వెస్ట్ బ్యాంక్ లో కొత్త సెటిల్మెంట్ నిర్మాణానికి ఇజ్రాయెల్ ఆమోదం


palestine-map

అంతకంతకూ కుదించుకుపోయిన పాలస్తీనా

1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగం “వెస్ట్ బ్యాంక్” లో మరో కొత్త సెటిల్మెంటు నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ శనివారం ఈ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. భవిష్యత్ లో జరిగే ఎటువంటి శాంతి ఒప్పందంలో నైనా తన ఆధీనంలో ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్న భూభాగం పైనే కొత్త సెటిల్మెంట్ నిర్మానం జరుగుతుందని ఆ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని పాలస్తీనా అధికారులు ఖండించారు. “ఈ నిర్ణయం పూర్తిగా తప్పు, ఇది మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది” అని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ప్రతినిధి ప్రకటించాడు.

శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగంలో నిర్మించిన సెటిల్మెంట్ లో నివసిస్తున్న ఓ యూదు జాతి కుటుంబంలోని ఐదుగురు హత్యకు గురయిన నేపధ్యంలో తాజా ప్రకటన వెలువడింది. హత్యకూ, సెటిల్మెంటు నిర్మాణానికీ సంబంధం లేదనీ, నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం గతంలోనే తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ దానిని ఎవరూ నమ్మడం లేదు. హత్యకు గురైన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను చంపకుండా వదిలేసినట్లు తెలుస్తున్నది. హత్య చేసింది పాలస్తీనా మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమానిస్తున్నది.

ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తినా భూభాగంలో ఇప్పటికే వందకు పైగా సెటిల్మెంట్లను ఇజ్రాయెల్ నిర్మించింది. అప్పటికే అక్కడ ఉన్న పాలస్తీనీయుల ఇళ్ళను ఏదో ఒక పేరుతో కూల్చివేసి సెటిల్మెంట్లను నిర్మించారు. ఈ సెటిల్మెంట్లలో ఐదు లక్షల మంది ఇజ్రాయెలీయులు (యూదులు) నివసిస్తున్నారు. ఇలా ఆక్రమిత భూభాగంలో తమ పౌరులకు ఇళ్ళను నిర్మించండం చట్టవ్యతిరేకమని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినప్పటికీ దాన్ని అమలు చేసేవారు లేరు. కారణం ఇజ్రాయెల్ అరాచకాలకు అమెరికా మద్దతు ఉండడమే. అంతర్జాతీయంగా అమెరికా ఎంత అరాచకం, రౌడీయిజమ్ చేస్తుందో, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ అంత అరాచకం, రౌడియిజం చెలాయిస్తుంది. మధ్యప్రాచ్యం లో అమెరికా ప్రయోజనాలను ఇజ్రాయెల్ కాపాడుతుంది. అందువలన ఇజ్రాయెల్ జోలికి ఎవరూ రాలేరు.

పాలస్తీనా అని ఒక దేశం పేరు వినిపించినప్పటికీ వాస్తవంలో పాలస్తీనాకు స్వంత భూభాగం అంటూ లేదు. దాని భూభాగం పూర్తిగా ఇజ్రాయెల్ అధీనంలోనే ఉంది. యాసర్ అరాఫత్ చివరి రోజుల్లో పాక్షిక ఒప్పందం జరిగి వెస్ట్ బ్యాంక్ అనే భూభాగంలో ఎన్నికలు జరిపారు. యాసర్ అరాఫత్ మరణించాక మహమ్మద్ అబ్బాస్ వెస్ట్ బ్యాంక్ అధ్యక్షుడుగా నియమితమయ్యాడు. గాజా అనే మరో చిన్న ప్రాంతాన్ని కూడా పాలస్తీనా భూభాగంగా పరిగణిస్తారు. అక్కడ 2006లో జరిగిన ఎన్నికలలో పాలస్తీనా మిలిటెంటు సంస్ధ “హమాస్” ఎన్నికయింది.

అయితే హమాస్ సంస్ధ ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించదు. ఇప్పుడు ఇజ్రాయెల్ గా పిలవబడుతున్న భూభాగం వాస్తవానికి 1948 వరకూ పాలస్తీనాగా పిలవబడేది. అమెరికా, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాలు కుట్రచేసి పాలస్తీనీయులను అక్కడి నుండి వెళ్లగొట్టి కొంత భూభాగాన్ని ఇజ్రాయెల్ గా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి చేత గుర్తింప జేశారు. వెళ్లగొట్టబడిన పాలస్తీనీయులు లెబనాన్, జోర్డాన్, సిరియా తదితర దేశాల్లో శరణార్ధులుగా వలస వెళ్లారు. ఇప్పటికీ వారు శరణార్ధి శిబిరాల్లొ తలదాచుకుంటున్నారు.

మరో వైపు 1967లో జరిగిన అరబ్ యుద్ధంలో మరిన్ని ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని సెటిల్మెంట్లు నిర్మిస్తూ మెల్లగా తనలో కలిపేసుకుంటూ వస్తున్నది. శాంతి పేరుతో పాలస్తీనీయుల చేతులను కట్టివేసి వారిని నానా విధాలుగా హింసకు గురిచేస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం రెండో తరగతి పౌరులుగా చూస్తున్నది. ఒక విధంగా దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష ఎలా చట్టబద్ధంగా కొనసాగిందో, పాలస్తీనియులపై జాతివివక్షను ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s