గడ్డాఫీ బలగాల ధాటికి లిబియా తిరుగుబాటు బలగాలు మళ్ళీ వెనక్కి పారిపోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడుల మద్దతు లేకుండా తిరుగుబాటు బలగాలు పురోగమించడం అసాధ్యమని స్పష్టమై పోయింది. గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన పౌర సైన్యానికి శిక్షణ కొరవడడంతో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్ని నిలబెట్టుకోలేక పోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడులతో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరుగుబాటు దారులు వదిలిపెట్టి తూర్పువైపుకు పారిపోతున్నాయి. దీనితో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ తిరుగుబాటు బలగాలకు ఆయుధ సాయం చేయడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు వారి ప్రకటనల ద్వారా అర్ధమవుతోంది.
ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పశ్చిమ దేశాలకు నో-వ్లై జోన్ అమలు చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్న తీర్మానాన్ని అనుకూలంగా ఉపయోగించుకోవడానికి పశ్చిమ దేశాలు అవకాశం కోసం చూస్తున్నాయి. తిరుగుబాటు బలగాలకు “ఆయుధ సాయం చేసే అవకాశాన్ని అంగీకరించడం లేదు. అలాగని తిరస్కరించడమూ లేదు” అని బారక్ ఒబామా చెప్పడాన్ని బట్టి తగిన సాకు కోసం పశ్చిమ దేశాలు చూస్తున్నాయని అర్ధం చేసుకోవచ్చు. లిబియాలొ జోక్యానికి లిబియా పౌరుల రక్షణ అన్న సాకును వెతుక్కున్నట్లే ఆయుధ సాయం కోసం తగిన పరిస్ధితులకోసం అవి ఎదురు చూస్తుండవచ్చు. అయితే లిబియా ఆయుధ సాయం చేయకుండా ఆంక్షలు విధించిన ఐక్యరాజ్యసమితి పశ్చిమ దేశాల ఆయుధ సాయానికి అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
తూర్పు లిబియాకు ముఖద్వారంగా చెప్పుకునే అజ్దాబియా నుండి గడ్డాఫీ బలగాలను వెనక్కి తరమడానికి సంకీర్ణ సేనలు ఐదురోజుల పాటు వైమానిక దాడులు చేయాల్సి వచ్చింది. అజ్దాబియా తర్వాత బ్రెగా, బిన్ లానుఫ్ లాంటి ఆయిల్ పట్టణాలను కూడా వశం చేసుకున్న తిరుగుబాటు బలగాలు, గడ్డాఫీ బలగాలు ట్యాంకులు, ఫిరంగులు, రాకెట్ లతో భారి దాడులు ప్రారంభించడంతోటే ఆ పట్టణాల్ని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయకుండా వెనక్కి పారిపోయాయి. తమ బలహీనతలను బెంఘాజీలోని తిరుగుబాటు దారుల నాయకులే అంగీకరిస్తున్నారు. డాక్టర్లు, లాయర్లు, విద్యార్ధులు, నిరుద్యోగులు ఆయుధాలు పట్టడం ద్వారా ఏర్పడిన తిరుగుబాటు బలగాలు అనుభవం, క్రమ శిక్షణ, ట్రైనింగ్ లేక బాగా బలహీనంగా ఉన్నాయి. గడ్డాఫీని వదిలిన తిరుగుబాటు సైన్యాలు గడ్డాఫీ బలగాలపై పోరుకు సిద్ధం కాలేదు. అవి బ్యారక్ ల వరకే పరిమితమయ్యాయి. యుద్ధంలో కమాండర్ల ఆజ్గ్నలకు కూడా త్వరగా స్పందించలేక పోతున్న తిరుగుబాటు బలగాలు యుద్ధాన్ని కొనసాగించడం అనుమానమే. ఇప్పటికే తీవ్ర వాదోపవాదాలు జరిగితే గాని ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్ధితిలో అవి ఉన్నాయి.
ఈ నేపధ్యంలో లిబియాలో అంతర్యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి తీర్మానం దరిమిలా పశ్చిమ దేశాల జోక్యం లేనట్లయితే గడ్డాఫీ సైన్యం ఈ సరికి తిరుగుబాటును అణిచివేసి ఉండేదేమో! దీర్ఘకాలం కొనసాగే యుద్ధానికి నాయకత్వం వహించే స్ధితిలొ లేకే అమెరికా వెనక్కి తగ్గింది. ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకు సైతం తమ తమ దేశాల్లోని సంక్షోభ ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా దీర్ఘకాలం లిబియా యుద్ధంలో మునిగి తేలే పరిస్ధితి లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్ధితుల నడుమ ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమించి, ఆయుధ సరఫరాపై తాము విధించిన నిషేధాన్ని తామే ఉల్లంఘిస్తూ, పశ్చిమ దేశాలు, లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Your contribution is very good. It’s a worthy work. This website is very needful. I will follow from today onwards. …PR
Thank you, Ranganna. I’m honored.