గ్రీసు రేటింగ్ ను తగ్గించిన మూడీస్, కొనసాగుతున్న యూరప్ అప్పు సంక్షోభం


Greece agitation

పొదుపు చర్యలపై గ్రీకు ప్రజల ఆందోళన

మూడీస్ రేటింగ్ సంస్ధ గ్రీకు సావరిన్ అప్పు రేటింగ్ ను మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ Ba1 రేటింగ్ ఉండగా దానిని B1కు తగ్గించింది. ట్రెజరీ బాండ్లు జారీ చేయడం ద్వారా దేశాల ప్రభుత్వాలు చేసే అప్పును సావరిన్ అప్పు అంటారు. సావరిన్ బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. బాండ్లు జారీచేసే దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై బాండ్ల కొనుగోలుదారులకు (మదుపుదారులు) ఉన్న నమ్మకాన్ని బట్టి బాండ్లపై ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ రేటు నిర్ణయమవుతుంది. ప్రభుత్వాలు బాండ్ల విలువ మొత్తాన్ని అవి పక్వానికి వచ్చినపుడు చెల్లించగలవా లేదా అన్న నమ్మకాన్ని బట్టి మదుపుదారులు వడ్డీ రేటును డిమాండ్ చేస్తారు. ఎక్కువ నమ్మకం ఉంటే వేలంలో తక్కువ వడ్డీ నిర్ణయమవుతుంది. ఆర్ధిక వ్యవస్ధ బలహీనంగా ఉండి నమ్మకం తగ్గినట్లయితే వేలంలో మదుపుదారులు ఎక్కువ వడ్డీని డిమాండ్ చేస్తారు.

రేటింగ్ సంస్ధలు ఇచ్చే రేటింగ్ ను బట్టి ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్ధలను మదుపుదారులు అంచనా వేస్తారు. పూర్తిగా రేటింగ్ సంస్ధల రేటింగ్ పైనే ఆధారపడక పోయినా ఒక కొలమానంగా రేటింగ్ ను చూస్తారు. 2008 ఆర్ధిక సంక్షోభంలో రేటింగ్ సంస్ధల పాత్ర చాలా ఉంది. ఆర్ధిక సంక్షోభానికి ముందు ఈ రేటింగ్ సంస్ధలు ఇచ్చిన రేటింగ్ లు పూర్తిగా విఫలమయ్యాయి. వీరు అత్యున్నత రేటు ఇచ్చిన సెక్యూరిటీలు మార్కెట్ లో బోల్తా పడి సంక్షోభానికి తక్షణ కారణంగా పని చేశాయి. వీటిపై నియంత్రణ ఉంచాలని, అదుపులో ఉంచాలని జి-20 గ్రూపు దేశాలు నిర్ణయించుకున్నాయి కూడా. ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. జి-20 దేశాల సమావేశాలు మాత్రం వరసగా జరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపధ్యంలోనే గ్రీసు దేశ సావరిన్ అప్పుకు మూడీస్ రేటింగ్ సంస్ధ రేటింగ్ తగ్గించడం పట్ల గ్రీసు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేటింగ్ సంస్ధలపై గట్టి నియంత్రణ అమలు చేయాలని కోరింది. రేటింగ్ సంస్ధలు గ్రీసు అప్పు రేటింగ్ ను సంవత్సరం నుండీ తగ్గిస్తూ వచ్చాయి. దీని వలన గ్రీసు జారీ చేసిన బాండ్లపై అత్యధిక వడ్డీని చెల్లించవలసి వస్తున్నది. రేటింగ్ తగ్గించడానికి మూడీస్ క్రింది కారణాలను చూపింది.

  • పన్నుల ఎగవేత తీవ్రం కావడం
  • పొదుపు చర్యలు గ్రీసు శక్తికి మించినవి.
  • 2013 తర్వాత యూరోపియన్ యూనియన్ (ఇ.యు) గ్రీసు అప్పును పునర్మూల్యాంకనం చేయాలని ఒత్తిడి చేయవచ్చు.

గత మే నెలలో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు కలసి గ్రీసుకు 110 బిలియన్ యూరోలు (154 బిలియన్ డాలర్లు) అప్పు సాయం చేశాయి. దానికి ప్రతిగా దారుణమైన షరతులను గ్రీసుపై రుద్దాయి. ఆ షరతుల కారణంగా పొదుపు పేరిట గ్రీసు బడ్జెట్ బాగా తగ్గిపోయింది. ఉద్యోగులను ఇళ్ళకు పంపారు. జీతాలు తగ్గించేశారు. పెరగకుండా స్తంభింప జేశారు. సదుపాయాలు కత్తిరించారు. దాంతో నిరుద్యోగం ప్రబలింది. అన్ని రంగాల ప్రజలు సమ్మెలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

అప్పటికే ఉన్న అప్పును తీర్చలేదన్న కారణంతో తక్కువ రేటు ఇవ్వడంతో గ్రీసుకు అప్పు పుట్టలేదు. దానితో షరతులతో కూడిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల అప్పు తీసుకోక తప్పలేదు. షరతులు అమలు చేయడంతో ఉద్యోగులు తగ్గిపోయారు. కొనుగోలు శక్తి పడిపోయింది. దానితో వ్యాపారాలు పడిపోయాయి. దాంతో అటు ఉద్యోగులు, ఇటు వ్యాపారుల్లో సహజంగానే పన్ను చెల్లింపుదారులు తగ్గిపోయారు. ఇక పై అంతస్ధులో ఉండే ధనికులు బ్లాక్ మనీ మీద పన్ను చెల్లించలేరు కాబట్టి, ఎలాగు పన్ను కట్టరు. ఇదంతా రేటింగ్ తగ్గించడంతో పాటు అప్పు షరతుల వలన ఏర్పడిన పరిణామం. ఆ విషయం గమనించకుండా పన్నుచెల్లింపుదారులు తగ్గిపోవడాన్ని పన్ను ఎగవేతగా చూసి రేటింగ్ ను ఇంకా తగ్గించడం మదుపుదారులకు లాభం చేకూర్చడం తప్ప కష్టాల్లో ఉన్న గ్రీసు ప్రజలను అగ్నిగుండాల్లోకి నెట్టడం తప్ప మరొకటి కాదు.

పైగా పన్ను వసూలు చేసే కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందనీ దానితో పన్నులు ఎగవేస్తున్నారనీ మూడీస్ ముక్తాయించింది. నువ్వు రేటింగ్ తగ్గించి పనికిమాలిన అప్పుతీసుకునే వైపుకు దేశాన్ని నెట్టి, తద్వారా ఉద్యోగాలు రద్దు కావడానికి దోహద పడితివి. ఇప్పుడు అలా తగ్గిన ఉద్యోగుల వలన పన్నులు వసూలు కావడం లేదని మళ్ళీ రేటింగ్ తగ్గించడం అత్యంత దారుణం తప్ప మరొకటి కాదు.

పొదుపు చర్యలు గ్రీసు శక్తికి మించిపోయాయన్నది రెండో కారణం. రేటింగ్ తగ్గడంతో అప్పు పుట్టని పరిస్ధితి దాపురించింది. దాంతో కఠినమైన అప్పుకు పోవలసి వచ్చింది. కఠినమైన పొదుపు చర్యలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే తప్ప ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అప్పు ఇవ్వబోమని తేల్చి చెప్పాయి. మళ్ళీ అంత కఠినమైన షరతులు గ్రీసు అమలు చేయడం కష్టం అని రేటింగ్ ఇంకా తగ్గిస్తే దేశం, దేశంలోని ప్రజలు కోలుకోగలరా అన్నది ప్రశ్న. దారుణ స్ధితికి చేరుకోవడానికి రాచమార్గాన్ని వేసి, ఆనక దారుణ స్ధితిలో ఉన్నందుకు ఇంకా రేటింగ్ తగ్గించడం పెనం నుండి పొయ్యిలోకి… పొయ్యినుండి ఇంకా పెద్ద పొయ్యిలోకి నెట్టడమే. ఆ తర్వాత ఇంకా ఇంకా పెద్ద పొయ్యిలోకి నెట్టడమే తప్ప బైటపడే మార్గం చూపేవారే లేరు.

2013 తర్వాత గ్రీసు తన అప్పును పునర్మూల్యాంకనం (రీ షెడ్యూల్ లాంటిది) చేయవచ్చన్నది మూడో కారణం. ఇది మరీ అన్యాయం. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసుకు చేసింది సాయం కాదా? కాదనే మూడీస్ సంస్ద తన రేటింగ్ తగ్గింపు ద్వారా తేల్చి చెప్పింది. 2013 నాటికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు హామీ ఇచ్చిన 110 బిలియన్ యూరోల అప్పు పూర్తిగా గ్రీసుకు ఇచ్చేస్తారు. వారి అప్పుతో గ్రీసు అప్పు రెండు కొండలంత అవుతుంది. అప్పటికే కొండలా ఉన్న అప్పును తీర్చలేదన్న కారణంతో, సాయం పేరుతొ ఇచ్చిన అప్పు చేరి  మరో కొండంత అప్పును గ్రీసు సమకూర్చుకుంటుందన్నమాట. రెండు కొండలంత అప్పు నువ్వు తీర్చలేవుగనక మొత్తం అప్పును పునర్మూల్యాంకనం చెయ్యి అని గ్రీసును ఇ.యు వత్తిడి చేస్తుందని మూడీస్ ఇప్పుడే చెబుతోంది. పునర్ముల్యాంకనం అంటే అప్పు చెల్లించే కాలాన్ని మరింత పొడిగించడం, అవసరమైతే కొంతమందికి అప్పులో కొంత భాగాన్ని గానీ లేదా వడ్డీని గానీ ఎగ్గొట్టాలని నిర్ణయించుకోవడం.

అప్పు చెల్లించే కాలాన్ని పొడిగించినా, కొంత ఎగ్గొట్టాలని నిర్ణయించినా ఇక ఆ దేశానికి ప్రపంచ అప్పు మార్కెట్ లో అత్యంత చెడ్డ పేరు వస్తుంది. అప్పు ఇచ్చేవాడే ఉండడు. రోజువారి ఖర్చులు వెళ్లక చంద్రశేఖర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టినప్పటి పరిస్ధితి దాపురిస్తుంది. గ్రీసు మొఖం ఎవడూ చూడడు. ఇక అక్కడ పిండుకొనేది ఏమీ లేదని అర్ధం అయ్యాక అందరూ మొఖం చాటేస్తారు. ఇ.యు దేశాలు కూడా కరుణించవు. ఆ విధంగా గ్రీసు పరిస్ధితి మరింత దిగజారుతుందన్నమాట. 2013తో ఈ దేశాల పరిస్ధితి మరింత దిగజారుతుందని తెలుసు కనుకనే ఇ.యు గత సంవత్సరమే 750 బిలియన్ల యూరోలను (1000 బిలియన్ డాలర్లు లేదా ఒక ట్రిలియన్ డాలర్లు) ఇ.యు నిధిగా సమకూరుస్తామనీ, దానిని అవసరాన్ని బట్టి ఇ.యు దేశాలన్నింటికీ అందుబాటులో ఉంచుతామనీ ఇ.యు దేశాలు ప్రకటించాయి.

అప్పుడు గ్రీసు దేశ ఆర్ధిక వ్యవస్ధను జర్మనీ, ఫ్రాన్సు లాంటి దేశాలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకొంటాయి. ఇదంతా ముందస్తుగా పధకం వేయాల్సిన అవసరం లేదు. పధకం వేసినట్లు అనిపిస్తుంది గానీ అది నిజం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఆర్ధిక నిర్మాణం, దాని ప్రాధామ్యాలు ప్రభుత్వాల నడకను ఆ దిశగా నిర్దేశిస్తాయి. ఇటువంటి పనికిమాలిన వ్యవస్ధను ఒక సిద్ధాంత చట్రంలో ఇరికించడం అంటే అటువంటి సిద్ధాంతం కూడా అంత పనికిమాలినదన్నమాటే.

పునర్మూల్యాంకనం (డెట్ రీస్ట్రక్చరింగ్) ఎలా ఉండబోతున్నదీ జర్మనీ ఛాన్సలర్ గత సంవత్సరమే శాంపిల్ గా చెప్పి మార్కెట్ లోని మదుపుదారులను ఇప్పటికే బెదరగొట్టింది. జర్మనీ, ఫ్రాన్సులు (ఇవి యూరోను ఉమ్మడి కరెన్సీగా అంగీకరించిన 17 దేశాల్లో పైన ఉండేవి. ఒక రకంగా యూరో జోన్ కి నాయక దేశాలు. బ్రిటన్ యూరోను కరెన్సీగా అంగీకరించలేదని గమనించాలి. అందువలన బ్రిటన్ యూరోజోన్ కిందికి రాదు) గత సంవత్సరం నవంబరు నెలాఖరులో స్ధూలంగా ఒక ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారం 2013 తర్వాత యూరోజోన్ దేశాలు బాండ్ మార్కెట్ ద్వారా సేకరించే అప్పును పునర్మూల్యాంకనం చేయవలసి వస్తే అందులో బాండ్ల కొనుగోలుదార్లు కూడా కొంత భారాన్ని భరించాల్సి ఉంటుంది. అంటే అప్పు ఇచ్చే వాడికి ఆ అప్పులో కొంత భాగాన్ని చెల్లించలేక పోవచ్చు అని ముందే చెపడమన్నమాట.

ఈ ఒప్పందాన్ని ప్రకటించిన వెంటనే అప్పు సంక్షోభంలో ఉన్న గ్రీసు, పోర్చుగల్, ఐర్లండ్, స్పెయిన్, ఇటలీ దేశాల బాండ్లపై వడ్డీ అమాంతం పెరిగిపోయింది. వేలంలో అమ్ముడుబోయిన బాండ్లకు ఆయా ప్రభుత్వాలు కొత్తగా పెరిగిన వడ్డీని చెల్లించనవసరం లేదు. కానీ బాండ్లను వేలంలో కొన్నవారిలో కొంతమంది సెకండరీ మార్కెట్ లో అమ్మకానికి పెడతారు. అలాంటి అమ్మకాలపై ఎక్కువ వడ్డీని చెల్లించవలసి వస్తుంది. అయితే ఇలా సెకండరీ మార్కెట్లో వడ్డీ పెరిగితే ఆ బాండు జారీ చేసిన దేశం ఆ తర్వాత మళ్ళీ అప్పు చేయటానికి బాండ్లు జారీ చేయాల్సి వస్తే వాటిపై తాజాగా పెరిగిన వడ్డీ రేట్లను చెల్లించాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రైమరీ మార్కెట్లో కూడా బాండ్ల వేలం కష్టంగా మారి అప్పు దొరకడం కష్టం అవుతుంది. జర్మనీ, ఫ్రాన్సులు నవంబరులో తమ ఒప్పందాన్ని వెల్లడి చేశాక స్పెయిన్, ఐర్లండ్, పోర్చుగల్ లాంటి దేశాల సావరిన్ బాండ్ల రేటు అమాంతం పెరిగిపోయింది. అప్పుడా దేశాలు జర్మనీ ఛాన్సలర్ ను తిట్టి పోశాయి. చాన్సలర్ ఏంజెలా ఆ తిట్లను దులుపుకు పోయిందన్నది వేరే విషయం.

అంతటితో జర్మనీ, ఫ్రాన్సుల అఘాయిత్యాలు ఆగలేదు. మొన్న ఫిబ్రవరి మొదటి వారంలో యూరో జోన్ దేశాలు చేసే అప్పుపై పరిమితి విధించుకోవాలనీ, అటువంటి పరిమితులను తమ తమ రాజ్యాంగంలోనే రాసుకోవాలని ఆ రెండు దేశాలూ ప్రతిపాదించాయి. యధావిధిగానే అప్పు సంక్షోభంలో ఉన్న దేశాలు నిరాకరించాయి. యూరో జోన్ దేశాలు మొదట జర్మనీ, ఫ్రాన్సుల ప్రతిపాదనలు తిరస్కరించడం, ఆ తర్వాత మెల్లగా ఒప్పుకోవడం ఒక రివాజుగా మారింది. ఇప్పుడు కూడా జర్మనీ, ఫ్రాన్సులు ఆ ధైర్యంతొనే ఉన్నాయి. రెండు మూడు దేశాలు అందుకు ఒప్పుకున్నాయి కూడా. బెల్జియం దేశం మొదట నిరాకరించి ఇప్పుడు అంగీకరించింది. ఈ ప్రతిపాదన ద్వారా జరిగే మరో పరిణామం ఏంటంటే… యూరో దేశాల్లో చాలా వరకూ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఆ దామాషాలో ఉద్యోగుల కరువు భత్యం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. తాజా ప్రతిపాదన వలన అలా పెరగడం జరగదు. యూనియన్లు సమ్మెలూ అవీ చేసి ద్రవ్యోల్బణం పెరిగింది కనక కరువుభత్యం (డి.ఏ) పెంచమని డిమాండ్ పెడితే ప్రభుత్వాలు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోక పోవచ్చు.

పైన గ్రీసు గురించి చెప్పుకున్న పరిస్ధితి గ్రీసుకే పరిమితి కాదు. గ్రీసు లాగానే ఐర్లండు, పోర్చుగల్ దేశాలు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల నుండి సాయం పేరుతో అప్పు తీసుకున్నాయి. వాటి పరిస్ధితి కూడా గ్రీసులానే మారుతుంది. ఇప్పుడు సాయం తీసుకోక పోయినా 2013 తర్వాత అప్పు పునర్మూల్యాంకనం చేసుకునే దేశాలదీ దగ్గర దగ్గర అదే పరిస్ధితిలో ఉంటాయి. అంతిమంగా యూరో జోన్ లో బలహీన ఆర్ధిక వ్యవస్ధలుగా మార్చబడిన దేశాలు జర్మనీ, ఫ్రాన్సుల ఆర్ధిక వ్యవస్ధలకు పక్కా అనుబంధ ఆర్ధిక వ్యవస్ధలుగా మారిపోతాయి. ఇప్పుడున్న స్వతంత్రత పరోక్షంగా కనుమరుగై పోతుంది. అయితే ఆ లోగా ప్రజలు గట్టి వ్యతిరేకత వ్యక్తం చేస్తే, లేదా ఎన్నికల వల్లనో అటువంటి పరిస్ధితి మరికొంత కాలం వాయిదా పడవచ్చు. లేదా విప్లవం లాంటి సంఘటనలే ప్రజల విముక్తికి మార్గంగా ప్రజల ముందుకు వస్తాయి. ఈ లోగా ఆ దేశాల లోని ప్రగతిశీల శక్తులు అప్రమత్తంగా ఉండి ప్రజల మద్దతును సంపాదించగలిగితే విప్లవాల ఆగమనాన్ని త్వరితం చేయవచ్చు. అటువంటి స్వీయాత్మక పరిస్ధితులను వేగవంతం చేసే బాధ్యత విప్లవ శక్తుల పైనే ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s