ఎయిర్టెల్ జాబ్ నుండి గ్రామ సర్పంచ్ గిరీకి…


Rajawat, Soda village sarpanch

సోడా గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు గామస్ధులతో ‘రజావత్’ (క్లిక్ చేసి పెద్ద బొమ్మ చూడండి)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ చేసిన వారంతా రెండు సంవత్సరాల పాటు గ్రామాల్లో వైద్యం చేస్తేనే డిగ్రీ చేతికి ఇస్తామని ప్రకటించినపుడు మెడికల్ విద్యార్ధులు ఆ నిబంధనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయడం చూశాం. ఇండియాలో ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యాసంస్ధలలో భారత ప్రజల డబ్బుతో చదువుకొని కోట్ల కొద్ది జీతాల కోసం అమెరికా వాల్ స్ట్రీట్ కంపెనీల ఉద్యోగాల కోసం పరిగెత్తే విద్యాధికులను చూశాం. ఇంజనీర్లు, డాక్టర్లైతే చాలు ఎప్పుడు అమెరికా కి చెక్కేద్దామా అని ఎదురుచూసే యువతీ యువకులు అనేకమందిని చూశాం. విద్యుత్, నీటి పారుదల శాఖల్లో ఉద్యోగాలు సంపాదించి ప్రతి చిన్న పనికీ ప్రజలనుండీ లంచాలు గుంజుతున్న ఉద్యోగుల్ని చూస్తున్నాం. ప్రజల ఓట్లతో ఎన్నికై పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి లంచాలు, ప్రభుత్వాలు కూలిపోకుండా ఓటేసినందుకు లంచాలు గుంజుతున్న రాజకీయ నాయకులను చూస్తున్నాం.

కానీ ఎం.బి.ఏ చదువుకొని, భారత దేశంలో అతిపెద్ద ప్రవేటు కమ్యూనికేషన్స్ సంస్ధ ఎయిర్ టేల్ లో అప్పటికే ఉన్నత స్ధానంలో ఉన్న తన ఉద్యోగాన్ని వదులుకొని, స్ధితిమంతురాలయి కూడా ఒక కుగ్రామానికి సర్పంచ్ గా ఎన్నికయి ఆ గ్రామ అభివృద్ధికి కంకణం కట్టుకున్న ఒక నవయవ్వన యువతిని చూస్తే ఆశ్చర్యంతో నోటమాట రాక మ్రాన్పడి నిలబడిపోక తప్పదు. ఆ అమ్మాయిని చూస్తే షూటింగ్ కోసం గ్రామం వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ లా కనిపిస్తుంది. ప్రముఖ దుస్తుల మోడల్స్ తయారు చేసిన దుస్తులను కేట్ వాక్ చేసి ప్రదర్శించే ఓ మోడల్ యువతి దారి తప్పి వచ్చిందేమోనని భావిస్తాం. కానీ జీన్స్ ఫాంటు, టీషర్టు ధరించి అందం పోత పోసి ఉన్న ఆ నవ యువతి బాగా వెనకబడ్డ రాజాస్ధాన్ రాష్ట్రానికి చెందిన ఓ మారుమూల కుగ్రామానికి సర్పంచ్ గా పని చేస్తున్నదని తెలిసాక నిశ్చేష్టులవక తప్పదు.

ఆ అమ్మాయి పేరు రజావత్. ఎం.బి.ఏ చదివింది. ఎయిర్ టెల్ సంస్దలో సంవత్సరం క్రితం వరకు ఉన్నత స్ధాయిలో మేనేజిమేంట్ బాధ్యతలు నిర్వహిస్తుండేది. ఇప్పుడు రాజస్ధాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కి 60 కి.మీ దూరంలోని “సోడా” అనే గ్రామానికి సర్పంచ్ గా పని చేస్తోంది. భారత దేశంలోని సర్పంచుల్లో అత్యంత పిన్నవయస్కురాలుగా ఈమేను భావిస్తున్నారు. మార్చి 24, 25 తేదీల్లో “గ్రామాభివృద్ధిలో పౌర సమాజం బాధ్యతల” పై ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది. “దారిద్ర్యాన్ని పారద్రోలి అభివృద్ధిని సాధించడం ఎలా” అన్న అంశంపై ఈ సమావేశాల్లో మాట్లాడి ఆహూతులను ఆకట్టుకుంది. సినిమా హీరోయిన్ లా వెలిగిపోతున్న 30 సంవత్సరాల రజావత్, ఇండియాలో ఓ గ్రామ సర్పంచ్ అని తెలుసుకొని ఐక్యరాజ్యసమితి సమాశాలకు హాజరైన ప్రపంచ దేశాల ప్రతినిధులు ముక్కున వేలేసుకున్నారు.

Rajawat village (Soda) sarpanch, near Jaipur, Rajasthan

రాజస్ధాన్ రాష్ట్రంలో సోడా గ్రామ సర్పంచ్ ‘రజావత్”

వివిధ వ్యూహాల ద్వారా పునరాలోచించి ఈ-సర్వీసు లాంటి నూతన టెక్నాలజీ ద్వారా మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని ఆమె అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో చెప్పింది. వనరులు పరిమితమైన ఈ కాలంలో అది అవసరమని చెప్పింది. స్వాతంత్రం వచ్చాక గత 65 సంవత్సరాలపాటు జరిగిన వేగంతో ఇండియా అభివృద్ధి కొనసాగితే ఇండియా సాధించేదేమీ లేదని పేర్కొంది. స్వాతంత్రం వచ్చి 65 ఏళ్ళయినా భారత పాలకులు సాధించిన అబివృద్ధి సున్న అని అమే పరోక్షంగా చెప్పినట్లయింది. నీరు, విద్యుత్, టాయిలెట్లు, స్కూళ్ళు, ఉద్యోగాల కోసం కలలు గంటున్న భారతీయులను మన చర్యలు విఫలం చేస్తాయని తేల్చింది. ఈ ప్రక్రియను భిన్నరీతిలో, వేగంగా చేసే పద్ధతులపై తనకు నమ్మకం ఉందని పేర్కొంది. ప్రభుత్వం, ప్రవేటు సంస్ధలు, ఎన్జీఓ సంస్ధల సాయం లేకుండా సోడా గ్రామంలో తమ గ్రామస్తులంతా కలిసి గత సంవత్సరంలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పింది.

మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి బయటి ఏజెన్సీల మద్దతు కావాలని కోరింది. యునైటేడ్ నేషన్స్ ఆఫీస్ వర్ పార్టనర్షిప్స్ వారు తమ ఇండియా సలహాదారు బాబు లాల్ జైన్ ను సోడా గ్రామానికి పంపి మొదటి బ్యాంకు ఏర్పాటు చేసినందుకు కృతజ్గ్నతలు తెలిపింది. బ్యాంకు ఏర్పాటు చాలా మార్పులకు దోహదం చేసిందని తెలిపింది. “మూడు సంవత్సరాల్లో నేను మాగ్రామాన్ని మారుస్తాను. నాకు డబ్బు అవసరం లేదు. గ్రామంలో ప్రాజెక్టులు చేపట్టడానికి మనుషులు, సంస్ధలు కావాలి. ప్రజలతో సంబంధం లేకపోవడం వలన చాలా ప్రాజేక్టులు తరచుగా విఫలమౌతున్నాయి. అదిగో ఆ సంబంధాలను నెలకొల్పే పని నేను చేస్తాను” ని రజావత్ ఐక్యరాజ్యసమితి సదస్సు కు తెలిపింది.

సమావేశం తర్వాత పిటీఐ తొ రజావత్ మాట్లాడింది. “గ్రామస్దులకు సేవ చేయడం అంటే నా పునాది వైపుకి ప్రయాణం కట్టడమే. ఇది ముందుగా అనుకున్నది కాదు. నేను పుట్టిపెరిగిన గ్రామ ఋణాన్ని తీర్చుకుంటున్నాను, అంతే” అని అమె తెలిపింది. పదివేల జనాభా గల సొడా గ్రామ సర్పంచ్ కావడానికి ముందు రజావత్ జైపూర్ లోని తమ కుటుంబ వ్యాపారం ఐన హోటల్ వ్యాపారాన్ని కూడా చూస్తుండేది. గ్రామ స్త్రీలు సాంప్రదాయ బద్దంగా తమ ముఖాన్ని కప్పి ఉంచుకునే చోట రజావత్ జీన్సు ఫాంటు, టీషర్టు వేసుకొనే గ్రామ సమావేశాల్ని నిర్వహిస్తుంది. “గ్రామ పాలన నిర్వహించడానికి నాకు నా ఎం.బి.ఏ డిగ్రీ ఉపయోగపడుతోంది. సర్పంచ్ ఉద్యోగాన్ని కెరీర్ అభివృధ్హి కోసం కాక సామాజిక కార్యక్రమంగా భావిస్తున్నాను. ఎన్జీఓ ల సాయంతో సురక్షిత తాగునీటి సౌకర్యం, ఉద్యోగ కల్పనలపై కేంద్రీకరిస్తున్నాం” అని రజావత్ పిటీఐ కి తెలిపింది.

Rajawat, 30 yrs, youngest village sarpanch of Soda, riding horse

ముప్ఫై ఏళ్ళ రజావత్ తన గుర్రం ‘మేజిక్’ పై స్వారీ చేస్తున్న దృశ్యం

“400, 500 మధ్య ఉండే పాఠశాలల్లో ఇద్దరు లేదా ముగ్గురు టిచర్లే ఉన్నారు. ఇది చాలా బ్యాడ్. ఇక్కడ ప్రవేటు కాలేజి కోసం అరవై, డెబ్భై ఎకరాలు సేకరించాం. విదేశీ రాజస్ధానీయులను ఇక్కడ కాలేజీ స్ధాపించమని కోరాను” అని రజావత్ తెలిపింది. “నేను కేవలం గ్రామంలోని ఓ అమ్మాయిని మాత్రమే. కాకుంటే దేశంలోని కొన్ని ప్రతిష్టాత్మక సంస్ధల్లో చదువుకునే అవకాశం దొరికింది. నాచుట్టూ ఉన్న ప్రజలకు ఏదో ఒకటి చేయడానికి తిరిగి ఇంటికి వచ్చానంతే. అది చాలా చిన్నవిషయం. మన పునాదులనుండి పరిగెత్తి పారిపోవద్దని కోరుతున్నా. ఎందుకంటే మనం నిలబడడానికి నిర్మించి ఉన్న పునాది. అది దేశానికి గూడా పునాదే. మనం ఏదయినా విభినత్వాన్ని చూపాలనుకుంటే మనం క్రింది స్ధాయికి వెళ్ళాలి. అక్కడ మనం చేయడానికి ఎంతో ఉంటుంది” అని చెబుతున్న రజావత్ మాటల్లో ఎంతో నిజం ఉంది.

“ఇండియా టుడే యూత్ సమ్మిట్ 2010 ” లో సచిన్ పైలట్, సౌరవ్ గంగూలి, విశ్వనాధన్ ఆనంద్, కత్రినా కైఫ్, ముకుల్ దేవరా లాంటి ప్రముఖుల సరసన పాల్గొన్న రజావత్, సోడా గ్రామాన్ని అభివృద్ధి చేసి తన శక్తిని చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా విస్తరింప జేయలని కోరుకుందాం.

3 thoughts on “ఎయిర్టెల్ జాబ్ నుండి గ్రామ సర్పంచ్ గిరీకి…

  1. సౌరభ్ గంగూలీ, సచిన్ పైలట్, కత్రిన కైఫ్….వీల్లందర్నీ role model or equal gaano…చెసుకొమని మీరు కూడా చెపుతున్న…ఆ అందమైన బాలీవుడ్ సుందరి…నిజంగానె ఊరికోసం పని చెస్తుంది అని మీరు నమ్ముతున్నరా?

  2. ప్రసాద్ గారూ, మీ ఉద్దేశ్యంలో ఆమె ఊరికోసం కాకుండా ఎందుకోసం చేస్తున్నట్లు? మీ అభిప్రాయం తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది.

  3. అవును ప్రసాద్ గారు. నాక్కూడా ఏదో తేడాగా అనిపిస్తోంది. కొంచెం వివరంగా చెప్పగలరా ప్రసాద్ గారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s