లిబియా పౌరులను గడ్డాఫీ నుండి రక్షించే పెరుతో అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాలోని తిరుగుబాటుదారుల కేంద్ర పట్టణం ‘బెంఘాజీ’ పై మిస్సైళ్ళతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో లిబియా పౌరులు మరణించినట్లు తెలుస్తున్నది. మరో వైపు గడ్డాఫీ పశ్చిమ దేశాలతో దీర్ఘకాలిక యుద్ధం సాగిస్తానని ప్రతిన బూనాడు. ఐక్యరాజ్యసమితి లోని భద్రతా సమితి చేత దాడులకు అనుకూలంగా తీర్మానం చేయించుకుని, ఆ తీర్మానాన్ని అమలు చేయడానికి దాడులు చేస్తున్నామని పశ్చిమ దేశాలు చెప్పడంలో వాస్తవం లేదు. గడ్డాఫీ ‘కాల్పుల విరమణ’ ప్రకటించాడు కనక ఆ అంశాన్ని పరిశీలించవలసి ఉంది. పౌరుల రక్షణ పశ్చిమ దేశాల లక్ష్యం కాదని లిబియా తిరుగుబాటుదారులు గ్రహించాలి.
ఫ్రాన్సు మిస్సైళ్ళతో దాడి చేశాక ధ్వంసమైన వాహనాల వద్ద 14 మంది పౌరుల మృతదేహాలు పడిఉన్నాయని రాయిటర్స్ వార్తాసంస్ధ తెలిపింది. అమెరికా ప్రయోగించిన క్రూయిజ్ మిస్సైళ్ళు ట్రిపోలిలోని ఇరవై విమాన స్ధావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. అమెరికా మిస్సైళ్ళ దాడిలో 48 మంది పౌరులు చనిపోగా 150 మంది గాయపడ్డారని లిబియా టెలివిజన్ తెలిపింది. మిలట్రీ పౌరుల మరణాన్ని తప్పించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు బ్రిటన్ ఆర్ధిక మంత్రి జార్జ్ ఓస్బోర్న్ తెలిపాడు. మరి పౌరులు ఎలా చనిపోతున్నారో చెప్పలేదు. శాటిలైట్ చిత్రాల ద్వారా గడ్డాఫీ స్ధావరాల ధ్వంసాన్ని పరిశీలించి అవసరమైతే మరోసారి దాడులు చేస్తానని బిబిసి యుద్ధ విలేఖరి తెలిపాడు.
లిబియాలోని ఇరుపక్షాలు ఒకరినొకరు తూలనాడుకొవడం మానలేదు. తమ మధ్య సమస్యను తీసుకెళ్ళి పశ్చిమ దేశాల చేతుల్లో పెట్టిన వీరు అంతిమంగా లిబియా ప్రజలకు తీవ్ర నష్టం తెస్తున్న విషయాన్ని గ్రహించాలి. గడ్డాఫీ తమ పౌరులను చంపుతుంటే మేము చూస్తూ కూచోలేమంటున్న బారక్ ఒబామా మాటల్లోని బూటకత్వాన్ని లిబియా ప్రజలు గ్రహించాలి. తమ భవిష్యత్తుని తామే నిర్ణయించుకుంటామని స్పష్టంగా లిబియా ప్రజలు పశ్చిమ దేశాలకు తెలియజేయాల్సి ఉంది.
ఫ్రాన్సు శనివారమే విమాన దాడులు ప్రారంభించింది. అమెరికా జలాంతర్గామి నుండి 110 తోమహాక్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. బ్రిటన్ కూడా తమ జలాంతర్గామినుండి క్షిపణుల్ని ప్రయోగించింది. గడ్డాఫీ సైన్యం ఒక ఫ్రాన్సు విమానాన్ని కూల్చినట్లు ప్రకటించినా ఫ్రాన్సు ఆ వార్తలో నిజం లేదంది. పశ్చిమ దేశాల నౌక బలగాలు లిబియా సముధ్ర మార్గాల్ని నిర్బంధంలో ఉంచాయి.
లిబియా పౌరుల్ని రక్షించే పేరుతొ దాడి చేసి ఆ పౌరుల్నే చంపడం దురహంకార పశ్చిమ దేశాలకు తగని పని. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లపై దశాబ్దం నుండి యుద్ధం చేస్తూ, ఆర్ధికంగా కృంగిపోయి తమ ప్రజలపై పొదుపు చర్యల పేరిట ఆర్ధిక దాడులకు దిగుతున్న పశ్చిమ దేశాలు తగుదునమ్మా అంటూ లిబియా పై దాడులకు తెగబడడాన్ని ప్రపంచ దేశాలూ, ప్రజలూ వ్యతిరేకించాలి. పశ్చిమ దేశాల ప్రజలు కూడా తమ పాలకుల ప్రపంచ పెత్తనాన్ని ప్రశ్నించాలి. వారి పాలకులు సాగిస్తున్న పెత్తందారు దాడుల వలన తమ దేశాల్లో ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు తలెత్తిన విషయం గుర్తెరిగి తమ కర్తవ్యాన్ని రూపొందించుకోవాలి.