ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చిన ఇండియాపై అమెరికా ఆగ్రహం -వికీలీక్స్


UNGA

ఐక్యరాజ్య సమితి, జనరల్ అసెంబ్లీ

ఇండియాపై అమెరికా కర్రపెత్తనానికి ఇది మరో ఋజువు. ఈ సారి అమెరికా చెప్పినట్టు ఇండియా వినకపోవడమే వార్త. అయితే అందులో ఇండియా పాలక వర్గాల ప్రయోజనం ఇమిడి ఉండటంతో అమెరికా గీసిన గీత దాటడానికి ఇండియా పాలకులు ధైర్యం చేశారు. డిసెంబరు 2008లో ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం గాజా పై దాడి చేసి అక్కడి పౌరులను చంపడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానానికి ఇండియా మద్దతు తెలిపింది. ఓటింగ్ కుముందు అమెరికా లాబీయింగ్ ను ఇండియా వ్యతిరేకించిన విషయాన్ని తెలుపుతూ ఆగ్రహంగా అమెరికాకి రాసిన విషయం వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. భద్రతా మండలిలో రెండు సంవత్సరాల తాత్కాలిక సభ్యత్వానికి 2010 లో జరిగే ఎన్నికల్లో అలీన దేశాల మద్దతు సంపాదించుకోవడానికే ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఇండియా నిర్ణయించుకుందని తెలుపుతూ అమెరికా రాయబారి తిమోతి రోమర్ కేబుల్ పంపాడు.

అమెరికా టెర్రరిస్టు సంస్ధగా ముద్ర వేసిన హమాస్ సంస్ధ, పాలస్తీనా భూభాగం “గాజా” లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయి ప్రభుత్వం ఏర్పరిచింది. హమాస్ సంస్ధ ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించదు. అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నట్లే ఇజ్రాయెల్ మధ్య ప్రాచ్య ప్రాంతంలో పోలీస్ రౌడీగా వ్యవహరిస్తుంది. గాజాలో హమాస్ ఎన్నికయినా దాన్ని గుర్తించకుండా గాజాను అష్టగిగ్బంధనం గావించింది. ఆహారం, సరుకులు ఏవీ బైటినుండి అందకుండా అడ్డుకుంటుంది. ఇళ్ళ నిర్మాణానికి వాడే సరుకుల్ని కూడా పేలుడు పదార్ధాలు తయారు చేయడానికి వాడతారన్న పేరుతో అడ్డుకుంటుంది. గాజాకు ఎవరన్నా సాయం చేస్తారేమోనని మధ్యధరా సముద్రంలో కాపలా కాస్తూ అంతర్జాతీయ జలాల్లో ఉన్న నౌకల్ని కూడా దౌర్జన్యంగా ఆపి తనిఖీ చేస్తుంది.

ఇన్ని చేసినా గాజా ప్రజలు హమాస్ ని వీడటానికి ఇష్టపడలేదు. ఇజ్రాయెల్ ఎన్ని కష్టాలు పెట్టినా పాలస్తినా ప్రజల్లో హమాస్ ప్రతిష్ట పెరిగిందే తప్ప తరగలేదు. డిశెంబరు 2008 జనవరి 2009 నెలల్లో మూడు వారాల పాటు ఇజ్రాయెల్ గాజా పైన అతి దుర్మార్గంగా దాడి చేసింది. విచక్షణా రహితంగా బాంబు దాడులు చేసింది. బుల్ డోజర్లు నడిపి ఇళ్ళను నేలమట్టం చేసింది. 1400 పౌరుల్ని చంపింది. ఆసుపత్రుల్ని కూల్చివేసింది. ప్రభుత్వ భవనాలని నేల మట్టం చేసింది. పాలస్తీనా సైనికుల దాడులకు గురికాకుండా ఉండటానికి పాలస్తీనా పౌరులను “హ్యూమన్ షీల్డ్” గా ఉపయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ యూదుల్ని ఎంత ఘోరంగా వెంటాడి వేధించాడో అంతగా గాజా పౌరుల్ని వేధించింది. పిల్లలు, ముసలివాళ్ళు అన్న తేడా లేకుండా దుర్మార్గంగా దాడి చేసింది. గాజా నుండి రాకెట్ దాడి చేస్తున్నారని దానికి సాకుగా చూపింది.

ఈ ఘటనపైన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ “రిచర్డ్ గోల్డ్ స్టోన్” ను విచారణ కోసం నియమించింది. ఆ కమిషన్ సమర్పించిన రిపోర్టులో ఇజ్రాయెల్ ను తూర్పార బట్టింది. తాను స్వయంగా యూదు అయినప్పటికీ నిష్పాక్షికంగా రిపోర్టు వెలువరించింది. రిపోర్టులో అత్యధికా భాగం ఇజ్రాయెల్ దుర్మార్గాలను ఎండగట్టడానికే కేటాయించింది. హమాస్ పైన గూడా కొన్ని నేరాలను మోపింది. యుద్ధ నేరాలకు ఇరుపక్షాలూ పాల్పడ్డాయని తేల్చింది. హమాస్ పైన మోపిన నేరం గురించి చాలా తక్కువగా రాసింది. ఇజ్రాయెల్ ఒక్కదాన్నే తప్పుపడితే బాగోదన్నట్లుగా హమాస్ పై నేరారోపణ చేసింది. ఈ రిపోర్టును ఇజ్రాయెల్ తిరస్కరించింది. పక్షపాతంతో నివేదికను తయారు చేశాడని తిట్టిపోసింది. నివేదికను తయారు చేసింది యూదు జాతీయుడే అయినా ఆ ఆరోపణ చేసింది. ఈ రిపోర్టుకి విస్తృత మద్దతు లభించింది.

నవంబరు 5, 2009 తేదీన జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో రిచర్డ్ గోల్డ్ స్టోన్ నివేదిక పైన చర్చ జరిగింది. నివేదిక ఆమోదం కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికాతో పాటు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేసిన జనరల్ అసెంబ్లీ నివేదికను ఆమోదించింది. నివేదిక, ఇజ్రాయెల్ వైరి పక్షం బలం కంటే ఎన్నో రెట్లు బలాన్ని ఉపయోగించిందని తప్పు పట్టింది. పాలస్తీనా పౌరులను నేరుగా ఉద్దేశ్యపూర్వంకంగా టార్గెట్ చేసి చంపిందని తేల్చింది. ఈ నివేదిక ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పక్షపాతంగా ఉందనీ అందువలన నివేదికను తిరస్కరించమనీ అమెరికా, ఇజ్రాయెల్ లు తీవ్రంగా లాబీయింగ్ జరిపినా నివేదికను జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అరబ్ దేశాలు, అలీన దేశాలు కలిసి తయారు చేసిన ఈ ఆమోద తీర్మానం ఇరు పక్షాలను తాము జరిపిన యుద్ధ నేరాలపై విచారణ జరపాలని కోరింది.

ఈ ఐక్యరాజ్య సమితి సమావేశం ముందు. అమెరికా, ఇండియా పైన తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇజ్రాయెల్ తో ఏర్పరచుకున్న కొత్త స్నేహాన్ని గుర్తు చేసింది. (ఎన్.డి.ఏ పాలనలో బిజేపి నాయకత్వంలోని ప్రభుత్వం అనేక దశాబ్దాల విధానాన్ని విడనాడి ఇజ్రాయెల్ తో స్నేహ సంబంధాలు పెట్టుకుంది. జాతి విద్వేషంలో రెంటికీ దగ్గరి సంబంధాలుండడం అందుకు కారణం కావచ్చు) ఎన్ని చేసినా ఇండియా తీర్మానం సమర్ధిస్తానని పరోక్షంగా తెలుపుతూ వచ్చింది. ఇండియా పాలకుల దృష్టిలో భద్రతా సమితి సీటు ఉందన్న అమెరికా రాయబారి ఆరోపణ వాస్తవమే. భద్రతా సమితి సీటు ద్వారా ప్రపంచంలో వాణిజ్య సంబంధాలు పెంచుకోవచ్చని ఇండియా పాలకులు భావించారు. శాశ్వత సీటుకి మద్దతు సంపాదించుకోవచ్చని కూడా భావించారేమో (భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వానికి అర్హురాలిగా ఇండియా తనను తానే భావించుకుంటుందని హిల్లరీ క్లింటన్ హేళనగా వ్యాఖ్యానించిన విషయం మరో కేబుల్ ద్వారా తెలిసింది. ఆ కేబుల్ వెల్లడయ్యిన దగ్గర్నుండీ ఇండియా పాలకులు శాశ్వత సభ్యత్వం గురించి పదే పదే మాట్లాడ్డం మానేశారు).

తాము ఎన్ని చెప్పినా విన్నట్లు కనిపించకపోవడంతో అమెరికా రాయబారికి కోపం వచ్చింది. సెప్టెంబరు 24 న ఐక్యరాజ్య సమితిలోని ఇండియా రాయబారికి నిరసన (అభిశంసన?) పత్రాన్ని పంపించాడు. ఇజ్రాయెల్ తీర్మానాన్ని ఇండియా వ్యతిరేకించడంపై అమెరికా అత్యధిక ప్రాముఖ్యతను కేటాయించిందని ఆ పత్రంలో పరోక్షంగా హెచ్చరించాడు. పాలస్తీనా అంశంపైనే ఏర్పాటు చేసిన మూడు ఐక్యరాజ్య సమితి సంస్ధలకు మద్దతు తెలుపుతూ పెట్టిన తీర్మానలను సైతం వ్యతిరేకించమని అమెరికా రాయబారి ఒత్తిడి తెచ్చినా ఇండియా అనుకూలంగా ఓటు వేసింది. ఇదంతా భద్రతా సమితి సీటు కోసమేనని అమెరికా ఆరోపణ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s