అమెరికా రాయబారులు రాసినవంటూ వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ లోని సమాచారాన్ని నమ్మలేమని పార్లమెంటులో ప్రకటించిన భారత ప్రధాని కి సమాధానం దొరికింది. అసలు వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ అసలు ఉన్నాయా లేదో కూడా రుజువులు లేవన్న మన్మోహన్ అనుమానానికి కూడా సమాధానం దొరికింది. సమాధానం ఇచ్చిన వారు ఎవరో కాదు. 2004 నుండి 2009 ఫిబ్రవరి వరకూ ఇండియాలో అమెరికా రాయబారిగా పనిచేసి ఇండియా పై తాను సేకరించిన సమాచారాన్ని కేబుల్స్ గా పంపిన డేవిడ్ సి. మల్ఫోర్డ్ స్వయంగా వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ నిజమైనవేనని స్పష్టంగా ధృవ పరిచాడు. అంతే కాకుండా అమెరికా రాయబారి పంపే సమాచారం సాధారణంగా సరైనదే అని కూడా బల్లగుద్ది చెప్పాడు.
సి.ఎన్.ఎన్ – ఐ.బి.ఎన్ వార్తా ఛానెల్ లో కరణ్ ధాపర్ నిర్వహించిన కార్యక్రమంలో డేవిడ్ సి. మల్ ఫోర్డ్ అతిధిగా మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో ‘ది హిందూ’ ఛీఫ్ ఎడిటర్ ఎన్.రాం, రాయబారి లలిత్ మాన్ సింగ్ కూడా పాల్గొని చర్చించారు. రాయబారిగా తాను పంపిన కేబుల్స్ లోని సమాచారం సరైనదేనా అడిగిన ప్రశ్నకు సమాధానంగా “ఖచ్చితంగా. న్యూ ఢిల్లీ లోని అమెరికా రాయబారులు పంపే సమాచారం సాధారణంగా సరైందేన”ని చెప్పాడు. విశ్వాస పరీక్ష నెగ్గడానికి ఓట్లకు నోట్లిచ్చిన సమాచారం కరెక్టేనా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మల్ఫోర్డ్ నిరాకరించాడు. “కేబుల్ లోని సమాచారాన్ని కల్పించి రాసి ఉండొచ్చని భావిస్తున్నారా?” అని రెట్టించి అడగ్గా “ఆ విషయంలో నేను చెప్పేదేమీ లేదు” అన్నాడు.
లంచాలిచ్చి విశ్వాస పరీక్ష నెగ్గారన్న విషయంలో తాను పంపిన సమాచారం ప్రత్యేకంగా వివరించడానికి నిరాకరించినప్పటికీ, డేవిడ్ మల్ఫోర్డ్, అది తప్పని కూడా చెప్పలేదన్నది గమనార్హం. అది నిజమే అని ధృవపరచడం ద్వారా వచ్చే ప్రత్యేక సమస్యలను ఎదుర్కోవాలని ఎవరు మాత్రం భావిస్తారు? నిజానికి అది నిజమా కాదా అన్న ప్రశ్నకు కూడా మల్ఫోర్డ్ సమాధానం చెప్పినట్లే. ‘అమెరికా రాయబారి పంపే సమాచారం జనరల్ గా కరెక్టే’ అన్న సమాధానం లోనే ‘ఓటుకి నోటు’ విషయం లో వేసిన ప్రశ్నకు కూడా సమాధానం ఉందని గమనించాలి.
“ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ -ఐ.ఏ.ఇ.ఏ” లో ఇరాన్ కి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరడం ఒత్తిడిగా భావించరాదని మల్ఫోర్డ్ కరణ్ ధాపర్ ప్రోగ్ర్రాంలో వ్యాఖ్యానించాడు. “ఇండియా ఇరాన్ కి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుండి దూరంగా ఉన్నట్లయితే ఇండియా, అమెరికాల మధ్య ‘పౌర అణు ఒప్పందం’ కుదరడం అసాధ్యంగా మారి ఉండేదని హెచ్చరించడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అది వాస్తవం కనుక. ‘పౌర అణు ఒప్పందం’ కుదరడం లో ఇరాన్ వ్యతిరేక ఓటు చాలా కీలకమైన అంశం. రెండింటికీ ముడిపెట్టడం ఒత్తిడిగా నేను భావించడం లేదు. ఇరాన్ విషయంలో అమెరికాకి అనుకూలంగా వ్యవహరించకపోతే ఎదురయ్యే ప్రమాదాలను గురించి ఇండియాను హెచ్చరించడం నాభాద్యత” అని మల్ఫోర్డ్ ముక్తాయించాడు.
అమెరికా రాయబారి ఇక్కడ దాస్తున్నదేమీ లేదు. పౌర అణు ఒప్పందం కావాలా, ఇరాన్ కావాలా తేల్చుకొమ్మని ఇండియాను అడిగాడు. అది అమెరికా దృష్టిలో దాని ప్రయోజనాల కోసం చేసే దౌత్యం. ఇండియా ప్రయోజనాలను కాపాడడంలోనే మన పాలకులు విఫలమయ్యారు. అమెరికా దౌత్య నీతికి లొంగి పోయారు. అమెరికా దృష్టిలొని దౌత్య నీతి ఇండియా పాలిట ఒత్తిడిగా ప్రతిఫలించింది. సాధారణ దౌత్య నియమాలతో అమెరికాకు పని లేదు. దాని ప్రయోజనాల కోసం ఒత్తిడి స్తుంది, బెదిరిస్తుంది, వేధిస్తుంది, వెంటాడుతుంది, దేనికీ లొంగకపోతే ఇరాన్, అఫ్ఘనిస్తాన్ లలో వలే యుద్ధానికి దిగుతుంది.
ప్రధాని మన్మోహన్ తన కేబినేట్ లోని పెట్రోలియం మంత్రి మణి శంకర్ అయ్యర్ ని తొలగించి మురళీ దేవరా ని నియమించడం ‘అమెరికా అనుకూల చర్యగా’ ఎలా నిర్ణయించగలరు? అన్న ప్రశ్నకు మల్ఫోర్డ్ సమాధానం ఇచ్చాడు. కేబినెట్ మార్పులు, చేర్పులు లాంటి ముఖ్యమైన విషయాల గురించి ఒక నిర్ణయానికి రావడం రాయబారుల బాధ్యత. దానికనుగుణంగానె తనవద్ద ఉన్న సమాచారాన్ని బట్టి రాయబారి ఒక నిర్ణయానికి వస్తాడని మల్ఫోర్డ్ చెప్పాడు. ఇతర దేశాల్లో అమెరికా రాయబారుల కార్యకలాపాలను మల్ఫోర్డ్ చక్కగా సమర్ధించుకున్నాడు. అంతే కాకుండా వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ యధార్ధతను కూడా ఆయన ధృవీకరించాడు.
వికీలీక్స్ ని నమ్మలేమనీ, అసలు కేబుల్స్ ఉన్నాయో లెదో కూడా తెలియదనీ పార్లమెంటు కి చెప్పిన ప్రధాని ఇప్పుడేమంటారు? బహుశా ఇంకేమీ అనలేకపోవచ్చు.
మన్మోహన్ కు దిమ్మ తిరిగింది.