కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ పక్షపాతం మిలియన్ మార్చ్ విధ్వంసానికి కారణాలు


తెలంగాణ పొలిటికల్ జె.ఏ.సి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారన్న వార్త తెలియడంతోనే టాంక్ బండ్ పై ఉన్న ఆందోళనకారులు ఆయన విడుదల డిమాండ్ చేస్తూ విగ్రహాల ధ్వంసం ప్రారంభించారని తెలుస్తోంది. ఆ తర్వాత కోదండరాంను విడుదల చేశాక “కోదండరాంను విడుదల చేశార”న్న సమాచారంతో కే.సి.ఆర్ హడావుడిగా టాంక్ బండ్ వద్దకు చేరుకున్నప్పటికీ కే.సి.ఆర్ మాటకూడా వినకుండా విగ్రహలు ధ్వంసం చేయడం వారు కొనసాగించారని “ది హిందూ” పత్రిక తెలియజేసింది.

సంఘటనల క్రమం

ఐదువందల మంది ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు సమీపంలో ఉన్న కల్యాణ మండపం నుండి ఒంటి గంటకు ఒక్కుమ్మడిగా బ్యారికేడ్లను ఛేదిస్తూ ఉత్తరంవైపు నుండి టాంక్ బండ్ మీదకు దూసుకొచ్చారు. బ్యారికేడ్లు ధ్వంసం కావడం పోలీసులు ముందుగా ఊహించలేకపోయారు. ఏం జరుగుతోందో అర్ధం అయ్యేలోపు బ్యారికేడ్లు ధ్వంసం కావడం జరిగిపోయింది. బ్యారికేడ్లు ధ్వంసం అయ్యాక టాంక్ బండ్ సమీపంలో వివిధ చోట్ల దాగిఉన్న వివిధ సంఘాల కార్యకర్తలు వెల్లువగా రావడం ప్రారంభించారు. అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోవడంతో పోలీసులు నిస్సహాయంగా చూస్తుండి పోవలసి వచ్చింది.

ఈ లోపు జె.ఏ.సి కార్యాలయంనుండి బైటికి వచ్చిన వెంటనే కోదండరాంను పోలీసులు అరెస్టు చేసిన వార్త టాంక్ బండ్ మీద ఉద్యమకారులకు చేరింది. ఆ వార్తతో వారు అగ్రహోదగ్రులయ్యారు. “కోదండరాంను వెంటనే విడుదల చెయ్యాలి. లేకుంటే విగ్రహాలు ధ్వంసం చేస్తాం” అని ఉద్యమకారులు ప్రకటించారు. అలా ప్రకటించిన గంట తరవాత కూడా కోదండరాం టాంక్ బండ్ మీదికి రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు తమ ఇష్టారీతిన విగ్రహాల ధ్వంసం ప్రారంభించారు. టాంక్ బండ్ మీది విగ్రహాల్లో తెలంగాణకు చెందిన ముఖ్యుల విగ్రహాలు లేవనీ తమ వారి విగ్రహాలు ప్రతిష్టించకుంటే ఉన్న విగ్రహాలను కూల్చివేయాల్సి ఉంటుందనీ గతంలో టి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఏ తారక రామారావు ప్రకటించి ఉన్నాడు. అది తెలంగాణవాదుల మనసుల్లో నాటుకుపోయి ఉంది. ఇక ఆగ్రహంతో ఉన్న ఉద్యమకారులకు విచక్షణ నశించి విగ్రహాలను యధేఛ్ఛగా ధ్వంసం చేయడం ప్రారంభించారు.

విద్యార్ధుల ప్రాణత్యాగం, విగ్రహాల ధ్వంసం ఒకటి కాదు.

విగ్రహాల ధ్వంసం వార్త విన్న కే.సి.ఆర్ కోదండరాం విడుదల చేయాలని ప్రకటన జారీ చేశారు. కోదండరాంని విడుదల చేశాక కె.సి.ఆర్ ఆవార్తను టాంక్ బండ్ వద్దకు స్వయంగా చేరవేసినప్పటికీ ఆందోళనకారులు తమ కార్యక్రమం ఆపలేదు. దానితో తాము రెచ్చగొట్టిన ఫలితాన్ని టి.ఆర్.ఎస్ నాయకులు తామే నివారించలేక నిస్సహాయంగా ఉండి పోవలసి వచ్చింది. విగ్రహాల ధ్వంసం అయితే పెద్ద నష్టం లేదనీ విధ్యార్ధుల ప్రాణాలకంటే అవేమీ గొప్పకావనీ కె.టీ.ఆర్ ప్రకటిస్తున్నాడు. విగ్రహాలను మళ్ళీ తయారు చేసుకోవచ్చు గాని పోయిన విద్యార్ధుల ప్రాణాలను తీసుకురాలేము నిజమే. కాని ఆ పేరుతో విగ్రహాల ధ్వంసం చేయడం సమర్ధనీయం కాదు. ధ్వంస రచన జరిగింది విగ్రహాల గురించి అప్పటికే ఉన్న ప్రచారం, కోదండరాం గారి అరెస్టు వార్తల వలన. ఆ కారణాల సవ్యత, అపసవ్యత ల గురించి చర్చిస్తే ఉపయోగం తప్ప విద్యార్ధుల త్యాగాలను విగ్రహాల ధ్వంసం తొ ముడిపెట్టి త్యాగాలను పలుచన చేయడం రాజకీయ నాయకులకు బొత్తిగా తగని పని.

ముఖ్యమంత్రి నీతిపాఠాలు

విగ్రహాల ధ్వంసంపై చాలామంది నైతికతపై పాఠాలు దంచుతున్నారు. “మహనీయుల విగ్రహాల ధ్వంసం హేయం” అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతుందని మిలియన్ మార్చ్ కి అనుమతించలేదు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదని ఆయన ముక్తాయించారు. ఎంత దారుణం? మార్చ్ జరిగేవరకూ దానిపై ఒక్క ముక్క మాట్లాడకుండా ఉద్యమంపైకి పోలీసులను ఉసిగొల్పిన కిరణ్ కుమార్ అకస్మాత్తుగా మహనీయుల మహనీయత గుర్తుకురావడం ఆశ్చర్యకరం. ఈజిప్టు, ట్యునీషియాల్లో నియంతలను కూల్చివేసే ప్రదర్శనలకే నియంతల అనుమతి దొరికింది గానీ, ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రజాస్వామిక కోరికను ప్రకటించడానికి ప్రదర్శనకు అనుమతి దొరకలేదు. శాంతియుత, ప్రజాస్వామిక ప్రదర్శనకు అనుమతి నిరాకరించడంలో నైతికత, సమర్ధనీయతలు ఉన్నాయని కిరణ్ కుమార్ గారు చెప్పదలిచారా?

ప్రజాస్వామిక కోరికను తెలపడానికి ప్రజలను రానీయకుండా గల్లి గల్లికి పికెట్లు, చెక్ పోస్ట్ లు పెట్టి పరదేశ దండయాత్రకు సిద్ధమైనట్లుగా పోలిసులు, పారా మిలట్రీని మొహరించిన ముఖ్యమంత్రి, వేలకోట్ల ప్రజాధనాన్ని దిగమింగిన భ్రష్ట రాజకీయులు, అధికారులపై చిన్న చర్యకు కూడా పూనుకోకపోవడం ఏ నీతికి సంకేతం? అణువణువునా విధించిన ఆంక్షలవలన మార్చి 10 న పగలంతా ప్రజాజీవనం అస్తవ్యస్తం కాలేదా? తెలంగాణ వాదులు పరీక్షకు ఆటంగం కలగకుండా సమయాన్ని సవరించి హుందాగా వ్యవహరించారు. విద్యార్ధుల పరీక్షలు తమకూ ముఖ్యమే అని చాటుకున్నారు. కాని ప్రభుత్వం చేసినదేంటి?

పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్ధులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు పోలీసుల ఆంక్షలవలన సమయానికి పరీక్షహాలుకి చేరుకోలేని సంగతి ప్రభుత్వానికీ, సీ.ఎం కీ ఒక అంశంగా కూడా కనబడలేదు. తెలంగాణ మార్చ్ ని జరగకుండా చేయాలన్న పట్టుదల తప్ప పరీక్ష రాస్తున్నవారి ఇబ్బందులను ఏమాత్రం పరిగణించలేదు. విగ్రహాలు ధ్వంసం కావడానికి దారితీసిన పరిస్ధితులను సృష్టించింది పోలీసులూ, ప్రభుత్వం. తెలంగాణ మార్చ్ పట్ల అత్యంత హేయమైన “కక్ష” ను ప్రభుత్వ పెద్దలు ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్యం, దాని విలువల పట్ల తమకు ఏమాత్రం గౌరవం లేదని మరొకసారి నిర్లజ్జగా చాటుకున్నారు.

తెలంగాణ రాజకీయుల స్వార్ధం

తెలంగాణ రాష్ట్ర డిమాండుకు ఉన్న విలువను తెలంగాణ రాజకీయనాయకులు తమ స్వార్ధపూరిత ప్రకటనలతో పలుచన చేస్తూ వచ్చారు. ప్రజల మద్దతు దండిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర డిమాండుతో రాజకీయ లబ్ది పొందటానికి సోనియానుండి గల్లీ నాయకుడి వరకూ పాకులాడడమే తప్ప, ఉద్యమ నిర్మాణ క్రమంలో ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అన్న విచక్షణను ఈ ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుల్లో అత్యధికులు పాటించలేదు. పదవులు వదులుకుంటాం; రాజీనామా లేఖ జేబులోనే ఉంది; ప్రాణాలైనా ఇస్తాం; ఎటువంటి త్యాగానికైనా సిద్ధం; అంటూ ఖాళీ ప్రకటనలే తప్ప రాష్ట్ర సాధన పై చిత్తశుద్ధితో ఆచరణాత్మకంగా వ్యవరించినవారు చాలా తక్కువ మంది.

తెలంగాణ రాజకీయ నాయకులు రాష్ట్ర సాధన కోసం పదే పదే సీమంధ్రనాయకులపై విద్వేషపూరిత ప్రకటనలు చేయడం పూర్తిగా అసంబద్ధమైనది. సీమాంధ్ర వారిపై విచక్షణా రహితంగా దాడి చేస్తే తెలంగాణ ప్రజల్లో పేరు వస్తుందను కోవడం కేవలం భ్రమ మాత్రమే. దానివల్ల తాత్కాలిక ప్రచారం రావచ్చు కానీ ఇరువైపులా ప్రజల మనసుల్లో విద్వేషభావనలు పురివిప్పి తిరిగి తమకే ఎదురు నిలుస్తాయన్న అంశాన్ని తెలంగాణ రాజకీయ నాయకులు గుర్తించాలి. మాటి మాటికీ తెలంగాణ వ్యతిరేకులపై భౌతిక దాడులకు దిగుతామని ప్రకటిస్తూ దానినే తెలంగాణ సత్తాగా చెప్పేవారు నిజానికి ప్రజా జీవితానికి అనర్హులు. భౌతిక దాడి అనేది తెలంగాణవారే కాదు, ఎవరైనా చేయగలరు. దాని వలన ఒరిగేది హింసా, విద్వేషాలే తప్ప ఏమీలేదు. అలా వచ్చిన రాష్ట్రంలో రేపు తెలంగాణ రాజకీయులు సైతం అటువంటి పరిస్ధితులు ఎదుర్కోవడం అనివార్యం.

అసలది సమస్యేనా?

తెలంగాణ సమస్య కాంగ్రెస్, టీడీపి లకు ఒక రాజకీయ సమస్య. అది ప్రజల సమస్య అన్న తెలివిడి వారికి ఉండదు. ఉన్నా రాజకీయ ప్రయోజనాల ముందు దానికి విలువ లేదు. ప్రజలంటే వారి దృష్టిలో ఓట్లు మాత్రమే. తెలంగాణలాంటి సమస్యలు వారికి ఓట్లు సంపాదించి పెట్టేవి. అందుకే అవి హనుమంతుడికి సైతం తెలియని కుప్పిగంతులు వేస్తున్నాయి. నాలుగొందల మంది విద్యార్ధులు యువకులూ అమాయకంగా ఆత్మహననం చేసుకుంటుంటే చేష్టలుడిగి చూసిన ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అభివర్ణించడానికి మాటలు లేవేమో! కొత్త సంవత్సరం ప్రారంభంనుండి నిరంతరం తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరసన పాటిస్తుంటే దానిపై ఒక ప్రకటన, ఒక అభిప్రాయం, ఒక నిర్ణయం ఏదీ ప్రకటించని కేంద్ర ప్రభుత్వం ఎవరికోసం ఉన్నట్లు. బడ్జెట్ పాస్ కావాలి, రాష్ట్రాల ఎన్నికలు ముగియాలి, ఇంకా అనేకంగా ఉన్న సమస్యలు పరిష్కరించబడాలి. తరవాతే తెలంగాణ అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యం కాదనే చెబుతోంది. ఈ సమస్యలన్నీ తెలంగాణకు ముందూ ఉన్నవే, తర్వాతా ఉండేవే. తెలంగాణ అసలు ఒక సమస్య కాకపోవడమే విచిత్రం. విచిత్రం కాదు, నేరం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s