“స్లమ్ డాగ్ మిలియన్” చిత్రంలో నటించిన భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించిన మరో హాలీవుడ్ సినిమా “మిరాల్” ప్రీవ్యూను ఐక్యరాజ్యసమితి లోని జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. “మిరాల్” పాలస్తీనా, ఇజ్రాయెల్ వైరానికి సంబంధించిన చిత్రం. ఐక్యరాజ్యసమితి కేంద్ర భవనం న్యూయార్క్ లోఉంది.
జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు అనుమతించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నది. “మిరాల్” సినిమాను అనుమతించడం ఐక్యరాజ్య సమితి తీసుకున్న “రాజకీయ నిర్ణయం” అని ఇజ్రాయెల్ విమర్శించింది.జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు ఇవ్వడం మామూలు విషయమేననీ, అలాగే ఇప్పుడూ ఇచ్చామనీ, దీనిలో రాజకీయాలేవీ లేవని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి చెప్పాడు.
“మిరాల్” సినిమాలో ప్రధాన పాత్రను భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించింది. ఈమె, ఉత్తమ చిత్రం గా ఆస్కార్ అవార్డు పొందిన “స్లమ్ డాగ్ మిలియనీర్” చిత్రంలో కధానాయకి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. “మిరాల్” చిత్రం, 1948 లో పాలస్తినాను విడదీసి ఇజ్రాయెల్ దేశాన్ని స్ధాపించిననాటి నుండి జరిగిన పరిణామాలను ఒక అనాధ బాలిక జీవితం ద్వారా చూపిస్తుంది.
నేపధ్యం
1948లో అమెరికా, బ్రిటన్ ల నాయకత్వంలో అరబ్ దేశాల ఆయిల్ వనరుల పై పట్టుకోసం కుట్రపూరితంగా పాలస్తీనా దేశాన్ని విభజించి ఇజ్రాయెల్ దేశానికి జన్మనిచ్చారు. దీనిని అరబ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. యూదు జాతివారిని జర్మనీ నియంత హిట్లర్ పెట్టిన కష్టాలకు నష్టపరిహారంగా ఇజ్రాయెలీయులకు తమకంటూ స్వంత భూభాగాన్ని కల్పించే పేరిట పశ్చిమ దేశాలు ఈ దారుణానికి ఒడిగట్టాయి. ఆ తర్వాత 1967లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ వారం రోజుల్లోనే అరబ్ దేశాలను ఓడించి పాలస్తీనాగా విడదీసిన భూభాగాలను కూడా పూర్తిగా ఆక్రమించింది.
అప్పటినుండీ తాను ఆక్రమించిన పాలస్తీనా భూభాగంపై వందకు పైగా సెటిల్మెంట్లను యూదు జాతీయులు నివసించడానికి నిర్మించింది. ఇది ఐక్యరాజ్యసమితి తీర్మానికి వ్యతిరేకం. అంతర్జాతీయ చట్టాలకు కూడా వ్యతిరేకం. అమెరికా దన్నుతో అనేక అక్రమాలకు ఇజ్రాయెల్ పాల్పడుతూ వచ్చింది. పాలస్తీనా అరబ్బులను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తూ జాతివివక్షకు గురిచేస్తున్నది. పాలస్తీనా – ఇజ్రాయెల్ సమస్య శాంతియుతంగా పరిష్కరించబడాలంటే 1967 నాటి సరిహద్దులకు ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళాలని అంతర్జతీయ సమాజం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతున్నది.
సినిమా కధ
ఈ నేపధ్యంలో “మిరాల్” సినిమా నడుస్తుంది. “హింద్ హుస్సీనీ” అనే ఇజ్రాయెలీ మహిళ 1948 లో పనికి వెళ్తూ 55 మంది అనాధ బాలురు బాలికలను చూస్తుంది. వారిని తన ఇంటికి తీసుకెళ్తుంది. వారికి నీడ కల్పించి ఆహారం ఇస్తుంది. ఆరు నెలల్లోనే అనాధల సంఖ్య 55 నుండి 2000 కు పెరుగుతుంది. ఆ విధంగా “దార్ ఆల్-తిఫెల్” పేరుతో అనాధాశ్రమం వెలుస్తుంది.
1978 లో “మిరాల్” అనే బాలిక తల్లి మరణించడంతో పాప తండ్రి ఈ అనాధాశ్రమానికి పంపిస్తాడు. ఆశ్రమం గోడల మధ్య పెరిగిన ఆ బాలికకు తన చుట్టూ ఉన్న పరిస్ధితులపైనా ఇజ్రాయెలీయులు, పాలస్తీనియులపై అమలు జరుపుతున్న జాతి వివక్షపైన అవగాహన ఉండదు. 1988 లో 17 సంవత్సరాల వయసులో “మిరాల్”ను ఒక పాలస్తీనీయుల పునరావస శిబిరంలో టీచర్ గా నియమిస్తారు. అక్కడ మిరాల్ కు తాను ఏ పరిస్ధితుల మధ్య బ్రతుకుతున్నదీ తెలిసి వస్తుంది.
శిబిరంలో టీచర్ గా పనిచేస్తుండగా పాలస్తీనా రాజకీయ కార్యకర్త ‘హానీ’ తో ప్రేమలో పడుతుంది. ఆ స్ధితిలో మొదటి ఇంతిఫాదా (తిరుగుబాటు) మొదలవుతుంది. కానీ అనాధాశ్రమం వ్యవస్ధాపకురాలు ‘మామా హుస్సీనీ’ విద్య ద్వారా శాంతి స్ధాపన జరుగుతుందని నమ్ముతుంది. ప్రియుడి తిరుగుబాటు భావాలకూ, తనని సాకిన వారి శాంతి భావాలకూ మధ్య “మిరాల్” ఘర్షణ పడుతుంది. ఈ ఇతివృత్తమే “మిరాల్” సినిమాగా అమెరికన్ యూదు అయిన “జులియన్ ష్నాబెల్”, తన దర్శకత్వంలో సినిమాగా తీశాడు. ఈ సినిమా ప్రివ్యూను ఈ రోజే అంటే సోమవారం, మార్చి 14 న జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించబోతున్నారు.
పాలస్తీనా జర్నలిస్టు “రులా జెబ్రియాల్” రాసిన ఆటోబయోగ్రాఫిక్ నవల ఆధారంగా సినిమా నిర్మితమయ్యింది. రచయిత్రే స్క్రీన్ ప్లే రాసిన ఈ చిత్రం ఫ్రాన్సు, బ్రిటన్, ఇటలీ లలో ఇప్పటికే విడుదలయ్యింది. అమెరికాలో మార్చి 25న విడుదల కావలసి ఉంది. దర్శకుడు తల్లి అమెరికన్ జియోనిస్టు మహిళా సంఘానికి ఆధ్యక్షురాలిగా పని చేసింది. అమెరికాలోని జియోనిజానికి ప్రపంచవ్యాపితంగా చెడ్డపేరు ఉంది. యూదు మతస్ధులు నమ్మేది “జుడాయిజం”. యూదుల జాతి దురహంకారానికి జియోనిజం ఆమోదం తెలుపుతుంది.