంటుంది. ఆనందంగా ఒప్పుకుంటాం. టైం పాస్ కి బ్లాగు మొదలు పెట్టి దానికి డబ్బులొస్తాయంటే ఎవరైన ఒప్పుకుంటారు. మరి డబ్బులు ఏ ఖాతాలో జమ చేయమంటారు అనడుగుతుంది. మీ బ్యాంకు అకౌంటు నంబర్ చెప్పండి. దాన్ని రహస్యంగ ఉంచే పూచీ నాదీ. లేదా ఫలానా విశ్వసనీయమైన వెబ్ సైటు (ఉదా: పే పాల్) ఉంది. దాని ద్వారా మీ బ్యాంకు లో వేస్తాం అంటుంది. నిజంగానే పేపాల్ విశ్వసనీయమైనదే. కాని దానికి ఇచ్చే వివరాలు గూగుల్ ద్వారా వెళ్తాయి. మీ అకౌంట్ లో ఉండే మీ పేరు, మీ బ్లాగ్ కోసం ఇచ్చిన మీ పేరు ఒకటిగానె ఉండాలి. తప్పు పేర్లు ఇవ్వడానికి వీల్లేదు అంటుంది. దాంతొ అప్పటిదాకా వేరే పేరు ఇచ్చిన మనం అదిచ్చే డబ్బు కోసం అసలు పెరు ఇచ్చేస్తాం. దాంతో అసలు పేరు, ఉద్యోగం తదితర వివరాలన్నీ గూగుల్ కి తెలుస్తాయి. వాటిని ఓ చోట భద్రంగా ఉంచి వివిధ రకాల వ్యాపారాలకు వినియోగించుకుంటుంది గూగుల్. ఇంతా చేసి గూగుల్ ఇచ్చే ఆదాయం పైసల్లో ఉంటుంది. కొంతమంది బాగానె సంపాదిస్తారు. అయితే వారికి అదే పనిగా ఉండాలి. అలా అదే పనిగా ఉండే వాళ్ళ వివరాలు అప్పటికే నెట్ లో అందుబాటులో ఉంటాయి.

జీ మెయిల్ మొదలు పెట్టినప్పుడు కూడా గూగుల్ ఇలాంటి వేషాలే వేసింది. మొదట బహిరంగంగా అందుబాటులో ఉంచకుండా కొంతమందికే ఇచ్చింది. వాళ్ళు జీ మెయిల్ తీసుకోమని ఎవరికైనా ఆహ్వానం ఇవ్వడానికి కొన్ని ఆహ్వానాలను కేటాయించింది. వారు ఆహ్వానితుల్ని జీ మెయిల్ కి పరిచయం చేసిన కొద్దీ ఆహ్వానాల్ని పెంచింది. దీన్లో ఉన్న ఎత్తుగడ ఏంటంటే ఆహ్వానించే వారు తాము ఆహ్వానించేవారి అసలు వివరాలను ఇచ్చేటట్లు ఆ ఆహ్వానాలు ఉన్నాయి. ఆ విధంగా కొన్ని కోట్ల మంది వివరాలు గూగుల్ సంపాందించి ఉంటుందని అంచనా. యాహూ లాంటి సంస్ధలకు ఇన్ని తెలివితేటలు లేవు. ఇలా సమాచార సేకరణ ద్వారానే తన వ్యాపారాన్ని గూగుల్ పెంచుకుంటూ పోయింది. గూగుల్ సెర్చి లో అంత త్వరగా రిజల్ట్స్ రావడానికి కారణం అది అడ్డదారుల్లో చేసిన సమాచార సేకరణ. కేవలం సమాచార సేకరణ ద్వారా ఇంటర్నెట్ కంపెనీల్లో అన్నింటి కంటే పెద్ద సంస్ధగా ఎదిగింది. గూగుల్ కి మనం ఇచ్చే వివరాలు అమెరికా గూఢచార సంస్ధలకు అందుబాటులో ఉంచిందన్న అనుమానాలు సైతం ఉన్నాయి. వాటిల్లో నిజం ఎంతో తెలీదు. ఫొటోల దగ్గర్నుండి పుట్టిన రోజు దాకా మనం ఇచ్చే వివరాలు ఇలా ఉపయోగించబడుతున్న సంగతి వార్తలు శ్రద్ధగా చదువుతూ, ఇంటర్నెట్ పోకడలు పరిశీలించే వారికే అర్ధమవుతాయి తప్ప అందరికీ అర్ధం కావు. అర్ధం అయ్యేలా ఉన్నా తెలుసుకొనే ఆసక్తి, ఓపిక ఉండవు. అందుకే గూగుల్ ఘోరాలు వరసగా బైట పడుతున్నా దాని ఆటలు సాగుతూనే ఉన్నాయి. ఏ ఇంటర్నెట్ ద్వారా ఐతే గూగుల్ ఎదిగిందో ఆ ఇంటర్నెట్ నె గూగుల్ దుర్వినియోగం చేసి ఈ స్ధాయికి ఎదిగిందని గమనించి ఇంటర్నెట్ లోని వివిధ ఉచిత సర్వీసులు పొందేవారు తమ ప్రైవసీని తామే రక్షించుకోవాలని గుర్తెరగాలి. బ్బాగా అవసరమైతే తప్ప, అన్ని కోణాల్లోంచి ఆలోచించి ఫర్లేదు అనుకుంటే తప్ప వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా రాజకీయ కార్యకర్తలకు ఈ హెచ్చరిక బాగా వర్తిస్తుంది.

4 thoughts on “గూగుల్ చాలా ఘోరాలు చేస్తోంది -అమెరికా రెగ్యులేటర్ ఎఫ్.టి.సి

  1. అవునా? కావలిలో గూగుల్ ఉచిత బ్లాగ్లు నడుపుతున్నారు. వాటిల్లో యాడ్స్ కూడా వస్తున్నాయి, డాలర్ల రూపంలో. నెలా నెలా వేల రూపాయల చెక్ లు వస్తున్నాయి. వారందరికి నేను ఈ గూగుల్ ఘోరాల ఆర్టికల్ పంపాను.

  2. నా ఫేస్ బుక్ లో కూడా నీ ఆర్టికల్స్ ను కాపీ చేసి పెడుతున్నాను. క్లిక్ చేస్తే నీ సైట్ ఓపెన్ అవుతున్నది. ఫేస్ బుక్ లో కూడా అందరూ వారి ఫోటోలు, సుత్తి కవితలు తప్పితే పొలిటికల్ సోషల్ యాక్టివిటీలు ఉండడం లేదు. కొన్ని ఆర్గనైజేషన్లు ఫర్వాలేదు. పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్, ఇంక్విలాబ్ నవజవాన్ సభ లాంటి కొన్ని సొంత ఫేస్ బుక్ లు నడుపుతున్నాయి. అవి బాగున్నాయి.

  3. భాస్కర్, యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. కొనసాగించు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి వలన మనుషుల మధ్య నేరుగా సంబంధాలు పెట్టుకొని ఆరోగ్యకరమైన సంభాషణలు జరుపుకోవడం బాగా తగ్గి పోయింది. ఈ నేపధ్యంలో రాజకీయ కార్యకర్తలు కూడా టెక్నాలజీ ద్వారా సంబంధాలు పెంచుకునే అవసరం పెరిగింది. తమ టైంలో ఎంతొకొంత ఇంటర్నెట్ సంబంధాలను పరిమిత స్ధాయిలో పెట్టుకోవలసిన అవసరం పెరుగుతున్నట్లుగా నాకనిపిస్తోంది. ఇంటర్నెట్ కోసం ఇంటర్నెట్ కాకుండా ఇంటర్నెట్ సంబంధాల్ని వినియోగించుకునే రీతిలో టెక్నాలజీ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s