యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ జడలు విప్పుతోంది. తాజాగా అది పోర్చుగల్ ను బలి కోరుతోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు), ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ తీసుకోవడానికి వ్యతిరేస్తున్న సోషలిస్టు ప్రభుత్వం ప్రతిపాదించిన పొదుపు చర్యలను పార్లమెంటు వ్యతిరేస్తుండడంతో పోర్చుగల్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. గురువారం జరగనున్న ఇ.యు సమావేశం నాటికి పొదుపు చర్యల బిల్లును ఆమోదించుకుని వెళ్ళాలన్న ప్రధాన మంత్రి “జోస్ సోక్రటీస్” ఆశల్ని వమ్ము చేస్తూ, సోషల్ డెమొక్రట్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నది.
“బిల్లు ఆమోదం పొందకపోతే నేను రాజీనామా చేస్తాను” అని ప్రధాని ప్రకటించాడు. సోషల్ డెమొక్రట్ పార్టీ మొదట పొదుపు బిల్లును సమర్ధిస్తామని ప్రకటించినా ఇప్పుడు విరమించుకుంటున్నానని తెలుపుతోంది. దానితో సోషలిస్టు పార్టీ నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వం కూలడం తధ్యం అని అర్ధమైంది. ఈ వార్తతొ పోర్చుగల్ సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ రేటు పెరిగిపోయింది. సావరిన్ బాండ్లపై వడ్డీ పెరగడం అంటే పోర్చుగల్ అప్పు పుట్టని దశకు చేరుకుంటున్నదని అర్ధం. అదే అప్పు సంక్షోభం.
గ్రీసు దేశంతో ప్రారంభమైన యూరప్ అప్పు సంక్షోభం ఐర్లండ్ కుపాకి ప్రస్తుతం పోర్చుగల్ ను కుదుపుతోంది. స్పెయిన్, ఇటలీ దేశాలు కూడా అప్పు సంక్షోభం అంచున ఉన్నాయి. పోర్చుగల్ అప్పు బాండ్లపై జర్మనీ అప్పు బాండ్ల కన్నా 4.43 శాతం వడ్డీని ఎక్కువగా మదుపుదారులు (ఇన్వెస్టర్లు) డిమాండ్ చేస్తున్నారు.
అప్పు సంక్షోభంలో ఉన్న యూరోజోన్ దేశాలకు సహాయం (ఇదీ అప్పే) అందించడానికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు కలిసి ఒక రక్షిత నిధిని (రెస్క్యూ ఫండ్) ఏర్పాటు చేశాయి. అది తీసుకున్న దేశాలపై కఠినమైన షరతులు విధించబడతాయి. కఠినమైన పొదుపు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగాలు తగ్గించడం, జీతాలూ పెన్షన్లు పెరగకుండా స్తంభింప జేయడం, ఉద్యోగుల సంక్షేమ సదుపాయాల్లో కోత పెట్టడం లేదా పూర్తిగా ఎత్తివేయడం మొదలైన వన్ని పొదుపు చర్యల కిందికి వస్తాయి. ప్రభుత్వ ఖర్చుని బాగా తగ్గించమంటారు. కోశాగార లోటు మూడు శాతానికి తగ్గించేలా ఖర్చులు తగ్గించమంటారు.
దానితో నిరుద్యోగం పెరుగుతుంది. ఉన్న ఉద్యోగాలు ఊడతాయి. కంపెనీలు మూసేస్తారు. కొత్త ఉద్యోగాలు బందవుతాయి. ప్రభుత్వాదాయం పెంచుకోవడానికి పన్నులు పెంచుతారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. సంక్షోభానికి కారణమైన బ్యాంకులు, కంపెనీల సి.ఇ.ఓ లకు మాత్రం మిలియన్ల కొద్ది బోనస్ లు ఇస్తూనే ఉంటారు. వాళ్ళ జీతాలు పెరుగుతూనే ఉంటాయి.