బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో గురువారం జరగనున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో పోర్చుగీసు అప్పు సంక్షోభం పైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ట్యునీషియా, ఈజిప్టు పరిణామాలు ఎజెండా గా సమావేశం ఏర్పాడు చేసినప్పటికీ పోర్చుగీసు లో ప్రభుత్వ సంక్షోభం ముంచుకు రావడంతో సమావేశంలో ఆ అంశమే మిగతా అంశాలను పక్కకు నెట్టే పరిస్ధితి కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
పోర్చుగీసు ప్రభుత్వం బడ్జేట్ లో తలపేట్టిన నాల్గవ విడత పొదుపు చర్యలను సమర్ధించడానికి ప్రతిపక్షాలు నిరాకరించడంతో జోస్ సోక్రటీస్ నేతృత్వం లోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని సోక్రటీసు బుధవారం రాజీనామా చేయడంతో ఎన్నికలు జరపవలసిన పరిస్ధితి ఏర్పడింది. బడ్జెట్ లో తలపెట్టిన పొదుపు చర్యలు, పన్నుల పెంపు ఈ సంవత్సరంలో నాల్గవ విడతగా ప్రతిపాదించినవి. ఇవి మరీ భరించలేనివిగా ఉన్నాయని ఐదు ప్రతిపక్షాలు భావించి వ్యతిరేకంగా ఓటు వేశాయి. దానితో ప్రభుత్వం కూలిపోయింది. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఇప్పటి సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆపద్ధర్మ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
నిర్ణయాధికారాలు తక్కువగా ఉండే ఆపద్ధర్మ ప్రభుత్వ కాలంలో ఆర్ధిక నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి తలెత్తింది. ఈ పరిస్ధితి పోర్చుగల్ ఎదుర్కుంటున్న అప్పు సంక్షోభం మరింత తీవ్రంగా మారుతుందని విశ్లేషకులు భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఇ.యు సమావేశం జరగనుంది. అప్పు సంక్షోభంలో ఉన్న యూరో జోన్ దేశాల కోసం ఇ.యు, ఐ,ఎం.ఎఫ్ లు కలిసి దాదాపు 1000 బిలియన్ల రక్షణ నిధిని ఏర్పాటు చేశాయి. దీనిలో 250 బిలియన్ యూరోలు (దాదాపు 350 బిలియన్ డాలర్లు) ఐరోపా ద్రవ్య సుస్ధిరతా సౌకర్యం (యూరోపియన్ ఫైనాన్షియల్ స్టబిలిటీ ఫెసిలిటీ – ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్) కింద ఇ.యు దేశాలు సమకూరుస్తున్నాయి. దీనిని 440 బిలియన్ యూరోలకు (625 బిలియన్ డాలర్లు) పెంచాలని ఇ.యు దేశాలు భావిస్తున్నాయి. దీనిపై ఈ రోజు (మార్చి 24) ఇ.యు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
పోర్చుగీసు ఏప్రిల్ 15 తేదీన 4.3 మిలియన్ యూరోల మేరకు సావరిన్ బాండ్ల చెల్లింపులు జరపవలసి ఉంది. అదీ కాక అప్పు సేకరించ వలసి వస్తే ప్రస్తుత రాజకీయ సంక్షోభం వలన మదుపుదారులు మరింత వడ్డీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. మార్కెట్ నుండి అప్పును సేకరించడం ఖరీదు వ్యవహారంగా మారుతుంది. దీన్నుండి యూరో జోన్ దేశాలను తప్పించడానికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా పోర్చుగల్ కోరవలసి రావచ్చు. మార్కెట్ తో పోలిస్తే రక్షణ నిధి నుండి పొందే అప్పుకు తక్కువ వడ్డీ ఉంటుంది. అయితే ఆ అప్పు ద్వారా విధించబడే షరతుల వలన పోర్చుగల్ ప్రజల బ్రతుకులు దుర్భరం అవుతాయి.
ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల రక్షిత నిధిని అడిగే దేశాలపై పొదుపు చర్యలను రుద్దుతారు. అంటే ఏ పొదుపు చర్యలను పోర్చుగల్ ప్రతిపక్షాలు నిరాకరించడం వలన ఆ దేశ ప్రభుత్వం కూలిపోయిందో, అవే చర్యలు మరింత కఠినంగా రుద్దబడతాయి. ఉద్యోగాల తగ్గింపు, జీతాల కోత, సదుపాయాల రద్దు, పెన్షన్ కోత, వేతనాల స్తంభన, పన్నుల పెంపు ఇవన్నీ ప్రజలపైన మోపుతారు. అంతిమంగా యూరప్ అప్పు సంక్ధోభం యూరప్ ప్రజల పాలిట యమపాశంగా మారుతుంది. ఉమ్మడి కరెన్సీ పేరుతో సభ్య దేశాల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న యూరో జోన్ సంక్షోభంలో సభ్య దేశాలకు అప్పులిచ్చి వ్యాపారాం చేస్తున్నదన్నమాట. రక్షించాల్సిన ఉమ్మడి సంస్ధ బలహీన, సంక్షోభ పీడిత దేశాలను మరింతగా సంక్షోభంలోకి నెట్టివేస్తుందన్నమాట.