ముబారక్ గద్దె దిగిపోయాక ఇళ్ళకు వెళ్ళిపోతారనుకున్న ఈజిప్టు ఆందోళనకారులు తాహ్రిరి స్క్వేర్ (విమోచనా కూడలి) ను ఇంకా వదిలి వెళ్ళలేదు. ప్రజాస్వామ్య పరిపాలన స్ధాపించబడే వరకు తాము వెళ్ళేది లేదని వారు పంతం పట్టారు. శనివారం సాయంత్రం సైన్యం ప్రదర్శకులను పంపించివేయటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా ఆందోళన ప్రారంభ దినాల్లో ప్రదర్శకులపై హింసాత్మక దాడులు జరిపి వందల మంది మరణించడానికి కారకులై ప్రజల్లో అపఖ్యాతి పాలైన మిలట్రీ పోలీసులు తిరిగి “విమోచనా కూడలి” వద్ద మొహరించడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.
కూడలి వద్దకు మరింతమంది ప్రజలు వచ్చి చేరుతుండడంతో వారిని నిరుత్సాహపరచడానికి ఏం చేయాలో తెలియక సైన్యం తల పట్టుకుంది. ఆదివారం ఉదయం కూడలి వద్ద ట్రాఫిక్ పెంచడానికన్నిట్లుగా అక్కడ ట్యాంకులను సైన్యం పక్కకు తీసింది. దానితో ట్రాఫిక్ రాక ప్రారంభమయ్యింది. సైన్యం సంఖ్య కూడా పెరగడంతో కూడలిలో ఉన్న ఆందోళనకారులపై ఒత్తిడి పెరిగింది. అకస్మాత్తుగా మిలట్రీ పోలీసులు ప్రత్యక్షమవటంతో ఆందోళనకారులు ఒక్కసారిగా ఉద్రిక్తులయ్యారు.
పోలీసులు “ఇది కొత్త ఈజిప్టు. పోలీసులూ, ప్రజలూ ఒక్కటీ” అంటూ నినాదాలు ప్రారంభించారు. ఆందోళన తీవ్ర దశలో ఆందోళనకారులు “సైన్యం, ప్రజలూ ఒక్కటే” అని నినాదాలు ఇవ్వటాన్ని వారు గుర్తుచేయటానికి ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు దానికి లొంగలేదు. ప్రతిగా “గెటౌట్, గెటౌట్” అని నినాదాలు ప్రారంభించారు. కొద్దిసేపు వారి మధ్య ఉద్రిక్తత పరిస్ధితి తలెత్తింది. కాని పోలీసులు అక్కడినుండి మెల్లగా వెనక్కి తగ్గి ఆ తర్వాత అక్కడినుండి వెళ్ళి పోవటంతో ప్రదర్శకులు శాంతించారు.
ఆందోళనకారులను కూడలి నుండి వెళ్ళగొట్టటానికి సైన్యం ప్రధమ ప్రాధ్యాన్యం ఇస్తున్నదని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్ధ ఏర్పడటానికి తాను ఏం చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నదో సైన్యం ఇంత వరకూ ప్రకటించలేదు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడి దానికి అధికారాలను శాంతియుతంగా మార్పిడి చేసే వరకూ ప్రాంతీయ గవర్నర్లు, ప్రస్తుత ప్రభుత్వం కలిసి “కేర్ టేకర్లు”గా వ్యవహరిస్తారని సైన్యం శనివారం ప్రకటించింది.
సైనిక హైకమాండ్ నాయకుడు “మహమ్మద్ హుస్సేన్ తంతావి” స్వదేశీ వ్యవహారాల శాఖ మంత్రి “మహమ్మద్ వాగ్ది” తో తిరిగి పోలీసులను తమ విధుల్లోకి రప్పించటం ఎలాగన్నదానిపై చర్చలు జరిగినట్లుగా ప్రభుత్వ మీడియా తెలియ జేసింది. తద్వారా సైన్యాన్ని ఉపసంహరించాలని మిలట్రీ కౌన్సిల్ భావిస్తోంది. సైన్య తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆందోళనకారులు, ప్రతిపక్షాలు త్వరగా ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించాలని కోరుకుంటున్నాయి.
అసలు సైన్యాన్ని అధికార మార్పడికి సందానకర్తగా ఎన్నుకోవడమే ఒక తప్పిదం. ఆయుధం ఎప్పడూ రాజకీయాల ఆధీనంలో ఉండాలి తప్ప, రాజకీయాల పక్కన కూర్చోవడానికో, రాజకీయాలను శాసించడానికో అనుమతించరాదు. అలా అనుమతించినందునే 8 కోట్ల ప్రజానీకాన్ని సైన్యం అండతో ముబారక్ మూడు దశాబ్దాల పాటు నిర్బంధించి పాలించ గలిగాడు. ముబారక్ విధానాలను గానీ అతను కుదుర్చుకున్న ఒప్పందాలను గానీ అలానే కొనసాగిస్తామని సైన్యం ప్రకటించిందంటే ముబారక్ అక్రమ సంపాదన కూడా సైన్యం కాపలాలో సురక్షితంగా ఉంటుందని భావించవచ్చు. ముబారక్ ఇప్పుడు ప్రపంచంలో కెల్లా అత్యంత ధవవంతుడని ఫోర్బ్స్ పత్రిక జనవరి ప్రారంభంలో ప్రకటించింది. దాన్ని బట్టి ముబారక్ దేశాన్ని ఎంతగా కొల్లగొట్టాడో అర్ధం చేసుకోవచ్చు.
కేవలం అమెరికాకు దళారిగా మాత్రమే ఉండి అత్యంత ధనికుడు కాగలిగిన ముబారక్, తన యజమాని అమెరికాకు ఎంత దోచిపెట్టాడో ఊహించుకో వలసిందే. సైన్యం మునుపటి ఒప్పందాలన్నింటిని కొనసాగిస్తామని చేసిన ప్రకనను అమెరికా, ఇజ్రాయిల్, బ్రిటన్ తదితర దేశాలు హార్షాతిరేకాలతో ఆహ్వానించాయి. 1979లో ఈజిప్టు, ఇజ్రాయిల్ తో కుదుర్చుకున్న ఒప్పందం కొనసాగుతుందని సైన్యం పరోక్షంగా తెలియజేసినట్లయ్యింది.
అమెరికా అధ్యక్షుడు ఈజిప్టు ప్రకటనను ఆహ్వానించగా, ఇజ్రాయెల్ కూదా ఆహ్వానిస్తూ ప్రకటనను జారీ చేసింది. ఇజ్రాయెల్, ఈజిప్టుల శాంతి ఒప్పందం మధ్య ప్రాచ్యంలో ఒక మైలురాయి వంటిదని అది ప్రకటించింది. ఆందోళన జరిగినన్నాళ్ళూ ఈ ఒప్పందం భవిష్యత్తు ఏమవుతుందోననే ఇజ్రాయెల్ ఆందోళన పడింది. సైన్యం ప్రకటనతో ఎక్కువగా సంతోష పడిన దేశాలు అమెరికా తర్వాత ఇజ్రాయెలే అయి ఉండవచ్చు. మధ్య ప్రాచ్య వ్యవహారలకు ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక దూతగా ఉన్న ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ “ముబారక్ దిగిపోవటం అనేది ఒక్క ఈజిప్టుకే కాకుండా చాలామందికి పెద్ద ఎత్తున అవకాశాలను సమకూర్చి పెట్టిన ఏకైక సంఘటనగా చెప్పుకోవచ్చు” అని ప్రకటించాడు.
ముబారక్ ఉన్నంతకాలం ఈజిప్టును ఒక్క అమెరికా దేశం మాత్రమే దోచుకోగలిగిందనీ ఇప్పుడు ప్రజల ఆందోళన పుణ్యాన ఎన్నికల ప్రభుత్వం ఏర్పడితే అమెరికాతో పాటు ఇతర దేశాలకు కూడా ఈజిప్టును ప్రజల్ని దోచుకునే మహత్తర అవకాశం లభించిందని టోనీ బ్లెయిర్ పరోక్షంగా తెలియజేస్తున్నాడా?
I am following your articles brother. తెలుగులో ఉండడం వలన చదవటానికి బాగుంది. PDSU ecms అందరికీ ఈ సైటు గురించి sms చేశాను.
ఉంటాను బ్రదర్.
Bhaskar, kavali
Very good Bhaskar. Thank you for your supportive gesture. Try to inform to all your friends about this site.