అమెరికా మేలు కోసం కేబినెట్ మంత్రుల్ని మార్చిన భారత ప్రధాని -వికీలీక్స్


“భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కేబినెట్ మంత్రులను నియమించడం, మార్చడం చేస్తున్నాడు” ఇది ఏ వామపక్షాలో, విప్లవకారులో చేసిన ఆరోపణ కాదు. ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితుడైన డేవిడ్ మల్ఫోర్డ్ అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిన ఓ కేబుల్ (టెలిగ్రాం ఉత్తరం) సారాంశం. భారతదేశ విప్లవ పార్టీలు భారత పాలకులు భారత ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తమకు ఎంగిలి మెతుకులు విసిరే విదేశీ పాలకుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రష్యా అగ్రరాజ్యంగా ఉన్నంత కాలం అది చెప్పినట్లు నడుచుకున్న భారత ప్రభుత్వాలు రష్యా కూలిపోయాక అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తున్నారని కూడా వారు ఆరోపించారు. ఆ విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడనివారు, విప్లవకారుల ఆరోపణలను “వీళ్ళెప్పుడూ ఇంతే” అంటూ కొట్టిపారేసినవారు తాజాగా వికీలీక్స్ బయటపెడుతున్న “డిప్లొమేటిక కేబుల్స్” ని చదివితే అవి ఆరోపణలు కాదు పచ్చి నిజాలని తెలుసుకుంటారు.

Pro and Anti America ministers

ఎడమనుండి: మణిశంకర్ అయ్యర్, మురళీ దేవరా, ఆనంద శర్మ, అశ్వనీ కుమార్, కపిల్ సిబాల్, సైఫుద్దీన్ సోజ్

వికీలీక్స్ ద్వారా బయటపడిన అమెరికా రాయబారుల కేబుల్స్ ను ‘ది హిందూ’ పత్రిక ప్రచురించింది. దాని ప్రకారం మన ప్రధాని మన్మోహన్ సింగ్ తాను ప్రధాని అయ్యింది మొదలు అమెరికాకి అనుగుణంగా నడుచుకుంటూ వచ్చాడు. కేబినెట్ మంత్రుల నియామకంలో కూడా అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చాడు. మంత్రుల్లో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే వారిని తొలగించడానికి కూడా వెనకాడలేదు. కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వంలో మన్మోహన్, సోనియా గాంధిలకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తున్నదన్న పత్రికల కధనాలు కూడా నిజమేనని ఈ కేబుల్ పరోక్షంగా సూచిస్తోంది.

జనవరి 30, 2006 తేదీన ఇండియాలో అమెరికా రాయబారి ‘డేవిడ్ మల్ఫోర్డ్’ అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుల్ ఉత్తరంలోని సారాంశం భారత ప్రభుత్వాల నైజాన్ని పట్టిస్తుంది. జనవరి 2006 లో ప్రధాని మన్మోహన్ సింగ్ తన కేబినెట్ ను పునర్ వ్యవస్ధీకరించాడు. “అత్యంత వివాదాస్పదుడు, ఇరాన్ ఆయిల్ పైప్ లైన్ కు గట్టి మద్దతుదారు అయిన” మణి శంకర్ అయ్యర్ ను పెట్రోలియం శాఖా మంత్రిగా తొలగించి “అమెరికా అనుకూలుడయిన మురళీ దేవరా”ను అతని స్ధానంలో నియమించడం “అమెరికా ఇండియాల సంబంధాలను అత్యంత వేగంగా అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పడానికి గట్టి సాక్ష్యం” అని రాయబారి తన కేబుల్ లో రాశాడు. ఈ కేబుల్ ను రాయబారి “అత్యంత రహస్యం” కెటగీరి కింద వర్గీకరించాడు. అంటే అమెరికాలో అతని కంటే ఉన్నత స్ధానంలో ఉన్నవారు, అదికూడా కేబుల్ ను ఉద్దేశించినవారు తప్ప మరెవ్వరూ దాన్ని తెరిచి చూడకూడదన్నమాట.

“ఆధునిక సంస్కరణలను” ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వంలో అత్యంత ఉన్నత స్ధానాల్లో ఉన్నవారి బలాన్ని ఈ కేబినెట్ పునర్ వ్యవస్ధీకరణ మరింత పెంచడానికి తోడ్పడుతుందని మల్ఫోర్డ్ రాశాడు. ఈ కేబినెట్ మార్పుల ఫలితం “ఇండియాలో అమెరికా లక్ష్యాలను నెరవేర్చడానికి అత్యద్భుతంగా తోడ్పడుతుంద”ని మల్ఫోర్డ్ తన సంతోషాతిరేకాలను కేబుల్ లో వ్యక్తం చేశాడు. దానితొ పాటు ఇరాన్ విషయంలో అమెరికా లక్ష్యానికి కూడా ఈ మార్పు పరోక్షంగా దోహదపడింది. ఇరాన్ పై వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక ఆంక్షలు విధించడంలొ ప్రధాని మన్మోహన్ అమెరికాకు మద్దతు కూడా పలికాడు. ఈ నిర్ణయం భారత దేశం అలీన విధానానికి పూర్తి వ్యతిరేకం. అలీన దేశాలుగా గతంలో ఉన్న మూడో ప్రపంచ దేశాల్లో భారత దేశం పరువును ఇది మంట గలిపింది. అంతే కాకుండా భారత ప్రజల ఆయిల్ ప్రయోజనాలను కూడా ఈ నిర్ణయం చావు దెబ్బ తీసింది. ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లే ఆ విషయాన్ని నిర్ద్వంద్వంగా నిరూపిస్తాయి. పెట్రోల్ ధరలను డీ కంట్రోల్ చేయడం, డీజిల్ ధరల్ని కూడా డీ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చూస్తుండడం కూడా దాన్ని నిరూపించే అంశం.

ఇరాన్ పై అమెరికా నేతృత్వంలో పశ్చిమ రాజ్యాలు నాలుగు దఫాలుగా వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక ఆంక్షలు విధించాయి. ఇరాన్ నుండి పాకిస్తాన్ మీదుగా ఆయిల్ పైపులైన్ నిర్మించడానికి ఇరాన్ తో అప్పట్లో ఒప్పందం కుదిరింది. ఇది అమెరికాకు ఇష్టం లేదు. దీన్ని రద్దుచేయించడం ద్వారా ఇరాన్ ఆయిల్ వాణిజ్యాన్ని దెబ్బ కొట్టడం అమెరికా లక్ష్యం. మణిశంకర్ అయ్యర్ ఇరాన్ పైపులైన్ ఒప్పందానికి బాగా కృషి చేశాడు. మన్మోహన్ సింగ్ పైపులైన్ కు అనేక విధాలుగా అభ్యంతరం చెప్పినప్పటికీ అయ్యర్ వినలేదు. దాని వలితంగానే అయ్యర్ ను ప్రధానమంత్రి తొలగించి అమెరికాకు గట్టి నమ్మకస్తుడయిన మురళీ దేవరాను నియమించుకున్నాడు. అప్పటునుండీ భారత ప్రభుత్వం ఇరాన్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పూర్తిగా మరిచిపోయింది. రద్దు చేశామని ప్రకటించకపోయినా మన్మోహన్ ఉన్నంతకాలం పైపులైన్ గురించి ఎవ్వరూ మాట్లాడరు.

అంతేకాకుండా ఇరాన్ పై నాలుగోసారి ఆంక్షలను విధించినప్పుడు ఇండియా ఆంక్షలకు అనుకూలంగా ఓటు వేసింది. నిజానికి ఓటింగ్ జరిగే ముందురోజు వరకూ ఇండియా ఆంక్షలకు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఓటింగ్ ముందురోజు మన్మోహన్ సింగ్ కీ, అమెరికా రాయబారికీ మధ్య రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశం సంగతి మరో కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఆ సమావేశం అనంతరమ్ ఐక్యరాజ్యసమితిలోని ఇండియా ప్రతినిధికి ప్రధానినుండి సందేశం వెళ్ళింది. ఇరాన్ పై ఆంక్షలు విధించడానికి జరిగే ఓటింగ్ లో అమెరికాకు అనుకూలంగా ఓటు వేయాలన్నది ఆ సందేశం సారాంశం. ఈ నిర్ణయాన్ని “గొప్ప విషయం” గా అమెరికా రాయబారి కేబుల్ లో రాశాడు. అమెరికాలో ప్రభుత్వ వర్గాలు కూడా దాన్ని గొప్ప నిర్ణయంగా పరిగణించాయి. ఇరాన్ కి వ్యతిరేకంగా ఓటు వేయడం అంటే మూడో ప్రపంచ దేశాల్లో ఇండియా అప్పటివరకు సంపాదించుకున్న పేరును వదులుకోవడమే. ఒక్క వదులుకోవడమే కాదు, తన పేరు ప్రతిష్టలను అమెరికా ప్రయోజనాల కోసం త్యాగం చేయడమేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా మరో సందర్భంలో వ్యాఖ్యానించాడంటే భారత ప్రధాని ఎంతకు తెగించాడో అర్ధం చేసుకోవచ్చు.

యు.పి.ఏ – 1 ప్రభుత్వం మన్మోహన్ నేతృత్వంలో కొలువుదీరిన కొద్ది నెలల్లోనే అమెరికాతొ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందంలో ఉన్న ఐదు అంశాలను ఒక్కోటి అమలు చేస్తూ వచ్చింది. మరో సంవత్సరంలొ ఎన్నికలనగా చివరిదయిన “అణు ఒప్పందం” పై సంతకాలు చేయడానికి రెడీ అయ్యింది. “అణు ఒప్పందానికి పూర్తిగా వ్యతిరేకం కానప్పటికీ” సి.పి.ఎం తన ఎన్నికల ప్రయోజనాల కోసం కొన్ని అంశాలకు మాత్రమే వ్యతిరేకత తెలిపినప్పటికీ సి.పి.యం మద్దతును వదులుకోవడానికి మన్మోహన్ సిద్ధపడ్డాడు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వమే సిద్ధపడింది. మన్మోహన్ బృందానికీ, సోనియా గాంధీ బృందానికి ఆర్ధిక సంస్కరణలను ఎంత వేగంగా అమలు చేయాలన్నదానిపై భేదాభిప్రాయాలున్నాయి తప్ప అసలు సంస్కరణలపై భిన్నాభిప్రాయలు లేవు.

ఆశ్చర్యకరంగా కాంగ్రెస్, సి.పి.ఎం ల మధ్య ఘర్షణ తలెత్తుతుందని ఆ పార్టీలు ఊహించాయో లేదో గానీ, అమెరికా రాయబారి మల్ ఫోర్డ్ మాత్రం 2006 లోనే ఊహించాడు. కేబినెట్ మార్పులపై రాసిన కేబుల్ లోనే ఆయన “కేబినెట్ మార్పులను ఎట్టి అనుమానాలు లేకుండా అమెరికాకి అనుకూలంగా చేపట్టడం ద్వారా మన్మోహన్ లెఫ్ట్ పార్టీలకు కోపం తెప్పించాడు. కూటమిని కష్టాల్లోకి నెట్టడంగా ఆ పార్టీలు ఈ చర్యను అర్ధ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య బహిరంగ ఘర్షణ కూడా తలెత్తే అవకాశం ఉంది” అని మల్ఫోర్డ్ తన కేబుల్ లో రాశాడు.

ఇండో యు.ఎస్ పార్లమెంటరీ ఫోరం (ఐ.యు.పి.ఎఫ్)

అమెరికా రాయబార కార్యాలయం తోటీ, ఐ.యు.పి.ఎఫ్ తోటీ మురళీ దేవరా అనేక సంవత్సరాలుగా మంచి సంబంధాలున్న వ్యక్తిగా అమెరికా రాయబారి తన కేబుల్ లో రాయడం గమనార్హం. అమెరికా చట్టసభలకు ఎన్నికయినవారు, ఇండియా పార్లమెంటుకు ఎన్నికయినవారు కలిసి ఏర్పాటుచేసిన వేదికే ఐ.యు.పి.ఎఫ్. ఎన్నికైన వారందరూ దీనిలో సభ్యులుకారు. ఆసక్తి ఉన్నవారు మాత్రమే సభ్యులు. సరిగ్గా చెప్పాలంటే అమెరికా తన ప్రయోజనాలను ఇతర దేశాల చట్టసభల ద్వారా నెరవేర్చడానికి వీలుగా ఆయాదేశాల చట్టసభల సభ్యులతో ఇలాంటి వేదికలు ఏర్పాటు చేస్తుంది. ఆ వేదికల ఏర్పాటు అమెరికా విదేశాంగ విధానంలో ఒక భాగం. ఇటువంటి వేదికల ద్వారా ఇతర దేశాల్లోని చట్టసభల్లో తమ మద్దతుదారులను అమెరికా తయారు చేసుకుంటుంది. వారికి కావలసిన అవసరాలు చూస్తూ తన ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ఐ.యు.పి.ఎఫ్ లోని భారత సభ్యులను అమెరికా తరపున భారత పార్లమెంటులో పనిచేసేవారుగా భావించాలి.

“యు.పి.ఏ ప్రభుత్వం అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామికి మద్దతుదారులయిన అనేకమంది సభ్యులను మంత్రివర్గంలోకి చొప్పించింది.  వారిలో ఏడుగురు ఐ.యు.పి.ఎఫ్ సభ్యులే. అమెరికా అధ్యక్షుడు భారతదేశం సందర్శించే లోపుగా భారత విదేశాంగ విధానంలో ఎటువంటి ప్రతికూల పరిణామాలు తలెత్తకుండా చూడటానికి మన్మోహన్, కీలకమైన విదేశాంగ మంత్రిత్వ శాఖను తనవద్దే అట్టిపెట్టుకున్నాడు. తదుపరి పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యి కీలకమైన కేరళ, బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలు మే నెలలో ముగిసేదాకా ప్రధాని మన్మోహన్ ఆ శాఖను తనవద్దే ఉంచుకునే అవకాశం ఉంది.” అని అమెరికా రాయబారి రాశాడు. దీనిని బట్టి ఎస్.ఎం.కృష్ట కూడా మన్మోహన్ అనుచరుడుగా భావించాలేమో తెలియడం లేదు. లేదా అమెరికా రాయబారి అంచనాను తలకిందులు చేస్తూ సోనియా పగ్గాలను తన చేతికి తీసుకోవడానికి ఎస్.ఎం.కృష్ణను ప్రవేశపెట్టి ఉండవచ్చు. పెట్రోలియం శాఖను మురళీ దేవరా నుండి జైపాల్ రెడ్డికి అప్పగించడం దానిలో భాగం కావచ్చు.

అమెరికా రాయబార కార్యాలయానికి భారత ప్రభుత్వంలో ఉన్న సన్నిహితులు మణిశంకర్ తొలగింపును సంతోషంగా ఆహ్వానించినట్లుగా రాయబారి తన కేబుల్ లో రాశాడు. “మణి శంకర్ అనేక సార్లు విదేశీ మంత్రిత్వ శాఖ వ్యవహారాల్లోకి జొరబడ్డాడు. అతను అలా జొరబడినప్పుడల్లా ప్రధానమంత్రి జోక్యాన్ని విదేశీ శాఖవారు కోరారు. ప్రధానమంత్రి కార్యాలయం అనేకసార్లు మణిశంకర్ ను వెనక్కి తగ్గమని హెచ్చరించినప్పటికీ విదేశీ శాఖ తన విధానాలను రూపొందించడంలొ అయ్యర్ నేతృత్వంలోని పెట్రోలియం శాఖ జోక్యం చేసుకోవడం మానలేదు. పాకిస్తాన్, ఇరాన్, సూడాన్, బంగ్లాదేశ్, చైనా, బర్మా దేశాలకు సంబంధించిన విధానలపై ఈ రెండు శాఖల మధ్య తీవ్ర విభేధాలు తలెత్తాయి” అని మల్ఫోర్డ్ అమెరికా ప్రభుత్వానికి తెలిపాడు.

“అయ్యర్ వినకపోవడంతో ఆయనని తొలగించడానికీ, తద్వారా విదేశీ మంత్రిత్వ శాఖను వ్యూహాత్మక విధానాలను రూపొందించడంలో నాయకత్వ స్ధాయికి తీసుకెళ్ళడానికీ ప్రధాని నిర్ణయం తీసుకున్నాడు” అని తెలిపాడు. “సొంత ప్రాపకానికి ప్రాధాన్యమిస్తూ ఆజ్గ్నలను తిరస్కరించే మణి శంకర్ అయ్యర్ లాంటివారి రాజనీతి కౌశల్యం ప్రధానికి చాలా అతి అయ్యింది. అయ్యర్ అమెరికా వ్యతిరేకతను వ్యాపింపజేస్తే మురళీ దేవరా అనేక సంవత్సరాల పాటు అమెరికా ఇండియా సంబంధాలు మెరుగుపడటానికి కృషి చేశాడు. రిలయన్స్ గ్రూపుతో దీర్ఘకాలంగా సంబంధాలుండటం, ఆ కంపెనీలో వాటా కూడా ఉండటమే మురళీ దేవరాకు ప్రతికూల అంశాలు” అనికూడా మల్ఫోర్డ్ రాశాడు. అమెరికా రాయబారి కేబుల్ ప్రకారం మురళీ దేవరాతో పాటు వాణిజ్యశాఖా మంత్రి ఆనంద శర్మ, జలవనరుల శాఖా కేబినెట్ మంత్రి సైఫుద్దీన్ సోజ్, పరిశ్రమల శాఖ కేబినెట్ మంత్రి అశ్వనీ కుమార్, గతంలో విద్యాశాఖా మంత్రి, ప్రస్తుతం ఐ.టి శాఖ మంత్రి కపిల్ సిబాల్ లు అమెరికా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నవారు. ఇతరులు కూడా ఉన్నప్పటికీ వారి పేర్లను కేబుల్ లో రాయలేదు.

ఆనంద్ శర్మ భారత వాణిజ్యాన్ని సంస్కరణల దారి పట్టించడంలో చాలా బిజీగా ఉన్నాడు. కపిల్ సిబాల్ విదేశీ యూనివర్సిటీల ఆగమనానికి పచ్చజెండా ఊపాడు. ఇంతలోనే ఐ.టి శాఖకు మార్చారు. పరిశ్రమల మంత్రి విదేశీ కంపెనీలకు ఆగమేఘాల మీద అనుమతి ఇచ్చే ఏర్పాట్లు చేశాడు. అయితే వీరందరికీ పర్యావరణ శాఖా మంత్రి జైరాం రమేష్ కంటిలో నలుసుగా మారాడు. పర్యావరణ చట్టాల పేరుతో సంస్కరణలకు అడ్డు వస్తున్నాడంటూ వివిధ మంత్రిత్వ శాఖలు ప్రధానికి అనేకసార్లు ఫిర్యాదు చేశాయి. అయితే పర్యావరణంపై రెండు సంవత్సరాలనుండీ అంతర్జాతీయంగా సభలు జరుగుతుండటం, కర్బన వాయువుల కట్టడికి ఇండియా హామీ ఇచ్చి ఉండడం, నెహ్రూకాలం నాటి ప్రభుత్వరంగ భావాలు కలిగిఉండటం, వీటన్నిటితో పాటు సోనియా మద్దతు ఉండడం జైరాం రమేష్ చేయి ప్రస్తుతానికి పైన ఉంది.”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s