అమెరికాతో ‘ఎస్.ఒ.ఎఫ్.ఏ’ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై అమెరికా ఒత్తిడి


అమెరికాతో ఇండియా “సోఫా” ఒప్పందం (ఎస్.ఓ.ఎఫ్.ఏ) ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన సంగతి వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బయటపడింది. అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఉప ప్రధానాధికారి ఆగష్టు 16, 2005 తేదీన రాసిన కేబుల్ నెం. 38759 ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మిలట్రీ డ్రిల్లు నిమిత్తం ఇండియా వచ్చే మిలట్రీ అధికారులకు, రాజకీయ, రాయబార అధికారులకు ఇచ్చిన విధాంగానే “డిప్లోమేటిక్ ఇమ్యూనిటీ” (రాయబార కార్యాలయ ఉద్యోగులకు వారు నియమించబడిన దేశాల నేర చట్టాలనుండి మినహాయింపు ఇవ్వబడుతుంది. దాన్నే డిప్లొమేటిక్ ఇమ్యూనిటీ అంటారు.) సౌకర్యం కల్పించడానికి “సోఫా” ఒప్పందం తయారు చేశారు.

కేబుల్ లో ఉన్న వివరాల ప్రకారం అమెరికా రాయబార కార్యాలయంలోని రక్షణ విభాగం ఆగష్టు 2005లో ఇండియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న జాయింట్ సెక్రటరీ ఎస్. జై శంకర్ కు ఓ లెటర్ రాసింది. “మీకు ముందు పనిచేసిన అధికారి జయంత్ ప్రసాద్, సెప్టెంబరు 2001 లో, ఇండియా వచ్చే అమెరికా మిలట్రీ అధికారులకు ‘సోఫా’ ఒప్పందంపై సంతకాలు జరిగే లోగా ఆ ఒప్పందం కల్పించే రక్షణలు పోందవచ్చని మా రాయబారికి నోటిమాటగా హామీ ఇచ్చి ఉన్నాడు. మేము ఇప్పుడు కోరేదేమంటే అమెరికా రక్షణ విభాగానికి చెందిన అధికారులు మిలట్రీ డ్రిల్లు నిమిత్తం ఇండియా వచ్చినపుడు జయంత్ ఇచ్చిన హామీమేరకు వారికి సోఫాతో నిమిత్తం లేకుండా మా రాయబార కార్యాలయంలోని పాలనా, సాంకేతిక సిబ్బందికి ఇచ్చినట్లే డిప్లొమేటిక్ ఇమ్యూనిటీ కల్పించాల్సిందిగా కోరుతున్నాం” అని ఆ లేఖలో కోరింది.

ఇరు దేశాల రాయబార కార్యాలయాలు దీనికి సంబంధించిన్ నోట్స్ ను పరస్పరం మార్పిడి చేసుకుని ఒప్పందంపై సంతకాలు జరిగే నాటికి చాలా ఆలస్యమవుతుందని అమెరికా రాయబార కార్యాలయంలోని రక్షణ విభాగం తన లేఖలో తెలిపింది. రానున్న మిలట్రీ డ్రిల్లు జరిగేనాటికి ఒప్పందం పూర్తయ్యే అవకాశాలు లేనందున ఒప్పందంతో సంబంధం లేకుండానే అది కల్పించే రక్షణ కల్పించాలని అది కోరింది. “అయితే మనం జరిపే మిలట్రీ డ్రిల్లు, సంక్లిష్టతలో గానీ, విస్తరణలో గానీ విస్తృతమైనందున అనుకోని ప్రమాదాలు గానీ, దురదృష్టకర సంఘటనలు గానీ జరిగే అవకాశం ఉంది. కనుక సోఫా ఒప్పందం కుదరక మునుపే అది కల్పించే రక్షణలు కల్పించాలని కోరుతున్నాం. ఇది చాలా అవసరం” అని అది రాసింది.

కేబుల్ లో ఉన్న సమాచారం ప్రకారం పై లేఖను అందుకున్న జై శంకర్ వెంటనే సమాధానం ఇచ్చాడు. దానిలో అమెరికా రాయబార కార్యాలయం చెప్పినట్లుగా జయంత్ ప్రసాద్ అటువంటి హామీ ఇవ్వకపోగా, దానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చినట్లు రాశాడు. అంటే ఇప్పుడప్పుడే అమెరికా రక్షణాధికారులకు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ కల్పించవద్దనీ, దానివలన సమస్యలొస్తాయని ఆయన తెలిపాడన్నమాట. జై శంకర్ తన సమాధానంలో “మీ లేఖ అందాక విదేశీ శాఖ విభాగంలో రికార్డులు పరిశీలించాం. కానీ అప్పటి అధీకారి జయంత్ నోటి మాటగా హామీ ఇచ్చినట్లు ఎలాంటి దాఖలాలు లేవు. పైగా ‘ఇండియాతో సోఫా ఒప్పందం కుదుర్చుకోవాలని మీరు ఇప్పుడప్పుడే కోరవద్ద’ని స్పష్టంగా అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధులతో సెప్టెంబరు 25, 2001 తేదీన జరిగిన సమావేశంలో చెప్పినట్లు మా రికార్డులు తెలుపుతున్నాయి. ఈ ఒప్పందం కోసం అమెరికా ప్రబుత్వం పట్టుబట్ట వద్దని కూడా జయంత్ కోరాడు” అని రాశాడు.

అయితే అమెరికా రాయబారి కార్యాలయంలోని రక్షణ విభాగం అంతటితో ఊరుకోలేదు. ఒత్తిడి ఇంకా కొనసాగిస్తూ మరొక లేఖ రాసింది. “మలబారు లో సెప్టెంబరు నెలాఖరులో జరిగే ఎక్సర్ సైజుల్లో కొత్తగా విధుల్లో చేరిన ‘యుద్ధ గ్రూపులు’ మొదటిసారిగా పాల్గొంటున్నాయి. వందలమంది సెయిలర్లు ఒడ్డు విడిచి సముద్రం పైకి వెళ్ళవలసి ఉంటుంది. అమెరికాకి ప్రధాన మిలట్రీ భాగస్వామ్య దేశాలన్నింటితో సోఫా ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం అమెరికాకే కాకుండా అవతలి పక్షానికి కూడా వర్తిస్తుంది” అని రాసింది. అంటే ఇండియా మిలట్రీ అధికారులకు కూడా అమెరికాలో అలాంటి సౌకర్యం లభిస్తుందని ఆశ చూపుతున్నారన్నమాట.

దానికి జై శంకర్ తిరుగు సమాధానమిస్తూ, “అమెరికా ఈ సమయంలొ సోఫా ఒప్పందం కోసం పట్టుబడితే అది ‘ఎక్విజిషన్ అండ్ క్రాస్-సర్వీసింగ్ ఎగ్రిమెంటు’ ఒప్పందం కుదరడాన్ని మరింత జఠిలం చేస్తుంది. ఇరుపక్షాలకు వర్తించినప్పటికీ సోఫా ఒప్పందం ద్వారా అమెరికా మిలట్రీ అధికారులకు ఇండియా గడ్డమీద నేరాల మినహాయింపు కల్పించడాన్ని ఇక్కడ వామపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తాయి. సోఫా ఒప్పందం కోసం వత్తిడి చేసి తద్వారా భారత వ్యవస్ధపై అధిక బరువు మోపవద్దని విన్నవిస్తున్నాం” అని రాశాడు.

‘పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం’ అంటే ఇదేనేమో. అమెరికా మిలట్రీ వాళ్ళు ఇక్కడ ఎక్సరసైజులు చేస్తూ పొరబాటున భారతీయుల్ని గాయపరిచినా, చంపినా వారిపై ఎటువంటి నేరారోపణ చేయకుండా వదిలిపెట్టాలన్నమాట! చంపితే నేరమవుతుందన్న నిబంధన ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మిలట్రీ ఎక్సరసైజుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాకాక ‘ఇవి ఎక్సరసైజులేగా, ఫర్లేదు చంపు, ఏంకాదు. సోఫా ఒప్పందం కుదుర్చుకున్నాంలే’ అనంటే చంపటానికి లైసెన్సు ఇచ్చినట్లే కదా. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అమెరికా మిలట్రీ కెరీర్ వార్ గ్రూపులు (అంటే మిలట్రీ తమ కెరీర్ ని అప్పుడే ప్రారంభించారని అర్ధం. వారు ఇలాంటి ఎక్సరసైజుల్లో పాల్గొని అనుభవం సంపాదిస్తే వారి సర్వీసుని రెగ్యులరైజ్ చేస్తారన్నమాట. అంటే ప్రొబేషన్ వీరులు) మొదటిసారిగా ఇలాంటి ఎక్సరసైజుల్లో పాల్గొంటున్నట్లు అమెరికా రాయబార కార్యాలయ రక్షణ విభాగం తెలిపింది. అమెరికాలోనె ఎక్సరసైజులు చేస్తే చచ్చేది అమెరికన్లే. “ఉమ్మడి సైనిక విన్యాసాల” పేరుతో వేరే దేశాల్లో ఎక్సరసైజులు చేస్తే చచ్చేది వాళ్ళే. సోఫా ఒప్పందం ఉంటుంది కనక నేరారోపణ జరగదు. ఇతర దేశీయుల్ని చంపి అమెరికా సైనికులు అనుభవం సంపాదిస్తారన్నమాట. అటు అనుభవమూ వస్తుంది, చంపినా స్వేచ్ఛగా అమెరికాకి వెళ్ళి పోవచ్చు.

అయినా, జయంత్ ప్రసాద్, జై శంకర్ ల అమాయకత్వం కాకపోతే, పదుల వేల మందిని చంపినా భోపాల్ గ్యాస్ లీకు నిందితుడు యాండర్సన్ ను మనోళ్ళు నిరభ్యంతరంగా ప్రభుత్వ విమానం ఇచ్చిమరీ సాగనంపారు. అనేక భారత చట్టాల్ని ఉల్లంఘించి మరీ సాగనంపారు. ఇక ఆఫ్ట్రాల్ ‘సోఫా’ ఏం చేస్తుంది? వచ్చి చంపుకోమనక?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s