8.9 పాయింట్ల భూకంపం, ఆ తర్వాత ఏళ్ళూ, ఊళ్ళూ ఏకం చేస్తూ ఉవ్వెత్తున ఎగసిపడిన సునామీ, అటు పిమ్మట ఫుకుషిమా దాయీచి నెం.1 అణు రియాక్టర్ పేలుడు, ఇప్పుడు దాయీచి నెం.3 అణు రియాక్టర్ పేలుడు… ఒకదాని వెంట మరొకటి వచ్చిపడుతున్న కష్టాలతో జపాన్ ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో మునిగి ఉన్నారు. ఒకదాని నుండి తేరుకునే లోగానే మరొక కష్టం విరుచుకు పడుతోంది. నెం.1, నెం.3 అణు రియాక్టర్లు ఇప్పటికే పేలిపోగా నెం.2 రియాక్టర్లో నీటి శాతం క్రమంగా తగ్గిపోతున్నది. రియాక్టర్లను చల్లబరిచేది నీరే. అది తగ్గిపోతుండడంతో మూడో అణు రియాక్టరు పేలుడు సంభవించే అవకాశం పొంచి ఉంది.
మూడో నెంబరు రియాక్టరు పేలిపోయినప్పటికీ అణు ఇంధనం ఉంచే పాత్ర (కంటైనర్) చెక్కు చెదరలేదని జపాన్ అధికారులు చెబుతున్నారు. ప్లాంటు వద్ద అణు ధార్మికత పరిమితికి తక్కువగానే ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. తాజాగా సంభవించిన పేలుడు ద్వారా మరింత అణు ధార్మికత పెరగకుండా ఉండటానికీ, రెండో నెంబరు రియాక్టరును చల్లబరచడానికీ అధికారులూ, శాస్త్రవేత్తలూ, అణు ఉద్యోగులూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. జపాన్ ఈశాన్య ప్రాంతంలో సముద్ర తీరాన నిలిపి ఉంచిన విమాన వాహక నౌక ను అమెరికా అక్కడినుండి దూరంగా తరలించింది. నౌక వద్ద అణుధార్మికత చేరినట్లు కనుగొనడంతో ముందు జాగ్రత్త చర్యగా అమెరికా తన నౌకను దూరంగా తరలించింది. రేడియో ధార్మికత గురైనందుకు 22 మందికి చికిత్స చేస్తున్నారు.
సునామీ సృష్టించిన విలయం అంతా ఇంతా కదు. సముద్రతీరం నుండి రెండు కిలోమీటర్ల వరకూ సమస్త నిర్మాణాలూ నేలమట్టమయ్యాయి. ఒకటిన్నర శతాబ్దంలోనే అత్యంత తీవ్రతతొ విరుచుకు పడిన భూకంపం ధాటికి సముద్రంలో అలలు పదమూడు నుండి ఇరవై మీటర్ల ఎత్తుకు ఎగసిపడి తీరాన్ని ముంచెత్తాయి. అడ్డు వచ్చిన ప్రతిదాన్నీ నేలమట్టం చేశాయి. మియాజి పట్టణ బీచ్ లో రెండువేలకు పైగా శవాలు పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణం లోపలి శిధిలాల క్రింద ఉన్న శవాల లెక్క తేలవలసి ఉంది. తీరం సమీపంలో ఉన్న యుద్ధవిమాన కేంద్రంలో ఉన్న విమానాలు సునామీ ధాటికి దూరంగా కొట్టుకుపోయి బిల్డింగుల మధ్య అనాధలుగా పడి ఉన్నాయి.
కార్లు, పడవలు సునామీ అలలకు కొట్టుకు వచ్చి మెరక ప్రాంతాల్లో ఇతర శిధిలాలతో కలిసి కుప్పలుగా పేరుకు పోయాయి. బతికి ఉన్నవారు మిగిలినవారి కోసం వెతుక్కుంటున్నారు. రోడ్లు ఆనవాళ్ళు లేకుండా పోయాయి. సునామీలో కొట్టుకువచ్చినదంతా బురదగా అన్నింటినీ కప్పివేసింది. మెరక ప్రాంతానికి కదలడానికి పడవలే ప్రధాన రవాణా సాధనంగా మిగిలాయి. ఎక్కడునుండో కొట్టుకొచ్చిన కార్లు అడుగడుగునా కనబడుతున్నాయి. వాటికి సొంతదారులం అంటూ ఎవరూ రావడం లేదు. కారు, బస్సు, విమానం… అన్ని రవాణాలూ బందైపోయాయి. నివాసప్రాంతాలు నివాసాలుగా కనిపించడం లేదు. స్ధానిక వాలంటీర్లు, విదేశీ వాలంటీర్లు, జపాన్ సైనికులు శవాల కోసం నీటి బురదలో కర్రలతో పొడుస్తూ వెతుకుతున్నారు.
భూకంపం అనంతరం సంభవించే కంపాలు స్ధాయి కూడా తీవ్రంగా ఉంటున్నాయి. సోమవారం నాటి భూకంపం తీవ్రత 6.2 గా నమోదయింది. మరో సునామీ హెచ్చరిక జారీ చేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. లక్షలమంది తాత్కాలిక పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వేల కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాయి.
ఆర్ధిక నష్టాన్ని అంచనా వేసే సాహసానికి ఇప్పుడెవరూ పోవడం లేదు. పూర్తి నష్టాన్ని అంచనా వేయడానికి మరిన్ని వారాలు పట్టవచ్చని అంటున్నారు. జపాన ప్రధాని మార్కెట్లు పతనం కాకుండా ఉండటానికి 182 బిలియన్ డాలర్లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అయినప్పటికీ జపాజ్ షేర్ మార్కెట్ నిక్కీ 6 శాతం పతనమయ్యింది. టోక్యో స్టాక్ ఎక్ఛేంజ్ లో సోమవారం 287 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకు పోయాయి. 3.5 ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ కేపిటల్ కొట్టుకుపోయింది.