జపాన్ ను అధిగమించి రెండో స్ధానానికి చేరిన చైనా అర్ధిక వ్యవస్ధ


చైనా ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. రెండవ స్ధానంలో ఉన్న జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి చైనా రెండో స్ధానం లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి 2010 సెప్టెంబరు నాటికే చైనా జపాన్ ను అధిగమించింది. వార్తా సంస్ధలు ఎందుకనో అప్పట్లో పట్టించుకోలేదు. 2010 డిసెంబరుతో చైనా ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు ఆర్ధిక సంవత్సరం క్యాలెండర్ సంవత్సరంతో సమానంగా ఉంటుంది. ఆర్ధిక సంవత్సరం ముగిసాక చైనా ఆర్ధిక వ్యవస్ధ జపాన్ దేశ ఆర్ధిక వ్యవస్ధను దాటిందని బిబిసి వార్తా సంస్ధ ప్రకటించింది.
2010 ముగిసే నాటికి జపాన్ స్ధూల జాతీయోత్పత్తి (జిడిపి) 5.474 ట్రిలియన్ డాలర్లు ఉండగా చైనా స్ధూల జాతీయోత్పత్తి 5.745 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బిబిసి తెలిపింది. అయితే చైనా అధికార పత్రిక “జిన్ హువా” జనవరి 20 తేదీన చైనా జిడిపి 6.050 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రకటించింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికా స్ధూల జాతీయోత్పత్తి 14.624 ట్రిలియన్ డాలర్లు. అంటే చైనా జిడిపి కంటే అమెరికా జిడిపి దాదాపు మూడురెట్లు ఉందని చెప్పవచ్చు. మరో దశాబ్దానికి చైనా జిడిపి ఆమెరికా జిడిపిని అధిగమిస్తుందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ చైనా, అమెరికాను చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించ వలసి ఉంది. (ఒక ట్రిలియన్ = లక్ష కోట్లు)

లాస్ట్ డికేడ్

జపాన్ ఆర్ధిక వ్యవస్ధ గత దశాబ్దం అంతా అనేక సమస్యలతో గడిపింది. సుదీర్ఘ కాలం పాటు అది డిఫ్లేషన్ (ప్రతి ద్వవ్యోల్బణం) ను ఎదుర్కొంది. జపాన్ కరెన్సీ యెన్ విలువ పెరిగి పోవటంతో అంతర్జాతీయ మార్కెట్ లో జపాన్ సరుకుల విలువలు పెరిగిపోయి ఎగుమతులు తగ్గి పోయాయి. 2008 నాటికి కొంత కోలుకున్న సూచనలు కనిపిస్తున్నంతలోనే పులి మీద పుట్రలా ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వచ్చి పడింది. దానితో జపాన్ మరింత సంక్షోభంలో కూరుకు పోయింది. తాజా గణాంకాల ప్రకారం 2010 చివరి మూడు నెలల్లో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ 1.1 సాంవత్సరిక రేటుతో కుచించుకుపోయింది. అంటే జపాన్ జిడిపి పెరగడానికి బదులు తగ్గిందన్న మాట. తర్వాత క్వార్టర్ లో కూడా అలాగే తగ్గినట్లయితే జపాన్ మళ్ళీ ఆర్ధిక మాంద్యం (రిసెషన్) లోకి జారినట్లు అవుతుంది.

అంతర్జాతీయంగా జపాన్ సరుకుల ధరలు పెరగడం ఒక ఎత్తయితే దేశీయంగా డిఫ్లేషన్ వలన సరుకుల ధరలు తగ్గుతూ ఉండడం మరో ఎత్తు. ధరలు తగ్గుతున్నపుడు ప్రజలు సరుకుల ధరలు ఇంకా తగ్గుతాయేమో అన్న ఆలోచనతో వాటిని కొనడానికి అంతగా ముందుకు రారు. ఆ విధంగా ఎగుమతులు తగ్గి, దేశీయ వినియోగం తగ్గి జపాన్ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి పడిపోతున్నది. లేదా చాలా తక్కువ శాతంలో వృద్ధి చెందుతున్నది. జపాన్ డిఫ్లేషన్ ను తగ్గించడానికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నించనప్పటికి అదుపులోకి రాలేదు. గత దశాబ్దాన్ని జపాన్ పాలిట “కోల్పోయిన దశాబ్దం” (లాస్ట్ డికేడ్)గా కొంతమంది ఆర్ధికవేత్తలు అభివర్ణిస్తారు.
చైనా తనను అధిగమించడాన్ని జపాన్ తేలిగ్గా కొట్టిపారేసింది. “ఒక ఆర్ధిక వ్యవస్ధగా మేము ప్రజల అవసరాలను తీర్చటానికీ, వారి జీవితాలను మెరుగు పరచటానికే మొదటి ప్రాధాన్యం ఇస్తాం తప్ప, ర్యాంకులను మేము పట్టించుకోము. మా పొరుగు దేశం వృద్ధి చెందటం మాకూ గర్వ కారణం” అని జపాన్ ఆర్ధిక మంత్రి కవోరు యసానో పేర్కొన్నాడు. దానిలో ఎంత నిజముందో గానీ స్టేట్ మెంట్ మాత్రం చాలా అందంగా వినసొంపుగా ఉంది. “విదేశాల ఆర్ధిక వ్యవస్ధలనుండీ, వారు అనుసరించే కరెన్సీ విధానం నుండీ ఎదురయ్యే ప్రమాదాలనుండి మేము జాగ్రత్తగా ఉండ వలసిన అవసరం ఉంది. చైనా యువాన్ పాలసీని ఉద్దేశించి మంత్రి ఆ మాటలను అన్నాడని వేరే చెప్పనవసరం లేదు.

చైనా వృద్ధి

ఛైనా వేగంగా వృద్ధి చెందటంలో దాని మాన్యుఫాక్చరింగ్ రంగం గణనీయమైన పాత్ర పోషించింది. చౌకగా లభించే శ్రమ వలన ఆ రంగం ఉత్పత్తి ప్రపంచ స్ధాయిలో పోటీ పడగలిగాయి. దాంతో ఎగుమతులు ఏటికేడూ పెరిగిపోయి వాణిజ్య మిగులును చైనా పోగేయగలిగింది. అమెరికా `లాంటి దేశాలకు పెద్ద ఎత్తున అప్పులను ఈ వాణిజ్య మిగులు కారణంగానే చైనా ఇవ్వ గలిగింది. చైనా ఎగుమతులతో పోటీ పడలేక అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గించాలని గత రెండు మూడు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి.

వాణిజ్య మిగులు ఆయా దేశాల జిడిపి లలో నాలుగు శాతం మించకుండా నియంత్రించాలన్న నిబంధనను విధించటానికి గత జి-7 సమావేశాల సందర్భంగా అమెరికా ప్రయత్నించింది. ఆ నిబంధన చైనా వాణిజ్య మిగులును ఉద్దేశించినదే. అటువంటి నిబంధన భవిష్యత్తులో ఎవరికైనా నష్టంగా పరిణమిస్తుందని గ్రహించి, ఇతర పశ్చిమ దేశాలతో పాటు జపాన్ కూడా దానిని గట్టిగా వ్యతిరేంచటంతో అమెరికా ఎత్తులు పారలేదు.

చైనా జిడిపి రెండో స్ధానానికి చేరుకున్నప్పటికీ అదింకా మూడో ప్రపంచ దేశమేనని చైనా ప్రధాన మంత్రి గత సెప్టెంబరులో అంగీకరించాడు. దానికి కారణం చైనా తలసరి జాతీయోత్పత్తి చాలా దేశాలకంటే వెనుకబడి ఉండటమే. అంటే చైనా వృద్ధి అక్కడి సామాన్య ప్రజానీకానికి చేరటంలేదు. సమాజంలోని ప్రభావశీలమైన వర్గాలు మాత్రమే వృద్ధి ఫలాలను అందుకోగలుగుతున్నారు. పేదరికం, దారిద్ర్యం, అవినీతి చైనా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి. పట్టణాల్లో కార్మికుల పరిస్ధితి కూడా అంతే. సమ్మెలకు తక్కువ అవకాశం ఉంది కనుక కార్మికులకు బేరసారాలు చేసే హక్కు లేదు. సుదీర్ఘ కాలం పాటు పెరగని వేతనాలతో చైనా కార్మకరంగం కునారిల్లుతోంది. ఈ మధ్య ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ మార్కెట్ ను అభివృద్ధి చేసుకోవాలనే వ్యూహంతో వేతనాల పెంపుకోసం కార్మికుల సమ్మెలను కొంత మేరకు అనుమతించింది. ఆ తర్వాత నిర్బంధం షరా మామూలే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s