యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో అమెరికా ఇండియా లమధ్య కుదిరిన అణు ఒప్పందం పై బిజేపి తెలిపిన వ్యతిరేకత నిజానికి ఉత్తుత్తిదే అని ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఎల్.కె.అద్వానీ అమెరికా రాయబారికి చెప్పిన విషయం వికీలీక్స్ లీక్ చేసిన డిప్లొమాటికి కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. 2009 పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఫలితాలు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు అమెరికా రాయబారి కార్యాలయం చార్జి డి’ ఎఫైర్స్ పీటర్ బర్లే (రాయబార కార్యాలయంలో ముగ్గురు ముఖ్య రాయబారులు ఉంటారు అందులో ఇద్దరు తామున్న దేశాల అధిపతులతో -అధ్యక్షుడు, ప్రధాని లాంటివారు- సంబంధం కలిగి ఉంటారు. మూడో అధికారి ఆ దేశ విదేశీ శాఖ మంత్రితో సంబంధం కలిగి ఉంటారు. విదేశీ మంత్రితో సంబంధం ఉండే రాయబారిని ‘ఛార్జి డి’ ఎఫైర్స్’ అంటారు) మే 13, 2009 న రాసిన కేబుల్ లో ఈ విషయాన్ని పొందుపరిచాడు.
పార్లమెంటు ఎన్నికలయ్యాక పంపిన తన కేబుల్ లో బర్లే ఇలా రాశాడు “గట్టి నమ్మకంతో, విశ్రాంతిగా అద్వాని కూర్చొని ఉన్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే అమెరికా, ఇండియా సంబంధాలు కొనసాగుతాయి. ఇంకా గట్టి పడతాయి కూడా అని ఆయన ఛార్జి తో అన్నాడు. అణు ఒప్పందం వలన భారత దేశ వ్యూహాత్మక స్వయం పాలనా శక్తి సన్నగిల్లుతుందనీ, బిజేపి అధికారంలోకి వస్తే ఒప్పందాన్ని మళ్లీ సమీక్షిస్తుందనీ జులై 2008లో బిజెపి బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ఆయన అంగీకరించాడు. అయితే భారత దేశంలో అప్పుడున్న రాజకీయ పరిస్ధితుల వలన అలా చెప్పవలసి వచ్చిందని అద్వానీ వివరించాడు.తన దృష్టిలో ప్రభుత్వం అనేది ఆటంకం లేకుండా కొనసాగుతూ ఉండేదనీ, అంతర్జాతీయ ఒప్పందాలను అంత తేలిగ్గా తీసుకోగూడదనీ (పభుత్వాలు మారడంతోనే మళ్ళీ మళ్ళీ సమీక్షించేటంత తేలికయినవి అంతర్జాతీయ ఒప్పందాలు కావు అని అద్వానీ అంతరార్ధం) ఆయన వివరించాడు. ఈ సందర్భంగా అద్వానీ సిమ్లా ఒప్పందాన్ని అద్వానీ ఉదహరించాడు. 1972 లో ఇండియా, పాకిస్తాన్ ల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని బిజేపి తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. కానీ బిజెపి అధికారంలోకి వచ్చాక సిమ్లా ఒప్పందాన్ని రద్ధు చేయలేదన్న విషయాని అద్వానీ గుర్తు చేశాడు.
బర్లే ఇంకా ఇలా రాశాడు. “అద్వానీ ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడున్న సమస్యంతా అంతిమంగా నిర్ణయాధికారం ఎవరన్న విషయం తెలియక పోవడమే. పౌర ప్రభుత్వమా, మిలట్రీయా, ఐ.ఎస్.ఐ నా లేక మరో సంస్ధా? అని ఆయన ప్రశ్నించాడు. ఆయన దృష్టిలో ముషారఫ్ అధికారంలో ఉన్నపుడు పాకిస్తాన్ తో వ్యవహారాలు జరపడం తేలిగ్గా ఉండేది. ఎందుకంటే అంతిమ నిర్ణయం ఆయన చేతుల్లో ఉందని స్పష్టంగా తెలుస్తున్నది గనక. పాకిస్తాన్ లో తాలిబాన్ ప్రభావం పెరగడం పట్ల అద్వాని ఆందోళన వ్యక్తం చేశాడు. అమెరికా కూడా ఆవిషయంలొ ఆందోళనగా ఉన్నట్లు నేను తెలిపాను. అమెరికా, ఇండియాల ప్రయోజనాల పట్లా, ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న భయాల పట్లా రెండు దేశాల మధ్య ఏకీభావం పెరుగుతున్న విషయాన్ని నేను ఆ సందర్భంలో గుర్తు చేశాను“
“ఇండియా, పాకిస్తాన్ ల మధ్య సంబంధాలను కాశ్మీరు వివాదం అద్దాలనుండి చూసే ధోరణి ప్రపంచ దేశాల్లో పెరగడం పై అద్వానీ హెచ్చరించాడు. 20 సంవత్సరాలు కరాచి లో పెరగడం వలన ఇండియా, పాకిస్తాన్ ల సంబంధాల పరిణామంపై తనకు నిర్ధిష్ట దృక్పధం ఉందని అద్వానీ చెప్పాడు. ఇండియా, పాకిస్తాన్ ల ద్వైపాక్షిక సంబంధాలలో కాశ్మీరు సమస్య ఒకటి మాత్రమే తప్ప అదే ప్రధాన సమస్య కాదు. ఇరు దేశాల సంబంధాలు ఒక్క కాశ్మీరు సమస్యపైనే అధారపడి లేవని ఆయన చెప్పాడు. ఒక దేశంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుండడం, మరో దేశంలో అలా జరగక పోవడం లోనే అసలు రెండు దేశాల మధ్య సమస్యలు తలెత్తడానికి కారణం అని అద్వాని అభిప్రాయపడ్డాడు. బేనజీర్ భుట్టో తో జరిగిన ఒక సంభాషణను అద్వానీ గుర్తు చేసుకున్నాడు. ఇండియాలో రాజకీయాలతో సంబంధం లేని మిలట్రీ ఉండడం, స్వతంత్ర ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ ఉండడం… ఈ రెండు అంశాల్లో ఇరు దేశాల మధ్య తేడా ఉండడమే ఇండియాలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడానికీ, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కోసం ఇంకా ఘర్షణ జరుగుతుండడానికీ కారణమని తామిద్దరూ భావించినట్లుగా అద్వానీ చెప్పాడు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి కష్టాలు ఎదురుకావడానికి ఈ రెండు కాకుండా మూడో కారణాన్ని అద్వానీ జత చేశాడు. పాకిస్తాన్ వ్యవస్ధ నిర్మాణంలో ఫ్యూడల్ వ్యవస్ధ కొనసాగుతుండగా, ఇండియా ఫ్యూడల్ వ్యవస్ధను చాలా వరకు పక్కన పెట్టిందనీ అందుకే పాకిస్తాన్ ఇంకా ప్రజాస్వామ్యం కోసం కష్టపడుతూనే ఉందనీ అద్వానీ తెలిపాడు“
“‘శ్రీలంకలో భారత దేశ ఆందోళన అక్కడ ఉన్న తమిళ ప్రజల బాగోగుల గురించే. ఎల్.టి.టి.ఇ ని ఓడించాలన్న శ్రీలంక ప్రభుత్వం కోరికను నేను అర్ధం చేసుకోగలను కాని ఇద్దరి మధ్య పోరాటంలో తమిళులు ఇరుక్కోవడం గురించి శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోవలసింది’ అని అద్వానీ చెప్పాడు. పోరాటం ముగిశాక తమిళులకు అధికారాన్ని పంచే విషయంలో స్పష్టత ఉండి మరింత సానుకూలత లేనట్లయితే శ్రీలంక ప్రభుత్వం పెద్ద తప్పు చేసినట్లేనని అద్వానీ అభిప్రాయపడ్డాడు“ అని బర్లే తన కేబుల్ లో రాశాడు.
దేశ సార్వభౌమత్వం గురించి బిజెపి చెప్పే కబుర్లన్నీ ఉత్తుత్తివేనన్న మాట. అమెరికా వ్యతిరేకత ఒఠ్ఠి బూటకమేనన్న మాట. ప్రభుత్వం నిరంతరం ఆటంకం లేకుండా కొనసాగేది అని చెప్పడం ద్వారా కాంగ్రెస్, బిజెపి ల విధానాలకీ తేడా లేదన్న అవగాహన బిజెపికి ఉందన్నమాట. కాశ్మీరు విషయంలో తాను వేసే గావుకేకలన్నీ తాటాకు చప్పుళ్ళేనన్నమాట. బిజెపి నాయకుల మాటలు విని రెచ్చిపోయి మసీదు కూల్చి, ఇటుకలు మోసుకెళ్ళిన హిందూ కార్యకర్తలూ, వింటున్నారా?
మీ సైట్ లో నిన్నటి వరకు ఉన్న వికీలీక్స్ ఆర్టికల్స్ ప్రింట్ తీసి మా ‘కావలి’ లో ఉన్న మా మిత్రులందరికీ ఇచ్చాను. ఎందుకంటే వారికి నెట్ చూసే అలవాటు లేదు. ప్రతి ప్రింట్ లో మీ వెబ్ సైట్ అడ్రస్ రాసి ఇచ్చాను. వికీలీక్స్ వెల్లడించిన వివరాలు అందరూ చూడాల్సిన అవసరం ఉందని మీ సైట్ లో చూశాక బలంగా అనిపించింది.
చాలా మంచి పని చేశావు భాస్కర్. నాక్కూడా ఆ ఐడియా రాలేదు. వికీలీక్స్ గురించి పంధా కోసం ఈ సైట్ లో రాయకముందు, ఓ ఆర్టికల్ రాశాను. పెద్ద ఆర్టికల్ అని వేసుకోలేదు. జులియన్ అస్సాంజ్ గురించిన అందులో వివరంగా రాశాను. అది మల్లికి ఇచ్చాను. తనని అడిగి ఓ కాపీ పంపమని అడుగు.
-విశేఖర్