అమెరికాలో కార్మికుల హక్కులపై దాడికి వ్యతిరేకంగా ఈజిప్టు తరహా ఉద్యమం


 

Wisconsin_Budget_Protests

అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో బడ్జెట్ వ్యతిరేక ప్రదర్శన (పెద్ద బొమ్మకోసం క్లిక్ చేయండి)

అమెరికాలో విస్ కాన్సిన్ రాష్ట్రంలో ఈజిప్టు తరహాలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నర్సులు మొదలయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ మూడు వారాలనుండీ ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అక్కడ ఏమీ జరగనట్లుగా నాల్రోజుల క్రితం వరకూ నటిస్తూ వచ్చాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ప్రత్యక్షంగా కారణమైన అమెరికాలోని ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలపై చర్య తీసుకోవటం అటుంచి ‘స్టిములస్ ప్యాకేజీ’ పేరుతో రెండు ట్రిలియన్లకు పైగా ప్రజల సొమ్మును వాటికి ధారపోసిన సంగతి జగద్విదితమే. అదే ఆర్ధిక సంక్షోభం పేరుతో అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, ఉద్యోగుల పైన ముఖ్యంగా సంఘటిత రంగం పైనే తీవ్రమైన దాడులకు పూనుకుంటున్నాయి. పొదుపు చర్యల పేరిట యూరోప్ దేశాలు ఉద్యోగులను ఇంటికి పంపి కార్మికుల వేతనాలు తగ్గించి, సంక్షేమ చర్యలను రద్ధుచేసి, వేతనాలు పెరగకుండా స్ధంభింప జేసి, మరిన్ని పన్నులు విధించిన విధంగానే అమెరికాలోని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికుల వేతనాలను తగ్గించడమే కాకుండా, అరకొరగా ఉన్న సదుపాయాలను కూడా రద్ధు చేశారు. అంతటితో ఆగకుండా సంఘటిత ఉద్యోగులు, కార్మికులు అనేక దశాబ్దాలు పోరాడి సాధించుకున్న యూనియన్ హక్కులను ఎత్తివేసేందుకు సిద్ధపడ్డారు.

విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉద్యోగ, కార్మిక సంఘాల ఉమ్మడి బేరసారాల హక్కును ఆ రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టారు. వేతనాలు తగ్గించి, సంక్షేమ సదుపాయాలను రద్దు చేసినా మౌనంగా భరించిన కార్మికులు, ఉద్యోగులు ఈ చర్యతో తీవ్ర ఆగ్రహం చెందారు. కార్మిక, ఉద్యోగ సంఘాల ఉమ్మడి బేరసారాల హక్కును రద్ధు చేయకూడదని డిమాండ్ చేస్తూ విస్కాన్సిన్ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నర్సులు, కార్మికులు మొదలైన వర్గాలకు చెందిన వారంతా అక్కడ సమ్మెకు దిగారు. రెండు వారాలనుండి వివిధ యూనియన్ సభ్యులు రాష్ట్ర రాజధాని మేడిసన్ లోని అసెంబ్లీ భవనంలోకి చేరుకుని అక్కడే రాత్రింబవళ్ళు ఉంటూ ఉమ్మడి బేరసారాల హక్కు రద్దు బిల్లును ఉపసంహరించుకొనే వరకూ బైటికి రామని బైఠాయించారు. వారిని బైటికి రప్పించటానికి రెండు వారాలనుండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేక పోయారు. ఉద్యోగులను విభజించడానికి పోలీసులు, అగ్నిమాపక దళ ఉద్యోగులను బిల్లునుండి మినహాయించారు. అయినప్పటికీ వారు కూడా రాష్ట్ర రాజధాని మేడిసన్ నగరంలో ప్రదర్శనలు నిర్వహించి ఆందోళన చేస్తున్నవారికి మద్దతు పలికారు. విస్కాన్సిన్ రాష్ట్రంలో 200,000 కు పైగా ఉన్న ప్రభుత్వరంగ ఉద్యోగులకు నష్టం జరుగుతుండగా తాము చేతులు కట్టుకొని కూర్చోలేమని వారు ప్రకటించి ఆందోళనలో జత కలిశారు.

ప్రజా వ్యతిరేక పత్రికలు

అరబ్ దేశాల్లొ ప్రజాస్వామ్య సంస్కరణల కోసం జరుగుతున్న ఉద్యమాల ప్రభావం ఒక్క అరబ్ దేశాల పైనే కాకుండా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చాటుకునే అమెరికా నడిబొడ్డునే అరబ్ ఉద్యమాల తరహాలోనే బైఠాయింపు ఉద్యమం జరగడం అమెరికా, దాని పశ్చిమ దేశాల మిత్రులకు మింగుడు పడటం లేదు. బహుళజాతి సంస్ధల ఆధీనంలో నడిచే కార్పొరేట్ వార్తా సంస్ధలు రెండువారాల ఉద్యమాన్ని వార్తగా ప్రచారం చేయటానికి మనసొప్పటం లేదు. లక్షమందికి పైగా నగరంలో ప్రదర్శన నిర్వహించినా ఆ వార్తను ప్రపంచానికి వెల్లడించకుండా మొదటి రెండు వారాల వరకూ మిన్నకుండి పోయాయి. రాష్ట్రంలోని ఇతర పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజలు బడ్జెట్ లోటు తగ్గించే పేరుతో అధిక పన్నులు, ఉద్యోగాల రద్ధు చర్యలతో దాడులకు దిగటాన్ని వ్యతిరేకిస్తూ పదుల వేల సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలు, బైఠాయింపులు జరుగుతున్నప్పటికీ అవి వార్తలుగా వాటికి కనిపించటం లేదు.

ఆందోళనలు మూడో వారంలోకి ప్రవేశించి డిమాండ్లు సాధించుకునే వరకూ విరమణకు ఒప్పుకోని పట్టుదల ఆందోళనకారుల్లో నానాటికీ అధికం అవుతుండటం, బ్లాగ్ లు, సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లు ఇతర చిన్న చిన్న వార్తా సంస్ధల ద్వారా ఆందోళనల వార్తలు వెల్లడికావడం తదితర కారణాలతో అంతర్జాతీయ వార్తా సంస్ధలకు అమెరికా ఆందోలనలను రిపోర్టు చేయక తప్పలేదు. గత నాలుగైదు రోజులుగా బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు అనివార్యంగా అమెరికా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాందోళనలను రిపోర్టు చేస్తున్నాయి. రిపోర్ట్ చేయడంలో అవి కొన్ని ఎత్తుగడలను అనుసరిస్తున్నాయి. పరీక్షగా చూస్తే తప్ప గమనించలేని ఎత్తుగడలవి. యూనియన్లు అనవసర పట్టింపులకు పోవడం, గవర్నర్ చర్యలు ఆర్ధిక వ్యవస్ధ మెరుగుదలకు అనుకూలం, మొదట కష్టమైనా దీర్ఘకాలికంగా ఫలితాలు తెలుస్తాయి… మొదలైన అర్ధాలు వచ్చే విధంగా అవి వార్తలను ముక్తాయిస్తున్నాయి.

భారత దేశంలోని వామపక్ష పార్టీలు ఢిల్లీలో నలభై వేల మందితో ప్రదర్శన జరిపితే రాయిటర్స్ సంస్ధ మూడు రోజులు వరసగా రిపోర్టు చేసింది. బిబిసి కూడా అదే స్ధాయిలో రిపోర్టు చేసింది. కాని అమెరికాలోని రాష్ట్ర కేంద్రంలో లక్షమంది ప్రదర్శన నిర్వహిస్తే ఆ విషయం నామమాత్రంగానైనా కవర్ చేయటానికి ఆ వార్తా సంస్ధలకు మనసొప్పలేదు. చైనాలో, లిబియాలో బయటి ప్రపంచం వార్తలు తెలియకుండా ప్రజల హక్కును హరిస్తున్నారని గావుకేకలు వేస్తున్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ తమ దేశంలో జరుగుతున్న ఉద్యమం, అదీ వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం తర్వాత అంత స్ధాయి ఉద్యమం ఇదే అని అంచనా వేయబడుతున్న ఉద్యమం తాలూకు వార్తను బయటి ప్రపంచానికి తెలియకుండా స్వయం నిషేధం విధించుకున్న తమ వార్తా పుత్రికలను ఏమనాలో చెబితే ప్రపంచం నేర్చుకుంటుంది.

విస్కాన్సిన్ రాష్ట్రం

విస్కాన్సిన్ రాష్ట్రానికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన “స్కాట్ వాకర్” 2010 నవంబరు ఎన్నికల్లో గవర్నర్ గా ఎన్నికయ్యాడు. అధికారానికి వచ్చిందే తడవుగా బడ్జెట్ లోటు తగ్గించే పేరుతో పొదుపు చర్యలు ప్రకటించాడు. పిల్లలు, వయో వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు మొదలైన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలను రద్దు చేయటమో లేదా తీవ్ర కోత విధించడమో చేశాడు. బడ్జెట్ లోటు తగ్గించడానికి ధనికులపై పన్నులు వేయటానికి మాత్రం నిరాకరిస్తున్నాడు. పన్నులు వేయకపోగా కార్పొరేట్ కంపెనీలకు వంద మిలియన్ డాలర్ల వరకు అప్పటికే ఉన్న పన్నుల్లో రాయితీలు కల్పించాడు. వీటన్నింటితో విస్కాన్సిన్ రాష్ట్ర ప్రజల్లో అత్యధికులు రానున్న ప్రమాదాన్ని గ్రహించి ఫిబ్రవరి 14 తేదీన రాష్ట్ర రాజధాని మేడిసన్ లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వందలమంది కార్యకర్తలు చట్ట సభలయిన “రాష్ట్ర ప్రతినిధుల సభ”, “రాష్ట్ర సెనేట్” లు కొలువుదీరే “కేపిటల్ భవనం” లోకి జొరబడి బైఠాయింపు ప్రారంభించారు. ర్యాలీలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. రిపబ్లికన్ పార్టీకి ఓటు వేసిన వారు సైతం ర్యాలీ లోనూ ఆ తర్వాత బైఠాయింపులోనూ పాల్గొంటున్నారు.

ఊరేగింపులు కేవలం పిబ్రవరి 14 తోనే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో కూడా విస్తృతంగా ఊరేగింపులతో వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా నిర్వహిస్తున్నారు కూడా. విస్కాన్సిన్ రాష్ట్రానికే పరిమితం కాకుండా అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలనుండి కార్యకర్తలు విస్కాన్సిన్ రాష్ట్రానికి వచ్చి మేడిసన్ లోని కేపిటల్ బిల్డింగ్ లో బైఠాయింపులో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ కేపిటల్ బిల్డింగ్ తెరిచిన వెంటనే మరింతమంది కార్యకర్తలు బైఠాయింపులో చేరుతున్నారు. బైఠాయింపులో 95 శాతం మంది స్ధానికులు ఉండగా 5 శాతం వరకు ఇతర రాష్ట్రాలనుండి మద్దతుగా వచ్చినవారు ఉంటున్నారు. ప్రధర్శనల్లో 40,000 నుండి 100,000 మంది వరకు పాల్గొనడం సర్వసాధారణంగా మారింది. ఇన్ని జరుగుతున్నప్పటికీ విస్కాన్సిన్ గవర్నర్ స్కాట్ వాకర్ లొంగి రావడం లేదు. ఉద్యోగుల యూనియన్ లకు ఉన్న హక్కులను రద్ధు చేయాల్సిందే నంటున్నాడు. గవర్నర్ ను ఉద్దేశిస్తూ కేపిటల్ బిల్టింగ్ లోపల గోడలపైన ఆందోళనకారులు మొదటి పది రోజుల్లో 10,776 మెసేజ్ లు రాశారని డెమొక్రసీ నౌ టీవీ ఛానెల్ తెలిపింది. మూవ్ ఆన్ డాట్ ఓ ఆర్ జి అనే వెబ్ సైటులో దేశ వ్యాపితంగా  ప్రజలు ఉంచిన ఈ మెసేజ్ లను సేకరించి ఆందోళనకారులు గోడలపై రాశారు. ఆందోళనలకు ప్రజలనుండి వస్తున్న విస్తృత మద్దతుకు ఇది సంకేతం మాత్రమే. మెసేజ్ లు ఉంచిన వారిలో రిపబ్లికన్ పార్టీ సభ్యులుగా రిజిస్టర్ అయిన వారు కూడా ఉండటం విశేషం. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే పోయిన నవంబరులో ఎన్నికయిన రిపబ్లికన్ అభ్యర్ధి స్కాట్ వాకర్ దారుణంగా ఓడి పోవడం ఖాయమని ఒక పత్రిక నిర్వహించిన ఓటింగ్ లొ వెల్లడయింది.

ఫిబ్రవరి 17 న పబ్లిక్ రంగ ఉద్యోగులు, విద్యార్ధులు 30,000 మందికి పైగా మేడిసన్ లో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్ధులు తమ టీచర్లను ఉద్యోగాలనుండి తొలగించే అవకాశం ఉందని తెలిసి వీధుల్లోకి వచ్చారు. అదే రోజు అదే నగరంలో మరో చోట 20,000 మంది ప్రదర్శన నిర్వహించారు. ఫిబ్రవరి 17 న వాస్తవానికి రాష్ట్ర సెనేట్ లో యూనియన్ల బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉంది. కాని డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్లు 14 మంది ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండటానికి రాష్ట్రం విడిచి వెళ్ళడంతో సెనేట్ లో కోరం లేక ఓటింగ్ వాయిదా పడింది. ప్రజలనుండి ఎన్నడూ ఎరుగనంత తీవ్ర వ్యతిరేకత రావడంతో వారికి బిల్లును ఆమోదించడానిక్ ధైర్యం చాల్లేదు. వారు ఫిబ్రవరి 18 న గవర్నర్ వాకర్ కి ఒక లేఖ రాశారు. పెన్షన్, ఆరోగ్య సంరక్షణ నిమిత్తం తమ జీతాలనుండి కొంత చెల్లించడానికి యూనియన్లు అంగీకరిస్తారనీ, ఉమ్మడి బేరసారాల హక్కును రద్దు చేసే విషయం పునరాలోచించి యూనియన్లను చర్చలకు పిలవాలని ఆ లేఖలో కోరారు. దానికి గవర్నరు అంగీకరించలేదు. యూనియన్లను చర్చలకు పిలవడం జరగదన్నాడు. దానితో వాకర్ అసలు టార్గెట్ బడ్జెట్ లోటు కాదనీ కార్మికుల హక్కులను హరించిడమేననీ తేలిపోయింది. బిల్లు ఆమోదం పొందకుండానే దాని అమలుకు పూనుకుంటున్నాడనీ అర్ధమైంది. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 19 న 80,000 మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు మళ్ళీ మేడిసన్ నగరంలో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఫిబ్రవరి 26 న లక్షమందికి పైగా మేడిసన్ నగరంలో ప్రదర్శన నిర్వహించి కేపిటల్ బిల్డింగ్ వద్ద కొన్ని గంటల పాటు బైఠాయించారు. ఈ ప్రదర్శన వియత్నాం యుద్ధం తర్వాత అంత పెద్ద ప్రదర్శనగా పేర్కొంటున్నారు. మార్చి 5 న మళ్ళీ లక్షమందికి పైగా అదే స్ధలంలో ప్రదర్శన నిర్వహించారు.

ఫిబ్రవరి 22 తేదీన ఓహియో రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులు 20,000 మందికి పైగా ప్రదర్శన నిర్వహించారు. ఓహియో రాష్ట్ర గవర్నరు కూడా విస్కాన్సిన్ గవర్నరు ప్రతిపాదించినట్లుగా కార్మికులు, ఉద్యోగుల ఉమ్మడి బేరసారాల హక్కు రద్దుకు ప్రతిపాదించాడు. ఉద్యోగులు తమ పెన్షన్లో సగభాగాన్ని తామే తమ జీతాలనుండి ఇవ్వాలనీ, ఆరోగ్య భీమా కింద ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చిన దానిలో 12.5 శాతాన్ని చెల్లించాలని ప్రతిపాదించాడు. వీటికి ఉద్యోగులు తయారుగానే ఉన్నారు. పైకి చెప్పకుండా 500 పేజీల బిల్లులో ఉద్యోగుల బేరసారాల హక్కును రద్ధుకు ప్రతిపాదించిన విషయం వెల్లడి కావడంతో పబ్లిక్ రంగ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇటువంటి ప్రతిపాదనలనే ఇండియానా, మిచిగాన్ రాష్ట్రాలలో కూడా ప్రతిపాదించడంతో విస్కాన్సిన్ రాష్ట్ర ఆందోళనలను స్ఫూర్తిగా తీసుకొని ఆ రాష్ట్రాలలోని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. దాదాపు అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోని పట్టణాల్లో ఊరేగింపులు, బైఠాయింపులు, ప్రదర్శనలూ జరుగుతున్నాయి. వీటిలో అన్ని వర్గాలు ప్రజలు -కార్మికులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, నర్సులు, విద్యార్దులు, ఫైర్ సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతిరోజూ వివిధ రంగాలకు చెందిన మేధావులు, వివిధ అవార్డులు పొందినవారు, రచయితలు, సినిమా ప్రముఖులు, సంఘ ప్రముఖులు ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ప్రకటనలు ఇస్తున్నారు. డిమాండ్ నెరవేరేదాకా ఆందోళన విరమించవద్దని ప్రోత్సాహం ఇస్తున్నారు.

ఉద్యోగుల ఆందోళనలను విచ్ఛిన్నం చేయడానికి గవర్నర్ వాకర్ అనేక ఎత్తుగడలకు పాల్పడ్డాడు. ఆందోళనలకు మద్దతుదారులుగా నటిస్తూ, నాయకత్వంతో విభేధించివారుగా సొంత మనుషులను ఆందోళనల్లోకి ప్రవేశపెట్టాడు. నాయకత్వం ఉద్యమంలొ గట్టి ఎత్తుగడలు వేయడానికి వెనకాడుతుందనో, అహింసాయుత ఆందోళనలవల్లనే గవర్నరు దిగి రావడం లేదంటూ, హింసాత్మక ఎత్తుగడలకు పాల్పడేలా రెచ్చగొట్టడానికో వీరు ప్రయత్నించేలా శిక్షణ ఇచ్చి దించాడు. ఒక బ్లాగర్ డేవిడ్ కాఛ్ గా నటిస్తూ గవర్నరుకి ఫోన్ చేసి ఆందోళనల గురించి చర్చించిన క్రమంలో గవర్నరు ఈ విషయం బైట్ పెట్టాడు. ఫోన్ సంభాషణలను కొన్ని చానెళ్ళు ప్రచారం చేశాయి. (కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా, కార్పొరేటు అధిపతులతో, జర్నలిస్టులతో జరిపిన సంభాషణలు ఇక్కడ టీవీలలో ప్రసారమైన విషయం పాఠకులకు తెలిసిందే) ఆ సంభాషణ లో ఉన్నది తానేననీ, అయితే దాని ఉద్దేశం వేరేననీ వాకర్ పత్రికలకు తెలిపాడు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్కాట్ వాకర్ తలపెట్టిన కోతల బిల్లు, యూనియన హక్కులు హరించే బిల్లు లపై ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండటానికి డెమొక్రటిక్ పార్టీకి చెందిన14 మంది సెనేటర్లు రాష్ట్ర విడిచి వేరే రాష్ట్రానికి వెళ్ళి పోయారు. విస్కాన్సిన్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్న ఇతర రాష్ట్రాల సెనేటర్లు కూడా తమ రాష్ట్రాలను వదిలి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయారు. యూనియన్లు డెమొక్రటిక్ పార్టీ ఆధీనంలో ఉన్న చోట అక్కడి డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్లు ఈ ఎత్తుగడను పాటిస్తున్నారు. రాష్ట్రం నుండి వెళ్లిపోయిన డెమొక్రటిక్ పార్టీ సెనేటర్లు వెంటనే తిరిగి రాకుంటే 1500 మందికి పైగా ప్రభుత్వరంగ ఉద్యోగులను తొలగిస్తానని గవర్నర్ స్కాట్ వాకర్ ఫిబ్రవరి 15 న ప్రకటించాడు.ఆందోళన చేస్తున్న ఉద్యోగులను అణచివేయడానికి నేషనల్ గార్డ్స్ ను పిలుస్తానని కూడా ఆయన బెదిరించాదు. అయితే ప్రభుత్వ ఉద్యొగులైన నేషనల్ గార్డ్స్ అటువంటి చర్యకు దిగడానికి వ్యతిరేకిస్తున్న పరిస్ధితి ఉంది. ఎటువంటి హింసకు పాల్పడకుండా శాంతియుత నిరసన తెలుపుతున్న కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విధ్యార్ధులపై మేమెందుకు చర్యతీసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పినట్లుగానే ఆందోళనకారులపై చర్యలు తీసుకోవడానికి నిరాకరించారు. గవర్నరు ఆర్డరును వారు అమలు చేయలేదు. పైగా వారితో చేరిపోయారు కూడా. ఇది వినడానికి నమ్మశక్యంగా లేనప్పటికీ నమ్మక తప్పదు. విస్కాన్సిన్ రాష్ట్ర పోలీసు సంఘం ఆందోళనకారులతో జత కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అమెరికాలో భద్రత కోసం అనేక రక్షణ డిపార్ట్ మెంట్లు పని చేస్తుంటాయి. వారిలో ఒక సంఘం ఆందోళనల్లో పాల్గొంటున్నది.

నోమ్ ఛోంస్కీ

విస్కాన్సిన్ లోని యూనియన్లు డెమొక్రటిక్ పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ జాతీయ స్ధాయిలో యూనియన్ లీడర్లు విస్కాన్సిన్ లో జరుగుతున్న ఆందోళనకు మద్దతు ఇవ్వక పోవడం పట్ల ఆందోళనకారులు చాలా అసంతృప్తితో ఉన్నారు. కనీసం ప్రస్తావించడానికి కూడా ఇష్టపడటం లేదని వారు ధ్వజమెత్తుతున్నారు. విస్కాన్సిన్ ఆందోళనలపై ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకుడు, భాషావేత్త, అమెరికాలోని ప్రతిష్టాత్మక “మసాచుఛెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ” లో ప్రొఫెసర్, అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకి అయిన “నోమ్ ఛోంస్కీ” డెమొక్రసీ నౌ టీవీ చానల్ తో మాట్లాడుతూ పబ్లిక్ రంగ ఉద్యోగులపై ప్రభుత్వాల దాడులు 1970లనుండే మొదలైన విషయాన్ని గుర్తు చేశాడు. రీగన్ కాలానికి తీవ్రమైన ఆ దాడి క్లింటన్ కాలంలో మరింత ఊపందుకుందని తెలిపాడు. క్లింటన్ కాలంలో కుదుర్చుకున్న నాఫ్తా (ఉత్తర అమెరికా స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందం) వలన కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేసినప్పుడల్లా ఆ ఉద్యోగాలను మెక్సికోకు బదలాయించడం ప్రారంభించారనీ దానితో ప్రైవేటు రంగంలో యూనియన్లు తగ్గిపోయాయని చెప్పాడు. ప్రస్తుతం ప్రవేటు రంగంలో కేవలం 7 శాతం మాత్రమే యూనియన్ల కింద సంఘటితమై ఉన్నారనీ తెలిపాడు.  జాతీయ స్ధాయిలో డెమొక్రటిక్ పార్టీ నాయకులు మాట్లాడక పోవడానికి వారుకూడా యూనియన్ల ఆధిపత్యం అంతం కావాలని కోరుతుండడమే కారణమన్నాడు.

కొత్త సంవత్సరం ప్రారంభమయ్యాక కార్మికులు, ఉద్యోగుల యూనియన్లపై రీగన్ కాలం నాటి ప్రచారం తర్వాత మరోసారి పెద్ద ఎత్తున వ్యతిరేక ప్ప్రచారం మొదలయ్యిందని ‘నోమ్ ఛోంస్కీ’ చెప్పాడు. కుంభకోణానికి కారణమైన వాల్ స్ట్రీట్ కంపెనీలు గోల్డ్ మెన్ సాఛ్, సిటీ గ్రూప్, జె.పి మోర్గాన్ ఛేజ్ లాంటి కంపెనీలు, ప్రభుత్వంలో వారికి మితృలుగా ఉన్న ఫెడరల్ రిజర్వ్ లాంటి సంస్ధలను వదిలేశారన్నారు. అవి పాల్పడిన ఆర్ధిక నేరాలనుండి దృష్టి మరలుస్తూ కార్మికులు, ఉపాధ్యాయులు, సఫాయి కార్మికులు, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, వీరందరి పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణా సదుపాయాలు, వారి యూనియన్లు మొదలైన వారిపైన దాడులు ఎక్కుపెట్టి ఆర్ధిక సంక్షోభానికి వారే అసలు విలన్లుగా చూపడానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని విశదీకరించారు. దానిలో భాగంగానే యూనియన్ల ఉమ్మడి బేరసారాల హక్కుల రద్దుకు నడుం కట్టారన్నారు. దీనికి రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు రెండూ మద్దతుదారులేనన్నారు. ఓ పక్క ఉద్యోగుల జీత భత్యాల్లో కోతలు విధిస్తూ మరో పక్క మేనేజర్లు, అధికారుల జీతాలు అనేక రెట్లు పెంచుతున్నారని చెప్పారు. గోల్డ్ మెన్ సాఛ్ కంపెనీ సి.ఇ.ఓ జీతాన్ని మూడు రెట్లు కంటే ఎక్కువ పెంచి గత సంవత్సరానికి 12.5 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు చెప్పారు. ధనికులకు పన్నును తగ్గించి ఉద్యోగుల పన్నును స్తంభించామని చెప్పారనీ, వాస్తవానికి ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, జనాభా పెరుగుదల నేపధ్యంలో చూస్తే పన్నుల స్తంభన అనేది పన్నుల పెంపుదలతో సమానమని చెప్పారు.

ప్రజాస్వామ్య ప్రయోగశాల

కార్మిక, ఉద్యోగ సంఘాలపై దాడులు ప్రారంభించడానికి, వారి ఉమ్మడి బేరసారాల హక్కుల రద్దుకు విస్కాన్సిన్ రాష్ట్రాన్నే మొదటగా ఎంచుకోవడం వెనక బలీయమైన కారణం ఉంది. 1901-09 కాలంలో అమెరికా అధ్యక్షుడుగా రిపబ్లికన్ పార్టీకి చెందిన “టెడ్డీ-రూజ్ వెల్ట్” పనిచేశాడు. అప్పట్లో అమెరికన్ల అభిమానాన్ని సంపాదించిన ఈయన విస్కాన్సిన్ రాష్ట్రాన్ని “ప్రజాస్వామ్య ప్రయోగశాల” గా అభివర్ణించాడు. (రిపబ్లికన్ పార్టీని అభ్యుదయ భావాలవైపుకు నడిపించడానికి ఈయన ప్రయత్నించాడు. వ్యాపారులు, కంపెనీలకు అత్యంత దగ్గరగా ఉండే రిపబ్లికన్ పార్టీలో ఉంటూ కూడా వ్యాపార సంస్ధలపైన నియంత్రణను పెంచడానికి ప్రయత్నించాడు. రష్యా జపాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించిన ఘనత ఈయనదే అనికూడా చెబుతారు. అందుకుగాను “నోబెల్ శాంతి బహుమతి” టెడ్డీకి దక్కింది. ఒక అమెరికన్ కు నోబెల్ బహుమతి దక్కడం చరిత్రలో అదే మొదటిసారి. పనామా కాలువ పైన ఆధిపత్యానికి నౌకా సేనను పంపిన ఘనత కూడా ఈయనదే. ఈ అన్ని కారణాల రీత్యా ఈయన పట్ల అమెరికన్లకు గౌరవ భావాలున్నాయి.)

విస్కాన్సిన్ రాష్ట్రంలో దాదాపు అన్నిరంగాల కార్మికులు, ఉద్యోగులు సంఘాల క్రింద సమీకృతమై ఉన్నారు. అమెరికాలో మరే రాష్ట్రంలోనూ ఇంత స్ధాయిలో సంఘాల కింద కార్మికులు సమీకృతులై లేరు. ప్రైవేటు రంగంలో సైతం కార్మికులు సంఘాల ఆధ్వర్యంలో అనేక హక్కులు సాధించుకున్న చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన యూనియన్ ఎ.ఎఫ్.ఎస్.సి.ఎం.ఇ 1930 స్ధాపించినది. ఇక్కడి టీచర్ల యూనియన్ డబ్ల్యు.ఇ.ఎ.సి దేశంలోనే అత్యంత శక్తివంతమైనది. ప్రధాన స్రవంతిలో ఉన్న భావాజాలాలను దేశంలోని ఇతర రష్ట్రాలు ఇక్కడినుండే పొందుతాయన్న పేరున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్పులకు మలుపులకు వేగంగా స్పందిస్తాయన్న పేరుంది. ఓహియో, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల గవర్నర్లు కార్మికుల ఉమ్మది బేరసారాల హక్కులను రద్ధు చేసింది విస్కాన్సిన్ రాష్ట్రాన్ని చూసిన తర్వాతే. ఇండియానా రాష్ట్రం గవర్నరు డేన్సియల్ ను విస్కాన్సిన్ గవర్నరు ప్రవేశపెట్టిన బిల్లును తేవాలని “ఫియట్” కార్ల సంస్ధ ఒత్తిడి చేస్తున్నది. గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఇక్కడి యూనియన్లు గట్టి సవాలుగా నిలిచాయి. అంతే కాకుండా ప్రఛ్చన్నయుద్ధ కాలంలో సంక్షేమ పధకాల వెల్లువ ఈ రాష్ట్రంనుండే మొదలయ్యింది. సంక్షేమ పధకాల అమలుకోసం ఇక్కడి యూనియన్లు తీవ్రంగా పోరాడాయి. విస్కాన్సిన్ రాష్ట్రంలో సంక్షేమ పధకాలు ప్ర్రారంభమైనాక అవి అమెరికాలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అమలు చేశాయి. సోషలిజం ప్రభావంనుండి తప్పించుకోవడానికి సంక్షేమ రాజ్య సిద్ధాంతం పుట్టుకను అనివార్యం చేసిన కార్మిక ఉద్యమాలకు విస్కాన్సిన్ రాష్ట్రం పురిటిగడ్డగా ఉన్న సంగతి రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతవేత్తలు మరిచిపోలేదు.

స్కాట్ వాకర్, విస్కాన్సిన్లో సఫలం ఐతే తమ రాష్ట్రాల్లో కార్మిక వర్గంపై దాడులను వేగవంతం చేయడానికి ఇతర రాష్ట్రాల గవర్నర్లు పార్టీలకు అతీతంగా కాచుకుని ఉన్నారు. ఇక్కడ గనక కార్మిక యూనియన్ల హక్కులపై దాడి విజయంతం చేయగలిగితే ఇక బడా కంపెనీలకు అమెరికాలో తిరుగుండదు. ఇక్కడ ఎదురయ్యే ప్రతిఘటన కార్మికులనుండి ఇతర రాష్ట్రాల్లో ఉండదు. కార్మిక రంగంపై ఇక్కడ బలమైన దెబ్బ పడినట్లయితే మిగతా రాష్ట్రాల్లో కంపెనీలకు నల్లేరు బండి నడకే అవుతుంది. అందుకే కార్మిక యూనియన్ అనే భావాజాలం పైన దాడి చేసి కార్మికుల్లో యూనియన్ల ప్రభావాన్ని అంతం చేయడానికి బడా సంస్ధలు విస్కాన్సిన్ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. టెడ్డీ కాలంలో ప్రజాస్వామ్య ప్రయోగశాలగా ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రాన్ని ఇప్పుడు కార్మిక రంగ అణచివేతకు ప్రయోగశాలగా మార్చడానికి రిపబ్లికన్ పార్టీ కంకణం కట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా విస్కాన్సిన్ రాష్ట్రంలోని కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నప్పటికీ అది అక్కడి యూనియన్లలో తమ పార్టీకి ఉన్న పట్టును నిలుపుకోవడానికే. నిజానికి విస్కాన్సిన్ రాష్ట్రంలో యూనియన్ల ఓటమికి వైట్ హౌస్ సిద్ధాంతవేత్తలు ఆతృతగా ఎదురుచూస్తున్నారనడంలో ఎట్టి సందేహమూ లేదు.

బైఠాయింపులో ఉన్న ఆందోళనకారులకు ఆహారం కోసం దేశవ్యాపితంగా విరాళాలు అందుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మలావి, హైతి, ఈజిప్టు దేశాలనుండి కూడా ఆందోళనకారులకు విరాళాలు అందాయి. ఇక్కడి ఆందోళనకారులు తమకు ఈజిఫ్టు ఆందోళనలే స్ఫూర్తినిచ్చినట్లు నిర్ద్వంద్వంగా అంగీకరిస్తున్నారు. ఈజిప్టు ఆందోళనలకు తప్పని పరిస్ధితుల్లో మద్దతు పలికిన అమెరికా ప్రభుత్వానికి ఈ విషయం గొంతులో పచ్చి వెలక్కాయ లాంటిదే.  బిల్డింగ్ లోపల చిన్న సైజు పట్టణం నడుపుతున్నట్లు బైఠాయింపులో పాల్గొంటున్నవారు చెపుతున్నారు. పుస్తకాల స్టాల్, మెడికల్ సెంటర్ లాంటివి బిల్డింగ్ లోపల ఆందోళనకారులు ఏర్పాటు చేసుకున్నారు. బైఠాయింపులో పాల్గొంటున్నవారు వివిధ యూనియన్ల కింద ఉన్నప్పటికీ కేపిటల్ బిల్డింగ్ లో ఉన్న వారంతా యూనియన్ విభేదాలన్ని పక్కన బెట్టి ఏకీకృత కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

అమెరికా, ఐరోపాలలో మితవాదుల పైచేయి

అమెరికాలో ప్రతి రెండు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. దేశ అధ్యక్ష పదవికి,  ఎన్నికలు జరిగిన రెండు సంవత్సరాల తర్వాత దేశ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్), సెనేట్ (ఎగువ సభ)లకూ రాష్ట్రాల గవర్నర్ పదవులకూ ఎన్నికలు జరుగుతాయి. 2009 నుండి అధ్యక్షుడిగా దేశాన్ని పాలించడానికి 2008 నవంబరులో అధ్యక్షు ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి బారక్ ఒబామా అధ్యక్షుడుగా ఎన్నిక కావడం తెలిసిందే. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు అంటే 2011 నుండీ ప్రారంభమయ్యే నాలుగు సంవత్సరాల కాలానికి 2010 నవంబరులో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దేశ ప్రతినిధుల సభ రిపబ్లికన్ పార్టీ చేతిలోకి వచ్చింది. సెనేట్ ను మాత్రం డెమొక్రటిక్ పార్టీ బొటాబొటీ మెజారిటీ తో నిలబెట్టుకుంది. మెజారీటీ రాష్ట్రాలలో కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధులే గవర్నర్లుగా ఎన్నికయ్యారు.

రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలు సాంప్రదాయకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయి. డెమొక్రటిక్ పార్టీ కూడా ప్రధానంగా పెట్టుబడిదారులకే అనుకూలమయినప్పటికీ కార్మిక హక్కులు, యూనియన్లు, సంక్షేమ పధకాలు తదితర పదజాలంతో తాము కార్మిక వర్గానికి అనుకూలం అన్నట్లుగా నటిస్తూ ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ నగ్నంగా పెట్టుబడిదారీ అనుకూల సిద్ధంతాలను ప్రవచిస్తే, డెమొక్రటిక్ పార్టీ సంక్షేమ పధకాల మాటున పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక సంక్షోభం తర్వాత పెట్టుబడి దారుల వర్గం కార్మిక వర్గ అనుకూలతను నటనగా కూడా అంగీకరించలేక పోతున్నారు. కార్మిక, ఉద్యోగ వర్గంపై ప్రత్యక్షదాడిని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కమ్యూనిస్టు ప్రమాదం పొంచి ఉన్నందున రిపబ్లికన్ పార్టీ కూడా సంక్షేమ పధకాలకు మద్దతు పలకక తప్పలేదు. ఇప్పుడు అలాంటి భయం ఏమీ లేక పోవడంతో అమెరికా పెట్టుబడిదారి వర్గానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

ఆర్ధిక మాంద్యానికి విరుగుడుగా అమెరికా రాష్ట్రాల చట్ట సభలకు ఎన్నికయిన వారి దగ్గరర్నుండి మితవాద ఆర్ధిక పండితులవరకు ప్రభుత్వరంగ ఉద్యోగుల జీత భత్యాల కోత, సదుపాయాల రద్ధు లతో పాటు అసలు యూనియన్ హక్కులను కూడా రద్ధు చేయాలని సిఫారసు చేస్తున్నారు. యూనియన్ ల ఉనికినే తీవ్రంగా ద్వేషిస్తున్నారు. రెండు వారాల క్రితం వెల్లడయిన గణాంకాల ప్రకారం అమెరికా దేశవ్యాపితంగా రాష్ట్రాల రెవిన్యూ వసూళ్ళు 2009 సంవత్సరంలో  31 శాతం తగ్గిపోయాయి. ఇది దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్లకు సమానం. ఈ తగ్గుదలకు కారణం ఆర్ధిక సంక్షోభం వలన అనేక కంపెనీలు మూతబడడం, అనేక పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను అత్యధికభాగాన్ని ఇంటికి పంపించడం. వ్యాపారాలు మూలన బడటం, ఉత్పత్తి కార్యకలాపాల్లో పెట్టుబడులు పడిపోయి ప్రతి డాలరును షేర్ మార్కెట్ లాంటి ద్రవ్య కార్యకలాపాల్లొ పెట్టు బడులు పెట్టడం, ఉన్న ఉద్యోగాలు ఊడడమే కాక కొత్త ఉద్యోగాలు పుట్టకపోవటం ఇవన్నీ కారణాలే. మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలో దైవంగా భావించే ప్రైవేటు కంపెనీలు దివాలా తీస్తే మార్కెట్ ఆర్ధిక పండితులు ద్వేషించే ప్రభుత్వ జోక్యంతోనే బైట పడిన విషయాన్ని ఇంతలోనే మర్చిపోయిన ఈ వంచనా శిల్పులు తిరిగి ప్రభుత్వరంగ ఉద్యోగుల పైనే దాడికి తెగబడి వారి సర్వహక్కులను హరించివేయటానికి పధకాలు రచించి వాటి అమలుకు పూనుకున్నారు.

2012 సంవత్సరానికి అమెరికాలోని 40 రాష్ట్రాలు 113 బిలియన్ డాలర్ల బడ్జెట్ లోటు ఎదుర్కొంటాయని అమెరికాకి చెందిన ఒక అధ్యయన సంస్ధ “స్టేట్ ఫిస్కల్ ప్రాజెక్టు” తేల్చి చెప్పింది. 46 రాష్ట్రాలు 130 బిలియన్ల డాలర్ల బడ్జెట్ లోటును పూడ్చుకోవటానికి పన్నులు విపరీతంగా పెంచి బడ్జెట్ ఖర్చులొ పెద్ద ఎత్తున కోత విధించుకున్నాయి. బడ్జెట్ ఖర్చు కోత అంటే ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగులు, వృద్ధులు, మహిళలు మొదలైన వారి సంక్షేమం కోసం పెట్టే ఖర్చులో కోత విధించడమే. బడ్జెట్ లోటు పేరుతో విధించిన కోతల వలన పబ్లికరంగ ఉద్యోగుల పెన్షన్ చెల్లింపుల్లో సగభాగం హరించుకు పోతుందని అక్కడి యూనియన్లు తెలుపుతున్నాయి. ఈ విధానాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికయిన వారికి ఎన్నికల ప్రచారం నిమిత్తం బిలియన్ల కొద్దీ డబ్బును చందాలుగా ఖర్చు పెట్టిన కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్ధలు చేస్తున్న డిమాండ్లే ఉత్సాహ ప్రోత్సాహాలిస్తున్న విషయం అమెరికాలో బహిరంగ రహస్యమే.

విస్కాన్సిన్ రాష్ట్రమే తీసుకుంటే డేవిడ్ కాఛ్ అనే బిలియనీరు గవర్నరు వాకర్ కీ, రిపబ్లికన్ పార్టీకీ అతి పెద్ద చందాదారు. 1980లలో ఈయన రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసిన చరిత్ర కూడా ఉంది. ఈ బిలియనీర్ కుటుంబం పక్కా కార్మిక వ్యతిరేకి, యూనియన్ వ్యతిరేకి. డేవిడ్ కాఛ్ తండ్రి అమెరికాలో 1950ల నాటి “జాన్ బిర్ఖ్ సొసైటీ” వ్యవస్ధాపకుడు. ఇది కార్మికులకు యూనియన్లు ఉండటాన్ని వ్యతిరేకించింది. పౌరహక్కుల చట్టాలను కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. కార్మికులకు, ఉద్యోగులకు సామాజిక భద్రతా సదుపాయాలు (పెన్షన్, నిరుద్యోగ భృతి, ప్రసూతి సెలవు మొదలైనవి) ఉండడాన్ని తిట్టిపోసింది. కార్పొరేట్ కంపెనీలు పన్నులు చెల్లించడానికి డేవిడ్ కాఛ్ గట్టిగా వ్యతిరేకిస్తాడు. ఇతని కంపెనీలు రెండేళ్ళ క్రితం అసలు ఆదాయపు పన్ను చెల్లించలేదని కొన్ని పత్రికలు వెల్లడించాయి. అయినప్పటికీ ఆ కంపెనీల మీద విచారణలాంటివేవీ జరగలేదు. కాఛ్ కంపెనీలు పన్నులు చెల్లిస్తాయా లేదా అన్నది ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. అటువంటి పచ్చి మితవాది, ప్రజా వ్యతిరేకికి ప్రతినిధిగా ఎన్నికయ్యడు గనకనే ప్రజలంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ, గవర్నరు వాకర్ కార్మికుల హక్కుని హరించడానికి పట్టుబట్టాడు.

నిజానికి విస్కాన్సిన్ రాష్ట్రానికి ఈ సంవత్సరం కోశాగార లోటు ఉండదని రాష్ట్ర ప్రభుత్వ సంస్ధే తెలిపింది.. “ఫిస్కల్ బ్యూరో ఆఫ్ విస్కాన్సిన్” సంస్ధ ఈ సంవత్సరం విస్కాన్సిన్ రాష్ట్రానికి 123 మిలియన్ డాలర్ల మిగులు ఉంటుందని జనవరిలో తెలిపింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్న లోటు వాదనలో నిజం లేదు. రాష్ట గవర్నరు అసలు ఉద్దేశం యూనియన్లను బలహీన పరచడమేనని యూనియన్లు చేస్తున్న వాదన సరైందని దీని ద్వారా స్పష్టమవుతున్నది. ఫిబ్రవరి 24 న విస్కాన్సిన్ రాష్ట్ర అసెంబ్లీ “బడ్జెట్ రిపేర్ బిల్లు” (వాకర్ ప్రతిపాదించిన బిల్లు పేరు) ను ఆమోదించింది. అయితే ఇది రాష్ట్ర సెనేట్ (రాష్ట్ర ఎగువ సభ) ఆమోదం పొందవలసి ఉంది. 14 మంది సెనేటర్లు రాష్ట్రం విడిచిపెట్టి ఇల్లినాయిస్ రాష్ట్రంలో శిబిరం వేయడంతో సెనేట్ ఆమోదం మిగిలి ఉంది. ఉమ్మడి బేరసార హక్కు రద్దు, పెన్షన్, ఆరోగ్య బధ్రత కోసం ఉద్యోగుల వేతన కోతతో పాటు ఈ బిల్లులో వేలం లేకుండా కాంట్రాకుటుల అప్పగింత, మెడిక్ ఎయిడ్ (ఆరోగ్య సహాయం), మెడికేర్ (ట్రీట్ మెంటు ఖర్చు ప్రభుత్వం భరించడం), సీనియర్ కేర్ (వృద్దులకు సాయం) లను పూర్తిగా ఎత్తివేయడం లాంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయని ఆందోళనలు మొదలైన పదిరోజులకు తెలిసింది. ఆందోళనల కారణంగానే బిల్లుకు ప్రచారం లభించి బిల్లులో ఏమున్నదన్న ఆసక్తితో చాలా మంది చదవడంతో చాలా అంశాలు బైటికి వచ్చాయి.

న్యూయార్క్ రాష్ట్రానికి కొత్తగా ఎన్నికయిన గవర్నర్ ‘ఆండ్రూ కువోమో’ జనవరిలో పదవీ స్వీకారం చేస్తూ “రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యాపారస్ధులకు స్నేహ పూరితంగా మారుస్తాన”ని సగర్వంగా చాటుకున్నాడు. దానితో పాటు రాష్ట్రానికున్న పది బిలియన్ల డాలర్ల బడ్జెట్ లోటును అప్పు తేకుండా పూడుస్తానని ప్రతిజ్గ్న చేశాడు. దానర్ధం ప్రభుత్వ రంగ ఉద్యోగులమీద విరుచుకు పడతానని చెప్పడమే. ఓహియో రాష్ట్రానికి గవర్నరుగా ఎన్నికయిన జాన్ కాసిక్ “ప్రభుత్వ ఉద్యోగులు, వారు ఏ రంగానికి చెందినప్పటికీ, సమ్మె చేయటానికి నేను వ్యతిరేకం” అని ప్రకటించాడు. అంతటితో ఆగకుండా “ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ఉద్యోగం ఉంది. పెద్ద జీతాలున్నాయి. మంచి సదుపాయాలున్నాయి. గొప్ప రిటైర్మెంట్ ఉంది. ఇన్ని ఉండగా వాళ్ళు సమ్మెలు ఎందుకు చేయాలి?” అని ప్రశ్నించాడు. పిల్లలు, ఇళ్ళ సంక్షేమ విభాగాల్లోని ఉద్యోలకు అసలు యూనియన్ పెట్టుకునే హక్కు కూడా ఉండకూడదని ఆయన అభిప్రాయం వ్యక్త చేశాడు.

ఒక్క అమెరికాలోనే కాకుండా యూరప్ లో సైతం మితవాద పార్టీలు అధికారంలోకి వచ్చాయి. సంవత్సరం క్రితం జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో పచ్చి మితవాద పార్టీ కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వం లోని కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. జర్మనీ, ఫ్రాన్సు లతో పాటు ఇంకా అనేక యూరప్ దేశాల్లో మితవాద పార్టీలు అధికారం చేజిక్కించుకుని కార్మిక వర్గంపై దాడులకు తెగబడుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం ఫలితంగా ఉద్యోగాలు కరువై వలస వచ్చిన కార్మికులను తమ ఉద్యోగాలను హరించి వేస్తున్నవారిగా చూడటం మొదలయ్యింది. వీరి భావాలకు అనుగుణంగా మితవాద పార్టీల భావాలు కూడా సరిపోవడంతో అవే అధికారం చేజిక్కించుకోగలిగాయి. సోషలిస్టు పార్టీల పేరుతో అధికారం చేజిక్కుంచుకున్న గ్రీసు, పోర్చుగల్, స్పెయిన్ లాంటి చోట్ల కూడా ఆర్ధిక సంక్షోభం, ఆ తర్వాత వచ్చిన “యూరప్ సావరిన్ అప్పు సంక్షోభం” ల ఫలితంగా అవికూడా మితవాద విధానాలనే అనుసరిస్తూ కార్మికులు, ఉద్యోగుల పైన తీవ్ర దాడులకు పూనుకొని ప్రజల పాలిట శాపంగా మారాయి. ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయం కనుచూపుమేరలో కనిపించకుండా పోయింది. గతంలోలాగా ప్రజలకు అనుకూల విధానాలను అనుసరించే వారిగా నటించేవారు కూడా ఇప్పుడు కనబడడం లేదు.

ఈ పరిణామాలు కార్మిక వర్గ ఉద్యమాల పెరుగుదలకు ముడిసరుకులే అయినప్పటికీ మూడో ప్రపంచ దేశాల్లో లాగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్ణయాత్మకంగా అటువంటి బాట పట్టే వారు కనబడడం లేదు. ఉన్నా ప్రకటనల వరకే తప్ప ఆచరణ శూన్యం. ఆర్ధిక సంక్షోభం కారణంగా పొదుపు చర్యల మాటున ప్రభుత్వాలు  ఇటువంటి విధానాలు అవలంబించకా తప్పదు అని ప్రజలను ఒప్పించడంలో అక్కడి ప్రభుత్వాలు కొంతవరకు సఫలం కావడం ఆందోళనకు నిర్ణయాత్మకమైన మద్దతు దొరకడం కష్టంగా మారింది. ఆర్ధిక సంక్షోభం బూచి చూపి ప్రైవేటు ద్రవ్య సంస్ధలు, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఉద్దీపనా ప్యాకేజీల కింద ప్రభుత్వాలు ధారబోసినప్పటికీ కార్మిక వర్గం తగినంతగా చైతన్యం కాలేదు. పెట్టుబడిదారీ సంస్ధలకూ, ప్రజలకూ మధ్య ప్రభుత్వాలు చూపిస్తున్న దారుణమైన వివక్ష కంటి ఎదుట కనిపిస్తున్నప్పటికీ అటువంటి వ్యవస్ధపైన రగులుతున్న ఆగ్రహాన్ని ప్రత్యక్ష ఆచరణలోకి ఇంకా రావడం లేదు. అలా అని నిరసనలు పూర్తిగా లేవని కాదు. అటువంటి నిరసనలు వలసకార్మికుల మీదకూ, ముస్లిం టెర్రరిజం మీదకూ మళ్ళించడంలో పాలక వర్గాలు ప్రస్తుతానికి అవసరమైనంత మేరకు సఫలం అవుతున్నాయి. అయితే అమెరికా, యూరప్ లలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న మితవాద ఆర్ధిక విధానాలపై ప్రజల వ్యతిరేకత ఎంతో కాలం దాగక పోవచ్చు. అది త్వరలో బద్దలై అభివృద్ధి చెందిన దేశాలను కబళించక మానదు. అయితే కమ్యూనిస్టు పార్టీలు అందుకు తయారుగా లేక పోవటమే అత్యంత ఘోరమైన ప్రతికూలత.

ఈ నేపధ్యంలో అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో తలెత్తిన ప్రజాగ్రహం గొప్ప మలుపుగా పేర్కొనవచ్చు. రానున్న కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో తలెత్తనున్న తీవ్రమైన మార్పులకు ఇది ప్రారంభంగా చెప్పుకోవచు. ఈ పరిస్ధుతుల ద్వారానయినా విప్లవ శక్తులు అప్రమత్తమై అభివృద్ధి చెందగలిగితే ప్రపంచ మానవాళికి అత్యంత ఉత్తేజకరమైన పరిణామాలు జరుగుతాయని గ్యారంటీగా చెప్పుకోవచ్చు.

2 thoughts on “అమెరికాలో కార్మికుల హక్కులపై దాడికి వ్యతిరేకంగా ఈజిప్టు తరహా ఉద్యమం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s