అల్జీరియా, యెమెన్ లలో ప్రదర్శకులను చెదరగొట్టిన ప్రభుత్వాలు


Bouteflika

అల్జీరియా నేత అబ్దెలాజిజ్ బౌటెఫ్లికా

ఈజిప్టులో ప్రజాందోళనల ధాటికి తలొగ్గి ముబారక్ అధికారం త్యజించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అల్జీరియా, యెమన్ ల పౌరులు తమ నియంతృత్వ ప్రభువులు సైతం దిగి పోవాలని డిమాండ్ చేస్తూ ఆయా రాజధానుల్లో శనివారం  ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ముందునుండే అప్రమత్తతతో ఉన్న అక్కడి ప్రభుత్వాలు పోలీసులు, సైన్యాలతొ పాటు తమ మద్దతుదారులను కూడా ఉసిగొల్పి ప్రదర్శనలు పురోగమించకుండా నిరోధించ గలిగింది.

“బౌటెఫ్లికా వెళ్ళిపో” -అల్జీరియా ప్రదర్శకులు

అల్జీరియా రాజధాని అల్జీర్స్ లో మొహరించి ఉన్న పోలీసులకు భయపడకుండా కొన్ని వేల మంది పౌరులు “మే 1 కూడలి” వద్దకు ప్రదర్శన నిర్వహించారు. అల్జీర్స్ అంతటా వ్యూహాత్మక ప్రాంతాల్లో సాయుధ వాహనాలను పోలీసులు మొహరించి ఉంచారు. దాదాపు 30,000కు పైగా పోలీసులను మొహరించినట్లు బిబిసి తెలిపింది. వారికి సాయపడటం కోసం వాటర్ కెనాన్ లనూ, గాలిలో చక్కర్లు కొట్టే హెలికాప్టర్లనూ ప్రభుత్వం దించింది. అల్జీరియాలో 1992లో బౌటెఫ్లికా అధికారం చేపట్టినప్పటి నుండి ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ చట్టం ప్రకారం ప్రదర్శనలు నిషేధం. అసలు అల్జీరియాలో ప్రదర్శనలు నిర్వహించ గలగడమే ఒక విశేషంగా చెప్పుకోవాలి.

శనివారం ఉదయానికి “మే 1 కూడలి”కి చేరుకున్న అల్జీరియా ప్రదర్శకులు, అధ్యక్షుడు “అబ్దెలాజిజ్ బౌటెఫ్లిక్” గద్దెనుండి దిగిపోవాలని నినాదాలు చేశారు. వారు అక్కడికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న “అమర వీరుల కూడలి (మార్టిర్స్ స్క్వేర్) కి ప్రదర్శనగా వెళ్ళడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని చెదర గొట్టటం ప్రారంభించారు. కొన్ని వందల మందిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఎటువంటి ప్రజాందోళన నైనా తాము సహించేది లేదని అల్జీరియా ప్రభుత్వం, పోలీసులు నిర్బంధం ద్వారా తెలిపారు.

శనివారం మధ్యాహ్నానికల్లా “మే 1 కూడలి” లో కొన్ని వందల మంది మాత్రమే మిగిలారు. అయినప్పటికీ ప్రదర్శకులు తమ ప్రదర్శన విజయవంతమైందని ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి ప్రజల్లో నెలకొని ఉన్న భయాన్ని తాము దూరం చేయగలిగామనీ, అదే పెద్ద విజయమనీ వారు అన్నారు. “ఇది ప్రారంభం మాత్రమే” అని “ప్రజాస్వామ్యం, మార్పుల కోసం జాతీయ సమన్వయం” సంస్ధ వ్యవస్ధాపకుల్లో ఒకరైన “ఫోదిల్ బౌమలా” మీడియాకు తెలియజేశాడు.

Ali abdbullah

యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే

“ఆలీ, ఇప్పుడు నీ వంతు” -యెమెన్ ప్రదర్శకులు

యెమెన్ రాజధాని సనా లో విధ్యార్ధులు కొన్ని వందల మంది ఈజిప్టు రాయబార కార్యాలయం వద్దకు ప్రదర్శనగా బయలుదేరారు. కొద్ది సేపటికే ప్రదర్శకుల సంఖ్య కొన్ని వేలకు చేరుకుంది. “ముబారక్ తర్వాత, ఇప్పుడు ఆలీ వంతు” అని నినాదాలు చేస్తూ సాగారు. కొంత సేపటికి యెమెన్ అధ్యక్షుడు “అలీ అబ్దుల్లా సలే” మద్దతుదారులు యెమెన్ సాంప్రదాయక ఆయుధాలయిన యెమెనీ కత్తి, కర్రలను చేత పట్టుకుని ప్రదర్శనగా వచ్చి, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనపై దాడి చేయటం ప్రారంభించారు. దానితో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శకులు అక్కడినుండి చెదిరి పోయారు.

అంతకుముందు, ట్యునీషియా అధ్యక్షుడు బెన్ ఆలీ దేశం నుండి పారిపోయాక యెమెన్ అధ్యక్షుడు ముందు జాగ్రత్తగా కొన్ని సంస్కరణ చర్యలు ప్రకటించాడు. 2013లో తన పదవీ కాలం ముగిశాక తాను మళ్ళీ పోటీ చేయనని ప్రకటించాడు. యూనిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆహ్వానించాడు. ఉద్యోగులు, అధికారుల జీతాలు పెంచాడు. అయినా ప్రజలు, ముఖ్యంగా విధ్యార్ధులు స్ధిరంగా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. యెమెన్ అరబ్బు దేశాల్లోకెల్లా బీద దేశం. ఆ కారణంగా యువత ఆల్-ఖైదా వంటి సంస్ధల పట్ల ఆకర్షితులవుతున్నారు. యెమెన్ ప్రభుత్వ రహస్యంగా అమెరికా ఆయుధాలను తీసుకొని “తీవ్రవాదంపై యుద్ధం” పేరుతో తమ విధ్యార్ధులు పౌరులపై దాడులు చేస్తున్నదని వికీలీక్స్ ఈ మధ్యనే వెల్లండించింది.

రానున్న రోజుల్లో యెమెన్ లలో అధ్యక్షుడు దిగిపోనప్పటికీ ఇంతకు ముందు ఊహించని కొన్ని పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s