దేశవ్యాపితంగా వెల్లివిరుస్తున్న క్రికెట్ దేశభక్తి


A Cricket fan at the Chepauk stadium, Chennai

ఎల్లలు లేని క్రికెట్ దేశభక్తి

క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభం కావడానికి నెల ముందునుండే (ఇంకా ముందన్నా ఆశ్చర్యం లేదు) భారత దేశ వ్యాపితంగా  దేశభక్తి వెల్లివెరుస్తోంది. ఇతర దేశాల సంగతేమో గానీ ఇండియాలో మాత్రం దేశభక్తికి సీజన్లు ఉంటాయి. అంటే సీజన్ ను బట్టి దేశభక్తి లక్షణాలు మారుతుంటాయి. దేశభక్తి అంటే ఎల్లప్పుడూ ఒక్కటే అర్ధం కదా అంటే, నిజమే. సర్వకాల సర్వావస్ధలయందూ ఒకటే అర్ధం. కానీ ఇండియాలో దేశభక్తి అన్ని కాలాల్లో వ్యక్తం కాదు. కొన్ని సీజన్లలో దేశభక్తి చాటుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవరికీ ఆ ధ్యాసే ఉండదు. కొన్ని సీజన్లలో దేశభక్తితో ప్రతిస్పంచించాల్సిన అవసరం లేకపోయినా చాలా తీవ్ర స్ధాయిలో వ్యక్తమవుతూ ఉంటుంది.

ఇండియాలో క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు భారత ప్రజల దేశభక్తిని పట్టలేం. క్రికేట్ అంత కాకపోయినా హాకీ మ్యాచ్ లు జరిగేటప్పుడు కూడా అలాంటి దేశాభక్తి ఉరకలేస్తూ ఉంటుంది. ఇటీవల కామన్ వెల్త్ ఆటలను ఇండియా నిర్వహించింది. ఆ సందర్భంలో కూడా ఇలాగే దేశభక్తి పెరిగింది. దానికి కామన్ వెల్త్ దేశభక్తి అనొచ్చేమో. క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడయితే దేశభక్తి హద్దులు దాటిపోతూ ఉంటుంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లైతే ఇక చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ పై అకారణ ద్వేషం రగులుతూ ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్టు దాడులు జరిగిన తర్వాత అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల విద్వేష ప్రచారం మూలాన ముస్లింలంటే విపరీతమైన ద్వేషం వ్యాపించింది. క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు -పాకిస్తాన్, ఇండియాలు ఆ మ్యాచుల్లో ఆడుతున్నట్లయితే-  ఆ ద్వేషానికి సాంప్రదాయకంగా దాయాదుల మధ్య కొనసాగుతూ వచ్చిన ద్వేషం జత కలిసి మరింతగా ప్రజ్వరిల్లుతుంది.

దాంతో ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద గెలిచి తీరాలన్నంత పట్టుదల భారతీయుల్లో పెరిగిపోతుంది. పొరపాటున ఇండియా ఓడినట్లయితే భారతీయులు తీవ్రమైన భావోద్వేగాలతో రెచ్చిపోతారు. ఆ భావోద్వేగాలు దారితప్పి ఆటగాళ్ళపై ద్వేషంగా, కోపంగా మారిపోతుంది. ఒక్కోసారి ఆటగాళ్ళ ఇళ్ళపై దాడులు చేసేదాకా ఆ కోప, ద్వేషాలు వెళ్తాయి. గతంలో భారత్, పాకిస్తాన్ పై ఓడినఫ్ఫుడు ఆటగాళ్ళ ఇళ్ళపై దాడులు జరిగిన సందర్భాలున్నాయి. ప్రస్తుత వరల్డ్ కప్ లోనే బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరనందుకు ఆ దేశ ఆటగాళ్ళపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహించారు. మ్యాచ్ ముగిసాక బంగ్లాదేశ్ లో కొన్ని చోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. అటువంటి సంఘటనలు ఇండియాలో కూడా జరిగాయి.

క్రికెట్ ఒక ఆట మాత్రమేననీ, ఆటన్నాక గెలుపోటములు సహజమేనన్న అవగాహన, ఓర్పు నశించిన సందర్భాలు చాలా సార్లు ఇండియాలో జరిగాయి. ఇండియా ఓటమి తప్పదని తెలిశాక మైదానంలోకి వాటర్ బాటిళ్ళులాంటివి విసరడం, అవతలి టీము వాళ్ళపై విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేయడం జరుగుతుంటుంది. అయితే ఈ స్ధాయి దేశభక్తి క్రికెట్ ఆటల సీజన్ ముగిశాక ఆశ్చర్యంగా కనబడకుండా పోతుంది. ఉదాహరణకి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభం కావడానికి చాలా ముందే ఇండియాలో 2 జి కుంభకోణం బైటపడింది. ఇష్టారీతిన స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు, 2 జి స్పెక్ట్రం ను తక్కువ ధరకు కేటాయించడం వలన 1.76 లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం నష్టపోయినట్లు భారత రాజ్యాంగ సంస్ధ “కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఏ.జి – కాగ్) తేల్చింది. దీనికి సంబంధించి మాజీ టెలికమ్యూనికేషన్ శాఖా మంత్రి ఎ.రాజా విచారణ ఎదుర్కోంటూ జైల్లో ఉన్నాడు.

ఇన్ని లక్షలకోట్లు నష్టం వచ్చిందన్నా ప్రతిపక్ష పార్టీలూ, కొన్ని ప్రజా సంఘాల నాయకులూ తప్ప ప్రజల్లో ఎలాంటి స్పందనా రాలేదు. దేశానికి రావాల్సిన డబ్బును రాబట్టాల్సిన మన రాజకీయ నాయకులు ప్రవేటు కంపెనీలతో కుమ్మక్కై లంచాలు మింగి తక్కువధరకు దేశ సహజ వనరుల్ని అమ్మేస్తే ఎంత కోపం రావాలి? అదేమీ రాలేదు. ఇప్పుడు విచారణ జరుగుతున్నదంటే కారణం సుప్రీం కొర్టు తనంత తానుగా స్వయంగా జోక్యం చేసుకోబట్టే. ప్రభుత్వం తన భాద్యత గుర్తించి విచారణకు ఆదేశించడం వలన జరుతున్న విచారణ కాదిది. లేదా ప్రజలు కోపగించి విచారణ జరగాలని డిమాండ్ చేయడం వలన జరుగుతున్న విచారణ కూడా కాదిది. కొర్టుల జోక్యం వలన ఈ విచారణ జరుగుతోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం విచారణ జరగకుండా ఉండటానికి మౌనంగా దాటవేయడానికి శక్తి కొద్దీ ప్రయత్నించి సఫలం కాకపోవడం వలన జరుగుతున్న విచారణ ఇది.

అలాగే కామన్వెల్త్ కుంభకోణం కూడా. బిల్డర్లతో కుమ్మక్కైన నిర్వహణాధికారులు నాసిరకం నిర్మాణాలు జరిపినా మౌనంగా ఉన్నారు. కామన్వెల్త్ ఆటల్లో పతకాలు సాధించడంలో ఆసక్తి చూపిన ప్రజలు ఆ ఆటల నిర్వహణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటే మాత్రం పట్టించుకోలేదు. ఈ బ్లాగ్ రచయిత బ్లాగ్ క్రిటిక్స్ అనే వెబ్ సైట్ లో కామన్వెల్త్ ఆటల్లొ జరిగిన అవినీతిపై భారత పాలకులను విమర్శిస్తూ ఓ ఆర్టికల్ రాస్తె ఓ చదువరి దాన్ని చదివి అంత పెద్ద ఆటలు జరుగుతుంటే ఇండియాను ప్రోత్సహించడం మానేసి అవినీతి లాంటి చిన్నవిషయాన్ని పట్టించుకోవడం ఏం బాగాలేదని ఆగ్రహిస్తూ కామెంట్ రాశాడు. ఆటలతో పోలిస్తే వేలకోట్ల ప్రజాధనం దిగమింగడం అతనికి చిన్న విషయంగా కనిపించింది. అంటే అతని కామన్వెల్త్ దేశభక్తి ఆ ఆటలను దాటి ముందుకు వెళ్ళలేక పోయిందన్నమాట.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల జీవనాధారాన్ని కబళించివేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని బీల నేలల్లో కోటీశ్వరులు ధర్మల్ ప్రాజెక్టు నిర్మిస్తుంటే అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. సంవత్సరం నుండి గ్రామాలకు గ్రామాలు నిరాహార దీక్ష చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసుల్ని కోటీశ్వరులకు అండగా పంపి ప్రాజెక్టుల్ని కట్టడానికి ప్రయత్నిస్తే ప్రజలు అడ్డుకున్నపుడు పోలీసులతో కాల్పులు జరిపించి మరీ ప్రజల్ను అడ్డుతొలగించడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందే తప్ప ప్రజల గోడు వినలేదు. చివరికి పోలీసుల కాల్పుల్లొ కొంతమంది చనిపోయినా రాష్ట్రప్రజలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజల ఆస్తులు ప్రవేటు వ్యక్తులకు అప్పజెప్పడం వలన నష్ట పోయేది రాష్ట్రప్రజలే. పైగా ప్రాజెక్టుల వలన చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటపోలాలు, నివాస ప్రాంతాలు అన్నీ పనికి రాకుండా పోతాయి. పోలీసుల కాల్పుల దృశ్యాన్ని టీవీ ఛానెళ్ళ వారు చూపినా ప్రజలనుండి ప్రతిస్పందన రాలేదు.

ఇవే కాదు. ప్రస్తుతం వికీలీక్స్ వెల్లడించిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ను ది హిందూ పత్రిక ప్రచురిస్తోంది. భారత పాలకులు ఇండియా ప్రయోజనాలను అమెరికాకి ఎలా తాకట్టు పెట్టిందీ ఆ కేబుల్స్ ద్వారా వెల్లడవుతోంది. ప్రధానమంత్రిని అడిగితే ఆ కేబుల్స్ నమ్మదగినవి కావని తప్పించుకున్నాడు తప్ప జవాబుదారీతనంతో సమాధానం ఇవ్వలేదు. ఆ కేబుల్స్ నిజమైనవే. అందులో సమాచారం కూడా కరెక్టే అని వాటిని రాసిన వ్యక్తి స్వయంగా చెప్పినా ప్రధాని దగ్గర్నుండి సమాధానం లేదు. మిస్టర్ క్లీన్ అని భావిస్తున్న మన ప్రధాని అంత డర్టీగా మాట్లాడుతున్నా కనీసం భారత మేధావి వర్గం నుండి రావాల్సిన స్పందన రాలేదు. ఇంగ్లీషు భాషతో సమస్య ఉంది కాబట్టి సామాన్య ప్రజానీకాన్ని మినహాయించినా మేధావులకేం తెగులొచ్చింది? ఈ మేధావులు కూడా క్రికెట్ దేశభక్తిలో ముందుండే వారే.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. జాతికి సంబంధించిన సహజ వనరులన్నీ ప్రవేటీకరణ, గ్లోబలీకరణ, సరళీకరణ పేర్లతో బహుళజాతి సంస్ధలకు అప్పగిస్తుంటే దేశభక్తి ఉన్నవారికి ఎంత ఆగ్రహం రావాలి? ఆటల్లొ ఈ రోజు ఓడినా రేపు గెలవచ్చు. రెండూ ఆటలో భాగమే. కాని దేశ సంపద ఖర్చయితే తిరిగి వచ్చేది కాదు. భారత రాజకీయ నాయకులే అడ్డగోలుగా ప్రజలకు చెందిన వనరుల్ని అమ్మేస్తుంటే రావల్సిన ఆగ్రహం రావడం లేదు. రేగాల్సిన దేశభక్తి రేగడం లేదు. దేశానికి సంబంధించిన అన్ని వనరులూ దేశ ప్రజలకే చెందాలన్న చైతన్యం కూడా దేశభక్తిలో ముఖ్యమైన ఒక భాగం. బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమం మొదట ప్రజల ఆర్ధిక అవసరాలనుండే మొదలయ్యిందన్న విషయం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి.

4 thoughts on “దేశవ్యాపితంగా వెల్లివిరుస్తున్న క్రికెట్ దేశభక్తి

  1. అవును! దేశభక్తి అంటే ఇండియా క్రికెట్ టీం పాక్ టీం పై గెలవటంగా ఇండియాలో ఉంది. అదే దేశభక్తిగా 99% ప్రజలకు పాలకవర్గాలు రుద్దాయి. అంతే కాదు, పాక్ పై తీవ్రమైన వైషమ్యం వెళ్ళగక్కడం, తద్వారా పాలకవర్గాల ప్రజా వ్యతిరేక పనులు వేగవంతం చేయడం…

  2. దేశభక్తి అంటే పాకిస్తాన్ పై క్రికెట్ మ్యాచ్ గెలిచిన రోజు అర్ధరాత్రి త్రివర్ణ పతాకం చేబూని నడి రోడ్డుపై గెంతులు వేయడం మాత్రమే అనుకునే యువతరం ఎక్కువైతున్న వేళ మీరు రాసిన ఈ ఆర్టికల్ సమయోచితంగా ఉంది

  3. దిలీప్ గారూ, మీ బ్లాగ్ గతంలో చూశాను. మీ పేరు చూసి ఎక్కడో విన్నాననిపించి గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించా. కాని గుర్తుకు రాలా. ఇప్పుడు మీ బ్లాగ్లో మీ పరిచయం చదివాక గుర్తుకు వచ్చింది. “దళారీ…” పుస్తకంపై ఓ స్టడీ సర్కిల్ లో సబ్జెక్టుగా చర్చించుకున్నాం. పుస్తకం చదివి క్లాసులాగా చెప్పింది నేనే. మీరు అనువదించిన పుస్తకం అది అని తెలుసుకుని చాలా ఎక్జైటింగ్ గా అనిపించింది. మీ సైట్లో కామెంట్ రాద్దామంటే ఎక్కడా చోటు దొరకలా. అందుకే ఇక్కడ రాయాల్సి వచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s