అమెరికా తరపున ప్రపంచవ్యాపితంగా నియమించబడిన రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూఢచర్యం నెరుపుతూ సంపాందించిన వివరాలను కేబుల్ ద్వారా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిస్తారు. 1960 నుండి 2010 ఫిబ్రవరి వరకూ అలా పంపిన కేబుల్స్ ‘వికీ లీక్స్’ సంస్ధకు అందిన విషయం తెలిసిందే. వికీ లీక్స్ సంస్ధ తనకు అందిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ ను 2010 నవంబరు నెలాఖరు నుండి తన వెబ్ సైట్ లో ప్రచురిస్తున్న విషయం కూడా తెలిసిందే.
ఇప్పుడు ఇండియాకు సంబంధించిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ అన్నీ ‘ది హిందూ’ పత్రిక చేతికి వచ్చాయి. వికీ లీక్స్ సంస్ధతో గత కొద్ది నెలలుగా చర్చలు జరుపుతు వచ్చిన ‘ది హిందూ’ పత్రిక ఎట్టకేలకు ఇండియాకి సంబంధించిన డాక్యుమెంట్లను ఎటువంటి షరతులు లేకుండా సంపాదించగలిగింది. పాఠకులకు అందవలసిన సమాచారాన్ని ఎటువంటి అరమరికలు లేకుండా అందించే పత్రికగా వికీ లీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ అభిమానాన్ని సంపాదించిన ‘ది హిందూ’ పత్రిక ఇండియాకి సంబంధించిన కేబుల్స్ ను సంపాదించగలిగింది. వాటి ప్రచురణను ‘ది హిందూ’ మంగళ వారం, మార్చి 15 నుండి ప్రచురించడం ప్రారంభించింది.
మొత్తం 180 దేశాల్లోని 280 అమెరికా రాయబార కార్యాలయలనుండి వాషింగ్టన్ లోని స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిన 251,187 కేబుళ్ళలో ఇండియాకి సంబంధించి మొత్తం 5,100 కేబుల్స్ ఉన్నట్లు ‘ది హిందూ’ తెలిపింది. మొత్త కేబుళ్ళలో 300 మిలియన్ల (30 కోట్ల) పదాలున్నాయని వికీలీక్స్ అంచనా వేసిందని తెలిపింది. ఇండియాకి సంబంధించిన కేబుళ్ళు ఇండియా విదేశాంగ విధానం, దేశీయ వ్యవహారాలపై అమెరికా రాయబారుల రాయబార, రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, మేధోపరమైన అంచనాలను, పరిశీలనలను పట్టిస్తాయని ఆ పత్రిక తెలిపింది.అమెరికా రాయబారులు ఇండియాలో పని చేసిన కాలంలో ఎదుర్కొన్నవీ, పరిశీలించినవీ, కనుగొన్నవీ, భావించినవీ, వ్యాఖ్యానించినవీ, అభినందించినవీ, దుర్వినియోగించినవీ అయిన అంశాలు, అభిప్రాయాలు, పరాచికాలు, దుర్బుద్ధులు ఈ కేబుల్స్ లో పొందుపరచబడ్డాయని ‘ది హిందూ’ తెలిపింది. ఇప్పటివరకూ ఇండియా కేబుళ్ళు నలభై మాత్రమే ప్రచురించబడ్డాయని తెలిపింది.
ఇండియా కేబుల్స్ తడిమిన విషయాలు, అంశాలు, వ్యక్తులు అసమాన్యమైనవని తెలిపింది. అమెరికా తరపున ఇండియాలో నియమించబడిన ప్రతి రాయబారి కన్నూ ప్రధానంగా “అభివృద్ధి చెందుతున్న భారత్, అమెరికాల వ్యూహాత్మక సంబంధాలు, వాటికి తోడ్పడేవీ ఆటంకపరిచే అంశాలపైనే కేంద్రీకృతమైందని ‘ది హిందూ’ వెల్లడించింది. దానితో పాటు ఇండియా పొరుగు దేశాలు, రష్యా, యూరోపియన్ యూనియన్, తూర్పు ఆసియా, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్ తో పాటు ఇతర పశ్చిమాసియా దేశాలు, ఆఫ్రికా, క్యూబా, ఐక్యరాజ్యసమితి లతో ఇండియా సంబంధ బాంధవ్యాలను ఇండియా కేబుల్స్ దృష్టి సారించాయని బయల్పరిచింది.
రక్షణ సహకారం, అణు విధానం, ఆయుధ నియంత్రణ, పౌర హక్కులు, భారత బ్యూరోక్రసీ, పర్యావరణం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మొదలైన అంశాలపై భారతదేశ చర్యల పై కేబుల్స్ సమాచారాన్ని చేరవేశాయని తెలియజేసింది. ముంబై పై టెర్రరిస్టు దాడులు (26/11), కాశ్మీరు, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మియాన్మార్ అంశాలపై ఇండియా విధానాలపై ప్రత్యేక కేంద్రీకరణ ఉందని వెల్లడించింది. సమస్త రాజకీయ భావాలకు చెందిన రాజకీయ నాయకులు, రాయబారులు, ఇతర అధికారులు, గూఢచారులు (ఆర్.ఎ.డబ్ల్యూ, ఐ.బి, సి.బి.ఐ), వ్యాపారులు, విలేఖరులు (సంపాదకులతో సహా), వ్యాపారులు, వివిధ పెద్ద చిన్న సంస్ధలు అందరూ ఈ అమెరికా రాయబారుల కేబుల్స్ లో చోటు సంపాదించారని ‘ది హిందూ’ తెలిపింది.
ఓపికతో వినడానికీ, పరిశోధించడానికీ, భేషజాలను సంతృప్తిపరుస్తూ కావలసిన సమాచారం రాబట్టడానికీ, రాయడానికీ, నివేదించడానికీ, విశ్లేషించడానికీ, ఆనందపరచడానికీ అమెరికా రాయబారులకు గట్టి శిక్షణ ఇచ్చారని తెలిపింది. దాదాపు సుశిక్షితులయిన విలేఖరులతో సమానంగా వీరి సమాచార సంగ్రహం సాగిందనీ తెలిపింది. చాలా తరచుగా ముఖ్యమైన సమావేశాల గురించిన సమాచారాన్ని అదే రోజు కేబుల్ చేసేవారని, వారి దృష్టినుండి తప్పించుకున్న అంశం దాదాపు లేనట్టేననీ తెలిపింది. భారత పురుషులను, స్త్రీలనూ, విషయాలనూ అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలూ, విధానాల కంటితో వారు చూశారని తెలిపింది.
అమెరికా రాయబారులు తాము పంపే కేబుళ్ళను ఆరు కేటగిరీలుగా విభజించారు. అవి:
- కాన్ఫిడెన్షియల్ (అతి రహస్యం)
- కాన్ఫిడెన్షియల్/నో ఫార్న్ – కాన్ఫిడెన్షియల్/నో ఫారెనర్స్ (అతి రహస్యం/విదేశీయులకు కాదు)
- సీక్రెట్ (రహస్యం)
- సీక్రెట్/నో ఫార్న్ (రహస్యం/విదేశీయులకు కాదు)
- అన్ క్లాసిఫైడ్ (వర్గీకరించబడనివి – అందరూ చూడదగినవి)
- అన్ క్లాసిఫైడ్/ఫర్ అఫిషియల్ యూజ్ ఓన్లీ (వర్గీకరించబడనివి/అధికారిక ఉపయోగానికి మాత్రమే)
ఇండియా కేబుళ్ళను వర్గీకరించి ఒక క్రమంలో పెట్టడానికి కొందరు విలేఖరులను, ఎడిటర్లనూ, విదేశీ విలేఖరులనూ, కంప్యూటర్ స్పెషలిస్టులనూ నియమించామనీ, వారు రాత్రింబవళ్ళూ శ్రమించి కేబుళ్ళను ప్రచురణకు వీలుగా మలిచారనీ, ఇంకా ఆ పనిలో కొనసాగుతున్నారనీ తెలిపింది. కొన్ని కేబుళ్ళకు అవసరమైన్ చోట మార్పులు చేశామనీ, కొన్ని సున్నితమైన అధికారిక సమారాన్ని ప్రొటోకాల్ కు అనుగుణంగా ఎడిట్ చేసినట్లు కూడా “ది హిందూ’ తెలిపింది.