ఇండియా యాంటీ-టెర్రరిస్టు సంస్ధ వివరాలను ఎఫ్.బి.ఐ కి నివేదించిన చిదంబరం -వికీలీక్స్


P Chidambaram

హోం మంత్రి పి.చిదంబరం

బొంబాయిలోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడి జరిగిన తర్వాత ఆగమేఘాలమీద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్టు చర్యల పరిశోధనా సంస్ధ “నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ – ఎన్.ఐ.ఏ” (జాతీయ పరిశోధనా సంస్ధ) గురించి అమెరికా ఫెడరల్ పోలీసు డిపార్ట్ మెంటు అయిన ఎఫ్.బి.ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారికి వివరించినట్లుగా వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఒక సర్వసత్తాక స్వతంత్ర దేశమయిన భారత దేశానికి హోం మంత్రిగా ఉంటూ, వేరే దేశంలోని పోలీసు సంస్ధ అధికారికి తాము ఏర్పాటు చేసుకున్న పరిశోధనా సంస్ధ గురించి వివరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

26/11 ముంబై టెర్రరిస్టుల దాడి తర్వాత భారత దేశంపై జరిగే టెర్రరిస్టు దాడులను విచారించడం కోసం కొత్త సంస్ధను పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ టెర్రరిస్టు చర్యలైన హైజాకింగ్, బాంబు పేలుళ్ళు, అణు కర్మాగారాలపై దాడులతో పాటు భారత దేశ సార్వభౌమాధికారానికీ, సమగ్రతకూ భంగం కలిగించే చర్యలపైన పరిశోధన జరిపే నేరనిరూపణ చేసే అధికారం ఈ సంస్ధకు దఖలు పరిచారు. దీనికి సంబంధించిన చట్టంపై పార్లమెంటులో నాలుగు రోజుల పాటు చర్చ జరిగింది. సి.పి.ఎం పార్టీ కొన్ని సవరణలను చట్టానికి ప్రదిపాదించినా  సంతృప్తికరంగా చర్చ జరగకుండానే, ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ హడావుడిగా పార్లమెంటు ఆమోదించింది.

ఎన్.ఐ.ఏ అధికారాలకీ రాష్ట్రాల అధికారాలకీ మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉన్న విషయం హోం మంత్రి చిదంబరం ఎఫ్.బి.ఐ అధికారితో పంచుకున్నాడు. ఆమోదించేటప్పుడు సమగ్ర చర్చ జరగకుండా ప్రతిపాదిత సవరణలను కూడా పట్టించుకోకుండా హడావుడిగా ఆమోదింప జేసిన ప్రభుత్వం అది రాష్ట్రాల అధికారలలో జోక్యం అవకాశం ఉందంటూ పరాయి దేశ అధికారికి చెప్పడం ఏమిటన్నది ఇక్కడా ప్రశ్న. ఎన్.ఐ.ఏ చేసే నేర పరిశోధనలో రాష్ట్రాలు తప్పని సరిగా భాగం పంచుకునేలా చట్టం సవరించాలని సి.పి.ఎం సభ్యుడు సీతారాం ఏచూరి సవరణ ప్రతిపాదించాడు. కానీ బొంబాయి దాడులపై ప్రభుత్వం ఏం చేయదలచుకుందో ప్రజలు ఎదురు చూస్తున్నారని చిదంబరం పార్లమెంటు లో వాదించి చర్చను ముగింప జేశాడు.

అమెరికాలో ఫెడరల్ భావంపై స్పష్టమైన అవగాహన ఉంది. వివిధ రాష్ట్రాలు సమాఖ్యగా ఏర్పడిన దేశంలో రాష్ట్రాలూ, దేశమూ తమదైన అధికారాలు కలిగి ఉంటాయి. రాష్ట్రాలకు ప్రత్యేకంగా కొన్ని అంశాలపై నిర్ణయాధికారం ఉంటుంది. రాష్ట్రాల అధికారాల్లోకి జోక్యం చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఈ నేపధ్యంలో కేంద్ర అధికారాలకీ, రాష్ట్రాల అధికారాలకీ మధ్య వైరుధ్యం తలెత్తి ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అటువంటి ఘర్షణలు తలెత్తకుండా ఉండేలా చట్టాలు రూపొందించుకోవలసి ఉంటుంది.

అయితే భారత దేశంలో ప్రజలకు ఫేడరల్ (సమాఖ్య) భావన గురించి అంతగా అవగాహన లేదు. ప్రభుత్వాలు కూడా ఆ విషయం పై అవగాహన కలిగించడానికి ప్రయత్నించిందీ లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులూ, అధికారుల్లో ఈ అంశంపై అప్పుడప్పుడూ చర్చలూ, వాదనలూ జరిగినా అవి పై స్ధాయిలో పరిమితమవుతాయి తప్ప ప్రజలకు అందులో భాగస్వామ్యం కల్పించడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు.

ఇండియాలో శాంతి భధ్రతల అంశం పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో ఉంది. ఎన్.ఐ.ఏ కి కల్పించిన అధికారాలు శాంతి బధ్రతల విషయంలో రాష్ట్రాల చేతుల్లో ఉన్న అధికారాల్లోకి చొచ్చుకు వస్తుంది. అప్పుడు అనివార్యంగా ఘర్షణ తలెత్తుంది. రాష్ట్రం లో ఒక పార్టీ, కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటువంటి ఘర్షణలు స్పష్టంగా ముందుకు వస్తాయి. రాజ్యాంగ పరంగా రాష్ట్రాలకున్న అధికారాల్లోకి కేంద్ర సంస్ధలు జోక్యం చేసుకున్నట్లయితే రాష్ట్రాలు కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎన్.ఐ.ఏ అధికారాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వెళ్ళి గెలిచే అవకాశం ఉందని చిదంబరం ఎఫ్.బీ.ఐ అధికారికి వివరించినట్లు అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి కేబుల్ ద్వారా తెలిపాడు.

అమెరికాకి ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని ప్రపంచ సమస్యగా మార్చి వేస్తుంది. ఎయిడ్స్, టెర్రరిజం అలాంటి సమస్యలే. ప్రపంచంలో టెర్రరిజం పుట్టుకకు కారణం అమెరికా తర్వాతే ఎవరైనా. ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి వివిధ దేశాల్లో టెర్రరిస్టు సంస్ధలను పాలు పెంచిన ఘనత అమెరికాదే. అలా పుట్టిన సంస్ధలు ఇప్పుడు అమెరికాకే ఎదురు తిరిగి దానికి సమస్యగా మారాయి. తాను తయారు చేసిన టెర్రరిస్టు సంస్ధలను మట్టుపెట్టే భాధ్యతను అమెరికా ప్రపంచం పైకి నెట్టివేసింది. ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజానికి వ్యతిరేకంగా చట్టాలు చేసి, సంస్ధలు ఏర్పాటు చేసి టెర్రరిజం పై యుద్ధం ప్రకటించాలసిన అగత్యాన్ని అమెరికా తెచ్చింది.

వివిధ దేశాలు చేసిన టెర్రరిస్టు చట్టాలు అవసరమైనంత దృఢంగా ఉందీ లేనిదీ అమెరికా పర్యవేక్షిస్తుంది. ఏ దేశం ఏ చట్టాలు చేసిందీ, దానికి ఎలాంటి కోరలు తొడిగిందీ తెలుసుకుని సలహాలు ఇస్తుంది. ఇచ్చేది సలహాలే అయినా వాటిని పాటించి తీరాల్సిందే. లేకుంటే వెంటబడి వేధిస్తుంది. అమెరికాపై యుద్ధం ప్రకటించిన ఆల్-ఖైదాలాంటి సంస్ధల సభ్యులు పట్టుకునే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటి పైనా ఉంది. వాస్తవానికి ఇండియాతో ఆల్-ఖైదా కు వైరం లేదు. కానీ తన చర్యల ద్వారా అమెరికా వైరాన్ని పుట్టిస్తుంది.

ఉదాహరణకి సద్ధాం హుస్సేన్ నేతృత్వం లోని ఇరాక్ పై యుద్ధం చేసినప్పుడు బి.జె.పి ప్రభుత్వం అమెరికా యుద్ధ విమానాలకి ఇంధనం నింపే సౌకర్యాన్ని కల్పించడానికి ఉరకలు వేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పోరులో ఇండియా, బలహీన స్ధితిలో ఉండి అణచివేయబడుతున్న పాలస్తీనా కు మద్దతు ఇచ్చేది. కాని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, అణు ఒప్పందం తదితరాల పేరుతో ఇండియా పాలస్తీనా, ఇరాన్ లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొనె పరిస్ధితికి నెట్టబడింది. ఇక ఇప్పుడు ఇండియా కూడా ముస్లిం టెర్రరిస్టు సంస్ధలకు శతృవైపోయింది. కాశ్మీరు సమస్య వలన గతంలో పాకిస్తాన్, కాశ్మీరు ముస్లిం లకు మాత్రమే శతృవుగా ఉండేది. ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా ఇండియా ముస్లిం లకు శతృవు. తత్ఫలితమే తాజ్ హోటల్ పై దాడి, ముంబై పేలుళ్ళు మొదలైనవి.

మనకు లేని సమస్యను మనపై రుద్దడమే కాకుండా ఆ సమస్యను మనం ఎలా ఎదుర్కొంటున్నాం అనేదానిపై కూడా అమెరికా పర్యవేక్షించాలనుకుంటుంది. అమెరికా పర్యవేక్షణను మన పాలకులు ఆమోదించడమే అసలు విషాధం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s