తెలంగాణ ఉద్యోగులు 16 రోజులనుండి చేస్తున్న “సహాయ నిరాకరణ” ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుండి విధుల్లో చేరాలని తెలంగాణ ఎన్జీఓల సంఘం నాయకుడు స్వామి గౌడ్ ఉద్యోగులను కోరాడు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక సెక్షన్ ఉద్యమం విరమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. “సహాయ నిరాకరణ” ఉద్యమం విరమించినందుకు ఆగ్రహంతో స్వామి గౌడ్ దిష్టి బొమ్మను కూడ ఆ జిల్లాలో దహనం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అసౌకర్యాన్ని తప్పించడానికే
పది లక్షలకు పైగా విధ్యార్ధులకు మార్చి 7 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలౌతుండడం, ఉద్యమం వలన యావత్పరిపాలన స్తంభించి పోవడం, దాని వలన వృద్ధులకు పెన్షన్ లు అందక పోవడంతో ప్రజలకు అసౌకర్యాన్ని తప్పించే ఉద్దేశంతో ఉద్యమం విరమిస్తున్నట్లు స్వామి గౌడ్ ప్రకటించాడు. సహాయ నిరాకరణ వలన తెలంగాణ ప్రాంతంలో ఎవరికీ ఫిబ్రవరి నెల జీతాలు అందలేదు. ముఖ్యమంత్రికి సైతం జీతం అందలేదు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ స్తంభించి పోయాయి. ప్రతిరోజూ ఆఫీసులో సంతకం చేసి బైటికి వచ్చి ఆట పాటల తోనో, నినాదాలతోనో ఉద్యోగులు గడపడంతో కార్యాలయాలన్నీ సందడితో నిండి పోయాయి. నిత్యం పనులకు వచ్చే ప్రజానీకం ఇబ్బంది పడ్డారు. తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతుండడంతో పనులు జరగక పోయినా ప్రజల నుండి సమస్యలు ఎదురు కాలేదు.
శనివారం ముఖ్యమంత్రితో చర్చలు జరిగాక ఉద్యమం విరమించాలని టి.ఎన్.జి.ఓ సంఘం నిర్ణయించింది. సహాయ నిరాకరణ కాలానికి జీతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కార్యాలయాల్లో ఎవరైతే పని చేశారో వారికే జీతాలు ఇస్తామని ప్రభుత్వం నిన్నటి వరకూ చెప్పింది. 610 జీ.ఒ, ముల్కీ రూల్స్, ప్రెసిడెంట్ ఆర్డర్ తదితర డిమాండ్లు తమ పరిధిలో లేవని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఉద్యోగుల ప్రతినిధులను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకెళ్ళి హోం మంత్రి చిదంబరం వద్ద చర్చలు జరిపేందుకు సహకరిస్తామని ముఖ్యమంత్రి ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు స్వామి గౌడ్ తెలిపాడు. తాము సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం కోసం ఇతర పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తామని ఆయన తెలిపాడు. మార్చి 10న జరగనున్న “మిలియన్ మార్చ్” లో ఉద్యోగులు పాల్గొంటారని కూడా ఆయన తెలిపారు.
మిలియన్ మార్చ్
సార్వత్రిక సమ్మె, ధర్నా, విధుల బహిష్కరణ మొదలయిన సాంప్రదాయక పోరాట రూపాల కంటే “సహాయ నిరాకరణ” ఉద్యమం ఎంత శక్తివంతమైనదో ఈ ఉద్యమం ద్వారా స్పష్టం అయ్యింది. “పెన్ డౌన్” ఉద్యమం కూడా ఖచ్చితంగా అమలు చేసినట్లయితే శక్తివంతంగా ఉంటుందని ఈ ఉద్యమం స్పష్టం చేసింది. స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో “సహాయ నిరాకరణ” ఉద్యమం భారత ప్రజలను పెద్ద ఎత్తున కదిలించిన విషయం అందరూ ఎరిగినదే.
మార్చి10 తేదీన “మిలియన్ మార్చ్” జరపటానికి తెలంగాణ ఉద్యమకారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పది లక్షల మందికి మంచినీరు, ఆహారం తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం పెద్ద సమస్యే. వరంగల్ కు చెందిన ఓ వ్యక్తి “మిలియన్ మార్చ్” కార్యక్రమాన్ని విరమింపజేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. పరీక్షలు నిర్విఘ్నంగా జరగడానికి తీసుకున్న చర్యలు తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ప్రభుత్వంతో పాటు రాజకీయ జె.ఏ.సి తదితరులకు కూడా నోటీసులు అందాయి.
కోర్టుల జోక్యం
ఉద్యమాలపై కోర్టుకు వెళ్ళడం ఈ మధ్య కాలంలో సర్వ సాధారణం అయ్యింది. సమాజంలోని వివిధ రంగాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం పోరాటాలకు దిగడం అనివార్యం. ప్రజలు అడగకుండానే వారి సమస్యలు పరిష్కారం అయితే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎవరికీ రాదు. అడగకుండానే పరిష్కారం చేయడం అటుంచి అడిగినా స్పందించని పరిస్ధితులే ఇప్పుడున్నాయి. అనేక రోజుల పాటు ఆందోళనలు చేసిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చికూడా వాటిని నెరవేర్చడం లేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూడా పదే పదే ఆందోలనలు చేయాల్సిన పరిస్ధితి. ఈ నేపధ్యంలో ఏదో వంకతో ఆందోళనలనూ, ఉద్యమాలనూ విరమింపజేయాలని కోరుతూ ప్రజలనుండే కొంత మంది కోర్టును ఆశ్రయించడం అంటే సమస్యను ఎదుర్కొంటున్నవారికి మరొక సమస్యను జోడించడమే అవుతుంది.
ఎవరికైతే వ్యతిరేకంగా ఆందోళన తలపెట్టారో వారే లోపాయకారీగా కోర్టుల్లో ఫిటిషన్లు దాఖలు చేయిస్తున్నారు. జూనియర్ డాక్టర్లు తలపెట్టిన ఆందోళనలకు ఇటువంటి పిటిషన్ల వలన అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యాయి. సమ్మె చేసే హక్కు కార్మికులకు లేదంటూ నాలుగైదు సంవత్సరాల క్రితం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ప్రజల ఆందోళనల పట్ల కోర్టులు ఎటువంటి వైఖరి తీసుకుంటాయో తేలిగ్గానే ఊహించవచ్చు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కి ఆ తర్వాత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అలవోకగా ప్రభుత్వాలు తీసుకుంటున్నపుడు ఆందోళనలకు దిగడం తప్ప ప్రజలకు గత్యంతరం లేదు. ప్రజల సమస్యలు, సమస్యలు ఉత్పన్నమవటానికి గల వ్యవస్ధాగత కారణాలు, ప్రభుత్వాల వైఖరి, ప్రజా పీడకుల పట్ల ప్రభుత్వాల సానుకూల వైఖరి మొదలైన వాటి పట్ల సరైన దృక్పధం లేనివారే ఈ విధంగా ఆందోళనలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ప్రజల్లో ఎవరూ ఇటువంటి ధోరణులను గురికాకుండా వివిధ సంఘాలు ఏంచేయాలో ఆలోచించ వలసిన అవసరం ఉన్నది.