లిబియా అంతర్యుద్ధం – లిబియా ఆయిల్ కోసం అమెరికా, ఐరోపా కుతంత్రాలు


ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరిగిన ప్రజా ఉద్యమాలు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో  లిబియా ప్రజలు 41 సంవత్సరాల నుండి ఏలుతున్న గడ్డాఫీని వదిలించుకోవడానికి నడుం బిగించారు. ఫిబ్రవరి 16 న లిబియాలోని రెండో పెద్ద పట్టణం బెంఘాజీ నుండి తిరుగుబాటు ప్రారంభమైంది. బెంఘాజీని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తిరుగుబాటుదారులు కొద్దిరోజుల్లోనే లిబియా తూర్పుప్రాంతాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధాని ట్రిపోలిలో గడ్డాఫీ ప్రాబల్యం ఇంకా కొనసాగుతోంది. మార్చినెల మొదటి వారాంతానికి లిబియాలోని 60 నుండి 70 శాతం వరకూ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నప్పటికీ, గడ్డాఫీ బలగాలు ప్రతిదాడి ప్రారంభించి తిరుగుబాటుదారుల నుండి ఒకటి రెండు పట్టణాలను తిరిగి వశం చేసుకున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ దేశ ప్రజలకు ప్రజాస్వామిక పాలనను అందించడంలో విఫలమయ్యాడని ప్రజాందోళనల ద్వారా స్పష్టమయ్యింది.

లిబియాలో గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. స్ధూలంగా చూస్తే తిరుగుబాటుదారుల చేతిలో లిబియా తూర్పు ప్రాంతంతో పాటు పశ్చిమ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు ఉన్నాయి. తూర్పుప్రాంత పట్టణం బెంఘాజీ వీరి కేంద్రం. ప్రధాన ఆయిల పట్టణాలు రాస్ లానుఫ్, బ్రెగా రెండూ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నాయి. గత నాలుగు రోజులుగా గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ పట్టణాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాస్ లానుఫ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం పోరాటం కేంద్రీకృతమై ఉంది. గడ్డాఫీ ట్రి;పోలిని కేంద్రంగా చేసుకుని పశ్చిమ ప్రాంతంపై పట్టు కలిగి ఉన్నాడు.  గడ్డాఫీ బలగాలు నాలుగు పట్టణాలను తిరుగుబాటుదారులనుండి కైవశం చేసుకున్నట్లు చెప్పినప్పటికీ అది అబద్ధమేనని తేలింది.

భద్రతా సమితి తీర్మానం

లిబియా పౌరులపై గడ్డాఫీ బలగాలు కాల్పులు జరుపుతుండడంతో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా సమితి ఆదాడులను ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. గడ్డాఫీ, అతని సన్నిహితులు “క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ” నేరానికి పాల్పడ్డారని ప్రకటిస్తూ,  దర్యాప్తు  చేయమంటూ అంతర్జాతీయ న్యాయస్ధానికి భద్రతా సమితి ఫిర్యాదు చేసింది. గడ్డాఫీతో పాటు పదిమందిపైన దర్యాప్తు ప్రారంభించామని న్యాయస్ధానం మార్చి 7న ప్రకటించింది. పరిస్ధితి తీవ్రతను గమనించిన గడ్డాఫీ, ఐక్యరాజ్య సమితి, అరబ్ లీగ్ లను లిబియాలో పౌరుల మరణాలపై పరిశోధించడానికి ఆహ్వానం పలుకుతానని ప్రకటించాడు.

తిరుగుబాటుదారుల కేంద్ర పట్టణమయిన బెంఘాజీలో తాత్కాలికంగా ప్రభుత్వాన్ని నడపడానికి 30 మందితో “లిబియా జాతీయ కౌన్సిల్” ఏర్పడింది.  లిబియా తూర్పుభాగం మొత్తం ఇప్పుడు తిరుగుబాటుదారుల ఆధినంలోకి వచ్చింది. పశ్చిమ ప్రాంతంలో ఉన్న పలు కీలక ప్రాంతాలను కూడా  తిరుగుబాటుదారులు వశం చేసుకున్నారు. మరికొన్ని పట్టణాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. విదేశీ జోక్యాన్ని లిబియన్లు నిరాకరిస్తున్నప్పటికీ అమెరికా, బ్రిటన్లు అక్కడి ఆయిల్ సంపదపై ఆధిపత్యం సంపాదించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాయి.

కొనసాగుతున్న పోరు

తిరుగుబాటుదారుల ఆధినంలో ఉన్న ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్, తోబ్రుక్, మిస్రాటా, జావియా పట్టణాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నామని గడ్డాఫీ బలగాలు కొద్ది రోజుల క్రితం ప్రకటించాయి. అయితే రాస్ లానుఫ్ పట్టణానికి వెళ్ళిన బిబిసి విలేఖరికి అక్కడ గడ్డాఫీ బలగాలు కనిపించ లేదు. పట్టణం తిరుగుబాటుదారుల ఆధినంలో ఉన్నట్లు గమనించాడు. మిస్రాటా, జావియా పట్టణాల పౌరులు తమ పట్టణాలు తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. రాస్ లానుఫ్ పట్టణం కోసం ఇరుపక్షాలు ఇంకా పోరాడుతున్నాయి. గడ్డాఫీ యుద్ధవిమానాలు తిరుగుబాటుదారులకు సమస్యగా ఉన్నాయి. తిరుగుబాటుదారుల వద్ద యుద్ధ విమానాలు లేవు. వాటిని సమర్ధవంతంగా కూల్చగల ఆయుధాలు కూడా లేవు. దానితో వారు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో లిబియాపై నిషిద్ధ గగనతలాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. అదే సమయంలో ఆ పేరుతొ విదేశాలు జోక్యం చేసుకోరాదని కోరుతున్నారు. ఈ రెండు కోర్కెలు ఒక ఒరలో ఇమడని కత్తుల్లాంటివి.

ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్, శనివారం, మార్చి 5 న తిరుగుబాటుదారుల చేతికి వచ్చినప్పటినుండి దానికి 50 కి.మీ లోపు గడ్డాఫీ బలగాలు అడుగు పెట్టలేక పోయాయని తిరుగుబాటు బలగాలు తెలిపాయి. రాస్ లానుఫ్ నుండి సిర్టే పట్టణానికి వెళ్ళే తీరప్రాంత రోడ్డుపై ఇరు పక్షాలకు మధ్య పోరు నడుస్తున్నట్లు బిబిసి తెలిపింది. సిర్టే పట్టణం గడ్డాఫీ జన్మ స్ధలం. సిర్టే వశమయితే గడ్డాఫీ ఓడినట్టేనని తిరుగుబాటుదార్లు భావిస్తున్నారు. గడ్డాఫీ బలగాల విమాన దాడులను తిప్పికొట్టడం కష్టంగా మారడంతో తిరుగుబాటుదారులు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో లిబియాపై నిషిద్ధ గగనతలాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. అయితే ఒంటె, గుడారం సామెతలో వలే ఐక్యరాజ్యసమితి పేరుతో వచ్చే పశ్చిమ దేశాలు  లిబియా ఆయిల్ కొల్లగొట్టడానికి అక్కడే తిష్ట వేసి తీరుతాయి.

ట్రిపోలిలో మెషిన్ గన్ల కాల్పుల మోతలు వినిపిస్తున్నప్పటికీ అక్కడ యుద్ధం జరగడం లేదని గడ్డాఫీ బలగాలు తెలుపుతున్నాయి.  ఆ కాల్పులు ట్రిపోలిలో ఉన్న సైనికులు గడ్డాఫీపై తిరుగుబాటు ప్రకటించాయనడానికి సంకేతం కావచ్చని ఊహిస్తున్నారు. దాన్ని ధృవపరిచేవారు ఎవరూలేరు. ట్రిపోలీ వీధుల్లో గడ్డాఫీ బలగాలు అనుక్షణం కాపలా కాస్తున్నాయి. పదిరోజుల క్రితం జరిపిన ప్రదర్శనపై గడ్డాఫీ బలగాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి చాలామందిని చంపివేయడంతో అక్కడి పౌరులు భయభ్రాంతులై ఉన్నారు. ట్రిపోలిపై గడ్డాఫీ పట్టు కొనసాగుతుండాగా తిరుగుబాటుదారులు దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మిస్రాటా, జావియా పట్టణాల్లో గడ్డాఫీ బలగాలు పౌరులపై కాల్పులు జరపడంతో కొందరు మరణించినట్లు తెలిసింది. ఎంతమంది మరణించిందీ ఖచ్చితంగా తెలియలేదు. ఇద్దరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటివరకూ లిబియా ఘర్షణల్లో వెయ్యి మంది మరణించారని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తున్నది.

అమెరికా ఐరోపా కుతంత్రాలు

ఇదిలా ఉండగా అమెరికా బ్రిటన్లు లిబియాపై సైనిక చర్యకు సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. విమాన వాహక నౌకలు యు.ఎస్.ఎస్.ఎంటర్ ప్రైజ్, యు.ఎస్.ఎస్ ప్రోన్స్,  యు.ఎస్.ఎస్. కియర్ సార్జ్ లతో పాటు భూమి నీళ్ళు రెండింటిలో ప్రయాణించే రెండు నౌకలు లిబియా తీరానికి చేరుకున్నాయి. బ్రిటన్ ఒక విధ్వంసక నౌకతో పాటు మరొక ఫ్రిగేట్ నౌకను (పెద్దదీ చిన్నదీ కాని నౌక. సైనికులు ఆయుధాలు చేరవేయడానికి వినియోగిస్తారు) లిబియా తీరానికి చేర్చింది. గడ్డాఫీని పదవీచ్యుతుడ్ని చేయడం తమ ప్రధమ కర్తవ్యమని బ్రిటన్ ప్రధాని కామెరూన్ నాలుగు రోజుల క్రితం ప్రకటించాడు. భూతల చర్యలకు గూడా బ్రిటన్ బలగాలను సిద్ధం చేస్తున్నట్లు బ్రిటన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపాడు.

ఇరాక్, యుగోస్లేవియాల్లో జోక్యం చేసుకున్నట్లుగానే మానవతా సాయం, శరణార్ధుల రక్షణ పేరుతో లిబియాలోకి ప్రవేశించడానికి అమెరికా, బ్రిటన్లు ప్రయత్నిస్తున్నాయి. ఆ ఉద్దేశం లేదని అవి చెబుతున్నప్పటికీ వాటి చర్యలు వాటి ఉద్దేశ్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. లిబియా, ట్యునీషియా సరిహద్దుల వద్ద చిక్కుకుపోయిన శరణార్దులను తరలించడానికి వినియోగిస్తున్న విమానాలు తదితర వాహనాలను సైనికుల చేర వేతకు వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యునీషియా, ఈజిప్టుల ద్వారా అందజేస్తున్న మానవతా సాయం వెళ్ళే రూట్ల రక్షణకోసం అమెరికా, బ్రిటన్లు తమ సైనికులను మొహరించాల్సిన అవసరం రావచ్చని ఆ దేశాల అధికారులు చెప్పినట్లుగా బ్రిటన్ కి చెందిన గార్డియన్ పత్రిక తెలిపింది. అంటే మానవతా సాయం రక్షణ పేరుతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల సైనికులను లిబియాలో జోక్యం చేసుకోవడానికి ట్యునీషియా, ఈజిప్టులకు లిబియాతో ఉన్న సరిహద్దుల వద్ద మొహరించే పధకాన్ని సిద్ధం చేశారన్నమాట. “ఈనగాచి నక్కల పాల్జేసినట్లు” లిబియా తిరుగుబాటుదారులు గడ్డాఫీని తొలగించడానికి చేస్తున్న యుద్ధం అమెరికా, యూరప్ దేశాలు, లిబియా ఆయిల్ వనరులను వశం చేసుకునేందుకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. ఆ అవకాశం కోసమే “లిబియా పౌరులను గడ్డాఫీ విమానదాడుల నుండి రక్షించడం” అనే బృహత్తర కర్తవ్యాన్ని అవి తమ భుజంపై వేసుకున్నాయి. ఈ విషయమై బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీల విదేశాంగ మంత్రులతో చర్చించినట్లు హిల్లరీ క్లింటన్ వారం క్రితం తెలిపింది.

జర్మనీ, ఫ్రాన్సులు లిబియాపై “నిషిద్ద గగనతలం” (నో-ఫ్లై-జోన్) అమలు జరపడానికి తమ మద్దతు తెలిపాయి. ఇటలీ తన భూభాగంపై ఉన్న అమెరికా స్ధావరాలను వినియోగించడానికి అంగీకరించింది. అయితే నాటో ద్వారా కాకుండా కొన్ని అనుకూల దేశాలు మాత్రమే సైనిక చర్యకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే నాటో దేశాలు కొన్ని సైనిక జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఆమోదం పొందిన తీర్మానం “మానవతా సాయం అందించడానికి ఎదురయ్యే ఆటంకాలను నివారించడానికి ఎటువంటి చర్యనైనా తీసుకొనే” అధికారాన్ని కల్పించింది. ఈ తీర్మానాన్నే అమెరికా, యూరప్ దేశాలు లిబియాపై సైనికులను నడపడానికి ఉపయోగించనున్నాయి.

ఫ్రాన్సు నిషిద్ద గగనతలం అమలుకు ఐక్యరాజ్య సమితి ఆమోదం కావాలని చెప్పగా, జర్మనీ ఈ చర్య సైనిక జోక్యంగా ఎట్టి పరిస్ధితుల్లోనూ కనిపించడానికి వీల్లేదు, అన్నది.  బ్రిటన్ మాజీ ప్రధాని “జాన్ మేజర్,” నిషిద్ద గగనతలం అమలు చేయడానికి ఐక్యరాజ్య సమితి తీర్మానం ఉపయోగపడుతుంది. కానీ లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం ఐక్యరాజ్య సమితి తీర్మానం అవసరం లేదు. అందుకు ఇష్టపడే దేశాలు ఉమ్మడిగా అటువంటి చర్యను చేపట్టవచ్చు అని ప్రకటించాడు. అంటే ఐక్యరాజ్య సమితి ఆమోదం లేకపోయినా సైనిక చర్యకు అమెరికా, యూరప్ లు సమాయత్తమౌతున్నయన్నమాట.

సైనికజోక్యానికి వ్యతిరేకత

నిషిద్ధ గగనతలం అమలు చేయడానికి రష్యా, చైనాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ దేశాలు లిబియా సంక్షోభానికి సంబంధించి “అతి” కి పోవద్దని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ హెచ్చరించాడు. నాటోకు రష్యా రాయబారిగా ఉన్న డిమిట్రీ రోగోజిన్, “వాషింగ్టన్ లో ఉన్నవారు ఎవరైనా లిబియాలో సైనిక జోక్యానికి ప్రయత్నిస్తున్నట్లయితే, నాటోకి అతీతంగా తీసుకునే అటువంటి చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం అవుతుందని తెలుసుకోవాలి” అని ప్రకటించాడు. “లిబియా ప్రభుత్వ యుద్ధవిమానాలు గానీ, పౌర విమానాలు గానీ ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నట్లయితే అది లిబియా దేశీయ వ్యవహారాల్లో లిబియా ఇష్టానికి వ్యతిరేకంగా జోక్యం చేసుకుకున్నట్లే అవుతుంది” అని రోగోజిన్ తెలిపాడు.

అమెరికా, బ్రిటన్ లు సైనిక జోక్యానికి పిలుపివ్వడాన్ని “పిచ్చి చర్య”గా మరో నాటో సభ్యదేశం అయిన టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అభివర్ణించాడు. “మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలను అమెరికా తదితర పశ్చిమ దేశాలు ఎప్పుడూ ఆయిల్ వనరులుగా మాత్రమే పరిగణిస్తూ వచ్చాయి. ఆయిల్ యుద్ధాల్లో వాటిని కేవలం పావులుగానే పశ్చిమ దేశాలు జమకట్టాయి. అరబ్ దేశాల్లో తలెత్తిన ప్రజా తిరుగుబాట్లకు ఇదే ప్రధాన కారణంగా పశ్చిమ దేశాలు గమనించి మసులుకోవాలి” అని హెచ్చరించాడు. ఎర్డోగాన్ హెచ్చరికలను బట్టి నాటో తరపున జోక్యం చేసుకోవడానికి అనుమతి దొరకడం కష్టం కావచ్చు. అందుకే అమెరికా, బ్రిటన్ లు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో చేసినట్లుగా తమంతట తామే లిబియాపై సైనిక చర్యకి దిగే అవకాశం కనిపిస్తోంది.

స్నేహ హస్తం

ఈ నేపధ్యంలో లిబియా తిరుగుబాటుదారులకు అధ్యక్షుడు గడ్డాఫీ స్నేహ హస్తాన్ని చాచినట్లుగా వార్తలు తెలుపుతున్నాయి. ఆహారం, మందులతో కూడిన వాహనాలను గడ్డాఫీ తిరుగుబాటు దారుల కేంద్ర పట్టణం బెంఘాజీకి పంపినట్లు ఈ వార్తల ద్వారా తెలుస్తోంది. లిబియా ప్రభుత్వానికి చెందిన విదేశీ గూఢచర్య సంస్ధ అధిపతి “బౌజైద్ డోర్దా” ను తిరుగుబాటుదారులతో చర్చలు జరపడానికి నియమించినట్లు తెలుస్తున్నది. అయితే గడ్డాఫీ స్నేహ హస్తాన్ని లిబియా తిరుగుబాటుదారులు తిరస్కరించినట్లు వార్తలు తెలిపాయి. మార్చి8 న ట్రిపోలీలోని లాయర్లు మధ్యే మార్గంగా ఒక ప్రతిపాదన చేశారు. “గడ్డాఫీ పదవిని త్యజించడం, అందుకు ప్రతిగా తిరుగుబాటుదారులు గడ్డాఫీ, అతని కుటుంబం క్షేమంగా దేశం వదిలి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం” దాని సారాంశం. ఆ ప్రతిపాదనను కూడా తిరుగుబాటుదారులు తిరస్కరించారు. పశ్చిమ దేశాలు సైనికంగా జోక్యం చేసుకోవడానికి కాచుకుని ఉన్న నేపధ్యంలో 41 సంవత్సరాల పాటు అధికారం చెలాయించిన గడ్డాఫీ దేశాన్ని ప్రజల యిష్టాయిష్టాలకు వదిలి పెట్టడం సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కాని తిరుగుబాటుదారులు గడ్డాఫీని విచారించి శిక్షించాలని పట్టుదలతొ ఉన్నారు.

లిబియా తిరుగుబాటు ప్రత్యేకత

ట్యునీషియా, ఈజిప్టులతో పోలిస్తే లిబియా ఆందోళనలకు ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ రెండు దేశాల్లో సైన్యానికి ప్రభుత్వంలో పలుకుబడి ఉంది. అక్కడి నియంతలు తమ నియంతృత్వ పాలనకు ప్రధానంగా సైన్యంపైనే ఆధారపడ్డారు. సైన్యం మద్దతు లేకుండా ఏ తిరుగుబాటుగానీ, కుట్రగానీ అక్కడ విజయవంతం కావడం అసంభవం. ట్యునీషియా, ఈజిప్టులలో సైన్యం తిరుగుబాటుదారులకు లేదా ఆందోళనకారులకు ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతు ఇవ్వడం వల్లనే నియంతలు దేశం విడిచి వెళ్లిపోవలసి వచ్చింది. అంతే కాకుండా అక్కడి సైన్యాలకు పశ్చిమ దేశాల మద్దతు కూడా ఉంది. పశ్చిమ దేశాల దర్శకత్వంలోనే సైన్యం నడుచుకుంది. కానీ లిబియాలో గడ్డాఫీ సైన్యానికి మొదటినుండీ ప్రాధాన్యం ఇవ్వలేదు. సైన్యం శక్తివంతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తనలాగే ఎవరైనా సైన్యం మద్దతుతో తనకు వ్యతిరేకంగా సైనిక కుట్ర జరిపే అవకాశాన్ని నివారించడానికే గడ్డాఫీ సైన్యాన్ని ఒక పరిమితిలో ఉంచాడు. తన తెగకు చెందినవారు, బంధువులతో ప్రత్యేకమైన రక్షణ బలగాలను నిర్మించుకుని వాటి నిర్వహణను నమ్మకస్తుల చేతిలో పెట్టాడు. సొంత రక్షణ బలగాలతో పాటు విదేశాలనుండి కిరాయి సైనికులను అవసరమైనప్పుడు వాడుకుంటూ వచ్చాడు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సైన్యం నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు కూడా గడ్డాఫి తిరుగుబాటుదారులపై యుద్ధానికి కిరాయి సైనికుల పైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నాడు. కిరాయి సైనికులుగా వచ్చిన కొంతమంది నల్లజాతీయులను తిరుగుబాటుదారులు పట్టుకున్నారు కూడా.

అంతే కాకుండా తిరుగుబాటుదారులకు ప్రఖ్యాతి చెందిన నాయకులెవరూ లేరు. సైన్యం నుండి తిరుగుబాటుదారుల వైపుకి దూకినవారు, పౌరులనుండి స్వఛ్ఛందంగా పోరాటానికి దిగినవారు గడ్డాఫీ బలగాలతో పోరాడుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితం గడ్డాఫీ మంత్రివర్గం నుండి బైటికి వచ్చిన మాజీ న్యాయశాఖా మంత్రి ముస్తఫా అబ్దెల్ జలీల్ తిరుగుబాటుదారులు బెంఘాజీ కేంద్రంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక “లిబియా జాతీయ కౌన్సిల్”కు నాయకత్వం వహిస్తున్నాడు. జలీల్ తప్ప ఇతర పేర్లు తిరుగుబాటుదారుల తరపున ఏవీ రావడం లేదు. లిబియా తిరుగుబాటు ప్రజా సామాన్యం నుండి ఉత్పన్నదైనదనడానికి ఇది సంకేతంగా భావించవచ్చు. గడ్డాఫీ సైతం అమెరికాతో గత ఐదు సంవత్సరాల నుండి తప్ప అంతకుముందెన్నడూ సన్నిహితంగా లేడు. ప్రధానంగా ఐరోపాతో వాణిజ్యపరంగా సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. అందువల్ల పశ్చిమ సామ్రాజ్యవాదులకు నమ్మకమైన సేవకుడు(లు) లిబియాలో లేరని చెప్పవచ్చు. తిరుగుబాటుదారులు కూడా వీరి జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నాలుగురోజుల క్రితం బ్రిటన్ కి చెందిన ఇద్దరు గూఢచారులను తిరుగుబాటుదారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వారు వాస్తవానికి తిరుగుబాటుదారులతో సంబంధాలు పెట్టుకొని సహాయం చేయడానికి వచ్చినవారు. తమ అనుమతి లేకుండా లిబియాకు రావడం పట్ల తిరుగుబాటుదారులు ఆగ్రహం చెంది నిర్బంధించారు. ఇవన్నీ లిబియా తిరుగుబాటుదారుల ప్రజా పునాదికి కల్మషం అంటుకోలేదనడానికి సంకేతాలు.

ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల వల్ల అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్సు తదితర ఐరోపా దేశాలు ఇప్పటికే పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. అంతే కాకుండా లిబియా తిరుగుబాటుదారులు విదేశీ జోక్యానికి బద్ధ వ్యతిరేకులుగా ఉన్నారు. పౌరులు సైతం విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే లిబియా తిరుగుబాటుదారులు, ప్రజలు విదేశీ సైనికులపై కూడా నిర్ణయాత్మకంగా యుద్ధం చేసే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఒక వేళ పశ్చిమ దేశాల సైనిక జోక్యంపై కూడా వారు తిరగబడానికే నిర్ణయించుకున్నట్లయితే అమెరికా పతన దిశలో, వైకుంఠపాళి లోని పాములాంటి మలుపు ఎదురు కావచ్చు. అయితే కేవలం అరవై లక్షలకు కొంచెం ఎక్కువగా ఉన్న లిబియా జనాభా పశ్చిమ దేశాల సైన్యానికి ఎదురొడ్డి నిలుస్తాయా అన్నదే ప్రశ్న. తిరుగుబాటుదారులకు ఆల్-ఖైదా మద్దతు ఉందన్న పేరుతో గడ్డాఫీ పశ్చిమ దేశాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. అడ్డంకుల్ని అధిగమించి లిబియా ప్రజా తిరుగుబాటు విజయవంతం కావలని ఆకాంక్షిద్దాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s