తమ భూముల్ని అక్రమంగా లాక్కుని ఇండోనేషియా వ్యాపార గ్రూపుకి అప్పగించడానికి వ్యతిరేకంగా నందిగ్రాం ప్రజలు జరిపిన వీరోచిత పోరాటంపై కాల్పులు జరిపి అనేకమంది చనిపోవడానికి కారణమయ్యాడన్న ఆరోపణ ఉండడం వలన అమెరికాలో ట్రైనింగ్ పొందే అవకాశాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి కోల్పోయిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. అమెరికాలో పోలీసు, మిలట్రీ శిక్షణ పొందాలనుకునే వారు మానవహక్కులు గౌరవించడంలో వ్యతిరేక రికార్డు ఉండకూడదని అమెరికా చట్టాలు నిర్దేశిస్తాయి. నందిగ్రాం ఆందోళకారులపై పోలీసులు చర్య తీసుకోవాలని పశ్చిమ బెంగాలో ఐ.జి (ఇనస్పెక్టర్ జనరల్) గా ఉన్న ‘రాజ్ కనోజియా’ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చాడని కోల్ కతా లోని అమెరికా రాయబార కార్యాలయానికి ఉప్పందింది. దానితో కనోజియాకు అమెరికా వెళ్ళడానికి రాయబార కార్యాలయం అనుమతి నిరాకరించింది.
అమెరికాలోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ అందించే “కౌంటర్ టెర్రరిజం ఫెలోషిప్” పొందటానికి రాజ్ కనోజియాను బెంగాల్ ప్రభుత్వం 2008 లో నామినేట్ చేసింది. నామినేట్ అయిన వారికి అమెరికా లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ లోని సిబ్బందితోటీ, అమెరికా మిలట్రీలో అదే రేంకు అధికారులతోటీ నిర్ధిష్టకాలం పాటు కలిసి పని చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈలోగా 2007 లో జరిగిన నందిగ్రాం పోలీసు కాల్పులకు కనోజియా బాధ్యుడన్న సమాచారం డిల్లీలోని అమెరికా రాయబారి డేవిడ్ సి. మల్ఫోర్డ్ కి అందింది. “నందిగ్రాంలో పోలీసులు కాల్పులు జరిపిన రోజు పశ్చిమ బెంగాల్ డి.ఐ.జి సెలవులో ఉన్నాడు. ఆయన స్ధానంలొ ఐ.జిగా ఉన్న కనోజియా ఇన్ చార్జి బాధ్యతల్లో ఉన్నాడు.” అని మల్ఫోర్డ్ రాశాడు.
మల్ఫోర్డ్ ఇంకా రాస్తూ, “నందిగ్రాంను పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవాలని బెంగాల్ రాజకీయ నాయకత్వానికి పోలిసు అధికారులు సలహా ఇచ్చారు. పోలీసులు నందిగ్రాంను తమ వశంలోకి తెచ్చుకోవాలన్న పధకంపై సలహా ఇవ్వడంలో కనోజియా పాత్ర ఉందని కోల్ కతా కాన్సులేట్ జనరల్ కార్యాలయం భావిస్తోంది. నందిగ్రాం పై పోలీసు చర్య చేపట్టాలని కనోజియా గట్టిగా అభిప్రాయపడ్డాడనీ, పెద్ద ప్రతిఘటన లేకుండానే పోలీసులు నందిగ్రాంను స్వాధీనం చేసుకోగలరనీ, ఆ తర్వాత తేలికగా అక్కడి ఉద్రిక్తత పరిస్ధితిని చల్లార్చవచ్చనీ కనోజియా సి.పి.ఎం నాయకత్వానికి సలహా ఇచ్చిన విషయం అమెరికా రాయబార కార్యాలయానికి సన్నిహితుడయిన ఓ పోలిసు అధికారి చెప్పాడని” తెలిపాడు.
“నందిగ్రాంలో పోలీసులు కాల్పులు జరిపినప్పుడు కనోజియా అక్కడ లేడు. పోలీసులు కాల్పులు జరపాలని కనోజియా ఆదేశించి ఉండకపోవచ్చు. కనోజియా పాత్ర నందిగ్రాం సంఘటన లో ఖచ్చితంగా ఉందని రాయబార కార్యాలయం రుజువు చేయలేక పోయినప్పటికీ, ఆయన పాత్ర ఎంతో కొంత ఉందని రూఢిపరుచుకుంది. అందువలన ఫేలోషిప్ ప్రొగ్రాం కు కనోజియా ఎన్నిక సరైంది కాదని రాయబార కార్యాలయం అభిప్రాయపడుతోంది” అని మల్ఫోర్డ్ రాశాడు. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ అమెరికా రాయబారి నిర్ణయం తీసుకోవడంలో సలహా ఇవ్వాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని కోరాడు. ఆ తర్వాత ఏం జరిగిందీ సమాచారం లభ్యం కాలేదని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
అయితే అమెరికాలో శిక్షణ పొందాలనుకుంటున్నవారి నేపధ్యాన్ని పరిశీలించడం కొత్తేం కాదని ఇంకా ఇతర కేబుల్స్ ద్వారా తెలుస్తోందని ‘ది హిందూ’ రాసింది. ఇండియా పదవ పారా బెటాలియన్ (భద్రతా దళాలు), 50 మంది ఇండిపెండెంట్ పారాచూట్ బ్రిగేడ్ లకు కూడా ఇలాగే అమెరికాలో శిక్షణ ఇచ్చారు. అమెరికా సైన్యానికి చెందిన 1 వ బెటాలియన్ 1 వ ప్రత్యేక (వాయు) దళాల గ్రూపుతో కలిసి ఉమ్మడి పరస్పర మార్పిడి శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వీరికి దొరికింది. చిన్న యూనిట్లు ఎత్తుగడలు, నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై ఈ కార్యక్రమం కేంద్రీకరించింది. వీరి నేపధ్యాన్ని సర్వీసు రికార్డులను కూడా అమెరికా రాయబార కార్యాలయం చెక్ చేసినట్లుగా మే 26, 2005 తేదీన పంపిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. అయితే ఈ పారాచూట్ యూనిట్ పై ఎటువంటి అప్రతిష్టాకర సమాచారం లేదని రాయబారి తెలిపాడు.
ఈ కేబుల్స్ ద్వారా తెలిసిన మరో విషయం ఏంటంటే, కనోజియాపై ఉన్న ప్రతికూల సమాచారాన్ని సాటి పోలీసు అధికారి ద్వారానే అమెరికా కార్యాలయానికి తెలిసింది. సమాచారం అందించిన వారిని అమెరికా రాయబారి “పోలిసు అధికారుల్లొని మన కాంటాక్టు” అని సంబోధించాడు. ఇతర కేబుల్స్ లో కూడా తమకు సమాచారాం అందించిన వారిని ‘మన కాంటాక్టు’ అనే రాయబారి సంబోధించాడు. కాంటాక్టు అంటే అమెరికా రాయబారికి భారత ప్రభుత్వంలోని సంబంధించ సమాచారాన్ని దొంగచాటుగా అందించేవారుగా అర్ధం చేసుకోవచ్చు. పచ్చిగా చెప్పాలంటే అమెరికా ఏజంటు అనాలి. ఈ ఏజెంట్లను రాయబారులే తమ చాతుర్యం ద్వారా సంపాదించుకొవచ్చు, లేదా సి.ఐ.ఏ లాంటి సంస్ధల సాయం తీసుకోవచ్చు.