లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్నది. గడ్డాఫీ సేనలు తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుండడంతో ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రత పెరిగింది. బిన్ జావాద్ పట్టణాన్ని సోమవారం గడ్డాఫీ బలగాలు వైరి పక్షం నుండి స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుండి ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్ ను వశం చేసుకోవాలని చూస్తున్నాయి. మార్గ మధ్యంలో తిరుగుబాటు బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. అడపా దడపా గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ పై విమాన దాడులు చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా గడ్డాఫీనుండి తిరుగుబాటుదారులకు రాజీ ప్రతిపాదన అందింది. మొదట గడ్డాఫీ తరపు వ్యక్తీ, ఆ తర్వాత ప్రభుత్వ అధికారి నుండీ రాజీ ప్రతిపాదన బెంఘాజీ పట్టణానికి అందినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం గడ్డాఫీ అధికారం త్యజిస్తాడు. తిరుగుబాటుదారులు గడ్డాఫీపై ఎటువంటి నేరారోపణ చేయకుండా అతనూ, అతని కుటుంబమూ క్షేమంగా దేశం దాటి వెళ్ళటానికి అనుమతించాలి. ఈ ప్రతిపాదనను తిరుగుబాటు దారులు తిరస్కరించారు. “పదవిని త్యజించడం ఒక విషయం. ఏ ప్రాసిక్యూషన్ లేకుండా వెళ్ళిపోతానంటే మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదు” అని తిరుగుబాటు నాయకుడొకరు వ్యాఖ్యానించాడు. తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసిన “ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్” అధిపతి ముస్తఫా అబ్దుల్ జలీల్, “గడ్డాఫీ తానుగా రాజీకోసం ఎవరినీ పంపలేదు. ట్రిపోలీలోని లాయర్లు మధ్యేమార్గంగా ఈ ప్రతిపాదన చేశారు” అని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధకు తెలిపాడు.
అదేకాకుండా రాజీ ప్రతిపాదనను తిరుగుబాటు దారులు పూర్తిగా నమ్మడం లేదు. విభేదాలు సృష్టించడానికి గడ్డాఫీ వేసిన ఎత్తుగడగా వారు చెబుతున్నారు.విమాన దాడులు, హెలికాప్టర్ గన్ షిప్పులు, భారీ ఆయుధాలతో గడ్డాఫీ బలగాలు తలపడుతున్నాయి. తాము గణనీయమైన పురోగతి సాధించామని కూడా గడ్డాఫీ బలగాలు రాయిటర్స్, బిబిసి విలేఖరులకు తెలిపారు. తిరుగుబాటుదారుల నుండి ఒక పట్టణాన్ని చేజిక్కించుకుని పశ్చిమ ప్రాంతంపై పట్టును స్ధిరీకరించుకునే ప్రయత్నం చేస్తూ రాజీ ప్రతిపాదించడం మోసపూరితమని వారు నమ్ముతున్నారు. తాను ఏ అధికార స్ధానంలోనూ లేననీ, ఇక లేని పదవిని త్యజించడం సాధ్యం కాని విషయమని గడ్డాఫీ వారం రోజుల క్రితమే తెలిపాడు.
మరోవైపు పశ్చిమ దేశాలు లిబియాపై “నిషిద్ధ గగనతలం” అమలు చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బ్రిటన్, ఫ్రాన్సులు ఒక ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని తయారు చేస్తున్నాయి. దానిపై వచ్చే గురువారం (ఫిబ్రవరి 10) నాటోలో చర్చ జరుగుతుందని తెలిసింది. నిషిద్ధ గగనతలం అమలులోకి వచ్చినట్లయితే గడ్డాఫీ సైన్యానికి చెందిన యుద్దవిమానాలు లిబియా గగనతలంలో ఎగరకుండా నిషేధిస్తారు. నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే అంతర్జాతీయ బలగాల ముసుగులో ఉన్న అమెరికా, బ్రిటన్ లు మధ్యధరా సముద్రంలో ఉన్న తమ విమాన వాహక నౌకల నుండి వాటిని కూల్చివేస్తాయి. ఈ వంకతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర దేశాల సైన్యం లిబియా భూభాగంపైకి చేరే అవకాశం ఉంది. అరబ్ లీగ్ కూడా నిషిద్ధ గగనతలం అమలు చేయాలని కోరడం తొందరపాటు చర్య.
ఇరాక్ యుద్ధానికి ముందుగానీ, బోస్నియా యుద్ధం ముందుగానీ నాటో సేనలు ఆ దేశాలపై ఇలాగే నిషిద్ధ గగనతలాన్ని అమలు చేశాయి. ఆ తర్వాత ఆ దేశాల్లో తిష్టవేశాయి. లిబియా అటువంటి పరిస్ధితిని ఎదుర్కోకూకూడదంటే అంతర్జాతీయ సాయాన్ని, ఐక్యరాజ్య సమితి సాయమైనా సరే, అడగక పోవడమే మంచిది. తిరుగుబాటుదారులు ఇప్పటివరకూ ఐక్యరాజ్య సమితి సాయాన్ని ఆడుగుతూ వచ్చారు. మానవతా సాయం చేయడానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి ఎటువంటి చర్యలనయినా తీసుకునేందుకు ఐక్యరాజ్య సమితి అవకాశం కల్పించింది. అందువలన లిబియా తిరుగుబాటుదారులు అప్రమత్తతతో ఉండడం అవసరం.