రైల్వేల ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపిన మమత రైల్వే బడ్జెట్


పాపులిస్ట్ నినాదాల మాటున మమత రైల్వే బడ్జెట్, రైల్వేల రంగంలో ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపింది. ప్రైవేటీకరణ గాయత్రీ మంత్రంగా మారిన ఈ రోజుల్లో పాపులర్ బడ్జెట్లు విమర్శలు ఎదుర్కొంటున్నట్లే మమత గారి కొత్త రైల్వే బడ్జెట్ కూడా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పండితులనుండి విమర్శలను ఎదుర్కొంటోంది. మమత మాత్రం “మానవీయ ముఖం (తొడుగు లేదా మాస్క్ అంటే సరిగ్గా సరిపోతుంది) తో ఆర్ధిక వ్యవస్ధ మెరుగుదలకు దోహదం చేసే బడ్జెట్ నాది,” అని అభివర్ణించింది. వచ్చే మే నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలు జరగనున్నందున సింగూరు, నందిగ్రామ్ లకు మమత వరాలు కురిపించింది. అవినీతి ఆరోపణలు, అధిక ధరలతో అప్రతిష్ట పాలయిన యు.పి.ఏ ప్రభుత్వం బడ్జెట్ తాయిలాలతో రాష్ట్రాల ఎన్నికల గండాన్ని గట్టెక్కాలని చూస్తున్నట్లుగా రైల్వే బడ్జెట్ ద్వారా గ్రహించవచ్చని విశ్లేషకులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేసారు. సోమవారం నాటి ప్రధాన బడ్జెట్ ఎలా ఉండబోతున్నదో కూడా రైల్వే బడ్జెట్ తెలియజేసింది.

ప్రైవేటీకరణకు ఊతమిస్తూ మమత 85, కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. ఇవన్నీ ప్రైవేటు కంపెనీల చొరవను పెంచేవి లేక మొత్తంగా ప్రైవేటు రంగానికి అప్పగించినవి. ప్రైవేటు రంగంలో కొత్త వ్యాగన్ ప్రాజెక్టులకు బడ్జెట్ అవకాశం కల్పించింది. దానితో పాటు ప్రైవేటు ప్రాజెక్టుల అనుమతి ప్రక్రియను సులభతరం చేసింది. “భారత రైల్వేలను పటిష్ట పరచటం, సగటు జీవి పట్ల సామాజి బాధ్యతను కనబరచటం అనే రెండు లక్ష్యాలను ప్రధానంగా తీసుకొని బడ్జెట్ రూపొందించాను” అని మమత పేర్కొంది. సగటు జీవి దృక్కోణంలో చెప్పాలంటే, ప్రైవేటీకరణ ద్వారా రైల్వే రంగాన్ని పటిష్ట పరచటం, రానున్న ఎన్నికల దృష్ట్యా చార్జీల పెంపుదలను వచ్చే సంవత్సరానికి వాయిదా వేయటం అనే రెండు లక్ష్యాలను రైల్వే మంత్రి దృష్టిలో ఉంచుకుందన్నమాట!

ప్యాసింజర్, సరుకు రవాణా ఛార్జీలను బడ్జెట్ ముట్టుకోలేదు. అన్ని తరగతుల రిజర్వేషన్ చార్జీలను దాదాపు సగానికి తగ్గించింది. ప్రయాణ చార్జీలతో పోలిస్తే రిజర్వేషన్ చార్జీలు పెద్ద లెక్కలోకి రావు. అవి తగ్గినా పెద్ద తేడారాదు. కాకుంటే తగ్గించామని చెప్పుకోడానికి ఉపయోగపడుతుంది. 2011-12 సంవత్సరంలో 1,06,000 కోట్ల రూపాయలు (23.4 బిలియన్ డాలర్లు) రైల్వేల ఆదాయం ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. ప్రయాణీకులు 6.4 శాతం పెరుగుతారనీ 993 మిలియన్ టన్నుల సరుకు రవాణా అవుతుందనీ అంచనా వేశారు. 57,630 కోట్ల రూపాయలను (12.68 బిలియన్ డాలర్లు) తాజాగా రైల్వేల అభివృద్ధికి ఖర్చు చేయాలని అంచనా కట్టారు. దానిలో ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు (4.4 బిలియన్ డాలర్లు) ఖర్చు పెడితే మిగిలింది అప్పు చేస్తారు. లేదా ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ముందు జాగ్రత్తగా అనుకుంటా ప్రైవేటు పెట్టుబడులు ఎంత అనేది చెప్పలేదు. ఎంతొస్తే అంతా అనుమతించే అవకాశం ఉంది.

మార్కెట్ అనుకూల విశ్లేషకులు కార్పొరేట్ వార్తా సంస్ధలు మాత్రం తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ విమర్శల వాన కురిపించాయి. దేశ మౌలిక రంగ అభివృద్ధిలో వెనుకబడి ఉండీకూడా సంస్కరణలపై ఆశలు పెట్టుకున్నవారిని నిరాశకు గురి చేస్తూ మమత పాపులిస్టు బడ్జెట్ ప్రతిపాదించిందని రాయిటర్స్ సంస్ధ అబివర్ణించింది. ఎమర్జింగ్ మార్కెట్లలో ఇండియాకు పోటీదారయిన చైనా కంటే రవాణా సౌకర్యాలు హీనంగా ఉన్నా వరుసగా పాపులిస్టు బడ్జెట్లే తెస్తున్నారని విమర్శించింది. 1947 పూర్వం బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన రైల్వేలు అభివృద్ధికి నోచుకోలేదని అయినా ప్రైవేటీకరణకు చొరవ చూపటం లేదనీ దెప్పిపొడిచింది. మౌలిక నిర్మాణరంగానికి వచ్చే దశాబ్దంలో 1.5 ట్రిలియల్ డాలర్లు ఖర్చు చేయాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆచరణలో చూపడం లేదన్నది.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న బడ్జెట్ అని ఓ ప్రైవేట్ విశ్లేషకుడు నిట్టూర్చాడు. కాని రైల్వేల ఆధునికీకరణ వెనకబడుతున్నదని ఆయన బాధపడ్డాడు. 14 లక్షల ఉద్యోగులు ఉన్న భారత రైల్వేలు ఉద్యోగుల కోసం స్కూళ్ళు, ఆసుపత్రులు, ఇళ్ళు కూడా నిర్మిస్తుందని మరొకాయన విస్తుపోయాడు. రోజుకు 2.2 కోట్ల మందిని గమ్యాలకు చేర్చే భారత రైల్వే ఆధునిక విమానయాన రంగం పక్కన వెలవెల పోతోందని ఇంకో మార్కెట్ పండితుడు అభివర్ణించాడు. రైల్వేల్లో 336.5 మిలియన్ డాలర్లు (1525 కోట్ల రూపాయలు) మాత్రమే ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయని బ్లూమ్ బర్గ్ అనే అమెరికా బిజినెస్ చానల్ తెలిపింది. రోడ్లు, విద్యుత్ రంగాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆ చానల్ తెలిపింది.

రైల్వేల్లో అధికంగా ప్రయాణించేది పేదలే. ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తే వేగం పెరిగి ధనిక ప్రయాణీకులు కూడా పెరుగుతారని కొంతమంది సలహా ఇస్తున్నారు. కాని పేదలు తగ్గిపోతారని మాత్రం చెప్పటం లేదు. ప్రైవేటీకరణ రైల్వేలను పేదలకు అందుబాటులో లేకుండా చేస్తుందన్న విషయాన్ని దాస్తున్నారు. ప్రైవేటు రోడ్లు (టోల్ గేట్లు అందుకే కదా), ప్రైవేటు విమానాలు, ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు ఇన్సూరెన్స్ ఇలా అధిక భాగం ప్రైవేటు రంగాన్ని చూస్తున్న మనం ఇక ప్రైవేటు రైల్వేలను త్వరలో చూడబోతున్నాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s