టాంక్ బండ్ విగ్రహాల ధ్వంసంపై సో-కాల్డ్ మేధావుల (అ)ధర్మాగ్రహం


మిలియన్ మార్చ్ సందర్భంగా తెలుగుజాతి మహనీయుల విగ్రహాలు ధ్వంసం కావడం నిస్సందేహంగా ఖండనార్హమే. కానీ ఏనాడూ ప్రజల ఈతి బాధల గురించి కించిత్ ఆందోళన సైతం ప్రకటించనివారు, వేలకొద్దీ జరిగిన రైతుల ఆత్మహత్యలపై ఎన్నడూ స్పందించనివారు, సోంపల్లి, కాకరాపల్లి ప్రజల కూడు, గూడు నాశనం చేయడమేకాక అదేమని అడిగినందుకు కాల్చి చంపడం ద్వారా సమాధానం ఇచ్చిన ప్రభుత్వాన్ని మర్యాదకు కూడా ప్రశ్నించని వారు ఈ నాడు మేధావులమంటూ విగ్రహాల ధ్వంసంపై ధర్మాగ్రహం ప్రకటించడం ఏ కోవలోకి వస్తుందో తప్పనిసరిగా ఆలోచించాల్సిందే. ఈ బాపతు వారు మేధావులా, మేతావులా అని ప్రశ్నించుకోవలసిందే.

విగ్రహాల ధ్వంసంలో ధ్వంసమైంది కేవలం విగ్రహాలు మాత్రమే. ధ్వంసం చేసినవారికి విగ్రహాలు ఎవరివో, ఎందుకు వాటినక్కడ ప్రతిష్టించారో తెలిసి ఉంటుందని భావించలేము. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రాజకీయంగా వినియోగించుకోవడానికి ఎత్తుగడ వేసిన (అ)రాజకీయుల అసంబద్ధ ప్రేలాపనలతో స్పందించిన సామాన్య కార్యకర్తలు అవగాహనా లేమితో తాము ఏంచేస్తున్నామో తెలియని స్ధితిలో చేసిన చర్యల కారణంగా చారిత్రక వ్యక్తుల విగ్రహాలు ధ్వంసం అయ్యాయి.  చారిత్రక అవగాహన ఉన్నట్లయితే, ఆయా మహనీయులు సామాజిక అభ్యుదయం కోసం జరిపిన కృషిపట్ల తెలివిడి ఉన్నట్లయితే ఆ కార్యకర్తలు విగ్రహాలను ధ్వంసం చేసి ఉండేవారు కాదు.

ఈ ఆదివారం నాడు కవులు, రచయితలు, మేధావుల పేరుతో చాలామంది టాంక్ బండ్ మీదికి వచ్చి పాక్షికంగా ధ్వంసం అయిన కొన్ని విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి పులకించి పోయారు. మరో ప్రపంచం కోసం కలాన్ని ఝళిపించిన శ్రీశ్రీ విగ్రహాన్ని కూల్చి వేస్తారా అంటూ కూల్చివేత వలన మరో ప్రపంచం రాకుండా ఆగిపోయినంత వేదన వ్యక్తం చేశారు. అయ్యో బుద్ధ భగవానుడు ఈ అన్యాయాన్ని వీక్షించవలసి వచ్చిందే అని కళ్ళను తడి చేసుకున్నంత పని చేశారు. వ్యూడల్ ప్రభువు, సౌందర్య ప్రియత్వంతో బహు భార్యలను స్వంతం చేసుకున్నవాడు, రాజ్య విస్తరణకు విగ్రహాలు కాదు, ప్రాణాలనే బలిగొన్నవాడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం గాయపడిందే అని నొచ్చుకున్నారు. విగ్రహాలను ధ్వంసం చేసినవారి తరపున తామే ఆ విగ్రహాలకు క్షమాపణ చెప్పుకున్నారు.

ఈ అవేదనాపరులు, ఈ ఆవేశపరులు, ఈ వివేచనాపరులు, ఈ సున్నిత మనస్కులు, ఈ విగ్రహానురాగ సంతుష్టపరులు, ఈ తెలుగుజాతి సంస్కృతీ పరిరక్షణా పరులు, ఈ తెలుగు కళారాధకులు, ఈ మేధావులు ఇన్నాళ్ళూ ఏ కలుగులో దాగి ఉన్నారన్నదే అసలు ప్రశ్న.

కోటానుకోట్ల శ్రమజీవులైన రైతులు, కూలీలు, కార్మికులు తమ స్వేదాన్ని చిందించి ఉత్పత్తి చేసిన తిండి గింజలను కడుపునిండా తిని అష్ట, శత, సహస్ర, శత సహస్రావధానులుగా ఛందోబద్ధ కావ్య స్రవంతులను ఆశువుగా దొర్లించినంత మాత్రాన వీరు మేధావులు కాగలరా? తమ కొంపా, గోడూ; గొడ్డూ, గోదా; చెట్టూ, చేమా; చిన్నా, చితకా; ముసలీ, ముతకా… అన్నీ శత కోటీశ్వరుల అనంత ఆస్తుల దాహానికి బలై ధర్మల్ కేంద్రాలుగా, అల్యూమినియం రిఫైనరీలుగా, స్టీలు పరిశ్రమలుగా, మారిపోతుంటే ఈ ఆవేదనాపరుల ఆవేదన ఏ కుర్ల్-ఆన్ బెడ్డింగ్ పై సేద తీరుతోంది?

ఇక్కడే, మన ఆంధ్ర దేశంలో, మన ఉత్తరాంధ్రలో సోంపల్లి, కాకర్లపల్లిల బీల నేలల్లో తింటున్న కలో గంజో కూడా అమాంతం నోటికాడనుండి లాగేసుకుని, అనంత కోటి టన్నుల కర్బన ఉద్గారాల విడుదలతో ఇప్పటికే అగ్నిగుండం కావించిన భూమాతను మరింతగా దహించివేస్తూ, ధర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తుంటే ఈ ఆవేశపరుల ఆవేశం ఏ ఏ.సి రూముల్లో దుప్పటి కప్పుకుని మునగదీసుకుంది? అదేమని అడిగిన పల్లెకారులను ఆడా, మగా తేడా లేకుండా, పిల్లా ముసలీ విచక్షణ లేకుండా ఖాకీచకులు తుపాకీ బాయినెట్లతో కుళ్లబొడిచి, వారి గుండెల్లో తుపాకి గుళ్ళు నాటి ప్రాణాలనే హరించి వేస్తుంటే ఈ సున్నిత మనస్కుల మనస్సులు ఏ బ్రాందీ, విస్కీల ప్రవాహంలో, ఏ నిస్సహాయ కన్నియల కౌగిళ్ళలో ఓలలాడుతున్నవి?

ఇక్కడే, మన తెలుగు గడ్డపై, మన కోస్తా తీరంలో, మన కోనసీమ గుండెలపైన బయల్పడిన వంటవాయు నిక్షేపాలను ధనబలిమితో స్వంత చేసుకుని ఇప్పటికే పేరుకుపోయిన శతకోట్ల నోట్ల కొండలకు మరిన్ని పర్వతాలను జమచేసుకుని, కైంకర్యం గావించి, బ్రేవ్ మని త్రేనుస్తున్న ముఖేశుడికి ఏ మాత్రం అడ్డు చెప్పకుండా స్వయంగా, కడు శ్రద్ధాభక్తులతో ఆయనకు సేవ చేస్తూ, ఆయన విదిలించే నోట్లకట్టలను మన ప్రభుత్వాధీశులు నాలుకలు చాచి చప్పరిస్తుంటే ఈ వివేచనాపరుల వివేచన ఏ ప్రభువుల పెరటి దొడ్లో గుర్రుపెట్టి నిద్రపోతున్నది? వాన్ పిక్ పేరుతో ఆంధ్ర దేశ కోస్తాతీరాన్ని పరదేశ ప్రైవేటు ప్రభువుల కోసం కాలుష్యకాసారంగా మారుస్తుంటే ఈ సంస్కృతీ పరిరక్షకులు ఏ మహానేత ముందు ముకుళిత హస్తాలతో శిరసువంచి నిలుచున్నారు?

అంతెందుకు? నిన్నగాక మొన్న, వందలమంది చిన్నారులు, నూనూగుమీసాల నవయువకులు, తమపై గంపెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని పంచిచ్చి, తాము బలీయంగా కాంక్షించిన తెలంగాణ, రాజకీయుల స్వార్ధ ప్రయోజనాల పాలై, ధన కాంక్షాపరుల పెట్టుబడుల గడీల్లో బందీయై, రాజకీయ పెట్టుబడిదారుల పదవీ కాంక్షల మాటున సమాధియై, తమ జన్మలో చూడలేమేమోనన్న నిరాశా నిస్పృహలకు లోనై తమన తాము నిలువునా దహించివేసుకుంటుంటే, తమ రక్తమాంసాలను హారతి కర్పూరంలా అమాయకంగా అగ్నికి ఆహుతి చేసుకుంటుంటే… ఒక్క కన్నీటి చుక్కయినా ఈ మేధావుల కంట రాలిందా? ఒక్క దయార్ద్ర హృదయమయినా వేణుగోపాలరావు మసిబారిన దేహం చూసి వగచిందా? ఒక్క అవధానైనా మండే అగ్నిగోళమైన యాదయ్యకోసం కంద పద్యం కట్టాడా? స్వేదాన్ని చిందాల్సిన దేహం నుండి కణకణ మండే మంటల్ని చిమ్మిన శ్రీకాంతాచారి ఆత్మత్యాగాన్ని ఏ సంస్కృతీ పరిరక్షకుడైనా రికార్డు చేశాడా?

ఎన్నుకొని స్పందించే హృదయానిది స్పందనేనా?

ప్రాంతాన్ని బట్టి ఎలుగెత్తే మేధావిది మేధస్సేనా?

డబ్బును బట్టి కలమెత్తే కవిది కవిత్వమేనా?

పొగడ్తను బట్టి దునుమాడే కలానిది రాతేనా?

పెట్టుబడిదారుడి గుమ్మానికి వేలాడే మేధావిది మేధస్సేనా?

ప్రయోజనాన్ని బట్టి నోరు తెరిచే నాయకునిది రాజకీయమేనా?

వసూళ్లను బట్టి పిడికిలెత్తే ఉద్యమ పార్టీది ఉద్యమమేనా?

కాదు గాక కాదు!!!

 

5 thoughts on “టాంక్ బండ్ విగ్రహాల ధ్వంసంపై సో-కాల్డ్ మేధావుల (అ)ధర్మాగ్రహం

  1. అరవిందరావు గారికి తన హస్తాన్ని ఎక్కడికయినా చాచగల పదవిలో ఉన్నారు. ఆయన తన హస్తాన్ని పరిమితికి మించి చాచినా మే(తా)ధావులకు పెద్దగా అభ్యంతరం ఉండదు సామాన్యుడుగారూ.

    అది సరే, మీ సైటు చూశాను. అందులో కొన్ని కవితలు కూడా చదివాను. బాగున్నాయి. పత్రికలు అచ్చువేస్తాయేమో, ఎప్పుడయినా ప్రయత్నించారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s