యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే కి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అయ్యేకొద్దీ మిలట్రీ అధికారులు ఒక్కరొక్కరుగా అధ్యక్షుడిని వదిలి ఆందోళనకారులతో చేరుతున్నారు. మిలట్రీ జనరల్ ఆలీ మొహసేన్ అల్-అమ్హర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. “పోరాటం రాను రానూ క్లిష్ట సమస్యగా మారుతోంది. హింస, అంతర్యుద్ధం వైపుగా వెళ్తోంది. నా ఆలోచనలు, నాటోటి కమాండర్ల, సైనికుల ఆలోచనల ప్రకారం మేము యువకుల విప్లవానికి శాంతియుత మద్దతు తెలుపుతున్నాము. భద్రత, దేశ సుస్ధిరత లను కాపాడటంలో మా విధిని నిర్వహిస్తాము” అని ఆలీ మొహసేన్ తెలిపాడు.
ఆలీ మొహసేన్ అధ్యక్షుడు సలే కు సన్నిహితుడుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు కమాండర్లు కూడా రాజీనామా చేసినట్లు వార్తలు తెలుపుతున్నాయి. ఆందోళనకారుల ప్రజాస్వామిక డిమాండ్లను గౌరవించాలని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాక సలే ఆదివారం తన మంత్రివర్గాన్ని రద్దు చేశాడు. తాత్కాలికంగా విధులు నిర్వర్తించాలని వారిని ఆదేశించాడు. షియా తిరుగుబాటుదారులు, ప్రభుత్వ సైనికుల మధ్య పోరాటం తీవ్రమవుతున్నది. సోమవారం మరో ఇరవై మంది చనిపోయారని వార్తా సంస్ధలు తెలిపాయి.
గత శుక్రవారం రాజధాని సనా లో ప్రదర్శన చేస్తున్న ఆందోళనకారులపై పౌర దుస్తుల్లో ఉన్న కొంతమంది విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 48 మంది మరణించారు. కాల్పులు ఎవరు జరిపారో తనకు తెలియదని తానెవర్నీ ప్రదర్శకులపై కాల్పులు జరపమని ఆదేశించలేదనీ అధ్యక్షుడు సలే ప్రకటించాడు. ఈ ఘటన తర్వాత అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. మిలట్రీలో కూడా ఆందోళనకారులపై సానుభూతి పెరిగింది.
యెమెన్ దక్షిణ భాగంలో చాలా ఏళ్ళుగా విడిపోవడానికి పోరాటం నడుస్తోంది. ఆల్-ఖైదా ఆధ్వర్యంలో విడిపోవాలని వీరు పోరాడుతున్నారు. గతంలో ఉత్తర, దక్షిణ యెమెన్ లుగా ఉన్న దేశాలు విలీనమై యెమెన్ ఏర్పడింది. ఉత్తర భాగంలో అధ్యక్షుడు సలే షియా మతస్ధుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. అమెరికాకు సలే గట్టి మద్దతుదారు. యెమెన్ దక్షిణ ప్రాంతంలొని ఏడెన్ రాష్ట్ర గవర్నరు కూడా తన పదవికి రాజీనామా చేశాడు. ఆందోళనలను హింసాత్మకంగా అణచివేయడానికి వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నాని గవర్నరు ప్రకటించినట్లు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది.
ఆలీ మొహసేన్ ఆందోళనకారులకు మద్దతు తెలిపాక మిలట్రీ టాంకులు అధ్యక్షుడి భనం చుట్టూ కాపలా కాయడం ప్రారంభించాయి. రాజధాని సనా లో ఇతర కీలక ప్రాంతాల్లో కూడా సైన్యం పికెట్లు ఏర్పాటు చేసింది. నాలుగు రోజుల క్రితం అధ్యక్షుడు దేశంలో అత్యయిక పరిస్ధితి (ఎమర్జెన్సీ) ప్రకటించాడు. ట్యునీషియా, ఈజిప్టులలో నియంతృత్వ పాలకులను ప్రజాస్వామిక ఉద్యమాలు కూలదోసిన తర్వాత ఆ స్ఫూర్తితో ప్రజలు ఆందోళనలు చేస్తున్న దేశాల్లో యెమెన్ ఒకటి. 32 సంవత్సరాలనుండి పాలిస్తున్న సలే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తన పదవీకాలం 2013 లో ముగిశాక మళ్ళీ పోటీ చేయబోనని అధ్యక్షుడు సలే ప్రకటించినప్పటికీ ఆందోళనలు ఆగలేదు.