యు.పి.ఏ ప్రభుత్వంలో దళితుల గురించి పట్టించుకునే నాధుడే లేడు -అమెరికా రాయబారి (వికీలీక్స్)


 

Upper caste christians buried to left and Lower to the right

తమిళనాడులోని ఓ గ్రామంలో అగ్రకుల క్రైస్తవ సమాధులకూ (ఎడమ) దళిత క్రైస్తవ సమాధులకూ మధ్య విభజన గోడ. దళితులు చావు తర్వాతా అంటరానివారే, మతం మారినా అంటరానివారే.

భారత దేశంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ ప్రభుత్వం నిమ్న వర్గాలకు చాలా చేస్తున్నట్లు గప్పాలు కొట్టుకొంటుంది. ‘పనికి ఆహార పధకం’, ‘ఉపాధి హామీ పధకం’, తాజాగా ‘ఆహార భద్రతా చట్టం’ ఇలా దేశంలోని పేదవారి కోసం పలు పధకాలు రూపొందించి వారిని పైపైకి లాగడానికి తీవ్రంగ శ్రమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమయం వచ్చినప్పుడల్లా డబ్బా కొట్టుకుంటుంది. ఒక్క యు.పి.ఏ అనే కాదు. దానికి ముందు పాలించిన ఎన్.డి.ఏ, దానికి ముందు యునటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ తదితర ప్రభుత్వాలన్ని ఇలాగే డబ్బా కొట్టుకుంటాయి. 1992 నుండీ నూతన ఆర్ధిక విధానలను ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక్కొక్కొ సంస్ధనూ ప్రవేటువారికి అప్పజెపుతూ వస్తున్నప్పటికీ తాము పేదలకు, ముఖ్యంగా దళితులకు ఎంతో చేస్తున్నామని రాజకీయ పార్టీలు చెప్పుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే. దళిత వర్గాలకు బడ్జేట్ లో వేల కోట్లు కేటాయించి, ఆనక దారి మళ్ళించడం ఒక కళగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

వికీలీక్స్ ద్వారా బయట పడిన అమెరికా రాయబారి అభిప్రాయం భారత దేశంలోని దళితుల వాస్తవ పరిస్ధితిని కొంత వరకు ప్రతిబింబించింది. అంతకంటే ముఖ్యంగా దళితులకు తామెన్నో చేస్తున్నామన్న ప్రభుత్వాల మాటల్లోని నిజం ఎంతో విప్పి చెప్పింది. జూన్ 22, 2005 తేదీన అమెరికా రాయబారి డేవిడ్ మల్ఫోర్డ్ పేరుతో అమెరికా స్టేట్ డిపార్డ్ మెంటుకు వెళ్ళిన కేబుల్ ఇలా పేర్కొంది. “పెద్ద సంఖ్యలో ఉన్న దళిత వర్గాల పరిస్ధితులను మెరుగుపరచడానికి యు.పి.ఏ ప్రభుత్వం దృష్టిపెట్టినప్పటికీ అగ్రకులాలు ఆధిపత్యం వహిస్తున్న ఆ కూటమిలో దళితుల బాగోగుల గురించి నిజాయితీగా పట్టించుకునేవారు చాలా తక్కువమంది ఉన్నారు. దానితో దళితులు అణచివేత, వివక్షలకు గురికావడం,  కొనసాగుతూనే ఉంది. వారి కోసం అనేక చట్టాలు చేసి, ఆ చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వ సంస్ధలను సైతం ఏర్పాటు చేసినా దళిత సమస్య మూలాలను ధ్వంసం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది.”

“కొన్ని విజయగాధలు ఉన్నా, దళితులపై హింస, సామాజిక ప్రతికూలత, అగ్రవర్ణ పక్షపాతం తదితర లక్షణాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కొనసాగుతున్నాయి. దళిత జనాభాలో ఏమాత్రం ఎదుగుల లేదు. విశాలమైన సమగ్ర దృక్పధంతో, ప్రాధమిక పాఠశాలల నుండే సమానత్వం, సహనం లను బోధించకపోయినట్లయితే కుల వివక్షకు సామాజిక ఆమోదం సమీప కాలంలో అంతరించే అవకాశం ఏమాత్రం లేదు” అని అమెరికా రాయబారి రాశాడు. కేవలం రాయబారిగా ఉండి పరిమిత పరిశీలనతోనే అమెరికా రాయబారి ఈ పరిష్కారాన్ని సూచించాడు. కానీ భారత దేశంలో ప్రాధమిక తరగతుల పాఠ్యపుస్తకాల్లో కుల వృత్తుల గురించి సహజమైన సామాజిక కార్యకలాపాలుగా బోధించడం జరుగుతోంది. ప్రాధమిక స్ధాయినుండే విశాల, సమగ్ర దృక్పధంతో కుల వ్యతిరేక చైతన్యం అందించాలన్న అమెరికా రాయబారి పరిష్కారానికీ, వాస్తవంలో జరుగుతున్న దానికీ అనంతమైన తేడా ఉంది.

భారత దేశంలో జన్మించి, ఇక్కడి సామాజిక చట్రంలో భాగంగా పెరిగి, భారత సామాజిక వ్యవస్ధపై పూర్తి అవగాహన ఉన్న భారత రాజకీయ నాయకులకు అమెరికా రాయబారికి తట్టిన పరిష్కారమార్గం తట్టక పోవడం సిగ్గు పడాల్సిన విషయం. పూర్తి అవగాహన ఉంది కనకనే, భారత సామాజిక చట్రంలో భాగంగా పెరిగారు కనకనే వారు అమెరికా రాయబారి సూచించిన పరిష్కారాన్ని ఆమోదించలేక పోతున్నారంటే సరిగా ఉంటుందేమో! కులవ్యతిరేక చైతన్యం, పాఠాలు అటుంచి కులాల మీదనే ఆధారపడి, కుల చైతన్యాన్ని ఇంకా రెచ్చగొట్టి అధికారం లొకి వస్తున్న మన రాజకీయ నాయకులు తాము స్వయంగా కుల వ్యతిరేక చైతన్యం పొందకుండా విద్యార్ధులకు బోధిస్తారని, బోధించే చట్టాలు చేస్తారని ఆశించడం నేతి బీరలో నెయ్యిని ఆశించడమే కదా! బిజేపి లాంటి పార్టీలు కుల సమస్యను ఒక సమస్యగా గుర్తించడానికే కొన్ని సందర్భాల్లో నిరాకరిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, దర్బన్ లో జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్సులో కుల సమస్యను చర్చించకుండా నాటి బిజేపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. దళిత సమస్యను అంతర్జాతీయ వేదికపై చర్చిస్తే పరువు పోతుందనుకున్న వాళ్ళు ప్రతిరోజు వివక్షను పాటించడంలోనే వారి పరువు వేల సంవత్సరాల క్రితమే గంగలో కలిసిన విషయం ఎప్పుడు గుర్తిస్తారో? కంపుకోట్టే వారి పరువు గంగలో కలిసినందునే గంగానది అంతగా కలుషితమై ఉంటుంది!

అమెరికా రాయబారి మరో చక్కటి అంశాన్ని కూడా లేవనెత్తాడు. “భారత ఆర్ధిక వ్యవస్ధలో ప్రైవేటు రంగం ఆధిపత్యం పెరుగుతోన్న నేపధ్యంలో, ఉద్యోగాల కేటాయింపులో కుల వివక్షను నిర్మూలించేందుకు తగిన యంత్రాంగం లేనట్లయితే, కులాల ప్రాతిపదికన ఆర్ధిక అంతరాలు ఇంకా తీవ్రమవుతాయి” అని రాయబారి కేబుల్లో పేర్కొన్నాడు. దీన్లో ఎంతో నిజం ఉందని ప్రత్యకంగ చెప్పనవసరం లేదు. ప్రవేటు రంగం తర్వాత. అసలు ప్రభుత్వం రంగంలోనే ఉద్యోగాల నియామకం దగ్గర్నుండి, శిక్షణ, ప్రమోషన్ల వరకూ అగ్రకులాల వారికే ప్రాధాన్యత ఇస్తున్న విషయం బహుశా అమెరికా రాయబారి దృష్టికి రాకపోయి ఉండవచ్చు. ఎల్.ఐ.సి ఆఫ్ ఇండియా, బ్యాంకులు తదితర సంస్ధల్లొ ఇప్పటికీ అగ్రకులాల వారి ఆధిపత్యం కొనసాగుతోంది. ముఖ్యమైన ప్రమోషన్లన్నీ వారికే వస్తాయి. దళితులకు బహిరంగ కోటాలో ఉద్యోగం వచ్చినా రిజర్వేషన్ కోటాలోకే తోసేస్తారు. రిజర్వేషన్ సౌకర్యం లేనట్లయితే ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో దళితుల ప్రవేశం పూర్తిగా అసాధ్యమై ఉండేది. రిజర్వేషన్ ఫలితంగా చదువులు, ఉద్యోగాలు పొందుతున్నందుకే సర్కారీ దత్త పుత్రులుగా వ్యంగ్యం బిరుదులను పొందిన దళితులు నేరుగా ఉన్నత స్ధానానికి చేరుకోవడం సాధ్యమయ్యే అవకాశాలే లేవు.

యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గదిచినా దళితుల సామాజిక-ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరచడానికి చాలా పరిమితంగా చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేకపోయాయని అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి నివేదించాడు. “భారత దేశ ఆర్ధిక వ్యవస్ధలో ఇప్పుడు ప్రవేటు రంగం అత్యంత పెద్ద రంగం. అత్యంత వేగంగా అది పెరుగుతోంది. ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాలు ప్రైవేటు రంగానికి వర్తించవు. ప్రాధమిక స్ధాయినుండి దళితులను సామాజిక స్రవంతిలోకి ఆహ్వానించే బోధనలు ప్రవేశపెట్టడం కుల వివక్ష అంతరించడానికి కీలకాంశంగా అనేక మంది నిపుణులు నమ్ముతున్నారు. కాని ఈ దృక్పధం ఛాయలు కూడా ప్రభుత్వ పాఠశాల వ్యవస్ధలో లేవు” అని రాయబారి రాశాడు.

అమెరికా రాయబారి ఇంకా ఇలా రాశాడు. “ప్రస్తుత రసాయనాలు ఎరువుల మంత్రి రాం విలస్ పాశ్వాన్ లాంటి వారు రాజకీయంగా విజయవంతం అయినప్పటికీ, జాతీయ స్ధాయిలో సమీకృతం అవడంలో దళితులు విఫలం కావడంతో సమాన హక్కుల కోసం డిమాండ్ చేయగల శక్తిని వారు సంతరించుకోలేక పోయారు. యధాతధ స్ధితిని మార్చాలని భారత దేశంలోని మెజారిటీ కులాల ప్రజలు తగినంత ఒత్తిడి తేనంతవరకూ, దళితుల్లో అత్యధికులు దారిద్ర్య రేఖకు దిగువనే చిక్కుకుపోతారు. వారు పైకి ఎదిగే యంత్రాంగాలు లేని నేపధ్యంలో శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాల్లోనే మగ్గిపోతారు.” రాం విలాస్ పాశ్వాన్ లాంటి వారి ఎదుగుల కూడా అగ్రకులాల పెత్తనంతోనే ముడిపడి ఉన్న అంశం బహుశా రాయబారికి గ్రహించి ఉండకపోవచ్చు. మేం కూడా దళితులను ప్రోత్సహిస్తున్నాం అని చెప్పుకోవడానికి పాశ్వాన్ లాంటి వారు భారత రాజకీయ యవనిక పై అక్కడక్కడా కనిపిస్తారు తప్ప, ప్రభుత్వాల నిజాయితీ ప్రయత్నాల వలన మాత్రం కాదు.

ప్రకటనలు

One thought on “యు.పి.ఏ ప్రభుత్వంలో దళితుల గురించి పట్టించుకునే నాధుడే లేడు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s