ఇండియా ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్ రాష్ట్రం ఇండియాలో భాగమైన ఒక రాష్ట్రం కంటే ఇండియా ఆక్రమించుకున్న ఒక వలస ప్రాంతం వలె ఉందని మణిపూర్ సందర్శించిన తర్వాత అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో రాశాడు. మిలట్రీ, పారా మిలట్రీ, పోలీసులు అడుగుడునా ఉన్న మణిపూర్ ని చూసి అది ఇండియా ఆక్రమణలో ఉన్న భావన కలిగిందని రాయబారి రాశాడు. 2006 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాక కోల్ కతా లోని అమెరికా కాన్సులేట్ జనరల్ హెన్రీ జార్డిన్, సెప్టెంబరు 1 తేదీన పంపిన కేబుల్ లో ఈ విషయం రాశాడు.
“కాన్సలేట్ జనరల్ అనేకమందితొ జరిపిన సంభాషణల్లో, కొంతమంది ప్రభుత్వ అధికారులతో జరిపిన సంభాషణల్లో సైతం, పదే పదే వినబడిన వ్యాఖ్య ఏమిటంటే మణిపూర్ లో పరిస్ధితిని బట్టి అది ఇండియాలో భాగమైన రాష్ట్రంలా కాకుండా ఇండియా అక్రమించిన వలస ప్రాంతంగా కొనసాగుతోందని. ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ (సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం) చట్టాన్ని ఇక్కడ సర్వ సాధారణంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టం అమలు చేయడమంటే ఇండియాలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు ఉన్న హక్కులన్నీ ఇక్కడి ప్రజలకు ఉండవు. ఈ రాష్ట్రానికి ప్రయాణం చేయడంపై ఉన్న ఆంక్షలు తాము ఒంటరివాళ్ళమన్న మణిపూర్ ప్రజల భావనకు తోడ్పడేదిగా ఉంది. ఇండియానుండి తాము విడిపోయామన్న భావన ఈ రాష్ట్ర ప్రజలకు కలిగిస్తున్నది.
‘కాన్ఫిడెన్షియల్’ గా వర్గీకరించిన ఈ కేబుల్ లో హెన్రీ ఇంకా ఇలా రాశాడు. “అనేకమంది మణిపూర్ వాసులు తామ ఇండియా ఫెడరేషన్ పాలనలో కంటే బ్రిటిష్ వారి పాలనలోనే ఎక్కువ హక్కులు అనుభవించామని చెబుతున్నారు. స్ధానిక రాజకీయ నాయకులు మణిపురి తిరుగుబాటు గ్రూపులతో రహస్య సంబంధాలు కలిగి ఉండడమో, లేదా తమ అవినీతి కారణంగా వారికి మద్దతు ఇస్తుండడమో జరుగుతోంది. దానితో తిరుగుబాటు గ్రూపులను అణచివేయడం, పెరుగుతున్న హింస అరాచకత్వాలను కట్టడిచేయడం కష్టంగా మారుతోందన్న నిస్పృహలో ఇక్కడి అధికారులు ఉన్నారు.”
“అవినీతి రాజకీయ నాయకులూ, తిరుగుబాటుదారుల మధ్యం సంబంధాలను పెంచుతున్నది. ప్రభుత్వ ప్రాజెక్టులనుండీ, కాంట్రాక్టర్ల నుండీ రాజకీయులు లంచాలు వసూలు చేస్తున్నారు. “ఇక్కడి రాజకీయ నాయకులకు తిరుగుబాటు గ్రూపులతో సంబంధాలు ఉండడమో, లేదా మద్దతు పొందడమో జరుగుతున్నదని మణిపూర్ ఛీఫ్ సెక్రటరీ జర్నైల్ సింగ్ ఒక డిన్నర్ సమావేశంలో అన్నాడు. ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ ను అడ్డం పెట్టుకొని అధికారులు అనేకసారులు మానవహక్కులను ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా ‘అస్సాం రైఫిల్స్ దళాలు’ మానవ హక్కుల ఉల్లంఘనలో ముందున్నాయని గవర్నర్ సిద్ధు అంగీకరించాడు” అని హెన్రీ రాశాడు.
పారామిలట్రీ దళాలు మనోరమ అనే యువతిని సామూహిక మానభంగం చేసి చంపేయడంతో మధ్య వయస్కులైన మణిపూర్ మహిళలు కొంతమంది (11 మంది) పూర్తిగా వివస్త్రలై “భారత సైనికులారా మమ్ముల్ని కూడా రేప్ చేయండి” అంటూ వారి కార్యాలయం ముందు చేసిన ప్రదర్శన ప్రపంచ వ్యాపితంగా సంచలనం సృష్టించింది. మన ఘనత వహించిన భారత ప్రభుత్వం కాశ్మీరులో కూడా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సర్వ సాధారణంగా అమలు చేస్తుంది. మహిళలు నగ్న ప్రదర్శన చేసినప్పటికీ సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెసు ఏలుబడిలో ఉన్న ప్రభుత్వానికి ఆ దుర్మార్గ చట్టాన్ని ఎత్తివేయడానికి అంగీకరించ లేదు.