దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు తొ జరిగిన విషయం తెలిసిందే. జులై 2005 లో జరిగిన ఈ వివాహం రిసెప్షన్ జులై 23, 2005 తేదీన దుబాయ్ లోని హోటల్ హయత్ లో జరిగింది. ఈ హోటల్ యజమాని అమెరికాకి చెందిన హయత్ కార్పొరేషన్ కావడమే అమెరికా రాయబారి ఆగ్రహానికి కారణం. దుబాయ్ లోని హోటల్ హయత్ అమెరికాకి చెందిన హోటల్ అని భారత దేశంలో అందరికీ తెలుసనీ, అమెరికా హోటల్ లో అంతర్జాతీయ టెర్రరిస్టుగా అమెరికా గుర్తించిన దావూద్ ఇబ్రహీం కూతురు వివాహానికి సంబంధించిన రిసెప్షన్ అంత బహిరంగంగా జరపడం ఏమిటని భారత దేశంలోని అమెరికా రాయబారి అమెరికాకి ఆగస్టు 8, 2005 పంపిన కేబుల్ లో రాశాడు.
అమెరికా లో ఉన్న హయత్ కార్పొరేషన్ ను ఈ విషయంలో వివరణ అడగాల్సిందిగా అమెరికా రాయబారి తన కేబుల్ లో కోరాడు. అయితే అమెరికా ప్రభుత్వం, రాయబారి కోరిన విధంగా వివరణ కోరిందీ లేనిదీ తెలియ రాలేదు. అప్పటికే ఈ సంఘటన పట్ల ఇండియా తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పెళ్ళి రెసెప్షన్ అభివృద్ధి చెందుతున్న అమెరికా, ఇండియాల సంబంధాలకు ప్రతికూలంగా మారిందని అమెరికా రాయబారి తన కేబుల్ లో వివరించాడు. రాయబారి కోరింది జరిగిందో లేదో తెలియదు కానీ ఆయన ఆగ్రహం మాత్రం ఇండియా ప్రభుత్వాన్ని ఏదో మేరకు సంతోషాన్ని కలిగించి ఉండాలని ‘ది హిందూ’ పత్రిక వ్యాఖ్యానించింది. ఇండియాకి సంబంధించిన డిప్లొమేటిక్ కేబుళ్ళను ‘ది హిందూ’ పత్రిక గత పది రోజులుగా ప్రచురిస్తున్న సంగతి విదితమే.
దావూద్ కూతురు వివాహ రిసెప్షన్ అమెరికా, ఇండియా ల టెర్రరిజం వ్యతిరేక సహకారంపై అనుమానాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడిందని రాయబారి కేబుల్ లో తెలిపాడు. “దావూద్ ఆతిధ్యం ఇచ్చిన వివాహ రిసెప్షన్ కు అమెరికా హోటల్ కేంద్రం కావడాన్ని బట్టి హోటల్ యాజమాన్యం తన వ్యాపార నిర్ణయాలను సరైన రీతిలో తీసుకోవడంలో విఫలమైందని తెలుస్తోందని రాయబారి ఆగ్రహించాడు. “అమెరికా, ఇండియా లమధ్య టెర్రరిస్టు వ్యతిరేక సహకారానికి సంబంధించిన చర్చలలో ఈ మాఫియా డాన్ ఒక ప్రముఖ అంశంగా ఉన్నది. అమెరికా అక్టోబరు 2003 లో దావూద్ ను ప్రత్యేక గుర్తింపు కలిగిన టెర్రరిస్టుగా గుర్తించడం అమెరికా, ఇండియా లమధ్య సహకారానికి ఒక మైలు రాయిగా ఉంది. అంత బహిరంగంగా ఒక టెర్రరిస్టు కూతురి వివాహ రిసెప్షన్, ఒక ప్రఖ్యాత అమెరికా కార్పిరేషన్ కి చెందిన హోటల్ లో జరగడం పట్ల ఇండియా ఆగ్రహంతో ఉంది”అని రాయబారి తన కేబుల్ లో రాశాడు.
ముంబై పేలుళ్ళలో దావూద్ ఇబ్రహీం పాత్ర ఉందని ఇండియా అనుమానిస్తోంది. అంతే కాక దావూద్ పాకిస్తాన్ లోనే ఉంటున్నాడని ఇండియా అనుమానిస్తోంది. ఇండియా అనుమాలకు దావూద్ కూతురు వివాహం మరింత బలం చేకూర్చింది. అమెరికా రాయబారి సైతం తన కేబుల్ లో దావూద్ పాకిస్తాన్ లో ఉంటున్నట్లు అర్ధం వచ్చేలా రాశాడు. అయితే దావూద్ పాకిస్తాన్ లోనే ఉంటున్నట్లు ధృవపరిచే విధంగా అమెరికా రాయబారి రాయలేదు.