సిగ్గూ, లజ్జా వదిలేసిన అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మరో సారి నవ్వుల పాలు


 

US imperialism

మట్టి కాళ్ళ మహా రాక్షసి

పాపాల పుట్ట అమెరికా తాను సిగ్గూ, లజ్జా ఎప్పుడో వదిలేశానని మరోసారి ఋజువు చేసుకుంది. తాను నిత్యం వల్లించే విలువలూ, సూత్రాలూ తనకు ఏ మాత్రం వర్తించవని ప్రపంచ వేదిక ఐక్యరాజ్యసమితి లోనే విలువల వలువలు ఊడదీసుకుని మరీ చాటి చెప్పుకుంది. తనకు నీతీ, నియమాలు ఒక లెక్క కాదనీ, తనకు ఉపయోగం అనుకుంటే ఎన్నిసార్లు మొఖం మీద ఉమ్మేసినా తుడుచుకు పోగలననీ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. తన హీనపు బతుక్కి వేరే ఎవరూ అద్దం పట్టనవసరం లేదనీ, తనకు తానే తన చర్యల ద్వారానే తన విలువల రాహిత్యాన్ని న్యూయార్క్ వీధుల్లో ఆరేసుకుని మరీ చూపగలనని ఎలుగెత్తి చాటింది.

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తన ఎన్నికల ప్రచారంలోనే “తాను ప్రెసిడెంట్ అయితే ముస్లిం ప్రపంచంతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకుంటాననీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అరవై ఏళ్ళనుండి రగులుతున్న పాలస్తీనా – ఇజ్రాయెల్ సమస్యను వినూత్న దృక్పధంతో పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాననీ కూడా ఒట్టు పెట్టిన సంగతీ విదితమే. కానీ ఒబామా మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి… ఒక్క ముస్లిం ప్రపంచానికే కాదు, వేల సంవత్సరాలనుండి మనిషి సాధించిన నాగరికత మొత్తానికే తలవంపులు తెచ్చేలా అరబ్ ప్రపంచం ప్రవేశపెట్టిన ఒక సాధారణ, న్యాయమయిన తీర్మానాన్ని వీటో చేసి పారేసింది. పాలస్తీనీయుల భూభాగంపై అక్రమంగా, అన్యాయంగా అక్కడ నివసిస్తున్న పాలస్తీనీయుల ఇళ్ళను కూలగొట్టి మరీ ఇజ్రాయెల్ నిర్మిస్తున్న సెటిల్మెంట్లను ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వీటో చేసింది.

అమెరికా సిగ్గుమాలినతనానికి ఋజువేంటంటే, భద్రతా సమితిలోని పదిహేనుమంది సభ్య దేశాల్లో అమెరికా తప్ప మిగిలిన పద్నాలుగు సభ్య దేశాలూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇంకా చెప్పాలంటే అరబ్ దేశాలు ప్రవేశ పెట్టిన ఆ తీర్మానానికి ఐక్యరాజ్యసమితి లోని 130 సభ్య దేశాలు సహ ప్రతిపాదకులుగా వ్యవహరించారు. అంటే ప్రపంచంలోని దేశాల్లో దాదాపు నూటికి తొంభై దేశాలు పాలస్తీనీయుల భూభాగంపై ఇజ్రాయెల్ నిర్మిస్తున్న సెటిల్ మెంట్లు అక్రమమని నిర్ధారించాయన్నమాట. అమెరికా వీటో వలన తీర్మానం సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా గొప్ప విజయం సాధించినట్లే. అమెరికా, ఇజ్రాయెల్ లు పాటిస్తున్న దౌర్జన్య న్యాయాన్ని బలంగా ఈడ్చి తన్నినట్లే.

ఒబామా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికన్నట్లుగా బలవంతంగా ఇజ్రాయెల్, పాలస్తీనాలను చర్చల బల్ల వద్దకు తెచ్చాడు. అదికూడా ఇజ్రాయెల్, తాను అక్రమంగా నిర్మిస్తున్న సెటిల్ మెంట్ల –అది కూడా తూర్పు జెరూసలేంలో నిర్మించే సెటిల్ మెంట్లను వదిలేసి– నిర్మాణాన్ని పాక్షికంగా, తాత్కాలికంగా, కేవలం పది నెలలు (మాత్రమే) ఆపడం వలన పాలస్తీనీయులు చర్చలకు రావటానికి ఒప్పుకున్నారు. దానిని సెటిల్ మెంట్ ఫ్రీజ్ అన్నారు. పాలస్తీనీయులు సెటిల్మెంట్లను పూర్తిగా ఆపేస్తే తప్ప, ఇక భవిష్యత్తులో నిర్మించబోనని హామీ ఇస్తే తప్ప చర్చలకు రామని మొదటినుండీ చేపుతూనే ఉన్నారు. ఒబామా బలవంతం మీద మొదటి తొమ్మిది నెలలు పరోక్ష చర్చలు మాత్రమే జరిగాయి. అంటే అమెరికా ఉపాధ్యక్షుడు జోబిడెన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ, వెస్ట్ బ్యాంక్ (పాలస్తీనాలో ఒక భాగం) అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ల మధ్య చక్కర్లు కొడుతూ ఒకరి అభిప్రాయాలు మరొకరికి చేరవేస్తూ ఉంటాడు. ఒక విధంగా పోస్ట్ మేన్ ఉద్యోగం అన్నమాట.

మరో నెలలో ఇజ్రాయెల్ తనకు తానుగా సెటిల్ మెంట్ల నిర్మాణంపై 2009 డిసెంబర్ 27 న విధించుకున్న పదినెలల మారిటోరియం ముగుస్తుందనగా ఇజ్రాయెల్ తో ప్రత్యక్ష చర్చలు జరపటానికి అబ్బాస్ నేతృత్వం లోని పాలస్తీనా పక్షం ఒప్పుకోవటంతో ప్రత్యక్ష చర్చలు (డైరెక్ట్ టాక్స్) మొదలయ్యాయి. కానీ 2010 సెప్టెంబరు 27 తో పది నెలల “సెటిల్ మెంట్ల నిర్మాణ స్తంభన” గడువు ముగిసిపోయింది. గడువును పొడిగించమని అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ లోని ప్రధాన దేశాలయిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లు కూడా కోరాయి. అమెరికా అయితే దాదాపు బ్రతిమలాడింది. కాని ఇజ్రాయెల్ లో అధికారంలో ఉన్న పచ్చి మితవాదులు అందుకు ఒప్పుకోలేదు. సెటిల్ మెంట్ల నిర్మాణం మళ్ళీ అట్టహాసంగా పత్రికలను పిలిచి మరీ మొదలు పెట్టారు.

దాంతో చర్చలు ముగిసిపోయాయి. తొమ్మిది నెలల పరోక్ష చర్చలు, ఆ తర్వాత ఒక నెల ప్రత్యక్ష చర్చలు అన్నీ ఒబామా ఎన్నికల హామీ కోసం బలవంతంగా ఆడిన డ్రామా అన్న అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఇప్పుడు చర్చలూ లేవు, అనుమానాలను పట్టించుకొనే నాధుడూ లేడు. చర్చలు అర్ధంతరంగా ముగిసాక “అరబ్ లీగ్” సమావేశమయ్యింది. రెండురోజులు చర్చించి చివరికి చర్చల కోసం కృషి చేసే బాధ్యతను మళ్ళీ అమెరికా పైనే వేసి చేతులు దులుపుకున్నాయి. అరబ్ దొంగలంతా కలిసి పెద్ద దొంగ అమెరికా చేతికి తాళం ఇచ్చేశాయన్న మాట. 2010 డిసెంబరు 7 న సెటిల్ మెంట్లను ఆపేయాలంటూ ఇజ్రాయెల్ ను డిమాండ్ చేయటాన్ని విరమించుకున్నట్లుగా అమెరికా ప్రకటించింది. తాళం పుచ్చుకున్న పెద్ద దొంగ మేటర్ అలా డిసైడ్ చేశాడన్నమాట.

ఆ తర్వాత ఎలాగో కష్టపడి అరబ్ దేశాలు ఒక తీర్మానం తయారు చేశాయి. “ఇజ్రాయెల్, తాను ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల్లో అక్రమంగా సెటిల్ మెంట్లు నిర్మించడం మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పటానికి ఆటంకంగా ఉన్నాయి,” అన్నదే ఆ తీర్మానం సారాంశం. 2010 సెప్టెంబరులో పాతిక రోజుల ప్రత్యక్ష చర్చలు ముగిసిన కొద్ది రోజుల పిమ్మట అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో, ఇజ్రాయెల్ నిర్మిస్తున్న సెటిల్ మెంట్లు మధ్య ప్రాచ్యంలో శాంతికి ఆటంకంగా ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. పాలస్తీనీయులు తమ భవిష్యత్ రాజధానిగా తూర్పు జెరూసలేంను భావిస్తున్నారు గనుక అక్కడ కూడా సెటిల్ మెంట్ల నిర్మాణం ఆపేయాలంది. ఈ మాటల్ని అమెరికా పరోక్ష చర్చలు మొదలవ్వటానికి ముందు కూడా చాలా సార్లు చెప్పింది. చర్చలు అర్ధంతరంగా ముగిసాకా చెప్పింది. కానీ అవే మాటలను తీర్మానంగా పెట్టే సరికి “తూఛ్” అనేసింది.

అంటే, అమెరికా ఘనంగా చేసే నీతి సూత్రాల ప్రకటనలన్నీ నీటి మీద రాసే రాతల్లాంటివే నన్నమాట! అమెరికాకి కావలసింది స్వప్రయోజనాలే తప్ప అది ఎప్పుడూ చెప్పే ‘ప్రపంచ శాంతి’ కోసం కాదన్న మాట. అంత నీతిమాలినది కాబట్టే రెండు స్వతంత్ర దేశాలమీద ఆక్రమిత దాడులు చేయగలిగింది. దౌర్జన్యం తప్ప వేరే తెలియనిది కాబట్టే ఉగ్రవాదం పై యుద్ధం పేరుతో అతి పెద్ద ఉగ్రవాద దేశంగా మారి ప్రపంచం మీదికి ఆయిలు కోసం, మార్కెట్ల కోసం ఆంబోతు లాగా తెగబడి రంకెలు వేస్తోందన్నమాట.

అమెరికా అతి పెద్ద రాక్షసే కావచ్చు. కానీ అది మట్టి కాళ్ళ రాక్షసి మాత్రమే. వంద గొడ్లను తిన్న రాబందు, ఒక్క గాలివానకు కూలినట్లు… ముప్ఫైఏళ్ళు నియంతగా ఈజిప్టును ఏలిన ముబారక్ పద్దెనిమిది రోజుల ప్రజా ఉద్యమ ఫెళ ఫెళార్భటుల మెరుపు తుఫానుకు మొదలు నరికిన చెట్టులా కూలిపోయినట్లు… తెరలు తెరలుగా, పౌర్ణమినాటి కడలి తరంగాలై అరబ్బు సామ్యాజ్యాలను గడగడలాడిస్తున్న మట్టి మనుషుల సమూహాల చేతిలో అమెరికా సామ్రాజ్యవాదం కూకటి వేళ్ళతో పెకలించుకు పోవటం ఖాయం. అది ఎప్పుడన్నదే ప్రశ్న తప్ప, కూలుతుందా లేదా అన్నది ప్రశ్న కానే కాదు. కాకుంటే కూల్చటానికి సిద్ధం కావలసిన వారిదే ఆలస్యం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s