ఈజిప్టు మాజీ అధ్యక్షుడు తన చివరి రోజులలో నియమించిన ప్రధాని అహ్మద్ షఫిక్ గురువారం రాజీనామా చేశాడు. ముబారక్ కు సన్నిహితుడుగా భావిస్తున్న షఫిక్ తొలగింపు కూడా ఆందోళనకారుల డిమాండ్లలో ఒకటి. మిలట్రీ కౌన్సిల్ షఫిక్ రాజీనామాను ఆమోదించినట్లుగా తన ఫేస్ బుక్ పేజీ లో ప్రకటించింది. రవాణా శాఖ మాజీ మంత్రి ఎస్సామ్ షరాఫ్ ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లుగా కూడా కౌన్సిల్ తెలిపింది.
సోమవారం నాడు ముబారక్, అతని కుటుంబ సభ్యులపై మిలట్రీ కౌన్సిల్ ఎక్కడికీ ప్రయాణించే అవకాశం లేకుండా నిషేధించినట్లు ప్రకటించింది. ఆందోళనకారుల డిమాండ్లను నెరవేరుస్తున్నట్లుగా చూపడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ల విషయం ఇంకా ఏమీ తేలలేదు. “స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ” చట్టాన్ని ఎత్తివేయాలని ఉద్యమకారులు గట్టిగా డిమాండ్ చేశారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని తిరుగుబాటు డిమాండ్ చేస్తే ఉన్న రాజ్యాంగాన్ని సవరిస్తున్నామని మిలట్రీ కౌన్సిల్ తెలిపింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాని అధికారం అప్పజెప్పేంత వరకూ తాత్కాలిక పౌర ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా తిరుగుబాటు డిమాండ్ చేసింది. దానికి బదులుగా మిలట్రీ కౌన్సిల్ అధికారం చెలాయిస్తోంది.
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మిలట్రీ పౌర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. అలా కాకుండా మిలట్రీయే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తయారవడం పలు అనుమానాలకి సహజంగానే తావిస్తోంది. ఇనుము ఎర్రగా ఉన్నపుడే దెబ్బ పడాలన్నట్లుగా తిరుగుబాటు సమయం లోనే ఈజిప్టు ప్రజలు ఈ డిమాండ్లను సాధించుకొని ఉండాల్సింది. తమ డిమాండ్లు నెరవేర్చనట్లయితే మళ్ళీ ఉద్యమానికి దిగుతామని ఆందోళనకారులు చెప్పినప్పటికీ అమెరికా చెప్పు చేతల్లో ఉన్న మిలట్రీ అందుకు అవకాశం ఇస్తుందా అన్నది అనుమానమే.