బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం


 

Budget 2011-12

2011-12 కు బడ్జెట్ ప్రతిపాదనలతో ఆర్ధిక మంత్రి

భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల కష్టాన్ని విందు భోజనంగా అందించారు. బడ్జెట్ ప్రకటించాక బొంబే స్టాక్ ఎక్ఛేంజ్ 550 పాయింట్లు లాభ పడిందంటే బడ్జెట్ మార్కెట్ కి ఎంత అనుకూలంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రకటించిన కేటాయింపులు అనుకున్నంతగా లేనందునా, ఎదురు చూసిన సరళీకరణ చర్యల్లో కొన్ని ప్రత్యక్షంగా కనపడనందునా షేర్ మార్కెట్ లాభం 122 పాయింట్లకు దిగజారింది.

కంపెనీలకు ఉద్దీపనా ప్యాకేజి కొనసాగుతుంది

బడ్జెట్ లో సామాన్యుడికి అవసరమైన సామాజిక కార్యక్రమాలకు వందల కోట్లతో సరిపుచ్చి, మార్కెట్ కూ, దళారీలకూ కోట్లు కురిపించే కార్యక్రమాలకి పదుల వేలు లేదా వందలవేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమర్పించుకుంది. ఆర్దిక సంక్షోభం పేరుతొ 2008-09 నుండి మూడు సంవత్సరాల పాటు దేశీయ ప్రయివేటు కంపెనీలకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు అందిస్తూ వచ్చిన ఉద్దీపనా (స్టిములస్) ప్యాకేజిని ఉపసంహరించుకోవాలని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఇచ్చిన సలహాను ఆర్ధిక మంత్రి పెడ చెవిన పెట్టాడు. భారత ఆర్ధిక వృద్ధిరేటును పరిరక్షించుకోవాలంటే మరి కొంతకాలం ఉద్దీపనా చర్యలు కొనసాగ వలసిందేనని ఆర్ధిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ లో సెలవిచ్చారు. స్ధానికంగా ఎదురయ్యే సమస్యలనూ, విదేశాలనుండి ఎదురయ్యే అవకాశం ఉన్న ప్రతికూల పరిణామాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలంటే స్టిములస్ లో కొంత భాగాన్ని అట్టిపెట్టాల్సిన అవసరం ఉందని చెపుతూ అందుకు అనువైన చర్యలను కూడా అర్ధిక మంత్రి బడ్జెట్ లో తీసుకున్నాడు. ఇది మార్కెట్ ను బహుధా సంతృప్తి పరచే అంశం.

స్టిములస్ ను అట్టిపెట్టే చర్యల్లో భాగంగా స్వదేశీ కంపెనీలు చెల్లించే కార్పొరేట్ పన్నుపై సర్ చార్జ్ 7.5 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. మార్కెట్ ప్రత్యామ్నాయ పన్నును 18 శాతం నుండి 18.5 శాతానికి పెంచారు. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన చోట రెండున్నర శాతం తగ్గించి, పెంచే చోట అర శాతం మాత్రమే పెంచారన్న మాట! కంపెనీలకిది హేపీస్. వ్యక్తిగత ఆదాయపు పన్ను ప్రారంభ రాయితీ (లక్షా అరవై వేల నుండి లక్షా ఎనభై వేలకి) ఇరవై వేలు పెంచారు. అంటే రెండు వేల రూపాయల ఆదాయపు పన్ను రాయితీ పెంపు. కానీ ద్రవ్యోల్బణం పెరుగుదల వలన ఉద్యోగులకు కరువుభత్యం పెరుగుదల, వేతన సవరణ వలన వేతనాల పెరుగుదల లను పరిగణన లోకి తీసుకుంటే నికరంగా ఆదాయపు పన్ను చెల్లింపు పెరిగిందే తప్ప తగ్గ లేదు. రాయితీ పెంచామని చెప్పుకునేందుకు తప్ప నికర పన్ను చెల్లింపు తగ్గక పోగా పెరిగింది. స్పూనుతో విదిల్చి, తెడ్దుతో తోడుకోవడం అన్నమాట!

బెత్తెడు గొర్రెతోక నుండి బారెడు గుంజుకోవడం

ఎనభై ఏళ్ళ పైబడినవారికి 5 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను రాయితీ ఇచ్చారు. సర్కారు వారు సీనియర్ సిటిజన్లకిచ్చే బొనాంజా పొందాలంటే తాజాగా రిటైరైన వారు మరో ఇరవై సంవత్సరాలు ఆగాలన్నమాట. బడ్జెట్ ప్రకటించిన పెద్దాయన సైతం మరో నాలుగు సంవత్సరాలు ఆగాల్సిందే. ఈ రాయితీ చిటారు కొమ్మన మిఠాయి పొట్లమే. దగ్గరికి చేరేలోపు తేనెటీగలు చుట్టుముట్టి కోర్కెలకు శాశ్వత ముగింపు పలుకుతాయి. ఉద్యోగుల గొర్రెతోక ఆదాయం నుండి బారెడు పన్ను గుంజుకున్న ప్రభుత్వం, కార్పొరేట్లు, ధనికులు చెల్లించే సర్వీసు పన్ను మాత్రం పెంచకుండా 10 శాతం వద్ద అట్టే పెట్టింది. పైగా ఆసుపత్రులు, హోటళ్ళను సర్వీసుల పరిధిలోకి తెచ్చారు. ఏ వర్గ రోగి ఐనా ఇప్పుడు కార్పొరేటు ఆసుపత్రులకు వెళ్ళాల్సిందే. కనుక ఈ పెంపు మధ్యతరగతి వినియోగదారుల పైన కూడా విస్తరిస్తుంది. చిత్రంగా ఆదాయం పెంచుకోవాటానికి ప్రభుత్వానికి, వేతన జీవులు, కార్మికులు, రైతులు కనబడితే జిడిపి వృద్ధి రేటు పెరగటానికై రాయితీలు పెంచటానికి కోటీశ్వరులైన కంపెనీల అధిపతులు, విదేశీ కంపెనీలు మాత్రమే కనబడతాయి.

తాజా బడ్జెట్ లో పరోక్ష పన్నులతో వినియోగదారులను తెంపు లేకుండా బాదారు. ఎక్సైజ్ పన్నును 10 శాతం నుండి పెరగకుండా అట్టే పెట్టి 130 రకాల సరుకులపై ఎక్సైజ్ పన్ను మినహాయింపుల నుండి తొలగించారు. అంతే కాకుండా వచ్చే సంవత్సరం నుండి మరో 240 సరుకుల్ని పన్నురాయితీ నుండి తొలగించాలని ఇప్పుడే నిర్ణయించారు. ఈ చర్యలు సరళీకరణ విధానాల కొనసాగింపు. అంతేకాక ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. కేంద్ర ఎక్సైజ్ పన్ను ప్రాధమిక రేటును 4 నుండి 5 శాతానికి పెంచారు.

శుష్క వాగ్దానాలు

బ్లాక్ మనీ, అవినీతి, విదేశీ ఖాతాలు… వీటిపై ఎన్ని విమర్శలు వచ్చినా, సుప్రీం కోర్టు అభిశంసించినంత పని చేసినా, ప్రభుత్వం నుండి స్పందన లేదు. బడ్జెట్ లోనైనా చూపిస్తారా అనుకుంటే అదీలేదు. దున్నపోతు మీద వర్షమే. విదేశీ ఎకౌంట్లనుండి నల్లడబ్బును వెనక్కి రప్పించటానికీ, అవినీతి డబ్బు కక్కించటానికీ నోటి మాటా, కలం రాతా తప్ప ఆచరణాత్మక చర్య ఒక్కటీ లేదు. 62 డిపార్ట్ మెంట్ల లో అవినీతి జరక్కుండా చూడటానికి ఓ గ్రూపు ఏర్పాటు చేస్తున్నారట. సి.బి.ఐకే దిక్కు లేనప్పుడు ఈ గ్రూపేం చేస్తుంది? కార్పొరేట్ల గుప్పిట్లో బందీలయిన దళారీ మంత్రులు, మాఫియాతో చెట్టపట్టాలేసుకున్న బ్యూరోక్రసీ అధికారులు, నిర్ణయాలు చేస్తున్నపుడు నీతిని నిలబెట్టే చర్యలు ఆశించడమే నేరం కాబోలు!

ఎరువులు, కిరోసిన్, వంట గ్యాసు లపై ఇస్తున్న సబ్సిడీని నగదు రూపంలో ఇస్తారట. ఎప్పుడంటే మార్చి 2012లో నట. అప్పటికి సబ్సిడీపై ఆధారపడే కార్యకలాపలన్నీ ముగుస్తాయి కదా. ఇక నగదును ఏ సబ్సిడీలకు ఇస్తారు? వివరం లేదు. ఇచ్చే ఉద్దేశం లేదంటే సరిపోతుంది. యూరియాపై సబ్సిడీని దానిలో పుష్టినిచ్చే పదార్ధాలు ఉన్న శాతాన్ని బట్టి (న్యూట్రియెంట్స్) సబ్సిడీ నిర్ణయమవుతుంది. రాజకీయ నిబద్ధత ఉండాల్సిన నిర్ణయాలివి. కానీ మన నాయకులకు లేనిది అదే కదా. ఎరువుల డీకంట్రోల్ (సబ్సిడీ ఉపసంహరణ) బహుళజాతి సంస్ధల దీర్ఘకాలిక డిమాండు. దాన్ని ప్రస్తుతానికి బైటికి తీయలేదు. త్వరలో రానున్న రాష్ట్రాల ఎన్నికలు భయపెడుతున్నందు వలన ఎరువుల్ని వదిలేశారు. అయితే డీసెల్ పై నియంత్రణ ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ కంపెనీల అమ్మకం ద్వారా రు. 40,000 కోట్లు అదాయం రావాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుత సంవత్సరం కూడా మొదట్ అదే లక్ష్యం అయినప్పటికీ 3-జి స్పెక్ట్రం వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలు రావటంతో దాన్ని రు. 22,144 కోట్లకు కుదించారు. దాన్నిప్పుడు నలభై వేల కోట్లకు పెంచారు. పబ్లిక్ రంగ కంపెనీల అమ్మకంపై ఐదారు సంవత్సరాల క్రితం వరకు ఆందోళనలు జరిగేవి. కార్మిక యూనియన్లు సరళీకరణ విధానాలను మౌనంగా అంగీకరిస్తుండటంతో ఇప్పుడలాంటివేవీ జరగడం లేదు. కనీసం నామమాత్రపు అసమ్మతి కూడా రావడం లేదు. గరళాన్ని మింగితే చావు తప్పదని తెలిసినా నోర్మూసుకుని మింగేలా నచ్చజెప్పటంలో ప్రభుత్వం సఫలమయ్యిందన్నమాట!

సరళీకరణ, ప్రైవేటీకరణ వేగవంతం

విదేశీ పెట్టుబడులకు (ఎఫ్.డి.ఐలు, ఎఫ్.ఐ.ఐలు రెండింటికీ) మరిన్ని అవకాశాలు కల్పించారు. విదేశీ అప్పు పరిమితిని 40 బిలియన్ డాలర్లకు (1,81,200 కోట్ల రూపాయలు) పెంచుకున్నారు. సామాన్యుడి నెత్తిమీద విదేశీ అప్పుభారం అంత కలుస్తుందన్న మాట. ఈ అప్పు మార్కెట్ సెంటిమెంటును పెంచి షేర్ మార్కెట్ లాభానికి ఉపయోగ పడొచ్చు. దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా విదేశీ పెట్టుబడులను అనుమతించారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే హెడ్జ్ ఫండ్సే. ఇవి చాలా ప్రమాదకర పెట్టుబడులు. అమెరికాతో మొదలై ప్రపంచాన్నంతా చుట్టుముట్టి ప్రైవేటు కంపెనీలకు నాలుగైదు ట్రిలియన్ డాలర్ల ప్రభుత్వ సహాయం, సామాన్యులకూ మధ్య తరగతి వారికీ నిరుద్యోగం, ఆకలి, దరిద్రం లను ప్రసాదించిన 2008 నాటి “ప్రపంచ ఆర్ధిక సంక్షోభం” తక్షణ కారణంగా ఇవే పని చేశాయి.

మ్యూచువల్ ఫండ్స్ లో విదేశీ పెట్టుబడుల అనుమతి అనేది, భారత దేశాన్ని సామ్రాజ్యవాద దేశాల ఆర్ధిక వ్యస్ధలకు మరింతగా ముడిపెట్టి వాటి పాదాల వద్ద పడేయటమే. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నుండి తక్కువ దెబ్బలతో ఇండియా బయట పడిందంటే అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో పాక్షికంగా కట్టివేయబడి ఉండడం వల్లనే. నేరుగా చెప్పాలంటే భారత దేశ ఆర్ధిక, ద్రవ్య కార్యకలాపాలు పూర్తిగా సరళీకరించబడకుండా ప్రభుత్వ రంగంలో ఉన్నందువల్లనే. ఇప్పుడా స్ధితిని వదులుకునే చర్యలను మరిన్ని తీసుకుంటున్నారు. ఇది భారత దేశాన్ని మరో అర్జెంటీనా గానో, మరో ఆసియా పులిగానో మార్చడమే. ప్రపంచంలో ఏ చిన్న పరిణామం జరిగినా చిగురుటాకులా వణికిపోయే దశకు భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను ఇంకా వేగంగా నెట్టేసే చర్య ఇది.

మరో రు. 30,000 కోట్ల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు కొత్త బడ్జెట్ సంవత్సరంలో అమ్మాలని ప్రతిపాదించారు. వీటికి పన్ను రాయితీ ఎప్పటిలాగే ఉంటుంది. ఇవి ధనికులకు అదనంగా ఉపయోగపడేవే. ఉద్యోగులకూ అందుబాటులో ఉన్నా, ఇవి అదనపు సౌకర్యం మాత్రం కాదు. రాయితీలను లక్ష రూపాయలకు పరిమితం చేసి ఎన్ని రాయితీలు ప్రకటించినా ఏం ప్రయోజనం గనక?

ఇళ్ళ నిర్మాణంలో కొన్ని రాయితీలు కొద్దిగా పెంచారు. రు. 25 లక్షల ఖరీదు చేసే ఇల్లు కట్టుకుంటే, వారు రు. 15 లక్షలు అప్పు తీసుకుంటే గనక, వారికి అప్పుపై వడ్డీలో 1 శాతం రాయితీ అదనంగా కల్పించారు. పాతిక లక్షల ఇల్లు కట్టుకోవడం ఎగువ మధ్య తరగతి వారికే సాధ్యం కాదు. దానికి పదిహేను లక్షల అప్పు అసలే సాధ్యం కాదు. అదీ కాక మెట్రో నగరాలనుండి చిన్న పట్టణాల వరకూ ఇళ్ళ స్ధలాల ఖరీదు ధనికులకు కూడా అందుబాటులో లేని పరిస్ధితి దాపురించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల పుణ్యాన కొద్దిపాటి ఇల్లు సైతం లగ్జరీ గా మారిపోయింది. ఇల్లు కట్టుకోవడం ఇప్పుడు అచ్చంగా తీరని కల. తీరని కలలకు ఇచ్చే రాయితీని కూడా కలలతో పోటీ పడుతుంటే అటువంటి రాయితీ ఇచ్చి ఏం లాభం?

మొత్తం మీద చూస్తే పన్ను రాయితీల వలన ప్రభుత్వానికి రు. 11,500 కోట్లు అదాయం పడిపోతే, కొత్త పన్నుల ద్వారా రు. 11,300 కోట్లుంటుందని “మని కంట్రోల్” అనే వెబ్ సైట్ ఛీఫ్ ఎడిటర్ లెక్క కట్టాడు. ఇందులో జిమ్మిక్కు ఏంటంటే పన్ను రాయితీలు అధికంగా కార్పొరేట్లకు, ధనికులకు ఉపయోగపడితే, కొత్త పన్నుల భారం అంతిమంగా సామాన్యుడి పైనే పడుతుంది. ఇస్తున్నది ఒకరికైతే గుంజుకుంటున్నది మరొకరినొండి. కనుక “ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో పుచ్చుకోవడం” అన్న సామెత కూడా ఇక్కడ వర్తించదు.

బలహీన వర్గాలకు విదిలింపు

నామమాత్రపు అభివృద్ధికి కూడా నోచుకోక ఉద్యమాలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రాలకు వెయ్యి కోట్ల రూపాయలు విదిలించారు. ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం లకు డబ్బు కేటాయించారు గానీ ప్రాధమిక విద్య ఊసు లేదు. ఈ ప్రతిష్టాత్మక సంస్ధల్లో ఉత్పత్తి అయ్యే మేధావులు విదేశాల్లో స్ధిరపడటం కోసం సిద్ధంగా ఉంటారు. వాళ్ళని తయారు చేయటం కూడా అందుకోసమే. భారతీయుల డబ్బుతో చదువుకొని బహుళజాతి సంస్ధల్ని ఉద్ధరిస్తారు వీళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి తక్షణ కారణంగా పని చేసిన సంక్లిష్టమైన సెక్యూరిటీలకు రూపకల్పన చేసింది ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం లలో చదువుకున్న వారే. కోట్ల రూపాయల చదువు చివరికి దరిద్రుల్ని పెంచటానికి ఉపయోగ పడింది. వారి చదువు సరిగ్గా వినియోగిస్తే దరిద్రులను తగ్గించ వచ్చు కూడా. కాని అది వారు పనిచేసే బహుళ జాతి సంస్ధలకు నచ్చని పని. అంగన్ వాడీల జీతం రు 1500 నుండి రు. 3000 కు పెంచినా నేటి పెరిగిన ధరలతో పోలిస్తే నికరంగా తగ్గినట్లే.

మహిళా సాధికారత కు 500 కోట్ల రూపాయలట. మహిళల సాధికారత అంత చౌకన్నమాట. ప్రాధమిక విద్య దాటి కాలేజి లో చేరేటప్పటికి 34 శాతం మంది చదువు మానేస్తున్నారు. అలా మానేయకుండా ఉండటానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పధకం తప్ప మరొకటి తలచదు. బడి మానేసే వారికి గ్రామీణ ఐ.టి.ఐ లను స్ధాపించి వ్యవసాయం లో వస్తున్న ఆధునిక టెక్నాలజీ పై ట్రైనింగ్ ఇవ్వాలని ఓ పెద్దాయన ఒక తెలుగు టీవీ చానెల్ లో ప్రతిపాదించారు. ఇది చాలా ఉపయోగకరమైన సలహా. అటు ఉద్యోగాలు ఇవ్వవచ్చు. లేదా స్వయం ఉపాధి పొందవచ్చు. దానితో పాటు వ్యవసాయదారులకు సలహాలు ఇచ్చేవారిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అవుతుంది. అంతే కాకుండా మైక్రో ఫైనాన్స్ లను ఉత్పాదక కార్యక్రమాలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా పండగలకు, పెళ్ళిళ్ళకు పెద్ద ఎత్తున అప్పులిచ్చి వసూళ్ళ కోసం వారిని చిత్రహింసలు పెట్టడాన్ని అడ్డుకునే చర్యలు తీసుకోవాలి . కాని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంకే మేమేమీ చేయలేమని చేతులెత్తేయటం, ఈ ప్రభుత్వాలు ప్రజల కోసం కాదని నేరుగా చెప్పడమే.

మేక్రో ఎమనమిక్స్

మేక్రో ఎకనమిక్స్ పరంగా చూస్తే… కొత్త బడ్జెట్ మొత్తం రు. 9,32,440 కోట్లు. రక్షణ రంగానికి రు.1.64 లక్షల కోట్లు. అంటే మొత్తం బడ్జెట్ లో 18 శాతం. ఇది సాధారణంగా ఆచరణలో పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త బడ్జెట్ సంవత్సరంలో కోశాగార లోటు 4.8 శాతం నుండి  4.6 శాతానికి తగ్గించారు. ప్రస్తుత సంవత్సరానికి విధించుకున్న  కోశాగార లోటు లక్ష్యం 5.5 శాతం నుండి 5.1 శాతానికి తగ్గించారు. 3-జి స్పెక్ట్రం ఆదాయం వల్ల ఇది తగ్గి ఉండవచ్చు. లేదా ప్రజల కోసం పెడతామన్న ఖర్చును వాస్తవంలో పెట్టకపోవడం వలన తగ్గి ఉండవచ్చు. లేదా రెండింటి వలన కావచ్చు. 2012-13 సంవత్సరానికి 4.1 శాతం, 2013-14 సంవత్సరానికి 3.5 శాతం కోశాగార లోటును లక్ష్యంగా బడ్జెట్ లో ప్రకటించారు. కోశాగార లోటును తగ్గించడం అంటే స్ధూలంగా సంక్షేమ కార్యక్రామాలపైన ప్రభుత్వ ఖర్చును తగ్గించడమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s