కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ రోజు రోజుకీ ఒంటరి అవుతున్నాడు. విదేశీ రాయబారుల్లో చాలామంది గడ్డాఫీకి ‘బై’ చెప్పేశారు. ప్రజలపై హింస ఆపమని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులవి న్యాయమైన్ డిమాండ్లు, వాటిని ఒప్పుకొని దిగిపో అని సలహా ఇస్తున్నారు. గడ్డాఫీ అనుకూల సైనికులు వీధుల్లో జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 1,000 మంది పౌరులను చనిపోయారని ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాట్టిని ప్రకటించాడు. వ్యాపార సంబంధాల వలన లిబియాలో ఉన్న తమ పౌరులను అక్కడినుండి ఖాళీ చేయించడానికి త్వరపడుతున్నారు.
గడ్డాఫీ మాత్రం తాను దిగేది లేదంటున్నాడు. స్వదేశంలో అమరుడు కావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వ టీవీలో మాట్లాడుతూ ప్రకటించాడు. తన మంత్రులు, సైనికులు అనేకులు ఆందోళనకారులకు మద్దతు ఇస్తున్నప్పటికీ ఒత్తిడికి లొంగడాన్ని ససేమిరా అంటున్నాడు. ఈజిప్టు వదిలి వెళ్ళటానికి ముందు ముబారక్ ఎటువంటి మొండితన ప్రదర్శించాడో అదే తరహా వైఖరి గడ్డాఫీలో కనపడుతోంది. 42 సంవత్సరాలనుండి అనుభవిస్తున్న అధికారాన్ని వదులుకోడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆందోళనకారుల వెంటబడి, తరిమి, పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించండి అని టీవిలో పిలుపునిచ్చాడు.
ప్రభుత్వానికి మద్దతుగా బుధవారం ప్రదర్శనలు జరపమని ఇచ్చిన పిలుపుకు పెద్దగా స్పందన రాలేదు. ఉదయానికల్లా కేవలం 150 మంది మాత్రమే గ్రీన్ స్క్వేర్ వద్ద గుమికూడారు. వారు జాతీయ పతాకం చేబూని గడ్డాఫీ ఫొటోలు పట్టుకుని గడ్డాఫీ అనుకూల నినాదాలు ఇచ్చారు. ట్రిపోలీ వీధుల్లో పౌరులు కనపడటం లేదు. గడ్డాఫీ అనుకూల సైనికులు మెషిన్ గన్లతో పహారా కాస్తున్నారు. మూడు రోజుల క్రితం వారి కాల్పుల్లో డెబ్భై మంది వరకు చనిపోవటంతొ పౌరులు వీధుల్లోకి రావటానికి జంకుతున్నారని లిబియాలో ఉన్న ట్యునీషియా దేశీయుడు చెప్పినట్లు బిబిసి తెలిపింది. “మీ దైనందిన కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించండి” అని గడ్డాఫీ చెపుతున్నప్పటికీ ఒకటి రెండు వీధి హోటళ్ళు తప్ప ఎవరూ తలుపులు తెరవలేదు.
లిబియా ఆందోళనల నేపధ్యంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశం గడ్డాఫీకి వ్యతిరేకంగా స్పందించింది. లిబియాపై ఆంక్షలు విధించాలని పిలుపినిచ్చింది. “లిబియాతో గల ఆర్ధిక, వాణిజ్య, ద్రవ్య సంబంధాల నన్నింటినీ మళ్ళీ నోటీసు ఇచ్చేవరకూ సస్పెండ్ చేస్తున్నామ”ని ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ ప్రకటించాడు. కానీ కతార్ దేశ ప్రధాన మంత్రి “లిబియాను ఒంటరిని చేయాలనుకోవడం లేదు” అని ప్రకటించినట్లుగా రాయిటర్స్ తెలిపింది.
లిబియాలోని హింసపై ప్రపంచ దేశాలన్నీ ఒక్క గొంతుతో స్పందించాలని అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. “అమెరికా సరైన సమయంలో తగిన చర్యలను లిబియా విషయంలో తీసుకుంటుంది” అని హిల్లరీ తెలిపెంది. కానీ లిబియాలో అమెరికా మాట చెల్లుబాటు అయ్యే పరిస్ధితి లేదు. లేని పెత్తనమైనా ఉన్న పెత్తనమైనా అమెరికా పెత్తనం చేయకుండా ఉండలేదు. అదీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక ముఖ్య సంఘటనలో తన మాట లేకపోతే అమెరికా ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. వేలో, కాలో పెట్టాలని చూస్తుంది. అవి తెగుతాయని తెలిసినా సరే. మొత్తం మీద కతార్ ప్రధాన మంత్రి ప్రకటనను బట్టి ప్రపంచ దేశాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు భావించవచ్చు.
ప్రపంచ ఆయిల్ లో లిబియా రెండు శాతం ఉత్పత్తి చేస్తుంది. దానితో లిబియా ఆందోళనలు ఆయిల్ ధరను పైపైకి నెడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బుధవారం ఉదయానికల్లా బ్యారల్ కు 107 డాలర్లను స్వల్పంగా అధిగమించింది.
రానున్న కొద్ది రోజుల్లో గడ్డాఫీకి ముబారక్ కు పట్టిన గతే పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజా ఉద్యమాల శక్తి అలాంటిది. ఈ రోజు ఏ శక్తీ లేని, ఎలాంటి ప్రభావమూ లేని అర్భకులుగా కనిపించిన వారే రేపటికల్లా ప్రళయ ఝంఝామారుతంలా ప్రత్యక్షం కావడమే ప్రజా పోరాటాల ప్రత్యేకత.