
సోమవారం సెంట్రల్ కైరోలో ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ అలెగ్జాండ్రియా’ బ్రాంచి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు వందల మంది కార్యాలయం బయట చేరుకుని తమ అధికారులను పదవి నుండి తప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ముబారక్ ను వెళ్ళిపొమ్మన్నట్లే వారిని కూడా వెళ్ళి పోవాల్సిందిగా కోరుతూ “వెళ్ళిపో! వెళ్ళిపో!” అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వ తెలివిజన్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు తమ కార్యాలయం ముందు గుమిగూడి తమ వేతనాలను పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ నినాదాలిచ్చారు. దాదాపు 500 మందికి పైగా ఈ ఆందోళనలో పాల్గొన్నారని రాయటర్స్ వార్తా సంస్ధ తెలియ జేసింది. ముబారక్ దొంగిలించిన డబ్బును ఎనిమిది కోట్ల మంది ఈజిప్షియన్ లకు పంచినట్లయితే మా దరిద్రం వదిలిపోతుందని ప్రదర్శకుల్లో ఒకరయిన 52 ఏళ్ళ వితంతువు ఆక్రోశించింది. ఆమెకు ఐదుగురు పిల్లలని తెలిపింది. పిల్లలను పోషించుకోలేక పోతున్నానని ఆమె తెలిపింది.
నిరసనలు, సమ్మెలు, ధర్నాలు ఈజిప్టు అంతటా వ్యాపించినట్లు వార్తా సంస్ధలు తెలియజేశాయి. ప్రభుత్వ సంస్ధలన్నింటా కార్మికులు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. స్టాక్ ఎక్స్చేంజ్, టెక్స్ టైల్స్ పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, మీడియా సంస్ధలు, పోస్టల్ సర్వీసులు, రైల్వేలు ఇలా ఒకటని కాకుండా అన్ని విభాగాల కంపెనీలు, సంస్ధల్లో కార్మికులు ఉద్యోగులు ప్రధానంగా వేతనాల పెంపుతో పాటు స్ధానిక సమస్యలను కూడా జోడించి సమ్మెలకు, నిరసన ప్రదర్శలకు, ఊరేగింపులకు దిగారు. కొత్తగా అనుభవంలోకి వచ్చిన “అసంతృప్తి వ్యక్తం చేసే స్వేచ్చ”ను ఉపయోగించుకుని తమ కొర్కెలను తీర్చుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు. ఆరోగ్య, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖల ఉద్యోగులు సైతం నిరసన చేపట్టారు.
అయితే అధికారం చేతిలో పెట్టుకున్న సైన్యం ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ దేశంలో మామూలు పరిస్ధితిని తెచ్చి ఆర్ధిక కార్యకలాపలను గాడిలో పెట్టడానికి ప్రధమ ప్రాధాన్యం ఇవ్వడానికి సమాలోచనలు జరుపుతున్నది. సమ్మెల వలన ఉత్పత్తి కార్యక్రమాలకు భంగం కలగ కుండా సమ్మెలను నిషేధించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇంతవరకు “స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ” చట్టం ఎత్తివేత గురించి మాట్లాడకపోవటం కార్మికులు, ఉద్యోగుల నిరసనలను అదుపు చేయటానికే అన్న సంగతి ప్రజలకు తెలియజేసే నాయకులెవరూ కనిపించడం లేదు.
సమావేశాలను గానీ, సమ్మెలను గానీ, ప్రదర్శలను గానీ వేటికీ అనుమతి ఇవ్వకుండా నిషేధిస్తూ మిలట్రీ కౌన్సిల్ ఒక ప్రకటన చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగం గానే తాహ్రిరి స్క్వేర్ లో సంస్కరణలు ప్రవేశపెట్టడం చూసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్న యాభై మంది ఆందోళనకారుల్లో నాయకులను సైన్యం నిర్బంధం లోకి తీసుకుంది. సైన్యం అరెస్టులను వ్యతిరేకించేవారి స్వరాలేమీ వినిపించడం లేదు.
ఈజిప్టు ప్రజల ఆందోళన వారి ఆకాంక్షల మేరకు సఫలం కాలేదని సైన్యం పాలనలోని మొదటి రోజే స్పష్టమయ్యింది.
