పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా ఘర్షణలు రాజుకుంటున్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ సైనిక విమానం జరిపిన దాడిలో పాలస్తీనా మిలిటెంట్ల రాకేట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత పశ్చిమ జెరూసలేం లోని ఒక బస్ స్టేషన్ లో ఉంచిన సూట్ కేసు బాంబు పేలింది. ఇద్దరు పిల్లలతో సహా 8 మంది పాలస్తీనీయులు ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా గాజాలోని ఇస్లామిక్ జీహాద్ సంస్ధ రెండు రాకెట్లను ఇజ్రాయెల్ పైకి పేల్చింది. దానికి ప్రతీకారంగా మంగళవారం మళ్ళీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఆ తర్వాత జరిగిన సూట్ కేసు బాంబు పేలుడు కు బాధ్యులమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించ లేదు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బాంబు పేలుడుకు బాధ్యులైన వారిని పట్టుకుంటామన్నాడు. ఇజ్రాయెలీయుల బధ్రత కోసం తీవ్రంగా, బాధ్యతాయుతంగా కృషి చేస్తామని తెలిపాడు. “వాళ్ళు మన దృఢత్వాన్ని పరీక్షిస్తున్నారు. కానీ మన దీక్ష ఉక్కుతో సమానమైనది” అని ఇజ్రాయెల్ ప్రధాని ‘బెంజిమిన్ నెతన్యాహూ’ అన్నాడు. అమెరికా బాంబు పేలుడును ఖండించింది. ఇరు పక్షాలూ సంయమనంతో వ్యవహరించాలని ఒబామా ఓ ప్రకటనలో కోరాడు. వెస్ట్ బ్యాంకు లో పాలస్తీనా ప్రభుత్వ ప్రధానమంత్రి సలాం ఫయ్యద్ బాంబు పేలుడు ను ఖండిస్తూ “అది టెర్రరిస్టు చర్య” అన్నాడు.
పాలస్తీనా పేరుతో స్పష్టమైన భూభాగం గానీ రాజ్యా వ్యవస్ధగానీ ఇంకా ఏర్పడలేదు. 1967 అరబ్బు యుద్ధానికి ముందున్న సరిహద్దులమేరకు పాలస్తీనా దేశం ఏర్పడవలసి ఉండగా యుద్ధంలో పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. అమెరికాకి బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్నపుడు కుదిరిన ఓస్లో ఒప్పందం ప్రకారం వెస్ట్ బ్యాంకు గాజా ప్రాంతాలను పాలస్తీనా గా నామమాత్రంగా ప్రకటించారు. వెస్ట్ బ్యాంకులో పాలస్తీనా అధారటీ ప్రభుత్వం ఉంది. అక్కడ ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. ఓస్లో ఒప్పందం ఫలితంగా యాసర్ అరాఫత్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఆయన మరణం తర్వాత మహమ్మద్ అబ్బాస్ అధ్యక్షుడుగా నియమించబడ్డాడు.
అబ్బాస్ ఇజ్రాయెల్ కు, అమెరికాకు నమ్మిన బంటు. గాజా ప్రాంతంలో 2006లో జరిగిన ఎన్నికల్లో పాలస్తీనా మిలిటెంట్ సంస్ధ ‘హమాస్’ కు అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో హమాస్ నెగ్గినప్పటికీ టెర్రరిస్టు సంస్ధ అన్న ముద్ర వేసి హమాస్ ప్రభుత్వాన్ని ఇజ్రాయెల్, అమెరికాలు గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి. వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనా అధారిటీ ప్రభుత్వం ఉన్నా ప్రజల్లో హమాస్ కే ఎక్కువ పలుకుబడి ఉంది. హమాస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుండీ ఇజ్రాయెల్ గాజా ను దిగ్భందించి అక్కడి ప్రజలకు ఎటువంటి సరుకులు అందకుండా నానా కష్టాలు పెడుతోంది. ఆ కష్టాలకు విసిగిపోయి గాజా ప్రజలు హమాస్ ను దూరం చేసుకోవాలని ఇజ్రాయెల్ ఎత్తు వేసింది. అయితే అంధుకు భిన్నంగా పాలస్తీనీయులలో హమాస్ పట్ల ఆదరాభిమానాలు ఇంకా పెరిగాయి.
అప్పటినుండి గాజాలోని హమాస్ కీ, ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ ఘర్షణలు జరుగుతున్నాయి. అనేక మంది హమాస్ ప్రభుత్వ అధికారులను ఇజ్రాయెల్ గూఢచారి సంస్ధ ‘మొస్సాద్’ దారుణంగా చంపించింది. గత రెండు సంవత్సరాలుగా పరస్పర దాడులు నిలిచిపోయి సాపేక్షికంగా శాంతి ఏర్పడినట్లు కనిపించింది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ తాను ఆక్రమించిన వెస్ట్ బ్యాంకు భూభాగంపై అక్రమ సెటిల్ మెంట్ల నిర్మాణం వేగవంత చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరి, పాలస్తీనా దేశం ఏర్పడడానికి అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అణచివేత విధానాలు అడ్డంకిగా ఉన్నాయి.