తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసిన కావూరి వ్యాఖ్యలు


బుధవారం నాడు తెలంగాణ లాయర్లు తనకు వినతి పత్రం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన సందర్భంగా ఏలూరు ఎం.పి కావూరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన

Telangana
తెలంగాణ + సీమాంధ్ర = ఆంధ్ర ప్రదేశ్

ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలపై విరుచుకు పడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిణామాలు ఒకింత వేగం పుంజుకోవడానికి దోహదం చేసింది. గురువారం జరిగిన, జరుగుతున్న పరిణామలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ లాయర్లు తమ ఇంటిని ముట్టడించారని కావూరి ఆరోపణ. కాదు, తన ఇంట్లో సీమాంధ్ర ఎం.పిలు, ఎం.ఎల్.ఏల సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడవద్దని వినతి పత్రం ఇవ్వటానికి మాత్రమే వెళ్ళామని లాయర్లు అంటున్నారు. ఏదేమైనా తెలంగాణ లాయర్లు కావూరి ఇంటికి వెళ్ళి గట్టిగా నినాదాలు ఇచ్చారు. లాయర్లు వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళినా, ఓ.యు.జె.ఏ.సి, టి.ఆర్.ఎస్ నాయకులు కొందరు కావూరి ఇంటిని ముట్టడిస్తామంటూ ఇచ్చిన ప్రకటనలు లాయర్లు ముట్టడి కోసమే వచ్చినట్టు భావించడానికి ఆస్కారం ఇచ్చి వుండొచ్చు.

తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అంటూ ప్రకటనలతో సరిపెట్టే బదులు ఆ త్యాగాలు చేసి ఎందుకు చూపించరు? అన్నది కావూరి మాటలకు స్డూల అర్ధం. తెలంగాణ ప్రజా ప్రతినిధులను, అదీ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను హేళన చేసినట్లుగా, అహంకారంతో మాట్లాడినట్లుగా తెలంగాణ కా. ఎం.పి లు ఈ రోజు (గురువారం) తీవ్రంగా విరుచుకు పడ్డారు. మా సత్తా చూపిస్తాం అని ప్రకటించారు. ఎప్పుడూ లేనిది పార్లమెంటులో నినాదాలు చేసి సభా కార్యక్రమాలను అధిష్టానం భయాలు పక్కన బెట్టి అడ్డుకున్నారు. ఐదు సార్లు వాయిదా పడి ఆరోసారి శుక్రవారానికి వాయిదా వేశాక రొమ్ము విరుచుకుని బయటకు వచ్చారు. “చూశారా, మేం తలచుకొని ఏం చేశామో” అన్నట్లుగా విలేఖరుల ముందు ఫోజు పెట్టారు. దాదాపు తెలంగాణ కా.ఎం.పి లందరూ విలేఖరుల సమావేశంలో ఆవేశంగా కావూరి పైన విరుచుకు పడ్డారు.

నిజానికి కావూరి మాటల్లో తప్పేమీ లేదు. అహంకారం విషయం కాంగ్రెస్ ఎం.పి లకే తెలియాలి గానీ ఆయన మాటల్లో మాత్రం వీళ్ళు ఆవేశపడినంత తప్పు ఏం లేదనే చెప్పాలి. ఎంతసేపటికి అవసరమైనప్పుడు ఏ త్యాగానికైనా సిద్ధం అని సంవత్సరం నుండి ప్రకటనలే తప్ప ఏ త్యాగమూ చేసిన పాపాన పోలేదు. అదేమంటే తె.దే.పాని విమర్శించడం మినహా తెలంగాణ సాధనకు ఏం ప్రయత్న చేశారు గనక? త్యాగాలు చేసింది విధ్యార్ధులూ, యువకులూ, లాయర్లూ, ఉద్యోగులు. సమ్మెలు చేశారు. రోకోలు చేశారు. తమను తాము నిలువునా కాల్చుకున్నారు. జైళ్ళకు వెళ్ళారు. ఇంకా జైళ్ళలో ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఉద్యోగులు సహాయ నిరాకరణలో పాల్గొనటం నిజంగా గొప్ప విషయం. వీళ్ళందరికీ మద్దతుగా అప్పుడప్పుడూ ప్రకటనలు ఇవ్వడం తప్ప కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇంతవరకూ ఏమీ చేయలేదు, ఈ రోజు తప్ప.

నల్లగా కాలి బొగ్గయిన విద్యార్ధి శవం మీద ప్రమాణాలు చేశారు, రాజీనామా చేస్తామని. ఢిల్లీకి పిలిచి క్లాసులు తీసుకోవడంతొ ప్రమాణాలు గాల్లో కలిశాయి. ఆ విద్యార్ధి ఆత్మ (ఉంటే) ఎంత క్షోభించి ఉంటుందో కదా! పైగా తెచ్చేదీ మేమే, ఇచ్చేదీ మేమే అని కబుర్లు. ఇస్తుంటే, తెస్తుంటే తెలంగాణ వాళ్ళు ఎవరు వద్దన్నారు? తెమ్మనే కదా అందరూ అడుగుతున్నది! చివరికి చిదంబరం గారి “రాత్రికి రాత్రి వచ్చేది కాదు, తెలంగాణ, ఏకాభిప్రాయం రావాలి” అన్న మోసపూరిత మాటలు తెచ్చారు! ఎంత మోసం! సంవత్సరం క్రితం ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇప్పుడు ఏకాభిప్రాయం అనడం నయ వంచన కాదా? అధిష్టానందే చివరిమాట అయితే అదే చెప్పి గమ్మున ఉండాలి. అబ్బే అలా కాదు. గమ్మున ఉంటే క్రెడిట్ అంతా ఎదుటి పార్టీలకు వెళ్తుందని భయం. క్రెడిట్ కావాలంటే తెలంగాణ తెస్తే అదే వస్తుంది కదా! ఊరికే బడాయి ప్రకటనలిస్తే క్రెడిట్ ఎలా వస్తుంది?

సోనియా మీద మాకు నమ్మకం అంటూ కబుర్లు. సోనియా గాంధి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ప్రభుత్వ నాయకురాలు కాదు కదా, తెలంగాణ ఇవ్వడానికి. సోనియా గాంధికి, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకూ మధ్య ఉన్నది పార్టీ వ్యవహారం మాత్రమే తప్ప ప్రభుత్వ వ్యవహారం కాదు. కాంగ్రెస్ వారికి వారి అధ్యక్షురాలి మీద నమ్మకముంటే అధి వారి అంతర్గత విషయం. ఆ నమ్మకాన్ని బహిరంగంగా చెప్పి అందరూ నమ్మాలంటే అది కరెక్ట్ కాదు. మీ పార్టీ నాయకులను ఒప్పించడం మీ బాధ్యతే. కాంగ్రెస్ అధినాయకుల చేత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పించుకోవడం కాంగ్రెస్ వారి తంటాలకు సంబంధించింది. తెలంగాణ ఇవ్వడం అనేది పార్లమెంటు చేతుల్లో ఉంది. ఆ ప్రక్రియ పార్లమెంటు నుండి ప్రారంభం కావాలి. అభిప్రాయాలు చెప్పమని అన్ని పార్టీలను అడగడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా “ఇదీ నా అభిప్రాయం” అని చెప్పిందా? లేదు. తె.దే.పా చెప్పలేదని ఎత్తిచూపించే నైతిక హక్కు కాంగ్రెస్ వారికి ఎలా ఉంటుంది? పైగా కమిటీల మీద కమిటిలు!

ఇప్పుడు తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్సే క్రెడిట్ కొట్టేస్తుంది. మేమేమన్నా పిచ్చివాళ్ళమా? అని వారం రోజుల క్రితం సర్వేగారు అన్నారు. అధికారానికి సంబంధిన ఈక్వేషన్ల వల్లే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడానికి వెనకడుగు వేస్తోందని పత్రికలు కూడా చాలా సార్లు విశ్లేషించాయి. అదే నిజమైతే అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదేమో! అంటే తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించినదా, లేక కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందా లేదా అన్న సమస్యకి సంబంధించినదా? నిజానికి ప్రజల ఆకాంక్షలకు సంబంధించినదని కాంగ్రెస్ అధినాయకులు భావించినట్లయితే ఈ పాటికి తెలంగాణ ప్రక్రియ సగం దూరం వచ్చి ఉండేది. ప్రజల ఆకాంక్షలను ఎన్నికలు, అధికారాలతో ముడి పెడుతున్నారు గనకనే కనీసం తన అభిప్రాయం సైతం కాంగ్రెస్ ప్రకటించలేక పోయింది.

రాష్ట్ర మంత్రి జూపల్లి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి లేఖను సోనియా గాంధికి పంపించారు. ఇదొక డ్రామా. పైగా సంవత్సరం క్రితం జరిగిన విద్యార్ధుల మరణాలు ఇప్పుడు ఆయనని కదిలించివేశాయట. రాజీనామా చేయదలుచుకుంటే గవర్నరు గారికో, స్పీకరుగారికో రాజీనామా లేఖను ఇవ్వాలి. సోనియాకిస్తే అది రాజీనామా ఎలా అవుతుంది? నాటకం అవుతుంది తప్ప.

కావూరి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎం.పీలే నిరూపించారు. ఆయన మీ త్యాగాలేంటో నిరూపించమన్నారు గనకనే ఈ రోజు పార్లమెంటులో గొడవ చేశారు తప్ప లేదంటే మా సోనియా ఇస్తారు మేం తెస్తాము అని పాత పాటే పాడుతూ ఉండేవారు కదా. ఇప్పటికయినా పార్లమెంటులొ ఆందోళన మొదలు పెట్టారంటే అది కావూరి పుణ్యమే అంటే తప్పేం లేదు. అది సరే. ఈ ఆందోళన ఈ రోజుతో సరా, లేక కొనసాగించేది ఏమైనా ఉంటుందా? డౌటే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s