ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది.
ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో అప్రతిష్టపాలయ్యారు. తిరుగుబాటు మొదలైన ప్రారంభ దినాల్లో ఆందోళనకారులపైకి కాల్పులు జరిపి అనేకమంది చనిపోవడానికి కారకులయ్యారు. ప్రజలను చిత్రహింసలకు గురుచేసిన చరిత్ర వీరికి ఉంది. వీరు యదేఛ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆందోళనకారులు మొత్తం పోలీసు వ్యవస్ధను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఈఫిప్టు కొత్త ప్రధాని ఎస్సామ్ షరాఫ్ శుక్రవారం విమోచనా కూడలి (తాహ్రిరి స్క్వేర్) లో బహిరంగ సభను నిర్వహించాడు. మాజీ ప్రధాని రాజీనామా డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు విమోచనా కూడలి వద్ద ప్రదర్శనకు ఆందోళనకారులు పిలుపిచ్చారు. అప్పటికే ఆయన రాజీనామా చేయడంతో కొత్త ప్రధాని ప్రదర్శకులనుద్దేశించి ప్రసంగించాడు. ప్రజలు కోరుకున్న మార్పులను తీసుకొస్తానని షరాఫ్ ప్రతిన సభలో బూనాడు.
ఎస్సామ్ సఫారా ఐదు సంవత్సరాల క్రితం ముబారక్ ప్రభుత్వంలో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరిగిన ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్నాడు. మార్చి 19 న రాజ్యాంగ సవరణలపై ఓటింగ్ నిర్వహించనున్నట్లుగా సైనిక ప్రభుత్వం ప్రకటించింది.