ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని తెలిపాడు. అయితే ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే తయారు చేశాడనికి ఆధారాలు సంపాదించడం కష్టం అని ఆయన చెప్పాడు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని రద్దు చేయాలని పశ్చిమ దేశాలు అమెరికా నాయకత్వంలో చాలా కాలం నుండి డిమాండ్ చేస్తున్నాయి. అణుబాంబు తయారుచేసే యోచనలో ఇరాన్ ఉన్నట్లు పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగిన సాక్ష్యాధారలను మాత్రం ఇంతవరకు చూపలేక పోయాయి. అయినప్పటికీ ఇరాన్ అణుబాంబు తయారు చేస్తున్నదంటూ ఇప్పటికి నాలుగు విడతలు ఇరాన్ పై ఆర్ధిక, వాణిజ్య, రాజకీయ ఆంక్షలను పశ్చిమ దేశాలు ఇరాన్ పై మోపాయి. ఈ ఆంక్షలను ఇరాన్ లెక్క చేయడం లేదు.ఇరాన్ అణు కార్యక్రమాన్ని తనిఖీ చేసే పేరుతో అంతర్జాతీయ అణు ఇందన సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ) శాస్త్రవేత్తలు ఇరాన్ లో అమెరికా తరపున గూఢచర్యానికి పాల్పడడంతో వారిని ఇరాన్ బహిష్కరించింది. పశ్చిమ దేశాలు గత సంవత్సరం నాలుగో సారి విధించిన ఆంక్షలను “వాడి పారేసిన రుమాలు గుడ్డ” గా ఇరాన్ అధ్యక్షుడు చీదరించాడు.
ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ “మొస్సాద్” స్టక్స్ నెట్ సృష్టిలో పాత్రధారి అని లాంగ్నెర్ చెప్పాడు. అమెరికా గూఢచార సంస్ధ సి.ఐ.ఏ ఎంత కుట్ర పూరితమైనదో మొస్సాద్ కూడా అంతే కుట్రపూరితమైన సంస్ధ. అనేక మంది పాలస్తీన అధికారులను కుట్రచేసి చంపిన చరిత్ర మొస్సాద్ సొంతం. ఇరాన్ తన అణు కార్యక్రమం వైద్య, ఇంధన ప్రయోజనాలకు సంబంధించినది మాత్రమేనని చాలా సార్లు స్పష్టం చేసింది. తనిఖీ నిమిత్తం ఐక్యరాజ్య సమితి పరిశీలకులను కూడా అనుమతించింది. అయినప్పటికీ పశ్చిమ దేశాలు ఇరాన్ ను బూచిగా నమ్మించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి.
స్టక్స్ నెట్ వలన కంప్యూటర్ వ్యవస్ధలొ సమస్యలు వచ్చి, తమ న్యూక్లియర్ రియాక్టర్లనుండి ఇంధన కడ్డీలను గత నెలలో ఇరాన్ తొలగించవలసి వచ్చింది. ప్రపంచంలో స్టక్స్ నెట్ వైరస్ బారిన పడిన కంప్యూటర్లలొ 60 శాతం ఇరాన్ లోనివే. గత సంవత్సరం జులైలో ఈ వైరస్ ను మొదటిసారిగా కనుగొన్నారు. దీని వలన ఇరాన్ లోని అణు ఇంధన శుద్ధి కార్యక్రమం బాగా నెమ్మదించిందని ఇరాన్ కంటె ముందే అమెరికా, యూరప్ లలోని వార్తా సంస్ధలే కధనాలు ప్రచురించాయి. గూఢచర్యం ద్వారా ఇరాన్ అణు పరిశోధనా కంప్యూటర్ లలో వైరస్ ను
ప్రవేశ పెట్టడం, ఇరాన్ కు రష్యా, తదితర దేశాలు అణు టెక్నాలజీ పరికరాలను దొంగిలించి డూప్లికేట్ పరికారలను ఉంచడం లాంటి అనేక నీతి మాలిన చర్యలకు అమెరికా, ఇజ్రాయెల్ లు పాల్పడ్డాయి. ఇక ముందు కూడా ఆ దేశాలు అలా చేస్తూనే ఉంటాయి. మొస్సాద్ అధిపతి కొంత కాలం క్రితం ఇరాన్ అణ్వస్త్రం నిర్మించాలంటే మరో ఐదు సంవత్సరాలు పడుతుందని ప్రకటించాడు. గూడచర్యంతో సంపాదించిన సమాచారం ద్వారానే ఆయన ఆ ప్రకటన్ చేయగలిగాడు.
మధ్యప్రాచ్యం ప్రాంతంలో అమెరికా అనుంగు మిత్రుడుగా ఉన్న ఇజ్రాయెల్ కు ఇరాన్ అణ్వస్త్రాల వలన ప్రమాదం ఉందని అమెరికా, ఇజ్రాయిల్ లకు భయం. అందుకే ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ తప్ప ఎవరికీ అణ్వస్త్రాలు ఉండరాదని పశ్చిమ దేశాల అనధికార నియమం. పైకి మాత్రం ఇరాన్ అణుబాంబుల వలన ప్రపంచ భధ్రతకు నష్టమని “ఆకుకు అందని, పోకకు పొందని” సామెత చెబుతాయి. జపాన్ పై అణుబాంబులు జార విడిచి లక్షల మందిన చంపడమే కాకుండా అనేక దేశాలపైన, దేశాల అధ్యక్షులపైన బాంబుల వేసి, యుద్ధాలు చేసిన అమెరికా వలనే ప్రపంచ భధ్రతకు అసలు ప్రమాదం ఉందన్న విషయాన్ని అమెరికా మిత్రులు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తాయి.
ప్రపంచ భద్రతకు అమెరికా ఎంత ప్రమాదకారిగా ఉన్నదో పశ్చిమాసియా ప్రాంతానికీ, అక్కడి అరబ్ దేశాల భద్రతకీ ఇజ్రాయెల్ అంత ప్రమాదకారి. ఒకరు ప్రపంచ గూండా అయితే మరొకరు పశ్ఛిమాసియాకు గూండా. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్, పాలస్తీనీయులపై జాతి విద్వేషాన్ని అమలు చేస్తున్నది. ఇజ్రాయెలీయులు ప్రయాణించే రోడ్లపై పాలస్తీనీయులు ప్రయాణించకుండా నిషేధించింది.