తెలంగాణ వాదులు గురువారం, మార్చి 10 తేదీన తలపెట్టిన “మిలియన్ మార్చ్” విజయవంతం అయిందని తెలంగాణ జెఏసి ప్రకటించింది. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ప్రజలు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. అయితే కార్యకర్తలు టాంక్ బండ్ మీద ఉన్న కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోకపోయినట్లయితే ప్రశాంతంగా జరిగి ఉండేదని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు.
జెఏసి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు జెఏసి ఆఫీసు వద్దే అరెస్టు చేశారు. మార్చ్ లో పాల్గొనడానికి ఆయన కార్యాలయం నుండి బైటికి రావడంతోనే నిర్బంధంలోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎం.ఎల్.ఏలు టాంక్ బండ్ వద్దకు వెళ్లడానికి బయలుదేరడంతోనే వారినీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. టిడిపి ఎం.ఎల్.ఏ దయాకర్ రావు, బి.జె.పి నాయకుడు విద్యాసాగరరావు లను బషీర్ బాగ్ వద్ద అరెస్టు చేశారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ వేలమందిని అరెస్టు చేశారని కోదండరాం పిటిఐ వార్తా సంస్ధ రిపోర్టరుతో అన్నారు.
మిలియన్ మార్చ్ వలన ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుందని పోలీసు బాసు అరవిందరావు, కమిషనర్ ఎ.కె.ఖాన్ లు గత కొద్దిరోజులుగా వాదిస్తూ వస్తున్నారు. కాని మార్చ్ జరిగిన రోజు చూస్తే పోలీసులు విధించిన ఆంక్షల వలన ప్రజాజీవనానికి పెద్ద ఎత్తున ఆటంకం కలిగిన విషయం అర్ధం అవుతుంది. పోలీసులు తెలంగాణ వాదుల నాయకులను అరెస్టు చేసి నిర్బంధంలోకి తీసుకోవడంతో టాంక్ బండ్ వద్ద కార్యకర్తలను అదుపు చేసే వారు కరువయ్యారు. దానితో వారు రెచ్చి పోవడంతో మహనీయుల విగ్రహాలు ధ్వంసం అయ్యాయి.
టాంక్ బండ్ మీద విగ్రహాలను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతిష్టించినవి. తెలుగువారిలో మహనీయులను తలచుకొనే వారు సైతం లేని కాలంలో తెలుగు ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ శ్రద్ధతో ఆ విగ్రహాలను ప్రతిష్టంప జేశారు. తెలుగుతల్లి అనే భావనకు వ్యతిరేకంగా సెంటిమెంటును రెచ్చగొట్టింది కెసిఆరే. తెలుగుతల్లి అనేది తెలుగు భాషపై ఉన్న గౌరవానికి సంబంధించినచి. తెలుగుతల్లి అనగానే ఆ భావన కేవలం ఆంధ్ర, రాయలసీమ లకు మాత్రమే పరిమితమైనది అని అనుకోవడం పూర్తిగా అవగాహనా రాహిత్యం. కె.సి.ఆర్ తెలుగుతల్లి కి వ్యతిరేకంగా వాగిన వాగుడు ఈరోజు టాంక్ బండ్ మీద విగ్రహాల ధ్వంసానికి భావాత్మక పునాదిగా పని చేసిందని చెప్పుకోవచ్చు.
ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి కంపెనీలు నడుపుతున్న కె.సి.ఆర్ తెలుగుతల్లి భావనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం స్వార్ధ ప్రయోజనాల కోసమే నని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రంలో భాషకు సంబంధించి వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రత్యేక భావాలు తెలుగు మాట్లాడే వారందరికీ సంబంధించినవి. తెలంగాణ యాస వేరే గాని భాష తెలుగే. కనుక తెలుగు భాషకు సంబంధించిన ప్రతీ సాంస్కృతిక భావన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలన్నీ స్వంతం చేసుకోవాలి. అటువంటి సంస్కృతిని తెలంగాణ నాయకులు పెంపొందించగలగాలి. లేనట్లయితే రేపు తెలంగాణకు సంబంధించి సాంస్కృతిక భావనలకు పునాది లేకుండా పోతుంది.