లిబియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఆంక్షలు విధించిన అమెరికా


 

libya unrest

లిబియాలో ప్రజాందోళన

లిబియాలో గడ్డాఫీ మద్దతుదారులకూ వ్యతిరేకులకూ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది. గడ్డాఫీ వ్యతిరేకులు క్రమంగా రాజధాని ట్రిపోలిని సమీపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్రిపోలీ పైనే ఇప్పుడు అటు ఆందోళనకారులూ, ఇటు గడ్డాఫీ ప్రభుత్వ బలగాలూ కేంద్రీకరించాయి. రాజధాని ఆందోళనకారుల వశం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ట్రిపోలీని పట్టుకొని గడ్డాఫీనీ అతని అనుకూలురనూ తరిమివేయాలని తిరుగుబాటుదారులు చూస్తున్నారు. గడ్డాఫీ వ్యతిరేక తిరుగుబాటుకు ఒసామా బిన్ లాడెన్ పూర్తి మద్దతు ఉందని గడ్డాఫీ ప్రకటించాడు. ముస్లిం తీవ్రవాదులుగా అమెరికా ముద్ర వేసిన వారి మద్దతు ఉన్నదని ప్రచారం చేయటం ద్వారా తిరుగుబాటుదారులు కూడా తీవ్రవాదులేనన్న ముద్ర వేయటానికి గడ్డాఫీ ప్రయత్నిస్తున్నాదు. వాస్తవానికి తిరుగుబాటుకు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు, సుదీర్ఘకాలం పాటు నియంతృత్వంలో మగ్గి విసిగిపోవటమే కారణాలుగా పని చేస్తున్నాయి. ట్యునీషియా, ఈజిప్టు లలో విజయవంతమయిన తిరుగుబాట్ల స్ఫూర్తి, అక్కడి పరిస్ధులే తామూఎదుర్కొనడం లిబియన్లను తిరుగుబాటుకు పురిగొల్పాయి.

గడ్డాఫీ ఇంటిపై బాంబులు జారవిడిచి చంపాలని ప్రయత్నించిన అమెరికా ఇప్పుడు లిబియాపై ఆర్ధిక వాణిజ్య ఆంక్సలు విధిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించింది. అమెరికా ఆంక్షలకు మద్దతు సంపాదించే పనిలో హిల్లరీ క్లింటన్ తలమునకలై ఉన్నది. సోమవారం జరగనున్న ఐక్యరాజ్య సమితి సమావేశంలో తన ప్రయత్నాలను హిల్లరీ ముమ్మరం చేయవచ్చు. ఆంక్షలు విధించేముందు అమెరికా యూరోపియన్ యూనియన్ లోని జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలతో సంప్రదింపుల్ జరిపినట్లు తెలుస్తోంది. లిబియా విషయంలో ప్రపంచ దేశాలు ఏకాభిప్రాయంతో ఉండాలని కోరిన అమెరికా తానొక్కటే ఆంక్షలు ఎందుకు ప్రకటించిందొ తెలియరాలేదు. సోమవారం నాడు భద్రతా సమితిలో ప్రవేశపెట్టడానికి ఓ తీర్మానాన్ని బ్రిటన్, ఫ్రాన్సులు తయారు చేస్తున్నాయి. ఆ తీర్మానికి అమెరికా ఇంతవరకు మద్దతు తెలపలేదు. తీర్మానంపై చైనా వైఖరి ఏమిటో తెలియటం లేదు. చైనా వీటో చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.

లిబియాతో ఎటువంటి అర్ధిక చర్యలను చేపట్టకపోవటం, లిబియా పౌరులపై మెషిన్ గన్లు, బాంబులతొ దాడులు చేస్తున్న గడ్డాఫీ, అతని కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఎకౌంట్లను స్తంభింపజేయటం, లిబియా దేశ ఆస్తులను బేరానికి పెట్టకుండా గడ్డాఫీ, అతని మద్దతుదారులపై నిఘా పెట్టడం మొదలయిన చర్యలను అమెరికా ప్రారంభించింది. లిబియాకు ఆయుధాలు సరఫరా కాకుండా నిషేధం విధించడం, పర్యాటక కార్యకలాపాలకు అనుమతి రద్దు, ఆస్తుల స్తంభన తదితర చర్యలను సమితి కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది. లిబియా ప్రజల పోరాటానికి దీటుగా స్పందించటానికి పశ్చిమ దేశాలు కిందా మీదా పడుతున్న సంగతి వారి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. వారి ప్రతినిధులు లిబియా తిరుగుబాటులో లేకపోవడం లిబియా ప్రజలకు అనుకూలమైన అంశం. కానీ లిబియాపై సాయుధదాడి జరిపే అవకాశాలను తోసిపుచ్చడానికి అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి నిరాకరించటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అమెరికా 2004 నుండీ గడ్డాఫీతో వ్యాపార సంబంధాలను పెంచుకుంది. అమెరికా విమానాన్ని స్కాట్లండ్ గగన తలంపై లిబియా పౌరుడు పేల్చివేసిన సంఘటన పట్ల బాధ్యత వహిస్తానని గడ్డాఫీ అంగీకరించడంతో అప్పటినుండి అమెరికా లిబియా పైన ఆంక్షలు ఎత్తివేసింది. అమెరికా ఆయిల్ కంపెనీలు లిబియాలో చమురు వెలికి తీసే పనిలో కుదురుకున్నాయి. ఇతర దేశాల ఆయిల్ కంపెనీలు లిబియాలో చమురు వెలికి తీయటం ఆపేసి తమ సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నప్పటికీ అమెరికా కంపెనీలు ఇంకా ఆ పని చేయలేదు. తమ పౌరులను సైతం చాలా ఆలస్యంగా వెనక్కి రప్పించుకుంది. తమ పౌరులు వెనక్కి వచ్చాక మాత్రమే తాజా ఆంక్షలు ప్రకటించింది. లిబియా పౌరులు తమ ప్రభుత్వాన్ని తాము ఏర్పరచుకోడానికి అమెరికా ఆటంకంగా మారిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

శుక్రవారం రాజధానిలో పెద్ద ప్రదర్శనను నిర్వహించటానికి తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. ఆ విషయమై ట్రిపోలీ వాసులకు తిరుగుబాటుదారులు ముందుగానే మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్ లను పంపినట్లుగా అమెరికాకి చెందిన “డెమొక్రసీ నౌ” టీవీ ఛానెల్ తెలిపింది. శుక్రవారం నిర్వహించిన ప్రదర్శనలో ఆందోళనకారులపై ప్రభుత్వ పోలీసులు, సైన్యం నేరుగా కాల్పులు జరిపారనీ వందల మంది చనిపోయారనీ ధృవీకరించబడని వార్తలు తెలుపుతున్నాయి. లిబియాలో ఇప్పటివరకు 2,000 మంది పౌరులు, ఆందోళనకారులు చనిపోయినట్లు అనధికార వార్తలు తెలుపుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో ఉన్న లిబియా దౌత్యవార్తలు ఆ వార్తలు నిజమేనంటున్నారు.

గడ్డాఫీ తనయుడు, లండన్ లో చదువుకున్న 38 ఏళ్ళ సైఫ్ అల్-ఇస్లామ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించాడు. త్వరలో లిబియాకు శాంతి తిరిగి రానున్నదని అతను చెప్పాడు. బాణసంచా పేలుడు శబ్దాలను కాల్పులుగా భావించవద్దని రిపోర్టర్లను కోరాడు. అది, పరోక్షంగా కాల్పుల శబ్దాలను బాణసంచాగా పేలుళ్ళుగా భావించమని కోరడమే. మూడో పెద్ద పట్టణమయిన మిశ్రాటాలో గడ్డాఫీ అనుకూల బలగాలకు సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అంగీకరించాడు. మిశ్రాటాలో ప్రభుత్వ బలగాలను ఆందోళనకారులు వెనక్కి తరిమినట్లు అప్పటికే వార్తలు వచ్చాయి. సైన్యం చర్చలకు సిద్ధంగా ఉందనీ శనివారానికి అంతా సద్దుమణుగుతుందని సైఫ్ నమ్మబలికాడు. మిశ్రాటి పట్టణం లిబియా పశ్చిమ ప్రాంతంలో ఉంది. తూర్పుప్రాంతాన్ని అదుపులీకి తీసుకున్న ఆందోళనకారులు పశ్చిమ ప్రాంతంలో కూడా పురోగమిస్తున్నారు. రాజధానిలో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు గడ్డాఫీ అదుపులో లేవని అక్కడి ప్రజలే ఫోన్ సమాచారం ద్వారా తెలిపినట్లు రాయిటర్స్ రాసింది.

ప్రపంచంలో మిలిటెంట్ ఉద్యమాలకు మద్దతు తెలిపినందుకు గడ్డాఫీని “పిచ్చి కుక్క” అని అభివర్ణించిన అమెరికా, తనతో సంబంధాలు మొదలుపెట్టాక ఆ “పిచ్చి కుక్క” తొనే వ్యాపారం చేయటానికి ఎటువంటి అభ్యంతరాలూ లేకపోవటం అమెరికా బుద్ధి ఏపాటిదో అర్ధం అవుతుంది. ఇప్పుడు సందు చూసుకొని అమెరికా లిబియాలో గట్టి మద్దతుదారుల కోసం తప్పక ప్రయత్నిస్తుంది.

గడ్డాఫీ అంతర్జాతీయంగా ఈ సామ్రాజ్యవాద దేశానికీ ఇతమిద్ధంగా మిత్రత్వం నెరపక పోవడం లిబియా ప్రజలకు ఇప్పుడు లాభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తిరుగుబాటుదారుల నాయకులకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల ప్రోత్సాహం, మద్దతు ఉన్న పరిస్ధితులేవీ లేకపోవటం ఇందుకు సాక్షీభూతంగా ఉన్నాయి. అంతర్గతంగా, రహస్య మద్దతు ఆ దేశాలనుండి ఉన్నదీ లేనిది తెలియని పరిస్ధితే ప్రస్తుతం నెలకొని ఉంది. దాదాపు ఏ విధమైన వార్తా సంస్ధకూడా తిరుగుబాటు దారులకు పశ్చిమ సామ్రాజ్యవాదుల మద్దతు ఉన్న విషయాన్ని ప్రస్తావించలేదు. వ్యాపార పరంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు గడ్డాఫీ దగ్గరగా ఉన్నాడు తప్ప లోతైన సంబంధాలు ఉన్నట్లు సమాచారం ఏదీ లేదు. దానితో లిబియా ప్రజలకు ట్యునీషియా, ఈజిప్టు దేశాలలాగా కాకుండా ఉన్నంతలో  తమ స్వంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అద్భుత అవకాశం లభించినట్లయ్యింది. అయితే లిబియన్లు అమెరికా పట్ల అప్రమత్తతగా ఉండాల్సిందే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s